ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

రాతితో సజీవమైన విగ్రహం చెక్కడం, కాన్వాస్ మీద కొన్ని రంగులతో జీవకళ ఉట్టిపడేట్టు బొమ్మను చిత్రించడం నిస్సందేహంగా గొప్పకళలే. “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ” అంటాడు టాల్ స్టాయ్.
ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన శిల్పుల్లో ఆగస్టు రోడిన్ (Auguste Rodin) ఒకరు. ఈయన రూపొందించిన శిల్పాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శిల్పం ‘ది థింకర్’. ప్రఖ్యాత పద్యకారుడు డాంటీ రాసిన డివైన్ కామెడీలో ఓ ముఖ్య పాత్ర ఆధారంగానే ‘ది థింకర్ ‘ రూపొందించినట్లు చరిత్ర చెబుతోంది. ది థింకర్ విగ్రహం నగ్నంగా ఉంటుంది. ఓరాయిపై కూర్చున్నట్లుండే ఈ విగ్రహంలో ఎక్కడా అశ్లీలానికి తావులేకుండా రూపొందించడం శిల్పిలోని విజ్ఞతకు నిదర్శనం.
డాంటీ రాసిన డివైన్ కామెడీ (దైవిక హాస్యం) లో ఉండే క్యారెక్టరు పారిలోని మ్యూజియం ఆఫ్ డెకరేషన్ ఆర్ట్ ముందు శిల్పాలుగా చెక్కించాలనేది మొదటి ప్రయత్నం. ముందుగా దిపోయెట్ ఆ తరువాత ‘ది థింకర్’ గా మారింది. ఆలోచనా ముద్రలో ఉన్న ఓ వ్యక్తి అద్భుతంగా రోడిన్ సృజించాడు. ఇది బ్రాంజ్ మెటల్ (కంచు) తో తయారుచేశాడు. ఒక విధమైన నిశ్చింతలో కూడిన ఆలోచన చేస్తున్నట్లు, మెడిటేషన్ లో ఉన్నట్లు, ఇంకా అంతర్గతంగా ఏదో సంఘర్షణ ఉన్నట్లు ఈ విగ్రహాన్ని చూస్తే అన్పిస్తుంది. ముందుగా 1880లో రోడిన్ ప్లాస్టర్ ఆఫ్ పారితో దీన్ని రూపొందించారు. అయితే కంచును వాడి 1902లో పెద్ద పరిమాణంలో ‘ది థింకర్’ శిల్పాన్ని రూపొందించాడు. 1904 వరకు దీని గురించి ప్రజలెవరికీ తెలియదు. 1922లో పబ్లిక్ దృష్టిలో పడింది. చైరన్ హోటల్ (ఫ్రాన్స్)కు దీన్ని తరలించారు. 1840లో పారిలో జన్మించిన రోడిలో గొప్ప కళాకారుడు ఉన్నప్పటికీ బీదరికం వల్ల చాలా కష్టాలు పడ్డాడు. చదువుకునే రోజుల్లో ఎకొలెడేస్ బ్యాక్స్ ఆర్ట్స్ పాఠశాలలో ప్రవేశం కోసం మూడుసార్లు వెళితే మూడు సార్లు తిప్పిపంపారు. అయితే రోడిన్ ప్రయత్నాలు వదలకుండా చేతివృత్తుల కళాకారులు ఇతర శిల్పకళాకారుల దగ్గర పనిచేసి స్వశక్తితో తన శిల్పకళా చాతుర్యాన్ని నిరూపించుకున్నాడు.
థింకర్ శిల్పాన్ని రోడిన్ రూపొందించి నేటికి 140 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ నేటికి ఇది ఫ్రాన్స్ లో వన్నెతరగని కళాఖండంగా ఆదరణ పొందుతూ, విశ్వవ్యాప్తంగా ఆలోచనకు ప్రతిరూపంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తరంలో అనేకమంది శిల్పులు రోడినను అనుకరిస్తూ వివిధ మెటీరియల్స్ తో శిల్పాలను రూపొందిస్తూ వస్తున్నారు. “థింకర్” శిల్పాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మంది కార్టూన్లు కూడా గీసారు. కవితలు కూడా రాసారు. ఇది “ది థింకర్” శిల్పం వెనుక కథ. “జీవితం క్షణిక మైనది-కళ అనంతమైనది” అన్నట్లు రోడిన్ లేకపోయినా ఆయన సృజించిన కళ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap