సంజీవునితో  నా రసమయ రేఖా బంధం 

( జూలై 3 ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ జన్మదినం సందర్భంగా)

సాధారణంగా మనుషులు మధ్య ఏర్పడతాయి బంధాలు ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా, తెలియకుండా కూడా ఏర్పడతాయి బంధాలు ఒక్కోసారి, ఇరువ్యక్తుల మధ్య భిన్న విభిన్న కారణాలతో. తెలిసి ఏర్పడే బంధాలను ప్రత్యక్ష బంధాలు గా చెప్పుకుంటే, తెలియకుండా ఏర్పడే బంధాలను పరోక్ష బంధాలు గా  చెప్పుకుంటాం. ప్రత్యక్ష భందాలే గొప్పవనుకుంటాం సాధారణంగా పరోక్ష బంధాలకంటే, కాని ఒక్కోసారి పరోక్ష భందాలే గొప్పగా అనిపిస్తాయి ప్రత్యక్ష బంధాల కంటే.  కారణం మనసులు కలవని ప్రత్యక్ష బంధంకంటే , మనసులు కలిసే పరోక్ష భందమే గొప్పగా వుంటుంది. ఈలాంటి భందంలో వ్యక్తులు ప్రత్యక్షంగా కలవనప్పటికి వారి మనసులు కలుస్తాయి పరోక్షంగా. భావ సారూప్యంగల ఏదో ఒక అంశం వారి మధ్య బంధాన్ని మరింత  గొప్ప అనుబంధంగా మారేలా చేస్తుంది.

తెలుగు ప్రజలు గర్వించదగిన ప్రఖ్యాత సౌందర్యారాదికుడు, రచయిత, కళావిమర్శకుడు, తత్వవేత్త, కళా చరిత్రకారుడు మరియు ప్రకృతి చిత్రకారుడు అయిన డాక్టర్ సంజీవ దేవ్ తో నాకు ఏర్పడిన భందం అలాంటి పరోక్ష భంధమే, సంజీవ్ దేవ్ గారిని నేను ప్రత్యక్షంగా చూడలేదు. కనుక ఆయనతో ప్రత్యక్ష భంధానికి ఆస్కారం లేదు కనుక ఆయనతో గల నా భంధం పరోక్ష భందమే. ఆయన సాహిత్యంతో తొలిసారిగా నాకు సంభంధం ఏర్పడేలా చేసింది మాత్రం మావూరు ప్రక్కనే వున్న వెల్ల గ్రామపంచాయితి గ్రంధాలయం అని చెప్పవచ్చు. నేను తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వి. ఎస్.ఎం. కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లో ప్రతి రోజూ మా వూరు కందులపాలెం  నుండి కాలేజీకి వెల్లే దారిలో వుండే  వెల్ల గ్రామ పంచాయితి గ్రంధాలయానికి వెళ్ళడం, అక్కడ రెగ్యులర్ గా వొచ్చే న్యూస్ పేపర్స్, వీక్లీస్ గాకుండా లోపలి పుస్తక భాండాగారంలోకి వెళ్ళి నా మనసుకు నచ్చిన  పుస్తకాలకోసం వెతకడం, అలా వెతికే  క్రమంలోఒక రోజు నా కంటపడిన తొలి గ్రంధం సంజీవ్ దేవ్ యొక్క రసరేఖలు. దాదాపు సగం వరకు నల్లటి క్వాలిటీ క్లాత్ బౌండ్ తోను, మిగిలిన సగం బూడిద రంగు అట్టతోనూ వుండిన  ఆ పుస్తకంపై   పేరును  సాధారణంగా అందరూ లిఖించేవిదంగా  ఎడమనుండి కుడికి కాకుండా పుస్తకంయొక్క బౌండ్ కి  అతికించిన నల్లటి క్లాత్ పై బూడిద రంగు అక్షరాలతో పై నుండి క్రిందకు రాసిన  రసరేఖలు, అలాగే  కుడివైపు దిగువ కార్నర్ నందలి  బూడిదరంగు అట్టపై నల్లటి సిరాతో  రాసిన  సంజీవ్ దేవ్ అన్న అక్షరాలు నన్ను అమితంగా  ఆకర్షించాయి.

ఆసక్తితో పుస్తకం తిరగేశాను. దేసీ కవితామండలి విజయవాడ వారు ఇప్పటికి 56 ఏళ్ళక్రితం అనగా 1963 ఏప్రిల్ మాసంలో శ్రీమతి బొందలపాటి శకుంతలా దేవి మరియు శివ రామ కృష్ణ ల సంపాదకత్వంలో ప్రధమ ముధ్రణగా వెలువరించిన  గ్రంధం అది.ఈతొలి గ్రంధాన్ని సంజీవ్ దేవ్ తన ఆప్త మిత్రుడు మరియు ప్రముఖ వంగకవి తాత్వికుడు చిత్ర శిల్పి, విద్వాంశుడు అయిన అసిత్ కుమార్ హాల్దార్కి అంకితమిచ్చారు. 368 పేజీలతో వున్న ఆ పుస్తకంలో 45 వ్యాసాలున్నాయి. ఇందులో ప్రచురితమైన వ్యాసాలన్నీ గతంలో ఆంధ్ర జ్యోతి , విశాలాంధ్ర, కిన్నెర, తెలుగు విద్యార్ధి,కళ లాంటి నాటి ప్రముఖ పత్రికలలో వొచ్చినట్టుగా సంజీవ్ దేవ్ తన ముందు మాటలో ఆయా సంపాదకులకు చెప్పిన కృతజ్ఞతలను బట్టి తెలుస్తుంది.

సాధారణ పుస్తకాలలో రచయితలు రాసే రచనారీతికి భిన్నమైన రీతి, విభిన్నమైన అంశాలను వారి రచనావస్తువుగా ఎంచుకోవడం, ఆ ఎంచుకునే వస్తువులో మనసుకు నచ్చే చక్కటి కళాత్మకతతో కూడిన  సౌందర్యంతో బాటు, బహుచక్కటి భావుకత, దానికి తోడు ఆరోగ్యకరంగా వుండే ఒక నవ్య రీతిలో సాగే మృదువైన విమర్శ, విజ్ఞాన విశ్లేషణలు కలిగి వుండడం వలన తొలిచూపులోనే నా మానసానికి హత్తుకునేలా చేసిన గ్రంధం సంజీవ్ దేవ్ గారి రసరేఖలు. విచిత్రంగా అదే వారి తొలి గ్రంధం కూడా కావడం విశేషం.

పుస్తకం తొలిపలుకులనే చాల కొత్తగా ప్రారంభిస్తారు . ఎందుకు రాయడం? ఎందుకు రాయకపోవడం? అంటూ మొదలు పెట్టి, ఎందుకు రాయకపొవడమో అందుకు రాయడం అంటూ వ్యాసాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఆయన రాసిన వ్యాసావలి లోని, రసం, రూపం, భావం, కళలు, కళాకారులు, చరిత్ర , తత్వం , తాత్వికులు, పర్యటనలు కొండలు కోనలు ఇలా ఎన్నో అంశాల తాలూకు మర్మాలను లోచానాలోచనలను, తర్కంతో కూడిన మృదువైన భాషతో వ్యాసాన్ని ముందుకు నడిపిస్తూ రాసిన ఆయన ముందుమాటలు చాల కొత్తగా అనిపిస్తాయి ఆపై హిమాలయాలలో తను పొందిన అనుభవాలతో హిమాలయాలలో ఒక రోజు అన్న వ్యాసంతో వ్యాస పరంపర కొనసాగుతుంది. ఆ తర్వాత తన జీవన యానంలోని మజిలీలతో పాటు ఆయన  కలిసిన వివిధ గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యం ద్వారా పొందిన అనుభవాలను, అనుభూతులను వారిద్వార తనలో రేకెత్తిన జ్ఞాన గంధంతోను, మరియు తాను చదివిన గొప్పగొప్ప గ్రందాలసారప్రభావంతో  ఆయనే ఒక గొప్ప సాహితీ స్రస్టగా, తాత్వికుడిగా, విమర్శకుడిగా, చరిత్రకారుడిగా, ఒక సౌందర్య ఆరాదికుడిగా, ప్రకృతి చిత్రకారుడిగా భిన్న విభిన్న కోణాలలో గొప్పగా తీర్చిదిద్దబడడం, ఆ ప్రభావంతో ఆయన ఒక్క తెలుగులోనే గాక ఆంగ్లం, హిందీ, బెంగాలి భాషలలో సైతం గొప్ప ప్రావీణ్యం సంపాదించి తనవే అయిన గొప్ప గొప్ప గ్రంధాలు రాయడం మనం చూస్తాము.

రసరేఖలు తర్వాత వెల్ల లైబ్రరీలో నాకు కంట బడిన ఆయన గ్రంధాలు రూపారూపాలు, తెజోరేఖలు, దీప్తి ధార, స్మ్రతి భింబాలు , కాంతిమయి, తెగిన జ్ఞాపకాలు, గతంలోకి, తెల్ల మబ్బులు అలాగే ఆంగ్లంలో ఆయన రాసిన “గ్రే అండ్ గ్రీన్” వీటితో పాటు ఆచంట జానకీరామ్ గారి సాగుతున్నయాత్ర . ఇవన్నిచదువుతుంటే  నిజంగా నా మానసాన ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అలుముకునేది. నాటి నుండే నేను సంజీవ్ దేవ్ గారి సాహిత్యానికి వీరాభిమానిగా మారాను. సంజీవ్ దేవ్ గారి సాహిత్యంతో పరిచయం ఏర్పడిననాటికి ఆయన ఇంకా లోకంలో బ్రతికే వ్వున్నారు. ఆయన వ్యాసాలు స్వర్ఘీయ ఆలపాటి రవీంధ్రనాద్ గారి సంపాదకత్వంలో అప్పుడు నూతనంగా ఆవిర్భవించిన గొప్ప పత్రిక మిసిమిలో కూడా వస్తుండేవి. అంతేగాక ఆయన లేఖలు తెలుగు విద్యార్ధి అనే పుస్తకంలో నేను చదివియున్నాను ఎవరో ఒక పాటకుడు అడిగిన చిన్న ప్రశ్నకు ఆయన ఎంతో లోతైన విమర్శతో పాటు అర్ధాలు అంతరార్ధాలతో కుడా వివరిస్తూ వారు రాసే సుధీర్గమైన లేఖలు నన్ను అమితంగా ఆకర్షించేవి. ఆ ప్రభావం తర్వాత నామీద కూడా బాగా పడిందని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఆయనకు లేఖ రాసి వారి నుంచి ఓ లేఖ అందుకోవాలని ఆశించే అనేకుల్లో నేను కూడా ఒకన్ని. కాని ఎందుచేతనో నేను లేఖ రాయనూలేదు ఆయన నుండి లేఖ అందుకోనూలేదు. అది అలా అయిన కొద్ది కాలానికే అనగా 25-08-1999 నాడు సంజీవదేవ్ గారు మరణించడం జరిగింది.

సంజీవ్ దేవ్ గారు బ్రతికి యున్నకాలంలో తీరని కోరిక ఆయన మరణానంతరం నాకు తీరింది . మిత్రుడు చిలువూరు సురేష్ గారి ద్వారా. సంజీవ్ దేవ్ సాహిత్యాన్ని బాగా ప్రజల్లోకి తీసువేల్లెందుకు ఎక్కువగా కృషి చేస్తున్న ముఖ్య వ్యక్తులలో చిలువూరు సురేష్ గారు ఒకరు. ఆయనే తొలిసారిగా సంజీవ్ దేవ్ గారి స్వయం చేతి వ్రాతతో రాసి ప్రింట్ చేయించిన అనుమేళన, రసరోచన లాంటి లఘు పుస్తకాలను నేను ఖమ్మంజిల్లా వెంకటాపురంలో ఉప ఖజానాదికారిగా పని చేస్తున్న సమయంలో నాకు  పంపించడం జరిగింది. అలాగే సంజీవ్ దేవ్ గారి మరో గొప్ప ఆంగ్ల గ్రంధం”బయో సింఫనీ తో పాటు హిమాలయాలలో ఉన్నకాలంలో ప్రఖ్యాత రష్యన్ పైంటర్ నికోలస్ రోరిక్ తో ఆయనకు ఏర్పడిన భంధంతో సంజీవ్ దేవ్ గారికి ఆ కాలంలో రోరిక్ రాసిన అనేక లేఖలు మొదలైనవి ఆయన నాకు పంపించడం జరిగింది. నిజంగా అవన్నీ నేను చూడడం గొప్ప అనుభూతి. అంతే గాకుండా 2011 లో  సంజీవ్ దేవ్ గారి జీవిత చరిత్రకు సంబందించిన తెగినజ్ఞాపకాలు, స్మృతి భింబాలు, గతంలోకి అనే మూడు గ్రంధాలను కలిపి సమగ్రంగా రాజాచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసిన “తుమ్మపూడి” అనే గ్రంధాన్ని కూడా ఆయన నాకు పంపించడం జరిగింది. అందుకు చిలువూరి సురేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేయడం నా భాద్యతగా భావిస్తున్నాను.

2013 డిసెంబర్ లో అజంతా కళారామం తెనాలి వారి జాతీయ చిత్రకళా పోటీలకు నేను వెళ్ళినప్పుడు చిలువురి సురేష్ గారు స్వయంగా తెనాలికి దగ్గరలోనే వున్న తుమ్మపూడికి తీసుకెళ్ళి సంజీవదేవ్ గారి ఇల్లు “రసరేఖ” ను ధర్సింపజేయడం, సంజీవదేవ్ గారి సతీమణి శ్రీమతి సులోచనా సంజీవదేవ్ గారిని పరిచయం చేయడం అక్కడ వీరి చేతులమీదుగా అల్పాహారం తీసుకోవడం ఒక మధురమైన అనుభూతి. బయటకు ఒక పాతకాలంనాటి చిన్నపాటి దుర్గం లా కనిపించే ఆ భవనం లోపలి వెళితే వుంటుంది  సువిశాలమైన గదులతో కూడిన భవనం, సంజీవ్ దేవ్ గారి లైబ్రరీ, ఆయన అందుకున్నఅవార్డుల తాలూకు గుర్తుగా కనిపించే మెమెంటోలు, నికోలస్ రోరిక్ స్పూర్తి తో ప్రకృతి చిత్రకారుడిగా మారి ఆయన వేసిన పలు చిత్రాలతో నిండిన ఆర్ట్ గాలరీ చాల కన్నుల పండుగలా వుంటుంది. ఆ భవనంలోకి ప్రవేశించిన వెంటనే హాలులో నన్ను ఆకర్షించిన రెండు చిత్రపటాలలో ఒకటి సంజీవ్ దేవ్ గారి రూపచిత్రం మన తెలుగు వారంతా గర్వించదగిన ప్రముఖ చిత్రకారుడు గిరిధర్ గౌడ్ గారి కుంచె ద్వారా జలవర్నాలతో రూపుదిద్దుకున్న చిత్రమది. రమ్యమైన సంజీవ్ దేవ్ గారి జీవితానికి దర్పణంలా అంతే రసమయ రంగుల పోహలింపు తో గౌడ్ గారి కుంచె ద్వారా రూపుదిద్దుకున్న ఆ చిత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 2014 లో జరిగిన సంజీవదేవ్ గారి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయన వేసిన చిత్రమది .

ఇక రెండవది గంగానది మూలం అనే ప్రకృతి చిత్రం. విశ్వ విఖ్యాత రష్యన్ చిత్రకారుడు, మరియు హిమాలయపర్యటనలో సంజీవ్ దేవ్ కు బాగా మిత్రులు అయిన నికోలస్ రోరిక్ సంజీవ్ దేవ్ వివాహ సందర్భంగా బహుకరించేందుకు వేసిన చిత్రమది. కాని సంజీవుడి పరిణయం చూడకుండానే ఆయన 1947 డిసెంబర్ మాసంలో మరణించడం జరిగింది. తెగిన జ్ఞాపకాలు అనే పుస్తకంలో ఒక చోట సంజీవదేవ్ ఇలా రాసుకుంటారు. “ఒకరోజు ఒక పార్సెల్ వొచ్చింది పోస్టులో. దానిమీద మేడం హెలీనా రోరిక్ పంపినట్లు పేరున్నది. విప్పి చూస్తే నికోలస్ రోరిక్ చిత్రించిన గంగానది మూలం అనే ఒక విలువైన చిత్రం వుంది. ఈ చిత్రాన్ని చూపుతూనే రోరిక్ అన్నారు” This painting awaits your  wedding” అని. ఈ చిత్రాన్ని నా వివాహ  సమయాన నాకు బహుకరించాలని ఆయన ఆకాంక్ష, కానీ అయన అభిలాష తీరలేదు. ఆయన జీవించి వుండగా నేను వివాహం చేసుకోలేదు. ఆయన మరణిస్తూ ఆ చిత్రాన్ని నాకు పంపమని చెప్పినారట . అందుకే ఆ చిత్రాన్ని ఆయన సతీమణి నాకు పంపింది అని రాసుకున్నారు. నికోలస్ రోరిక్ గారి చేతితో రూపుదిద్దుకున్న ఆ ఒరిజినల్ చిత్రం చూసినప్పుడు నిజంగానే నా శరీరం ఒక రోమాంచితమైన భావనకు లోనైంది. ఆగుర్తుగా సులోచనా సంజీవ్ దేవ్ గారితో కలిసి ఆ చిత్ర రాజం ముందు ఫోటోలు దిగడం మరో గొప్ప అనుభూతి.

సహజ సిద్దంగా చిత్రకళాభిషిక్తుడనయ్యి, దానిని అభ్యసించే అవకాసం దొరకని వాడను మరియు చరిత్ర విద్యార్ధి నయ్యి ప్రతీదీ ఒక లిఖిత రూపంలో రికార్డు చేయాలనే అభిలాష చిన్నతనము నుండి వుండే నాకు సహజంగానే సంజీవదేవ్ సాహిత్యం అటు కళాపరంగాను సాహిత్యపరంగాను చరిత్ర పరంగాను నా మనసును  హత్తుకోవడంతో ఇతర  పుస్తకాలతో  బాటు సంజీవదేవ్ గారి సాహిత్యం కూడా  సేకరించడం అలవాటు చేసుకున్నాను. అంతే గాక నన్ను బాగా ప్రభావితం చేసిన ఆ సాహిత్యం ఆ తర్వాత నేను చిత్రకళ తదితర అంశాలపై రాసే వ్యాసాలపై ఎంతోకొంత  పడిందని చెప్పవచ్చు. 2017 లో లలిత కళా అకాడమి న్యూడిల్లీ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన భారతీయ భాషలందలి దృశ్య కళారచయితల సదస్సుకు మన తెలుగు భాష తరుపున నన్నుఆహ్వానించినప్పుడు నేను 2010 నుండి మిత్రులు కళాసాగర్ గారు స్థాపించిన అంతర్జాల పత్రిక 64 కళలు.కాం నందు రెగ్యులర్ గా నేను రాసే చిత్రకళా వ్యాసాలతో వేసిన మూడు సంపుటాలకు సంజీవదేవ్ గారి స్ఫూర్తి తోనే చిత్ర దీప్తి,రూపదీప్తి మరియు కళాదీప్తి అని పేర్లు పెట్టడం జరిగింది. అంతే గాక గత తొమ్మిదేళ్లుగా చిత్ర కళాసాహిత్యంపై నేను చేస్తున్న కృషిని గుర్తిస్తూ అజంతా కళారామం తెనాలి వారు  సంజీవ్ దేవ్  శత జయంతి పురస్కారాన్ని నాకు అందజేయడం  మరో గొప్ప అనుభూతి.

సాధారణంగా మనిషికి మనిషికీ మధ్య భంధం అన్నది ఎవరికైనా తెలిసిన వాళ్ళతో ప్రారంభమై తెలియని వారివైపుగా సాగుతుంది.. కాని సంజీవదేవ్ గారి విషయంలో అది పూర్తి వైరుధ్యంగా సాగింది .ముందు తెలియని వ్యక్తులతో ప్రారంభమై క్రమంగా తెలిసిన వ్యక్తుల దిశగా సాగింది.లోకంలో ఎందరో వ్యక్తులు పుడతారు, మరణిస్తారు. కాని కొందరు మాత్రమే తోటి సమాజంపై ప్రభావం చూపగలుగుతారు .తమ దైన ముద్రను బలంగా వేయగలుగుతారు అందుకు గొప్ప గొప్ప డిగ్రీలతో పనిలేదు. అందుచేతనే కనీసం సెకండరీ విద్య కూడా పూర్తి చేయని ఒక బాలుడు బాల్యం లోనే తాను ఒక పుస్తకంలో చదివిన ప్రదేశాన్ని చూడాలని ఇష్టంతో దైర్యంగా హిమాలయాలనందలి మాయావతి అనే ప్రదేశానికి వెళ్ళడం అక్కడ రామకృష్ణ మిషన్ నందలి ప్రభుద్ద భారత్ పత్రిక సంపాదకుడు పవిత్రానందన్ ను కలవడం మొదలు పెట్టి నికోలస్ రోరిక్.అసిత్ కుమార్ హల్దార్, రవీంద్రనాథ్ టాగూర్. ఇంకా టాగూర్ వంశస్తులను, రహమాన్ చుగాతాయ్ లాంటి ఎందరోగొప్ప గొప్ప వ్యక్తుల పరిచయాలు జాతీయ అంతర్జాతీయంగా యేర్పడం అమోఘమైన వారి జ్ఞానసంపదను తాను ఆకళింపు చేసుకుని ఆయనే ఒక గొప్ప తాత్వికుడిగా రాసాస్వాధకుడిగా చిత్రకారుడిగా చరిత్రకారుడిగా  ఒక విద్యావేత్తగా విమర్శకుడిగా ఎన్నో విశ్వవిధ్యాలయాలలో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదగడమే గాక ఒక పరిపూర్ణమైన విశిష్ట వ్యక్తిగా పేరు గడించిన సూర్యదేవర సంజీవదేవ్ కారణంగా తను మాత్రమే గాక తాను నివసింఛిన పల్లె తుమ్మపూడి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల సందర్శనతో పులకించేలా చేసిన సంజీవ దేవ్ లాంటి  వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

-వెంటపల్లి సత్యనారాయణ(9491378313)

Landscape by Sanjeev Dev

13 thoughts on “సంజీవునితో  నా రసమయ రేఖా బంధం 

  1. డా. సంజీవదేవ్ గారి గురించిన శ్రీ వెంటపల్లి గారి రచన సందర్భోచితమైన వ్యాఖ్యానంతో సాగి అలరించింది. అభినందనలు.

  2. ధన్య వాదంలు పద్మ గారు

  3. సంజీవ్మీ దేవ్ గారితో అనుభవాలను కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా రాసారు .అభినందనలు సర్

  4. సత్యనారాయణ గారూ! మీరు డా.సంజీవదేవ్ గారి గురించి రాసినది చదివి మనసుపొంగింది. వీరి గురించి రాసినవన్నీ చదవటమే, వారితో చాలా ఆత్మీయ పరిచయమున్న ఎస్.ఎస్.లక్ష్మీ గారి ద్వారా వినటం, ఆ ఫోటోలు చూడటం.అంతే. వారిని చూసి తరించే భాగ్యానికి నోచుకోకపోయానే. మీరు రాసిన వారిపైఉన్న గౌరవం,అభిమానం పొంగిపొర్లుతున్నాయి. అభినందనలు. మీ గురించి తెలుసుకోవటం!!

  5. సంజీవదేవ్ గారితో మీ భావానుబంధాన్ని కళ్లకుకట్టినట్లుగా చిత్రించారు. అభినందనలు.

  6. సంజీవదేవ్ గారి గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. తుమ్మపూడి లోని వారి కళాత్మకమైన స్వగృహాన్ని మీరు స్వయంగా దర్శించి మీ వ్యాసం ద్వారా మాకు కూడా దర్శింపచేశారు. చిత్రకళ పట్ల మీకున్న అభిరుచి ప్రశంసనీయం. మనసారా మీకు నా యొక్క ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap