“సామాజిక చైతన్యం” అంటే సమాజంలో ఉండే చైతన్యం అని, సమాజంలో ఉండవలసిన చైతన్యం అని రెండు విధాలుగా అర్ధాలున్నాయి. అనేకమంది వ్యక్తుల చైతన్యం కలసి సామాజిక చైతన్యం అవుతుంది. “నిర్దిష్టకాలంలో, నిర్దిష్ట మనుగడ సాగిస్తున్న ప్రజల సామూహిక చైతన్యమే సామాజిక చైతన్యం”. ఈ సామాజిక చైతన్యాన్ని సామాజిక జీవితం నిర్ణయిస్తుంది. మరింతలోతుగా చూసినపుడు విభిన్న కాలాల్లో, విభిన్న స్థలాల్లో ఉండే ప్రజల మధ్య గల సంబంధాలను సామాజిక జీవితం మధ్య గల మానవ సంబంధాలు సామాజిక చైతన్యాన్ని నిర్ణయిస్తాయి.
మానవత్వంలేని మేధస్సు కంటే, మేధస్సులేని మానవత్వం ఎంతో మంచిదని చాటిన గొప్ప మానవతా వాది శ్రీ సూర్యదేవర సంజీవదేవ్. వీరు 1914వ సం. జులై 3వ తేదిన గుంటూరు జిల్లాలోని తుమ్మపూడి గ్రామంలో రామదేవరాయలు,వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే తల్లిని పొగొట్టుకున్న ఆయన జీవితంలో ఒక రకమైన మానసిక అస్థిరతకు లోనయ్యారు. 16వ ఏట హిమాలయాలకు వెళ్ళారు. అక్కడి ప్రదేశాలు, వ్యక్తులు, విభిన్న భాషలలో విభిన్న విషయాలను చర్చించిన గ్రంథాలు, ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి.
‘హేతువు. బాల్యం నుండే సంజీవదేవ్ ను వెన్నంటి ఉండి వీరు చిన్నతనంలోనే అనాచారాలు, మూఢనమ్మకాలపై ధ్వజమెత్తారు. వీరి 12వ ఏటనే కొన్ని సందేహాలు కలిగాయి. వీరు రాసుకున్న స్వీయ చరిత్రలో ఈ వివరాలు తెలుస్తాయి. “భార్యలు చనిపోయిన భర్తలు మరలా పెండ్లి చేసుకోవడం చూశారట, కానీ భర్తలు చనిపోయిన భార్యలు తిరిగీ పెండ్లి చేసుకోవడం లేదట. అపుడు దేవ్ గారి బంధువు ఒకాయన సహగమనం గురించి, దీనిని రూపు మాపిన రాజారామ మోహనరాయ్ గారిని గురించి విధవ వివాహాలను ప్రవేశపెట్టిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం గారి గురించిన వివరాలు తెలిపాడు. ఈ సంస్కరణలకు ఆకర్షితుడైన సంజీవదేవ్ తన స్నేహితులతో కలిసి భర్తలేని ఒక ఆమెకు పెండ్లి చేయపూనుకున్నారట. ఇలా సంస్కరణ వాదాలపట్ల, హేతు వాదం పట్ల ఆసక్తిని చిన్ననాటి నుండే కలిగి ఉన్నారు.
“తెలుగులో ఉద్యమగీతాలు” గ్రంధ రచయిత శ్రీ ఎస్. వి.సత్యనారాయణగారు “సామాజిక చైతన్యంలో మనిషి భావాలు, అభిప్రాయాలు, నైతిక, రాజకీయ, సైద్ధాంతిక దృక్పధాలు, సౌందర్యసృష్టి, తాత్విక, మత భావాలు, సాహిత్యాది కళలు అంతర్భాగాలుగా ఉంటాయి” అని పేర్కొన్నారు. వీటిలో వేటి ద్వారా నైనా మనిషి మనోగత భావాలను వ్యక్తం చేయవచ్చునంటారు.
అశాస్త్రీయ విషయాలకు, మూఢ నమ్మకాలకు దూరంగా ఉండే సంజీవదేవ్ ప్రకృతి విశ్లేషణ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. చిన్ననాటి నుండే శాస్త్రీయ దృక్పధంలో విషయాల గమనింపును మనం చూడవచ్చు. శాస్త్రీయ దృక్పధం అంటే ఏ విషయానికైనా అసలు కారణం (హేతువు)తెలుసుకోవడం. శాస్త్రీయ ఆలోచనలు ప్రకృతికి సంబంధించిన విషయాలకే కాక, సమాజానికి సంబంధించిన అసలు కారణాలుగా కూడా ఉంటాయి. ఈ శాస్త్రీయ ఆలోచనలు సృష్టిలో నిర్మాణానికి మూలలను అన్వేషిస్తాయి. సమాచారాన్ని విశ్లేషిస్తాయి. వాస్తవాలను విశదీకరిస్తాయి. ఇంకా లోతుగా చెబితే “ఇంద్రియాల ద్వారా సేకరించిన హేతుబద్ధమైన సమాచారాన్ని విశ్లేషించి, దానికి ‘శాస్త్రీయ నిబద్ధత’ సమకూర్చడమే శాస్త్రీయ ఆలోచనల ముఖ్య లక్ష్యం . .
“చైతన్యం” అన్నది ఎప్పుడైనా ప్రశ్నలో నుండే పుడుతుంది. నేనెవరిని? నీవెవరవు? ఈ ప్రశ్నలు చైతన్యానికి తొలి రూపాలు. ప్రశ్న అన్నది ప్రశ్నగానే మిగిలిపోయిన సమాజంలో చైతన్యం గడ్డకట్టినట్లుంటుంది. ప్రశ్నకు సమాధానం దొరికిన సమాజంలో చైతన్యం ద్రవరూపంలో ఉంటుంది. ఇలాంటి ద్రవరూప చైతన్యమే సజీవ చైతన్యం.
సంజీవదేవ్ గారి సాహిత్యం :
సంజీవదేవ్ గారి సాహిత్యం మనకు అనేక వ్యాసాల రూపంలోనూ, వ్యాస సంపుటాలుగా, కవితా సంపుటాలుగా, లేఖా సాహిత్యంగా, స్వీయచరిత్ర రూపంలో తెలుగు, ఆంగ్ల భాషలలో కనబడుతుంది.
-వీరి స్వీయచరిత్ర ఆత్మకధా ప్రపంచంలో ప్రత్యేక స్థానముంది. తెగిన జ్ఞాపకాలు, స్మృతి బింబాలు, గతంలోకి మూడు గ్రంధాలు కలిగిపినదే వీరి స్వీయ చరిత్ర, సంజీవదేవ్ గారు ఇంగ్లీషులో రాసిన గ్రంధం “బయోసింఫనీ” వీరి రచనలలోకెల్లా ఇది ఉత్తమమైనదిగా చెప్పబడుతోంది. ఇందులో విశ్వసృష్టి జీవోత్పత్తి, మానవ పరిణామం, సంస్కృతి, భాషలు, కళలు, జీవితం, మృత్యువు, మతాలు, దర్శనాలు ఇలా ఎన్నో విషయాలను తాత్త్విక వైజ్ఞానిక ధోరణుల గురించి అనేక శాస్త్రాలలో చెప్పిన విషయాలను సమదృష్టితో అర్ధం చేసుకుంటూ తనదైన ప్రత్యేకశైలిలో ఆ భావాలను తిరిగి మనకు అర్ధమయ్యేలా చెప్పారు. వీరే ఈ గ్రంధంలో నూతన జీవి తాత్త్విక సిద్ధాంతం. “సైకోహ్యూమనిజం”ను ప్రతిపాదించారు. దీనినే మానసవాదం అని కూడా అంటారు.
సంజీవ్ దేవ్ గారు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినవారు, అల్డస్ హాక్సలీ అనే ఆంగ్లమేధావికి ఒక ఉత్తం రాస్తూ అందులో “మానవుడు స్వేచ్ఛాజీవి, మానవుడు అన్నిటి కన్నా స్వాతంతాన్ని, స్వేచ్ఛను కోరుకుంటాడు. దు:ఖాన్నించి, దారిద్రాన్నించి, మనోవేదనల నించి, నిత్యావసరాల నించి, రాజకీయ, సామాజిక, ఆర్థిక పీడిత శక్తుల నుంచి విముక్తి చెంది ఉండటమే స్వేచ్ఛ, అదే స్వాతంత్య్రమని దేవ్ గారు లేఖలో రాస్తారు.
శాస్త్రీయ ఆలోచన:
శాస్త్రీయ విషయాల పట్ల సంజీవదేవకు ఆసక్తి ఉండటమే కాదు, ఆయన ప్రతి వ్యక్తి జీవితంలోనూ శాస్త్రీయ పరిజ్ఞానం ఉండాలని అంటారు.
దైవం:
దైవం అన్నది ‘ఒక నమ్మకం’ మాత్రమే హేతువుకు అందనిది. శాస్త్రీయంగా సమాధానం చెప్పలేనిది అంటారు. వీరు రాసిన ఒక లేఖలో ‘ప్రతి మఠంలో జ్ఞానకాండ, కర్మకాండ అనే రెండు దశల సాధనలుంటవి. నాకు కర్మకాండ నచ్చదు, జ్ఞానకాండ ఇష్టం” అంటారు. మతం పేరిట జరిగే పూజాక్రతువుల పట్ల సంజీవదేవ్ వివిధ సందర్భాలలో తమ విముఖత వ్యక్తపరచారు. మూఢనమ్మకాలు:
అశాస్త్రీయ విషయాలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటారు సంజీవదేవ్. ప్రకృతి వైద్యాన్ని, శాస్త్రీయంగా అర్ధం చేసుకోవడానికి ఆయన ఆసక్తి చూపుతారు.
శరీరనిర్మాణ శాం:
ప్రపంచంలో మెదడును మించిన సంక్లిష్టమైన, సునిశితమైన, శక్తివంతమైన నిర్మాణం లేదని, అది అనుభూతులు, ఆలోచనలు, కోరికలకు మూల స్థావరంగా ఉందంటారు. అంతేకాక శరీరంలో జరిగే అనేక జీవ రసాయనిక చర్యలను మెదడు అదుపు చేస్తుందని చెబుతారు.
మనోవిజ్ఞానం:
దేవ్ గారికి అత్యంత ఇష్టమైన రంగం మనో విజ్ఞానం. ““సామూహిక అచేతన నుండి వైయుక్తిక అచేతన వస్తుంది. వైయక్తిక అచేతన నుండి వైయక్తిక చేతన రూపొందుతుంది”. ఈ వైయక్తిక చేతననే ‘వ్యక్తిత్వం’ అన్న యూంగ్ సిద్ధాంతమంటే అభిమానం.
ఇవే కాక సంజీవదేవ్ గారు చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, ఇంకా అనేక కళా, సాహితీ అంశాలను శాస్త్రీయంగా వివరిస్తారు.
సామాజిక జీవితం ప్రభావిత అంశాలు:
సామాజిక జీవితాన్ని సాంఘికం, ఆర్థికం, రాజకీయం, నైతికం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటితోపాటుగా తాత్విక పార్శ్వం అన్నది కూడా ప్రముఖమైన ప్రభావిత అంశం. సంజీవదేవ్ గారి రచనలన్నీ కూడా తాత్విక పార్శ్వం నుండి ఇతర అంశాలను దర్శిస్తూ చైతన్య పరుస్తాయి.
మానవ స్వభావం, మానవ వ్యక్తిత్వం అన్నవి తమంతట తాముగా నిర్ణయిమైనవి కావు. ఒక్కొక్కమారు ఇతర మానవుల ఒత్తిడి ద్వారా, నిర్ణయమైనవిగా ఉంటాయి. అలాగే మానవుడు తన చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా ఎప్పటికప్పుడు, తన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని నిర్ణయించుకుంటుంటాడు. నిర్మించుకుంటుంటాడు.
చైతన్య శీలి అయిన మానవుడు సాటివారితో కలసి తన జీవితం నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు సుఖంగా, సంతోషంగా, అందంగా ఉండాలని కృషి చేస్తాడు.
ముగింపు:
మానవుడు ఆదిమ మానవ రూపం నుండి, సంచార జీవితపు గుహలు, చెట్టు తొర్రల నుండి పచ్చి మాంసం తినే దశ నుండి వండిన మాంసం తినే దశకు చేరినది పరిణామదశ, ఆహార సేకరణ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు. ఇవన్నీ కూడా మనషి తన అన్వేషణతో తన కోసం తాను సృష్టించుకున్న, సాధించుకున్న విషయాలు. ఈ పరిణామ దశలో మానవుడి సామాజిక చైతన్యం రూపుదిద్దుకుంది.
మనిషి శ్రమతో సంబంధం లేకుండా జీవితంలో ఏదీ సంబంధం కాదు. ప్రతి వస్తువును మనిషి, తన కోసం, తన శ్రమతో ఉత్పత్తి చేసుకుంటూ పురోగమిస్తున్నాడు.
మారిన పరిసరాలు, పరిస్థితులలో మనిషి తాను మారిన ఆలోచనలతో, అభిరుచులతో ఉత్పత్తి శీలతను మార్చుకుంటూ వస్తున్నాడు. నాటి ఆదిమ మానవునికి అనువుగాని పరిసరాలకు అనువుగా మార్చుకోవడంలోను, అదేవిధంగా నేటి ఆధునిక మానవుడు తనకు సవాలు విసురుతున్న క్రొంగొత్త రోగాలను, కొత్త సవాళ్ళను ఎదుర్కోవడంలో ఏనాడు నెరవడం లేదు. ఇదంతా అతను సాధించుకున్న సాంఘిక చైతన్యమే. ఈసామాజిక చైతన్యం ఒక జాతి, జీవిత విధానాన్ని నిర్వచిస్తుంది. ప్రజల సృజన స్వభావం, వారి సామాజిక చైతన్యంలో తొంగి చూస్తుంది. అలాంటి లోతైన, లోచూపున్న సాహిత్యాన్ని సృజన చేసి మనకందించిన సూర్యదేవర సంజీవదేవ్ గారు. చిరస్మరణీయులు.
-ఎల్.ఆర్. వెంకట రమణ