అమ్మను ఆశ్రయించిన అండం ‘మనిషి’ ఐనట్లే….
అక్షరాన్ని ఆశ్రయించిన మనిషి ‘మనీషి’ అవుతాడన్నది నిజం.
అసాధ్యాలను సుసాధ్యం చేసేది ‘అక్షరం’
అజ్ఞానాన్ని జయించే ఆయుధం ‘అక్షరం’
మనిషి మనసుకి ‘అద్దం’ అక్షరం
మనిషి మేధస్సుకి ఆలంబన అక్షరం.
ఆధునిక దైవం అక్షరం ! ఇంతటి మహిమాన్విత “అక్షర పాత్ర” విక్రమ్ పబ్లిషర్స్!
విక్రమ్ పబ్లిషర్స్ అధినేత రావిక్రింది రామస్వామి గారు మార్చి 13 న తన 73 వ యేట అనారొగ్యంతో విజయవాడలో కన్నుమూసారు.
ప్రస్థానం: ఆది మానవుడు ‘వ్యవసాయం’ పైనే ఆధారపడి కష్టించి, అన్నం పండించి, కడుపు నింపుకునేవాడు.
ఆధునిక మానవుడు అనేక వ్యాపకాలలో ‘పడి’ డబ్బుని సృష్టించి, ‘వ్యయ’సాయంతో కడుపు నింపుకొంటున్నాడు’!
“కోటి విద్యలూ కూటి (గూటి) కొరకే” అన్నది అక్షర సత్యం. ఈ కోటి విద్యలను అందరి దరికి చేర్చే సులభ సాధనం’ అక్షరం. ఇటువంటి మహత్తరమైన అక్షరాలను వీధిబడి మొదలు విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ చరిత్ర, సాహిత్యం, గణితం, శాస్త్ర సాంకేతిక ఇత్యాది విషయాల రూపంలో అచ్చొత్తించి, అందుబాటు ధరలో, ఆధునికంగా రూపొందించి అందించే క్రమంలో ఆవిర్భవించినదే రామస్వామి గారి ‘విక్రమ్ పబ్లిషర్స్’.
ప్రకాశం జిల్లా మార్కాపురం చెంతనున్న తిమ్మాపురం గ్రామంలో 1947 అక్టోబర్ దుర్గాష్టమి రోజున రావిక్రింది శ్రీరాములు, వెంకటసుబ్బమ్మ పుణ్యదంపతులకు జన్మించారు రామస్వామి.
‘కష్టేఫలి ‘ అని నమ్మిన వీరు- పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ రంగాల నేపధ్యంతో అనాదిగా విరాజిల్లే విశిష్ట నగరం, విజయాలవాడ విజయవాడలో చదువుల తల్లి నీడ, 1978 సంవత్సరంలో విక్రమ్ పబ్లిషర్స్ ను ప్రారంభించి విధ్యార్థి లోకానికి విజయసోపానాలు నిర్మించారు.
అనేక పదవులు: పబ్లికేషన్ రంగంలో విజయాలు సాధిస్తూ… విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కి అధ్యక్షులుగా, SKPVV హిందూ హై స్కూల్ పాలక వర్గానికి అధ్యక్షులుగా, కాకరపర్తి భావనారాయణ కళాశాల పాలకమండలి కమిటీ కి అధ్యక్షులుగా, విజయవాడ వన్ టౌన్ నందలి శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ పాలకమండలి అధ్యక్షులుగా తన విశేష సేవలను అందించారు.
విక్రమ్ – విజయమంత్రమ్!
అనవరతం ఆలోచించటం, ఆహర్నిశలూ శ్రమించటం తప్ప విశ్రమించటం తెలియని రామస్వామి గారి దశాబ్దాల పరిశ్రమ’కు భౌతిక సాక్ష్యం విక్రమ్ పబ్లిషర్స్. ప్రతీ విపణిలో రాణించాలంటే ముఖ్యంగా ప్రజలలో నమ్మకం పెరగాలి, అవసరానికి తగిన అవగాహన వుండాలి. పుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చే సాటి వ్యాపార సంస్థలిచ్చే గట్టిపోటినీ తట్టుకొని నిలబడాలి అన్నిటికీ మించి కాలం కలిసి రావాలి. ఇన్నింటి మధ్య సమన్వయంతో వ్యవహరించారు కనుకనే విక్రమ్ రామస్వామి గారు అంచెలంచెలుగా ఎదిగి, విక్రమించి .. “విక్రమ్ – పబ్లిషర్స్” ను ఉన్నతస్థాయిలో నిలబెట్టారు.
అచ్చులు – హల్లులు, వత్తులు, పొల్లులు రామస్వామి గారికి ఇల్లు ఇల్లాలు పిల్లలు.
విక్రమ్ పబ్లిషింగ్ ప్రత్యే’కత’
సామాజిక హితం, జీవన గుణితం, వ్యాపార గణితం, అన్నీ తెలిసిన ఈ రామస్వామి గారు తమ పబ్లిషింగ్ ని విజయపధలో నడిపించటాని కారణాలు… స్టూడెంట్ కంటెంట్ మెంట్ కాలాను గుణంగా కంటెంట్ డెవలప్మెంట్, ప్రచురణలో కమిట్ మెంట్, ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్, టీచర్స్ టెస్ట్ కు తగినట్లు లేటెస్ట్ ప్రెజెంటేషన్, విక్రమ్ పుస్తకాలు అందరికీ అందుబాటులో వుంచే యాంబిషన్ అని తెలుస్తుంది.
విద్యార్థి లోకంలో….
విక్టరీస్ కి అడ్రస్.. విక్రమ్ సీరిస్, విద్యార్థుల విజయాల స్పెక్ట్రమ్ – విక్రమ్ బుక్స్ అనే నానుడి వీరి అక్షరాల గుడికి రాజగోపురం.. సబ్జెక్ట్ ఏదయినా సరే… సరైన సమాచారం సమగ్రంగా ప్రచురించి అందించాలనే వీరి ఆబ్జెక్ట్ విక్రమ్ పుస్తకాలకు ఈ నేల నాలుగు దిశలా ఇంతటి ప్రాచుర్యం లభిస్తున్నది. పుస్తకం అందరికీ హస్తభూషణం. కానీ…రామస్వామి గారికి పుస్తకం సమస్తం.
సమాజంలో అన్ని రంగాలలో పరిణతిని సాధిస్తున్న ఆర్యవైశ్యులు, రాజకీయ రంగంలో కూడా ప్రాతినిధ్యం వహించాలనే తలంపుతో 15 సంవత్సరముల క్రితం “వైశ్యశంఖారావం” అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి రామస్వామి గారు ప్రేరణ ఇచ్చారని పలువురు నేటికీ చెబుతుంటారు.
-కళాసాగర్