నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం

నవరస నటనా సార్వభౌముడు అంటే సినీ ప్రేమికులకు ఆయన కైకాల సత్యనారాయణ అని ఇట్టే తెలిసిపోతుంది. చిరస్మరణీయమైన నటనాపటిమతో సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద సినిమాలలో అద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను మూట కట్టుకున్న స్ఫురద్రూపి కైకాల. రౌద్ర, భయానక, బీభత్సం, వీర, హాస్య, కరుణ, లాలిత్య రసపోషణలలో ధిట్టగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ, నందమూరి తారకరామునికి ఇష్టమైన ప్రతినాయకుడు. రామారావు శ్రీకృష్ణుడైతే కైకాల దుర్యోధనుడు. రామారావు శ్రీరాముడైతే కైకాల రావణాసురుడు. ఇద్దరూ కలిసి నటించిన 100 పైగా చిత్రాలలో అసలు సిసలైన ప్రతినాయకుడు. అయితే దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాలలో మాత్రం మూర్తీభవించిన కరుణారస హృదయుడు. ‘యమలీల’ సినిమాలో “యముండ” అంటూ హాస్యానికి భాష్యంపలికిన సార్వభౌముడు. విఠలాచార్య రూపుదిద్దిన అద్భుత నటుడు. రాజనాలకు సరిపోటీగా నిలిచి ఆయన పీఠాన్ని ప్రతిక్షేపించిన వారసుడు. వెరసి ఆయన ఒక విలక్షణ నటుడు. యాభై ఏళ్ళకు పైగా తెలుగు సినీరంగాన్ని అప్రతిహతంగా యేలి, ఎనిమిది వందలకు పైగా సినిమాలలో నటించిన కైకాల సత్యనారాయణ తన 87 వ యేట 23 డిసెంబర్ 2022 (శుక్రవారం) అనారోగ్యంతో బాధపడుతూ ఫిల్మ్ నగర్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ దివంగత సత్యనారాయణ గురించి అందిస్తున్న కొన్ని విశేషాలు….*

కైకాల తొలిరోజుల్లో …

కైకాల సత్యనారాయణ పుట్టింది 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో. తండ్రి లక్ష్మినారాయణ మోతుబరి రైతు. కైకాల పాఠశాల చదువు గుడ్లవల్లేరులో పూర్తిచేసిన తరవాత విజయవాడ, గుడివాడ పట్టణాలలో కాలేజి చదువు కొనసాగించి బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. ఆయన స్ఫురద్రూపి. కాలేజి రోజుల్లో సహాధ్యాయులందరూ ఎన్.టి. రామారావు లాగే వున్నావని ప్రస్తుతించేవారు. కైకాలకు నాటకాల మీద మంచి అభిరుచి వుండేది. సినిమా నటుడిగా రాణించాలని కూడా అభిలాష. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే వివిధ నాటక సంస్థల తరఫున రాష్ట్రమంతా పర్యటించి బంగారు సంకెళ్ళు, కులంలేని పిల్ల, ప్రేమలీలలు, పల్లెపడుచు, ఎవరుదొంగ వంటి నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించి అనేక బహుమతులు గెలుచుకున్నారు. డిగ్రీ పూర్తి చేసినా మంచి ఉద్యోగం రాలేదు. రాజమండ్రిలో కైకాల కుటుంబసభ్యులకు కలప వ్యాపారం వుండేది. అక్కడకు వెళ్లి కొంతకాలం వ్యాపారంలో మెలకువలు అధ్యయనం చేశారు. ఎందుకో ఆ వృత్తి కైకాలకు అంతగా వంటపట్టలేదు. సినిమా నటనమీద మోజుతో తన స్నేహితుడు కె.ఎల్.దత్ సలహాపై మద్రాసు చేరుకున్నారు. అప్పట్లో ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో కె.ఎల్. దత్ సహాయ కళాదర్శకుడిగా పనిచేస్తుండేవాడు. ఆ సంస్థ ‘కొడుకులు-కోడళ్ళు’ అనే సినిమా తీసే ప్రయత్నంలో వున్నప్పుడు దత్ కైకాల సత్యనారాయణను ఎల్.వి. ప్రసాద్ గారికి పరిచయం చేశారు. వెంటనే ప్రసాద్ సత్యనారాయణకు స్క్రీన్ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా నిర్మాణానికి నోచుకోలేదు. తరవాత సత్యనారాయణ దర్శక నిర్మాత బి.ఎ.సుబ్బారావును కలిశారు. ఆయన సిఫారసుతో కైకాల ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి వద్దకు వెళ్ళారు. అయన కైకాలకు మేకప్ టెస్ట్, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అన్నీ చేయించారు. ‘దొంగరాముడు’ చిత్రంలో ఒక పాత్రను ఇవ్వాలని కె.వి. రెడ్డి తలపోసినా వివిధ కారణాల వలన ఆయన ఇవ్వజూపిన పాత్ర ఆర్. నాగేశ్వరరావును వరించింది. ఒకానొక సందర్భంలో వినోదా సంస్థ అధిపతి డి.ఎల్.నారాయణ సత్యనారాయణను చూసి, అతని గెటప్ నచ్చి, చందమామ బ్యానర్ పై పి.చెంగయ్య దర్శకత్వంలో నిర్మించనున్న ‘సిపాయి కూతురు’(1959) లో హీరోగా పరిచయం చేస్తూ జమున సరసన నటింపజేశారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. డి.ఎల్. మూడు సంవత్సరాల అగ్రిమెంటు మీద సత్యనారాయణతో నెలకు మూడు వందల రూపాయల జీతానికి తీసుకోవడంతో కైకాలకు ఇతర నిర్మాణ సంస్థల్లో పనిచేయడానికి వీలు లేకుండాపోయింది. సిపాయికూతురు దెబ్బతినడంతో డి.ఎల్ మరో సినిమా ప్రారంభించలేక పోయారు. ఎన్టీఆర్ కు దగ్గర పోలికలుండటం చేత సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. అలా 1960లో ఎన్టీఆర్ చొరవతో మోడరన్ థియేటర్సు వారి ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’ చిత్రంలో కైకాల అతిధి నటుడిగా నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్.డి.లాల్ విఠలాచార్యకు శిష్యుడు. లాల్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ విఠలాచార్య కైకాలలో వున్న మెరుపును, తేజస్సును గుర్తించి, ప్రతినాయకుని వేషాలైతే అవకాశాలు ఎక్కువగా వస్తాయని సమాధానపరచి తన సొంత సినిమా ‘కనకదుర్గ పూజామహిమ’(1960)లో సేనాధిపతి పాత్రను ఇచ్చి తొలిసారి విలన్ పాత్రను పోషింపజేశారు. అదే సంవత్సరం బి.ఎన్.రెడ్డి ‘రాజమకుటం’ సినిమాలో సత్యనారాయణకు ఒక చిన్న సహాయపాత్ర ఇచ్చారు. దాంతో హీరోగా కాకుండా కైకాల విలన్ పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది.

*నవీన విలన్ … కైకాల *

కొంత విరామం తరవాత 1962లో సత్యనారాయణకు మంచి అవకాశాలు వచ్చాయి. శ్యాంప్రసాద్ మూవీస్ వారు వై.ఆర్.స్వామి దర్శకత్వంలో నిర్మించిన ‘స్వర్ణగౌరి’లో శివుడి పాత్ర సత్యనారాయణను వరించింది. తరవాత ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’(1963) లో కర్ణుడిగా, అదే సంవత్సరం చిత్తజల్లు పుల్లయ్య సారధ్యంలో వచ్చిన సంచలనాత్మక పౌరాణిక చిత్రం ‘లవకుశ’లో భరతునిగా, రాజ్యం పిక్చర్స్ వారి ‘నర్తనశాల’లో దుశ్శాసనునిగా, మానాపురం అప్పారావు నిర్మించిన ‘పరువు-ప్రతిష్ట’లో ప్రతినాయకునిగా కైకాల నటించారు. విఠలాచార్య సినిమా ‘అగ్గిపిడుగు’(1964)లో ప్రధాన విలన్ రాజనాలకు ఆంతరంగికునిగా, రాజకపూర్ చిత్రం ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’లో విలన్ ప్రాణ్ గెటప్ లో అగుపించి మంచినటన కనపరిచారు. ‘శ్రీక్రిష్ణపాండవీయం’ (1966) చిత్రంలో రుక్మిణి అన్న రుక్మి గా, ‘పాండవ వనవాసము’లో ఘటోత్కచునిగా, ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’ చిత్రాలలో దుర్యోధనునిగా, ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక సినిమా ‘దానవీర శూరకర్ణ’లో భీమునిగా, ‘సీతాకల్యాణం’లో రావణాసురునిగా, కైకాల సత్యనారాయణ అసమాన నటనను ప్రదర్శించారు. ఇక సత్యనారాయణకు వెనుకకు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ‘కథానాయిక మొల్ల’లో శ్రీకృష్ణ దేవరాయలుగా నటించిన సత్యనారాయణను చూసి రాయలువారు అలాగే వుండే వారేమోనని ప్రేక్షకులు భ్రమించారు. ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో ఎన్టీఆర్ కు జాలిగొలిపే అన్నగా, ‘వరకట్నం’లో కృష్ణకుమారికి అన్నగా, ‘శారద’ చిత్రంలో చెల్లెలి భర్త మరణాన్ని గుండెలోనే దాచుకున్న అన్నగా అద్భుతనటన ప్రదర్శించారు. ఈ ‘శారద’ సినిమాతోనే సత్యనారాయణ మంచి కేరక్టర్ నటునిగా గుర్తింపు పొందారు. ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో జయప్రదకు అసమర్ధుడైన అవిటి తండ్రిగా అద్భుత నటన ప్రదర్శించారు. ‘ప్రేమనగర్’ లో కేశవవర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ సినిమాల్లో విభిన్నమైన విలన్ పాత్రలు ధరించి మెప్పించారు. పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ గంభీరస్వరం ఆ పాత్రలకే వన్నెతెచ్చింది. ఇక సాంఘిక చిత్రాల్లో సత్యనారాయణ నటించిన విలన్ పాత్రలు చూసి పల్లెటూరి ప్రేక్షకులు తిట్టుకునేవారు.! అందుకోసం సత్యనారాయణ పట్టుదలతో శ్రమించడమే కారణం.

కేరక్టర్ నటునిగా కైకాల

యస్వీ రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన పాత్రలు ఎక్కువగా కైకాలనే వరించాయి. దాంతో కేరక్టర్ నటునిగా తనని తాను మలుచుకునే అవకాశం సత్యనారాయణకు దొరికింది. ‘గూండా’, ‘గ్యాంగ్ లీడర్’, ‘సమరసింహా రెడ్డి’ వంటి సినిమాల్లో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆపాత్రకే ఆయన వన్నెతెచ్చారు. రామానాయుడు సినిమా ‘సావాసగాళ్ళు’(1977) లో గుమ్మడితో కలిసి ఒక గ్రూప్ డ్యాన్స్ పాట “బంగారు తల్లివి నీవమ్మా” లో సత్యనారాయణ గుమ్మడితో కలిసి నర్తించాల్సివచ్చింది. నృత్యదర్శకుడు హీరాలాల్ వీళ్ళిద్దరూ స్టెప్పులు యెలా వెయ్యాలో వివరించారు. అసలే అది మంగళగిరి పట్టణంలో అవుట్ డోర్ షూటింగు. జయచిత్రకు సత్యనారాయణ పడుతున్న ఇబ్బంది అర్ధమైంది. ఆ స్టెప్పులు వెయ్యాల్సిన విధానం నెమ్మదిగా వివరించింది. మెలకువలు తెలుసుకున్న సత్యనారాయణ, గుమ్మడితో కలిసి ఇక విజృంభించి నాట్యం చేశారు. ఒకే షాట్లో ఆ సన్నివేశం ఓకే అయ్యింది. అలాగే ‘నిప్పులాంటి మనిషి’ చిత్రంలో హిందీ నటుడు ప్రాణ్ నటించిమెప్పించిన ఖాన్ పాత్రను పోషించారు సత్యనారాయణ. అందులో ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ‘తాత-మనవడు’, ‘చదువు-సంస్కారం’, ‘తూర్పు-పడమర’, ‘నేరము-శిక్ష’, ‘బంగారు కుటుంబం’, ‘అన్వేషణ’, ‘తాతయ్య ప్రేమలీలలు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘బొబ్బిలిరాజా’, ‘శ్రుతిలయలు’, ‘అత్తకుయముడు-అమ్మాయికి మొగుడు’, ‘రుద్రవీణ’, ‘అల్లుడుగారు’, ‘ఒంటరి పోరాటం’ వంటి సాంఘిక చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు, సోషల్ ఫాంటసీ చిత్రాలు ‘యమగోల’, ‘యమలీల’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాల్లో యముడిగా జీవించారు. రమా ఫిలిమ్స్ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దులమొగుడు’ వంటి ప్రయోజనకర చిత్రాలు తీసి విజయం సాధించారు. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2012 లో 59 వ జాతీయ బహుమతుల జ్యూరీలో సభ్యునిగా వ్యవహరించారు. 1996లో ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయ రంగప్రవేశం చేసి మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీచేసి 11 వ లోక్ సభలో సభ్యునిగా సేవలు అందించారు.

పురస్కారాలు..సత్కారాలు

సత్యనారాయణ దాదాపు 800 చిత్రాలలో వివిధ పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాలలో 223 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. దాదాపు 200 మంది దర్శకులతో ఆయన పనిచేశారు. అనంతపురం, గుడివాడల్లో కైకాలకు ‘నటశేఖర’ బిరుదు ప్రదానం చేశారు. కావలి విశ్వోదయ సాంసృతిక సంస్థ వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. ఇక ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదు సార్వజనీనికంగా అమరినదే. ‘తాత-మనవడు’, ‘సంసారం-సాగరం’, ‘కచదేవయాని’ సినిమాలకు ఉత్తమ నటునిగా కైకాలకు నంది పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు. 2011లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి గౌరవించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కైకాల చేసిన సేవలను గుర్తిస్తూ 2017లో ఫిల్మ్ ఫేర్ సంస్థ జీవనసాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఇంత గొప్పనటుడికి ఇప్పటికి కూడా ‘పద్మ’పురస్కారం రాకుండటం వింతే! ఇంత గొప్ప నటుడికి ‘పద్మ’ పురస్కారం రాకుండటం వింతే! ఈ విషయమై ఒకసారి సత్యనారాయణను అడిగితే “మహానటి సావిత్రికి, నటసార్వభౌముడు ఎస్వీఆర్ ల కే ‘పద్మశ్రీ’ లు ఇవ్వలేదు. వారి సరసన వున్నవాణ్నే కదా నేను. అందుకే ఇవ్వలేదేమో” అన్నారు. అయినా సత్కారాలను కొనుక్కోవడం అందరికీ ఇష్టం వుండదు కదా!. సొంతవూరు కౌతవరంలో తన తాతగారి పేరుతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సత్యనారాయణ కట్టించారు. రోడ్లు వేయించారు. సొంత ఊరుతో సత్యనారాయణకు ఎనలేని అనుబంధం. అలాగే గుడివాడలో ఒక కళా మంటపం నిర్మించారు. పేద విద్యార్థులకుచదువుతో పాటు పెళ్ళిళ్ళు, ఉపాధి అందిస్తున్నారు. ఈ నటనా సార్వభౌమునికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని భగవంతుని వేడుకుందాం.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం

  1. Really he is a good and fantastic artist. I loves his comedy. May his soul rest in peace. Many thanks to Sri
    ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap