సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)
ఒకప్పుడు సుప్రభాత వేళ నుండి రాత్రి పడుకునే వరకు సంగీత, సాహిత్య, నాటకాది విభిన్న కార్యక్రమాలతో ఆకాశవాణి ఆబాల గోపాలాన్ని అలరించేది. నాలుగయిదు దశాబ్దాల క్రితం ఆకాశవాణి కి ప్రజలకు అవినాభావ సంబంధం వుండేది. అలాంటి ఆకాశవాణిలో వివిధ హోదాల్లో ఉద్యోగించి పదవీ విరమణ చేశారు డా. నాగసూరి వేణుగోపాల్.
కాలమిస్టుగా, పత్రికా రచయితగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ తీరు తెన్నుల విశ్లేషకులుగా, ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు ‘ యద్దనపూడి సులోచనారాణి ల సంకలనాలకు సంపాదకులుగా, ‘వేణునాదం’ ఆత్మకథారచయితగా… ఎన్నో విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డా. నాగసూరి వేణుగోపాల్. ప్రతిష్టాత్మకమైన “జ్ఞానమద్ది సాహితీ పీఠం” వారి సాహిత్య సేవా పురస్కారం ఈ నెల 29 న అందుకోబోతున్న డా. నాగసూరి వేణుగోపాల్ గారికి అభినందనలు తెలియజేస్తూ… వారి జీవిత విశేషాలను తెలుసుకొవడానికి హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళదాం పదండి…!

ప్ర. ఇప్పుడు అందరూ బుల్లితెరకు బానిసలే. కానీ ఇరవై ఏళ్ళ కిందటి వరకూ ప్రతి ఇల్లూ ఆకాశవాణితోనే మేల్కొనేది. అలాటి ఆకాశవాణిలో మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి మీదైన ముద్రను ప్రతిష్ఠించుకొన్నారు. మీ జన్మస్థలం, బాల్యం గురించి చెప్తారా?

జవాబు: నేను 1988 ఏప్రిల్ నుంచి 2021 జనవరి దాకా పన (గోవా), అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, మద్రాసు, తిరుపతి కేంద్రాలలో పనిచేశాను. కొన్ని నెలలపాటు ఢిల్లీలోని ఆకాశవాణి మహానిర్దేశాలయం (Director General office) లో కూడా దేశ వ్యాప్తంగా రెండువందల పైచిలుకు ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారం కోసం ‘రేడియోస్కోప్’ అనే ఆంగ్ల సైన్సు సంచికా కార్యక్రమాన్ని కూడా కొన్ని నెలలు రూపొందించాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో నెగ్గి ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్ గా మూడేళ్ళు పనిచేసిన గోవాలో పని చేసిన తర్వాత యు.పి.ఎస్.సి. పరీక్ష ద్వారా ఆకాశవాణి/దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ తెలుగు (Spoken words and features) గా ఎంపికై పలు రాష్ట్రాలలో, పలు భాషల ఆకాశవాణి కేంద్రాలలో పనిచేసిన అదృష్టం నాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకి సంబంధించి ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలలో పనిచేసిన ప్రోగ్రామ్/ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఉద్యోగ నైపుణ్యం మెరుగు పరిచే రీజినల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్ కాస్ట్ అండ్ మల్టీ మీడియా (RABM, Hyderabad) శిక్షణా సంస్థలో సంచాలక బాధ్యతలు కూడా నిర్వహించాను. అంటే అనంతపురం వంటి అతి చిన్న ఆకాశవాణి కేంద్రం నుంచి ఢిల్లీలోని ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఆఫీస్ దాకా, అలాగే తెలుగులో ప్రఖ్యాత ఆకాశవాణి కేంద్రాలతో సహా పనిచేసే అవకాశం కలిగింది. ఇన్ని సాధ్యమవుతాయని నేను ఎంతమాత్రమూ ఊహించలేదు.

ఇదివరకటి అనంతపురం జిల్లా, ఇప్పటి సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలపు కుగ్రామం కొనతట్టుపల్లి మావూరు. అపూర్వ శిల్పకళా క్షేత్రం లేపాక్షికి పాతిక కిలోమీటర్లు, పెనుగొండ దుర్గానికి 30 మైళ్ళు. మా వూరులో అందరూ శ్రామిక జీవితం గడిపే కుటుంబాలు 50, 60కి మించి వుండేవి కావు. నీళ్ళ సదుపాయం పెద్దగా లేని ఈ కరువు ప్రాంతంలో పంటలు, జీవితమూ అన్నీ వర్షాధారమేు. అలాంటి కొండకింద ఉండే కొనతట్టు పల్లి ఎలిమెంటరీ పాఠశాలలో 5వ తరగతి దాకా చదివాను. 6వ తరగతి ఆరు కిలోమీటర్ల దూరంలో వుండే మండల కేంద్రం పాలసముద్రంలోని హైస్కూలులో చదివి, తరువాతి నాలుగు తరగతులు హిందూపురంలో చదివాను. ఇంటర్మీడియెట్ హిందూపురంలోనే కాగా బి.ఎస్సీ డిగ్రీ పుట్టపర్తి సత్యసాయి కాలేజీలోనూ ఫిజిక్స్ ఎమ్మెస్సీ, ఎమ్.ఫిల్ కోర్సులు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోనూ సాగాయి.
పదిమంది పిల్లలున్న మధ్యతరగతికి దిగువన వుండే సామాన్య, అగ్రవర్ణంలో ఎనిమిదో బిడ్డగా నేపథ్యం నాది. చిన్న చిన్న ఇంటిపనులు, పొలం పనులు, పశువులకు సంబంధించిన పనులు మొదలైనవి చేస్తూ సాగిన బాల్యం కూడా నాది. చదువు విలువ తెలిసిన తల్లిదండ్రులు నాకు గొప్ప వరం!

ప్ర. మీ కలానికి రెండువైపులా పదునుంది. ఒక వైపు సైన్సు, మరోవైపు సాహిత్యం. ఈ రెండిటికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు రాశారు. మీకు సైన్సు అంటే ఇష్టమా? సాహిత్యం అంటే ఇష్టమా? ఏది ఎక్కువ ఇష్టం?

జ. మీకు ధన్యవాదాలండీ. నిజానికి నాగసూరి కలం కత్తికి రెండువైపులే కాదు, మూడు, నాలుగు వైపులా పదునుంది అని అంటే మీరేం అనుకోవద్దు. సైన్సు, సాహిత్యం, జర్నలిజం, సామాజికం, చరిత్ర ఈ నాలుగైదు విభాగాల్లో నా మూడు పాతికల రచనల్లో కనబడతాయి. నిజానికి ఒక విభాగమని వింగడించడం కూడా ఒక్కోసారి సాధ్యపడదేమో అని కూడా అనిపిస్తూ వుంటుంది. తొలుత ప్రచురించబడిన వ్యాసాలు మూడున్నర దశాబ్దం క్రితం మూడు విభాగాలకు చెందినవి. ‘వేమనవాదంలో కవిత’ అని ‘ఆంధ్రప్రభ ఆదివారం’ సంచిక ప్రచురిస్తే; తెలుగు దినపత్రికల సంపాదకీయాల గురించి ‘ఆంధ్రపత్రిక’ డైలీ సోలార్ వాటర్ హీటర్ గురించి; ‘ఆంధ్రజ్యోతి’ తన ఎడిట్ పేజీలలో అలంకరించాయి. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లోపు నేను యూనివర్సిటీ చదువుతున్న కాలంలో సంభవించాయి. అన్ని పెద్ద పత్రికలే! మరో రకంగా చెప్పాలంటే సమాజానికి పనికొచ్చే వస్తువును అందంగా అందిస్తూ హేతుబద్ధతను రంగరించడమే నాగసూరి వ్యాసం అని అనవచ్చునేమో! పదవ తరగతి చదువుతున్నప్పుడు ‘ఆంధ్రపత్రిక’ ఓ కవితను ప్రచురించినా, డిగ్రీ చదువుతున్నప్పుడు తొలి కథ ‘అన్వయం’ రాసిన యూనివర్సిటీ మెట్లెక్కసరికి “ఫిక్షన్ వద్దు, వచనం చాలు” అనే నిర్ణయమయిపోయింది నాలో! ఇదే మాట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కేవలం రెండు మాటల్లో, ” వచనమంటే విజ్ఞానం” అని ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రిక లో రాశారని పుష్కరం క్రితం తెలుసు కున్నాను.

మూడు పాతికలకు మించిన నా పుస్తకాల్లో సైన్సు, సాహిత్యం, జర్నలిజం ప్రతిదీ సుమారు మూడోవంతు ఆక్రమిస్తుందని నేను భావిస్తున్నాను. అంటే నాకు సాహిత్యం, సైన్సు, సామాజికం, చరిత్ర అన్నీ ఇష్టమే! ఈ క్లారిటీ నేను పదోతరగతి చదివేటప్పటికే నాకుంది. సైన్సును విడిగా, స్వంతంగా చదవలేమని తెలుసుకుని ఇంటర్మీడియేట్ లో సైన్సు విభాగం ఎంచుకున్నాను. అందులో ఎంతో ఇష్టమైన, ఈ భౌతిక ప్రపంచాన్ని వివరించే ఫిజిక్స్ లో నా ఉన్నత చదువు కొనసాగించాను. ఆకాశవాణి ఉద్యోగంతో ఫిజిక్స్ పిహెచ్ డి మధ్యలో ఆగిపోయిన కారణంగా సర్వీసులో చేరిన పదిహేనేళ్ళకు జర్న లిజంలో ఎమ్.ఏ. చేసి పిమ్మట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెళ్ళ తీరు తెన్నుల మీద పి హెచ్. డి. పొందాను.

ప్ర. సుమారు 20 ఏళ్ళ కిందట ‘వార్త’లో మీ ‘ప్రకృతి-వికృతి’ కాలం చదివి సైన్సు విషయాలను కూడా ఇంత చక్కగా రాశారనిపించింది. మొదలు పెడితే ఆగకుండా చివరి దాకా చదివించే జలపాత శైలి, సరళ సుందరమైన భాష… ఎవరీ రచయిత? అనుకొన్నాను. తరవాత తెలసింది, విజయవాడ ఆకాశవాణిలో పనిచేయడానికి కొత్తగా వచ్చారని! అక్కడ పని చేస్తున్నప్పుడు ‘శతవసంత సాహితీ మంజీరాలు’ ధారావాహిక కార్యక్రమం ప్రసారం చేశారు కదా. ఆ కార్యక్రమం గురించి వివరిస్తారా?

జ. అవును, సుమారు పాతికేళ్ళ క్రితం శతాబ్దపు మలుపులో విజయవాడ ఆకాశవాణిలో పనిచేసే కాలంలో సాధించిన రెండు మైలురాళ్ళు ఇవి!
పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తూ కాలుష్యపు చెంపపెట్టును సైన్స్ ద్వారా చవిచూపిస్తూ సామాజిక బాధ్యతను ఫిలాసఫీతో రంగరించి సాహిత్య రూపంగా సాగింది ‘ప్రకృతి-వికృతి’ శీర్షిక. ఇందులో వంద వ్యాసాలు ‘వార్త’ దినపత్రిక ఆదివారం సంచికలో 1999 జనవరి నుంచి 2000 డిశంబరు దాకా వచ్చాయి. నాకు ఎక్కువ పేరూ గౌరవం సాధించిన రచన కూడా ఇది. అంతేకాకుండా తెలుగులో తొలి పర్యావరణ శీర్షిక కూడా ‘ప్రకృతి వికృతి’ అనవచ్చు.

తెలుగు ఆకాశవాణి కార్యక్రమాలకు మదరాసు ఒకప్పుడు మక్కా నగరం కాగా తరువాతి కాలంలో విజయవాడ ఆ స్థానాన్ని పొందింది. అలాగే హైదరాబాదు కూడా! నా అదృష్టం ప్రతిభ కారణంగా విజయవాడ, హైదరాబాదు, మదరాసులో పనిచెయ్యడమే కాకుండా వాటి 50, 60, డెబ్బయి అయిదేళ్ళ సంరంభాలలో ఆయా కేంద్రాల ఉద్యోగిగా సేవలు అందించే అవకాశం కూడా కలిగింది. ఉద్యోగం చెయ్యడం వరకే మన ప్రయత్నం. సహోద్యోగులను, సందర్భాలను మనం నిర్ణయించుకోలేం కదా! కానీ చేతికొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది ఆయా ఉద్యోగుల చేతుల్లో వుంటుంది.
1996 జులైలో విజయవాడ ఆకాశవాణిలో చేరిన నాకు ప్రైమ్ టైమ్; అంటే తెలుగు న్యూస్ చానల్స్ రాని కాలంలో ఉదయం 7.15 నుంచి 7.45 గంటల దాకా ప్రసారమయ్యే ‘ఉదయరేఖలు’ పర్యవేక్షణ బాధ్యతను తొలి రోజునుంచే అప్పజెప్పారు.
1999 జులై నాటికి వైటుకే సంచలనం గానీ, 2000 సంవత్సరపు పూనకం గానీ అప్పటికి మొదలు కాలేదు. వీటన్నికంటే ముందుగా 20వ శతాబ్దంలో వెలువడిన గొప్ప తెలుగు పుస్తకాలను పరిచయం చెయ్యాలనే తలంపు ఆకాశవాణి లో నాకు కలిగింది. 1999 జూలై 1వ తేదీ గురువారం ఏడుంబావుకు మొదలైన ‘శతవసంత సాహితీ మంజీరాలు’ మూడేళ్ళ పాటు సాగింది. ఇది వంద గొప్ప తెలుగు పుస్తకాల గురించి సుమారు 95 మంది పాల్గొన్న ధారావాహిక. ఇందులో కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, విమర్శ, స్వీయచరిత్రలు ఇంకా కొన్ని వర్గీకరణకు లొంగని రచనలు పరిచయం చేశాం. నిజానికి వస్తువు, దాన్ని సమర్పించిన శిల్పం, ఆ గ్రంధం కలిగించిన ప్రభావమూ, లేదా రేపిన దుమారం వగైరాలను వివరించడమే కాక, కాలపరీక్షకు నిలిచిన తరువాత ఆ పుస్తకం మిగుల్చుకున్నదేమిటి అనే పూర్ణమైన ప్రణాళికతో నడిచింది ఆ శీర్షిక.
‘శతవసంత సాహితీ మంజీరాలు’ అనే అందమైన పేరును నండూరి రామ్మోహనరావు చాలా ఇష్టపడేవారు. ఈ పేరును సూచించినది అప్పటి విజయవాడ కేంద్రం డైరెక్టర్ ప్రయోగ వేదవతి గారు.

ప్ర. మీ జీవితం గురించి, రేడియోలో మీ ఉద్యోగ విషయాల గురించి ‘వేణునాదం’ పుస్తకం రాశారు మీరు. ఒక మారుమూల చిన్న ఊరిలో ఊపిరి పీల్చుకొన్న మీరు ఒక ప్రసిద్ధ రచయితగా, సంపాదకులుగా, విభిన్న కార్యక్రమాల రూపశిల్పిగా జీవితంలో ఉన్నత శిఖరాలందుకొన్న విధం ఎందరికో స్ఫూర్తిదాయకం! ఈ పుస్తకం గురించి వివరించండి.

జ. నా అరవయ్యో యేట 2020 అక్టోబర్ లో వెలువడిన నా 61వ పుస్తకమిది. నిజానికి ఆంధ్రప్రభ ఆదివారం సంచికకోసం రాసిన కాలమ్ వ్యాసాలు వి. నాగరత్న కోరికమీద వీటిని ప్రారంభించాను. ఏ వస్తువు ఆధారంగా రాయాలనే విషయం గురించి నాకే స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆదివారం సంచికలో 2012-2014 మధ్య కాలంలో మా పల్లె గురించి, నా కుటుంబం గురించి, చదివిన పాఠశాలల గురించి, పనిచేసిన ఊళ్ళ గురించి, పరిచయమైన వ్యక్తుల గురించి రాసిన తళుక్కుమనే అనుభవాలతో కూడిన వ్యాసాలివి. బొమ్మతో కలిపి, పేజికి మించకుండా రాశాను. అంటే నా జీవితం మీద అంతరవరకు ప్రగాఢంగా ముద్ర వేసిన కొన్ని సందర్భాలను కొంత వరకు డాక్యుమెంట్ చేయగలిగాను. నిజానికి ఆకాశవాణిలో నా సర్వీసు ముగిసే సంవత్సరంలో ఆ సంస్థ గురించి నేను రాసిన పుస్తకం అప్పటికే పుష్కరం పాటు నలుగుతూ వచ్చింది కానీ, ఒక మిత్రుడి ప్రేమ కారణంగా అది మధ్యలో ఆగిపోయింది. ఆ పుస్తకం ఇప్పటికీ వెలుగు చూడలేదు. బహుశ వచ్చే సంవత్సరం వెలువరించగలను. కనుక ఆ సందర్భానికి తగినట్టుగా కొంత నా గురించి, కొంత నా ఆకాశవాణి జీవితం గురించి తెలిపే వ్యాస సముచ్ఛయం ఆ వ్యాసావళి. నిజానికి ‘వేణు నాద’మనే శీర్షిక ఆ పత్రికా సంపాదకవర్గం ఎంచుకుని నిర్ణయించింది.

ప్ర. మీరు తిరుపతి, కడప మొ॥ వివిధ రేడియో కేంద్రాల్లో పనిచేశారు. ఎక్కడ చేసినా మీదైన పద్ధతిలో కార్యక్రమాలను విభ్నింగా, విన్నూత్నంగా నిర్వహించి ప్రశంసలు పొందారు. విజయవాడలో ‘సినీకవి సమ్మేళనం’ నిర్వహించారు. ఆ కార్యక్రమ విశిష్టతను వివరించండి.

జ. ఏ కేంద్రాలలో పనిచేసినా బడుగు, బలహీన, శ్రామిక వర్గాలతోపాటు మహిళలకు సంబంధించిన అంశాలు, కళలు నా కార్యక్రమాలలో తప్పనిసరిగా వుండేవి. ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలు చేసే అవకాశాలను అన్ని రేడియో కేంద్రాలు నాతో పనిచేసిన తోటి ఉద్యోగులు, సంచాలకులు కల్పించడం గర్వకారణమే.
విజయవాడలో పనిచేస్తున్న కాలంలో ఒక వినూత్న పద్ధతిలో 1999 దీపావళికి సినీ కవిసమ్మేళనాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, భువచంద్ర, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ ఇలాంటి 8,9 మంది ప్రఖ్యాత కవుల కవితాపఠనంతో ఆ నాటి సభ దద్దరిల్లింది, ఆ జలదరింపుల ప్రతిధ్వనులు మరుసటి రోజు అన్ని దినపత్రికల టాబ్ లాయిడ్ లో రంగురంగుల ఫొటోలతో గుబాళించాయి. ఆలోచన ప్రయోగ వేదవతి గారిది. కవులను సమన్వయం చేసిన సహకారం జొన్నవిత్తుల రామలింగేశ్వరావుగారిది, మొత్తం నిర్వహణ,ప్రసార బాధ్యత నాది. ఈ కార్యక్రమ విజయంతో 2000 సంవత్సరం నుంచి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ఒక రోజు కార్యక్రమం విజయవాడ ఆకాశవాణికి ఇవ్వడం మొదలైంది. ఆ సంప్రదాయం రెండు దశాబ్దాలకు మించి ఇంకా కొనసాగుతూనే వుందని భావిస్తున్నాను. ఇది నిస్సందేహంగా విలక్షణమైన ఆకాశవాణికి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన కార్యక్రమం.

ప్ర. మీరు తిరుపతిలో పనిచేశారు. అక్కడ ఎలాటి కార్యక్రమాలు రూపొందించారు?

జ. 2016 ఆగస్టు నుంచి రెండేళ్ళపాటు ఆ కేంద్రం సంచాలక బాధ్యతలతోపాటు హెడ్ ఆఫ్ ఆఫీస్ బాధ్యతలను కూడా నిర్వర్తించాను. అప్పటిదాకా నేను పనిచేసిన ప్రతిచోటా ఒకరు లేదా ఒకరికి మించి అధికారులు దిశానిర్దేశం చేసే వెసులుబాటు ఉండేది. ఇక్కడ అలాంటి అవకాశం అంతరించిపోయింది. అయితే పాతికేళ్ళకు మించిన ఐదారు కేంద్రాల అనుభవం నా వెనుక ఉంది కనుకఆ రెండేళ్ళలో చాలా విలక్షణమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. సుప్రభాతం కార్యక్రమంలో ముగింపులో ఇచ్చే కార్యక్రమాలు సమూలంగా మార్చడం, సుప్రభాతంలో రాయసీమ ప్రాంతపు దేవాలయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, వ్యవసాయదారుల కార్యక్రమానికి ‘చేనూ-సేద్యం’ అనే శీర్షికగా మార్చి ఎక్కుమంది శాస్త్రవేత్తల అభిప్రాయాల కారణంగా కార్యక్రమం రూపొందించడం అలాగే మధ్యాహ్నం ఓ మూడుగంటల పాటు తెలుగు కార్యక్రమాలు పెంచడం, సినిమాపాటల్లో ఫోన్-ఇన్, ఇ-మెయిల్ విన్నపాలకు అవకాశం కలిగించే స్లాట్స్ కేటాయించడం; అలాగే తరిగొండ వెంగమాంబ రచనలకు వారానికి మూడు కార్యక్రమాల చొప్పున ప్రత్యేక స్లాట్స్ ను ఏర్పాటు చేయడం ఇలా చాలా చెప్పచ్చు.

ప్ర. మీరు చెన్నైలో పనిచేసినపుడు ‘మదరాసు బదుకులు’ అనే కథా సంకలనం తెచ్చారు. అక్కడ చాలామంది తెలుగువారున్నారు. మద్రాసు మనదే. కారణాలేమయితేనేం మద్రాసును కోల్పోయాము. ఆంధ్రప్రదేశ్లో తమిళ పాఠశాలలున్నాయి కానీ, అక్కడతెలుగు పాఠశాలలు లేవు. ఈ నేపథ్యంలో అక్కడ మీరెలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. మీకు తెచ్చిన కథా సంకలనం విశేషాలు చెప్పండి.

జ.’మదరాసు బదుకులు’ ఆకాశవాణి కేంద్రంతో సంబంధం లేకుండా ఉత్పన్నమయిన ఆలోచన. అంతకుముందు మదరాసు జీవితం ఆత్మగా వున్న తెలుగు కథానికలను గుదిగుచ్చాలనే విఫల ప్రయత్నాన్ని కొందరు చేశారు. ప్రఖ్యాత కథకులు ఆత్మీయ మిత్రులు శ్రీ విరించి, ఈ కథల కమామిషూ గురించి వివరంగా ఓ సందర్భంలో ముఖాముఖిగా నీడలో వివరించారు కూడా. మదరాసు నుంచి నేను బదిలీ కావడానికి నాలుగైదు నెలల ముందు వర్తమాన తెలుగువారి జీవితాన్ని చిత్రించే కథల సంకలనాన్ని తెస్తే బావుంటుందని అనిపించింది. పాతికవేలరూపాయలు ఇవ్వగలనని ఏదైనా ఆలోచన చేయమని పెద్దలు మిత్రులు చల్లగళ్ళ నాగేంద్ర ప్రసాద్ దాదాపు అదే సమయంలో కోరడం మంచి ఉత్ప్రేరకమయ్యింది. దాదాపు 36 మంది రచయితలు వాళ్ళు చూసిన మదరాసు తెలుగువాళ్ళ గురించి రాశారు. అందులో మహిళల సంఖ్య ఎక్కువ కావడం ఒక పార్శ్వం కాగా, తమ తొలి కథను ఈ సంకలనం కోసమే రాసినవారు సగందాకా ఉండడం ఇంకో అంశం. కథాశిల్పం కన్నా స్థానిక వస్తువు, మదరాసు తెలుగు భాషకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. ఈ మదరాసు బదుకులకు సంబంధించిన కృషి అంతా నేను తిరుపతికి వచ్చిన తరువాతనే జరిగిందని భావించాలి. 2017 సెప్టెంబరులో వెలుగు చూసిన 300 పేజీల ఈ సంకలనం రావడంలో సోదరి రాయదుర్గం విజయలక్ష్మి పాత్ర ఎంతో కీలకమైంది భువనచంద్ర, శ్రీవిరించి, శ్రీమతి లావణ్య, పత్రి అనూరాధ వంటివారి తోడ్పాటు కూడా గణనీయమైనదే. ఇప్పుడు ఈ కథల సంకలనం ప్రాంతీయతను ప్రతిఫలింప చేసి పరిమళింపచేస్తున్న తెలుగు కథాసంకలనాలలో ఒక ప్రధానమైన ప్రయత్నంగా మిగిలిపోవడమే కాక తగిన గౌరవాన్ని కూడా అందుకుంటోంది.

ప్ర. ఆకాశవాణిలో పనిచేసేటప్పుడు ఎన్నో చోట్లకు బదిలీలు అయ్యారు. ఇలా బదిలీ వచ్చినపుడు ఇబ్బంది పడ్డారా? ఆనందపడ్డారా కొత్త ఊళ్ళు చూడొచ్చని?

జ. ఇది ఒక రకంగా జీవితం నేర్పిన పాఠం! పుట్టపర్తి గానీ తిరుపతిగానీ అంతవరకు పరిచయంలేని ప్రాంతాలే. పైపెచ్చు వేరే రాష్ట్రాల, దేశాల సహాధ్యాయులు ఉన్న కళాశాల సత్యసాయి కళాశాల. అది ఒక రకంగా నాకు కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, మరింత హేతుబద్ధతను ప్రోది చేసుకోవడానికి దోహదపడింది. అలాంటిదే గోవాలో నా ఆకాశవాణి తొలి మజిలీ. అక్కడి రేడియో కేంద్రంలో మరాఠీ, కొంకణి, ఇంగ్లీషు, పోర్చుగీసు, హిందీ, ఉర్దూ — ఈ ఆరు ప్రసార భాషలు. నేను పనిచేస్తున్న కాలంలో ఆ కేంద్రంలో నేనొక్కడినే తెలుగు వ్యక్తిని. గోవా ఆకాశవాణి కేంద్రం మినీ ఇండియా లాగా కొంకణి, మరాఠీ, మళయాళం, కన్నడం, హిందీ, పోర్చుగీసు, ఇంగ్లీషు భాషలు మాట్లాడే వ్యక్తులతో నిత్యసందోహంలా వుంది. వారి మధ్య నేను చదువుకున్న ఫిజిక్స్ నైపుణ్యం కానీ, తెలుగు సామర్ధ్యం కానీ, మన నేపథ్యం కాని ఏ రకంగా దోహదపడని సందర్భం! అయితే భాష రాకపోవడం అనేది మరింత పరిశీలనగా గమనించి, ఇంకొంత నేర్చుకోవడానికి దోహదపడింది. కేవలం మన నీతి, నిజాయితీ, కష్టపడే గుణం, తెలివి, సృజనాత్మక సామర్థ్యాలు మాత్రమే అక్కడ చెల్లుబాటు అవుతాయి. తత్ఫలితంగా చాలా రకాల అహంకారం తొలిగిపోయి నమ్రత చోటు చేసుకుంటుంది. ఈ మూడేళ్ల ఉద్యోగ జీవితం కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడే సామర్థ్యమూ గుండె దిటవు లభించాయి. కనుక విజయవాడైనా విశాఖపట్టణం అయినా హైదరాబాద్ అయినా మదరాసు అయినా పెద్ద ఇబ్బంది అనిపించలేదు. దానికి తోడు కొత్త ప్రదేశంలో తక్కువ వ్యవధిలో లభించే అనుభవం; తెలిసిన ప్రదేశంలో ఎక్కువ కాలమున్నా లభించకపోవచ్చు. కనుకనే అన్ని తెలుగు ప్రాంతాల జీవన వ్యవహారాలను, సంస్కృతీ సాంప్రదాయాలను, వారసత్వ వారధులను అందుకునే, ఆకళింపు చేసుకునే ఆసక్తి, అభిలాషా, జీవితనేపథ్యమూ, అవి సాధించిన జీవన దృక్పథం దోహదపడ్డాయి. కనుక మీరన్నట్టు ప్రతిచోటా కొత్త విషయాలు తెలుసుకున్నాను, కొత్త ప్రయోగాలు చేశాను, కొంగొత్త విజయాలను అందుకోగలిగాను!

ప్ర. తీరికలేని ఉద్యోగం వత్తిళ్ళలో ఉంటూ కూడా ఒకేసారి 4,5 పత్రికలలో ‘కాలమ్స్’ రాశారు. వాటి గురించి చెప్పండి.

జ. అవును మీలాంటి విజయవాడ మిత్రులు తరచు ఆశ్చర్యపోయే విషయం అది. ఒకవైపు ఆకాశవాణిలో సదా కార్యక్రమాలు చేస్తూనే ఇన్ని కాలమ్స్ ఎలా రాయగలుగుతున్నారని ఎంతోమందికి సందేహం వస్తూవుంటుంది. విజయవాడలో నేను చేరేనాటికి నా వయసు 35 సంవత్సరాలు. ఇంకొక విషయం ఏమిటంటే బదిలీ కాగానే దానిని అంగీకరిస్తూ సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో సకుటుంబంగా అంటే కనీసం ఐదారు వేలు పుస్తకాలతో నెలలోపు వెళ్ళిపోయేవారం. విజయవాడలో ఇల్లు ఆఫీసుకు వందమీటర్ల లోపున ఉండేదంటే ఇప్పుడు ఆశ్చర్యంగానే వుంటుంది. చాలా అసౌకర్యాలున్నా దగ్గరున్న ఆ ఇంటిలో సర్దుకున్నాం. మరో విషయం ఏమిటంటే నా పని వరకే చూసుకుని అనవసరమైన ఉబుసుపోక వదంతులకు ఆసక్తి చూపేవాడిని కాను. ఏమాత్రం అవకాశం దొరికినా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఆనందపడేవాడిని. వారానికి ఐదారు కొత్త పుస్తకాలు రావడం వల్ల ఎటువంటి లోటూ వుండేది కాదు. విజయవాడలో పనిచేసే కాలంలో ఐదు దినపత్రికలకు వీక్లీ కాలమ్స్, నాలుగు మాసపత్రికలకు నాలుగు వ్యాసాలు ఇచ్చేవాడిని. అవి కూడా కొన్ని పోస్టు ద్వారా, కొన్ని స్థానికంగా అందజేయబడేవి. ఈ విభిన్నమైన మార్గాలను, ఆయా శీర్షికల వస్తువును గౌరవిస్తూ నా కలం సాగేది. అలా రాసిన ఒక శీర్షికా వ్యాసాలు తరువాతి కాలంలో బిఇడి విద్యార్థులు 12 ఏళ్ళపాటు సిలబస్ లో చదువుకున్నారు. ఇప్పుడు అబ్బురం అనిపిస్తుంది కానీ ప్రణాళిక చేసుకుంటే ఏదీ కష్టం. కాదు. నిజానికి ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా వృథా చేసే సమయమే ఎక్కువ వుంటుందనిపిస్తుంది. ఈ విషయం కొంతమందికి రుచించకపోయినా ఒక అద్భుతమైన వాస్తవంగానే పరిగణిస్తాను, దాని ఫలితాలను స్వయంగా పొందాను కనుక!

ప్ర. టెలివిజన్ కార్యక్రమాలపైనా, పత్రికారంగం పైనా విశ్లేషిస్తూ రాసేవారు కదా, ఆ వివరాలు చెప్తారా?

1996లో విజయవాడ రాగానే తొలుత పరిచయం అయిన మీడియా వ్యక్తి తెలకపల్లి రవి. ఈ సాన్నిహిత్యానికి సదా కలిసిపోయే ధోరణిలో కనబడే తెలకపల్లి రవి స్నేహపూర్వక స్వభావం ఒక కారణం కాగా; ఆయన సంపాదకుడుగా పనిచేసిన ‘ప్రజాశక్తి’ డైలీ కార్యాలయం నాకు ఐదారు నిమిషాల నడకదూరంలో ఉండటం మరో కారణం. 1997-1998 ప్రాంతంలో ప్రజాశక్తి దినపత్రికలో పత్రికారంగ ధోరణులపై కొన్ని వ్యాసాలు రాశాను. 1997 సెప్టెంబరులో ఆంధ్రభూమి దినపత్రికలో వారం, వారం టివి కార్యక్రమాలపై సమీక్షా వ్యాఖ్యాన వ్యాసాలను ప్రారంభించాను. ఈ వారం వారీ కాలమ్ ‘టీవీక్షణం’ 1997 నుంచి 2010 దాకా కొనసాగింది. అది విజయవాడ, అనంతపురం, విశాఖపట్టణం, హైదరాబాదు వంటి చోట్లకు బదిలీ అయినా సుమారు దశాబ్దన్నర నడిచింది. అంత సుదీర్ఘకాలం పాటు, అంత సమగ్రంగా మరొకరు తెలుగులో రాయలేదనేది నిర్వివాదాంశం. కొంతకాలం ఆంధ్రభూమితోపాటు, వార్త దినపత్రికలో కూడా ‘టీవీంద్రజాలం’ శీర్షికను నిర్వహించాను. ఇలా రాసిన వ్యాసాలు ఎనిమిది పుస్తకాలుగా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో అధ్యయనానికి పరిశోధనకు అందుబాటులో ఉన్నాయి. నాలుగేళ్ళలో వచ్చిన ఈ ఎనిమిది పుస్తకాలు 1999-2015 మధ్యకాలంలో వెలువడ్డాయి.
అపుడే ప్రవేశిస్తున్న టెలివిజన్ మాధ్యమం గురించి విమర్శలకు అవకాశం కల్పించిన పత్రికారంగం తనపట్ల వచ్చే విమర్శలకు వేదిక కల్పించడానికి కొంతవ్యవధి తీసుకుంది. ఇక్కడ విజయం సాధించడానికి వైయక్తికమైన నా ప్రణాళిక కూడా వుంది. చివరకు 2007లో ‘ఈవారం’ అనే వారపత్రికలో ప్రధానంగా తెలుగు పత్రికల పోకడలనూ మరీ ముఖ్యంగా బి.సి.వర్గాల గొంతుకలకు రంగస్థలమైన ‘సూర్య’ పత్రిక మొదలైనప్పుడు; అలాగే ప్రత్యామ్నాయ వేదికగా ‘సాక్షి దినపత్రిక మొదలైనప్పుడు; ఇతర తెలుగు మీడియా సంస్థల ధోరణుల తీరుతెన్నులను నా ‘మీడియా నాడి’ కాలమ్ తేటతెల్లం చేస్తూ డాక్యుమెంట్ చేసింది. నాలుగేళ్ళలో వచ్చిన ఈ వ్యాసాలన్నీ మూడు పుస్తకాలుగా వచ్చాయి.
మళ్ళీ 2013 నుంచి 2016 దాకా ‘ప్రజాశక్తి’ దినపత్రికలో వారం విడిచి వారం రాశాను. 2017 చివర నుంచి న్యూస్ ఆర్బిట్, న్యూవేవ్స్ న్యూస్ సైట్స్ లోను, ‘సూర్య ‘దినపత్రికలలో మీడియా, సోషల్ మీడియా గురించి రాశాను. కరోనా తొలి నెలల ప్రభావం దాకా సాగిన ఈ వ్యాసాలతో ‘మీడియా సోషల్ మీడియా’ అనే ఇ-బుక్ కూడా వెలువడింది. మొత్తం 20కి మించిన పుస్తకాలు ఈ విభాగంలో వెలువడి చాలా విశ్వవిద్యాలయాల్లో అధ్యయన, పరిశోధనా ఆకరాలుగా దోహదపడుతున్నాయి.

ప్ర. గాంధీ అంటే ప్రత్యేకాభిమానం మీకు గాంధీ మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఇతర రచయితలతో కూడా రచనలు చేయించారు. ఇప్పటికీ వారం వారం ‘గాంధేయం ఓ గాండీవం’ శీర్షికతో ‘ఆంధ్రప్రభ’లో రాస్తున్నారు గదా! వీటి ప్రత్యేకత తెలపండి.

జ. వాస్తవానికి ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన కాలమ్ రాయడానికి కృషి చేస్తున్న సమయంలో పరిష్కారమార్గంగా గాంధీజీ కనబడడం మహాశ్చర్యానికి గురిచేసింది. అది 1999 విషయం. దాదాపు అదే కాలంలో ‘మాన్ ఆఫ్ ది మిలీనియం’గా గాంధీజీని కొనియాడుతూ కొన్ని విషయాలు వెలికి వచ్చాయి. ఉద్యోగంలో ఉన్న వత్తిడి కారణంగా దృష్టి పెట్టే అవకాశం లేకపోయింది. సుమారు రెండు దశాబ్దాల తరువాత 2019 నుంచి గాంధీజీకి సంబంధించిన, వర్తమాన సమాజానికి దోహదపడే సిద్ధాంతాలను, పరిష్కారమార్గాలను, సంబంధించిన విస్మృత కోణాలను ఎప్పటికప్పుడు పరిచయం చెయ్యాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అలా మొదలైన గాంధీజీ ఆలోచనలతో ప్రయాణం ఇంకా విజయవంతంగా కొనసాగుతూ ఏడెనిమిది పుస్తకాలు వెలువరించడానికి దోహదపడింది. 2019 అక్టోబరు 2వ తేదీ గాంధీజీ విషయంగా ఐదు పార్శ్వాలలో ఐదు తెలుగు దినపత్రికలలో విభిన్నమైన వ్యాసాలు నేను రాయగలగడం నా రైటింగ్ కెరీర్ లో ఘనంగా గుర్తించుకోదగ్గ సందర్భం!

ప్ర. మీరు రాసిన సైన్సు రచనలను యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠ్యగ్రంధాలుగా పెట్టారు గదా! వాటి వివరాలు వివరించండి.

జ. 1999-2000 సమయంలో ‘ప్రజాశక్తి’ దినపత్రిక వారి ఉద్యోగార్థుల అనుబంధం దీపిక కోసం మిత్రులు అన్నవరపు బ్రహ్మయ్య ఆలోచనగా తెలకపల్లి రవి గారి ప్రోత్సాహంతో ‘ప్రపంచ వైజ్ఞానిక వైతాళికుల’ను ఒక సంవత్సరం పాటు పరిచయం చేశాను. ఈ వ్యాసాలే ‘సైన్స్ వైతాళికులు’గా మధులతా పబ్లికేషన్స్ పుస్తకాన్ని 2002లో వెలువరించింది. ఈ చిన్న పుస్తకం 2003 నుంచి 2014లో తెలంగాణ విడిపోయే దాకా పన్నెండేళ్ళపాటు తెలుగు ప్రాంతంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నిర్వహించే బి.ఇడి కోర్సు ఫిజికల్ సైన్సెస్ రిఫరెన్స్ పుస్తకంగా ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు చదివారు. అలాగే పర్యావరణం సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా విభాగంలో నిర్వహించే బి.ఏ. కోర్సుకు పాఠ్యాంశ పుస్తకాన్ని రచించాను. ట్రిపుల్ ఐటి కోర్సులో తెలుగు గురించిన నా వ్యాసాన్ని పిల్లలు చదువుకున్నారు. ఇంకా 2014 నుంచి ఐదారేళ్లు ఆంధ్ర ప్రదేశ్ లోని 9వ తరగతి పిల్లలు శాస్త్రవేత్త సర్దేశాయి తిరుమలరావు గురించి నా వ్యాసాన్ని పాఠ్యాంశంగా చదువుకున్నారు. అయితే మన అధికారుల, 9వ తరగతి తెలుగు వాచకం సంపాదకుల మెరుపు సామర్థ్యం ఏమిటంటే ఆ పాఠ్యాంశ రచయతగా నా పేరును అదృశ్యం చెయ్యడం! ఆ విషయం గురించి పోరాడే తీరిక నాకు లేకపోవడం కూడా వుంది. ప్రస్తుతం 8వ తరగతి ఫిజికల్ సైన్సెస్ తెలుగు- ఇంగ్లీషు ఉభయ మాధ్యమాల పాఠ్య పుస్తకం నేను కూడా సభ్యుడిగా ఉన్న సంపాదక వర్గం ద్వారా వెలువడింది.

ప్ర. ఇప్పటివరకు మీ వయసుకంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురించారు. ఎన్నో పుస్తకాలు రాయడమే కాకుండా అడివి బాపిరాజుగారు, యద్దనపూడి సులోచనారాణి గారి పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. మీరు సంపాదకులుగా ‘ఉన్న మిగిలిన పుస్తకాల వివరాలు చెప్పగలరా?

జ. మొత్తం పుస్తకాల సంఖ్య 1999 నుంచి ఈ పాతికేళ్ళలో వచ్చిన పుస్తకాల సంఖ్య మూడు పాతికలకు కొంచెం లోపల ఉండవచ్చు. వీటిలో మూడింట రెండు వంతులు నా రచనలు కాగా; మూడోవంతు సంపాదకత్వం వహించినవి. ఈ సంపాదకత్వం వహించిన వాటికి సంబంధించిన తొలి పుస్తకం ‘శతవసంత సాహితీ మంజీరాలు’: ఇటీవలి పుస్తకం ‘అఖిల కళా వైభవశ్రీ అడివి బాపిరాజు’. సుమారు ఈ పాతిక సంకలనాలకు పాతిక మంది మించిన మిత్రులు సహ సంపాదకులుగానూ, 350 మందికి పైగా ఈ సంకలనాలలో చేర్చబడిన రచనల కర్తలు గానూ కనబడతారు. విద్వాన్ విశ్వం, సర్దేశాయి తిరుమలరావు, తాపీ ధర్మారావు, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, అడివి బాపిరాజు, యద్దనపూడి సులోచనారాణి, పొట్టి శ్రీరాములు, గాంధీజీ వంటివారి గురించిన విమర్శనాత్మక సంకలనాలు ఒక తరహా కాగా; వైజ్ఞానిక కథలు, పర్యావరణ కథలు, మదరాసు బదుకులు, సైన్స్ ఎందుకు రాస్తున్నాం?, తెలుగు భాష,ప్రసార భాషగా తెలుగు వంటి అంశాలకు సంబంధించి మిగతా సంకలనాలు వెలువడ్డాయి. ఈ పాతికేళ్ళలో సుమారు పాతిక సంస్థలు లేదా వ్యక్తులు వీటిని ప్రచురించారని చెప్పవచ్చు. సులోచనారాణి, అన్నమయ్య వంటి వార్ల సంకలనాలు త్వరలో రావలసివుంది.

ప్ర. సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్ ట్రస్ట్ వంటి సంస్థలకు కూడా కొన్ని పుస్తకాలు రాస్తారు కదా… ఆ పుస్తకాల వివరాలు…

జ. సాహిత్య అకాడమీ ద్వారా ‘విద్వాన్ విశ్వం’ గురించి నా మోనోగ్రాఫ్ 2011లో వెలువడింది. విద్వాన్ విశ్వం శతజయంతి సంవత్సరానికి రెండేళ్ళు ముందు ఈ పుస్తకం రావడంతో చాలా గుర్తింపు, గౌరవాన్ని పొందగలిగింది. మళ్ళీ విద్వాన్ విశ్వం రచనలు రెండు రాష్ట్రాల విద్యా ప్రణాళికలో అంతర్భాగం అవడం మళ్ళీ మొదలైంది. 1928లో తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ కథను హైదరాబాదు నుంచి వెలువడే ‘సుజాత’ మాసపత్రిక, ప్రచురించింది. ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సైన్స్ ఫిక్షన్ కథలతో సంకలనం చెయ్యమని సాహిత్య అకాడమీ 2012లో కోరింది. డా నామిని సుధాకరనాయుడు తోడ్పాటుతో ఈ నాలుగు వందల పేజీల, 27 కథల సంకలనం పని 2013కి పూర్తి అయిపోయినా ఈ ‘వైజ్ఞానిక కథలు’ పుస్తకం మాత్రం 2017 సంవత్సరంలో వెలువడింది. ఈ పుస్తకం కూడా ఎంతో గుర్తింపు పొందడం, గౌరవాన్ని సంపాదించి పెట్టడం ఆనందదాయకం. స్వాతంత్య్ర సమరయోధులు, సాహిత్యవేత్త, ‘శ్రీ సాధన’ పత్రికా సంపాదకులు, పూర్వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ఇంగ్లీషు బోధించిన గురువుగారు అయిన పప్పూరు రామాచార్యుల గురించి మోనోగ్రాఫును కూడా పూర్తి చేసి అకాడమీకి అందజేసి సంవత్సరం దాటింది. రేపో మాపో ఈ పుస్తకం కాపీలు చేతికి రావచ్చు. ఇవి కాకుండా తెలుగులో పాపులర్ సైన్స్ రచనా తీరుతెన్నులు, తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనల తీరు గురించి రెండు సుదీర్ఘమైన వ్యాసాలను సాహిత్య అకాడమీ ప్రచురించే సంకలనాల కోసం పంపివున్నాను. నేషనల్ బుక్ ట్రస్ట్ వారికోసం 2010లో ‘సామాజిక మార్పు కోసం విద్య’ అనే పుస్తకాన్ని అనువాదం చేశాను. గత సంవత్సరం ‘సర్వేపల్లి రాధాకృష్ణ’ గురించి రాసిన 120 పేజీల మోనోగ్రాఫ్ అతి త్వరలో చేతికందుతుంది. ఇవే కాకుండా ద్రావిడ విశ్వవిద్యాలయం 2010లో ‘ద్రావిడ శాస్త్రవేత్తలు’ పుస్తకాన్ని ప్రచురించగా, ఆ మరుసటి సంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రాన్ని బి ఏ విద్యార్థులకోసం ప్రచురించింది.

ప్ర. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. విరామెరుగని మీ రచనా జీవితంలో మీకు అండగా ఉంటున్న మీ సహచరి హంసవర్ధిని గారి గురించి మీ మనసులో మాట చెప్పండి.

జ. నా జీవితంలోకి ఆకాశవాణి 1988లో ప్రవేశిస్తే, హంస వర్ధిని 1991లో తోడైంది. అంతకు ముందు కేవలం ఒక గోవాలోనే నేను ఉద్యోగం చేశాను. ఆమె తోడుగా అనంతపురం, విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాదు, కడప, మదరాసు, తిరుపతి నగరాలలో సుమారు మూడు దశాబ్దాలపాటు ఆకాశవాణి ఉద్యోగంతో మిళితమై ఈ సహచర్యం నడిచింది. ఈ బదిలీలన్నిటిలోనూ సద్దుకుపోవడం, కొత్త పరిస్థితులకు ఒదిగిపోవడం, సమస్యాత్మక పరిస్థితిని సమన్వయంతో అధిగమించడం గమనించవచ్చు. తొలి రోజుల నుంచి ఇంటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను ఆమే చూసుకుంటున్నారు గనుకనే నా శక్తి సామర్థ్యాలన్నీ ఆకాశవాణి ఉద్యోగానికి రచనా వ్యాసంగానికి కేటాయించగలుగుతున్నాను. ఆమె రచయిత్రి కాకపోయినా,; సాహిత్యకారులు, పండితుడు, మేధావి, ఎటువంటి పాత్ర పోషించగలరో ఆమెకు బాగా తెలుసు. మా ఇంటికి బంధువులు కన్నా మిత్రులే ఎక్కువ మంది వస్తారు. ఇద్దరం కలిసి సభలు, సమావేశాలతో పాటు ఇంకా నెలకో ఒకటో రెండు టూర్లు వెళ్లి వస్తుంటాం!
మూఢనమ్మకాలన్నా, హేతురహితమైన పనులన్నా, అర్ధంలేని మతాచారాలన్నా ఆమెకు వళ్ళుమంట. సగటు మహిళ పట్టణ ప్రాంతంలో ఎటువంటి ఆలోచనా రహితమైన రీతిలో ప్రవర్తిస్తుంది అనే ఆమె పరిశీలనలు ఆధారంగా కొన్ని వ్యాసాలు రాయమని 2005 ప్రాంతంలో ఆమె కోరారు. ఆ విషయాల ఆధారంగా ‘ప్రజాశక్తి’ ఆదివారం సంచికలో సెన్స్ కామన్ సెన్స్’ పేరున కొన్ని వ్యాసాలు మా ఇద్దరి పేరున వెలువడ్డాయి. ఆ ఆలోచనాత్మక వ్యాసాలు అదే పేరుతో ఓల్గా గారి ముందుమాటతో పుస్తకంగా వెలువడి ఐదేళ్ళవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె తోడ్పాటు ఆ స్థాయిలో లేకపోతే నా ఆకాశవాణి ఉద్యోగమైనా, నా రచనా వ్యాసంగమైనా ఇంత మోతాదులో ఇంత గుణాత్మకంగా సాగివుండేది. కాదేమో!
మా ఇద్దరి శక్తి సామర్ధ్యాలు, ఆసక్తి, ఆర్థిక వనరులు ఎంతో కొంత నలుగురికి ఉపయోగపడాలనే మా ప్రయత్నాలు కలిసి సాగుతున్నాయి. ఇందులో ఆమె మౌనంగా కనబడే పాత్ర ఎంతో కీలకమైనది కూడా!

ప్ర. ఇప్పుడు ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగింది. 24 గంటలు టీ.వీ.లో ప్రసారమయ్యే సీరియళ్ళు, రొడ్డ కొట్టుడు కార్యక్రమాలు, శబ్ద కాలుష్యం ఇలా భరించాల్సిందేనంటారా? ఆకాశవాణి మళ్ళీ పూర్వవైభవం పొందలేదా…? ఆకాశవాణి ఉద్యోగిగా, సంచాలకులుగా మీరేమంటారు?

జ. మనిషి ఈ భూమండలం మీదికి వచ్చి ఎంతకాలమైనా రేడియో, సినిమా, టి.వి. టెలిఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ వంటివి మనిషిని చుట్టుముట్టి వందేళ్ళు మించి పైబడలేదు. కనుక ఇప్పుడు 60-80 వయసున్న వ్యక్తులు చాలా పెద్ద స్థాయిలో ఒకదాని తరవాత ఒకటి సంభవించిన సమాచార సాంకేతిక విప్లవాలను చవిచూస్తున్నారు. కొంతకాలం పత్రికలు, రేడియో, సినిమా, టివి, సోషల్ మీడియా ఇలాంటివి మనిషి మీద ఒకదాని తర్వాత ఒకటి స్వారీ చేస్తూనే వున్నాయి. ఒక తరానికి నచ్చనిది కాలుష్యప్రాయంగా కనబడేది, తరువాతి తరానికి బహు పసందుగా, మీదుమిక్కిలి తీపిగా కనబడటం మారిపోవడం మనం చూస్తూనే వున్నాం. కనుక గతించిన వైభవాలు గతించినవే! రేపు తెరతీయబడే కొత్త అద్భుతం సరికొత్తగానే వుంటుంది. ఇదివరకటి అనుభవాల మేళవింపుగానో, వాటికన్నా మేలైనదిగానో వుంటుంది. కనుక కొత్తదంతా రోత, పాతదంతా పసిడి అంటే ఒక తరానికి నచ్చినా మరో తరం విభేదిస్తుంది. పత్రికలూ, సినిమాలూ, టీవీ, కంప్యూటర్ అందుబాటులో లేని రెండు మూడు దశాబ్దాల కాలం ఇతర ప్రాంతాలలాగా తెలుగు ప్రాంతాన్ని కూడా ఆకాశవాణి ఏలింది; హరిత విప్లవం, శ్వేత విప్లవం, చిన్న కుటుంబం, పోషకాహారం వంటి పెద్ద మార్పులలో కీలక పాత్రను పోషించింది. మళ్ళీ అలాంటి పాత్ర పోషించగలదా అంటే అది ముందు ముందు మానవ జీవితంలో అంత ప్రధాన పాత్ర వహిస్తుందా అనే దాని మీద ఉంటుంది. ఈ పరిణామాలను గుర్తించకుండా, అధ్యయనం చెయ్యకుండా అర్థరహితంగా భేదించడం కూడా అనవసరమేమో! ఎప్పటికప్పుడు నిత్య స్పృహతో టెక్నాలజీ పట్ల మనిషి మసలుకోవాలి. లేకపోతే ఐదారు దశాబ్దాలలో ప్లాస్టిక్ భూతం ఎలా భూమండలాన్ని నాశనం చేస్తున్నదో అలా మరోటి మరింత దారుణంగా మన సంస్కృతిని, సంస్కారాన్ని దెబ్బ తీయవచ్చు. నిత్యస్పృహ, స్వయం ఎరుక ఒకటే తరుణోపాయం! దీనికి వేరే షార్ట్ కట్ లేదు.

ప్ర. ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు పొందారు గదా! చాలా పత్రికలు తెలుగు మాటల బదులు ఇంగ్లీషు శీర్షికలు పెడుతున్నారు. పత్రికలలో తెలుగుదనం ఉట్టిపడే భాష మళ్ళీ వస్తుందంటారా?

జ. ఇది కూడా సతతం మనలను ఆందోళన పెట్టే అంశం! నిజానికి సంస్కృతమో, ఉర్దూనో లేదా ఇప్పటి ఇంగ్లీషు భాష లాగానో ఏదో ఒక భాష తెలుగు వంటి స్థానిక ప్రజల భాషలను గద్దిస్తున్నాయి, గద్దెనెక్కుతున్నాయి. పశ్చిమగోదావరి.. ఈ మాటను ఎందుకంత శ్రమపడుతూ పలకాలి? హాయిగా పడమటి గోదారి అని అంటే ఇటు పలికేవాళ్ళకీ, అటు వినేవాళ్ళకి, ఇంకోవైపు అర్థం చేసుకునే వారికి సులువుగా వుంటుందికదా… నిజానికి ఈ విషయం గురించి కనీసం మనలాంటి వాళ్ళం అయినా ఎపుడయినా ఆలోచన చేశామా? ఒకవైపు ఇంగ్లీషు సంకరమవుతోంది అని మన తరం లేదా ఈ రకం ఆలోచనలున్నవారు భావిస్తున్నా అది మనకెంతో సౌలభ్యం, సదుపాయం అనే వ్యక్తులు, వర్గాలు మనకు పెద్ద సమూహాలుగా కనబడుతున్నాయి. ఇలాంటి చర్చే తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం గురించి చేస్తూ వుంటాం! అసలు సమస్య ఏమిటంటే మనం ఏ భాషలోనూ నైపుణ్యం సాధించలేకపోవచ్చు! ప్రపంచ వ్యాప్తంగా అన్ని అభివృద్ధికి సంబంధించిన పార్వశ్వాలు అనాదరణకు గురవుతున్నాయి. వినోదాత్మకంగా వాణిజ్యాత్మకంగా ఈ సీరియస్ విషయాలు మారిపోతున్నాయి. కాబట్టి కొన్ని విషయాలకు కాలమే తీర్పు చెప్పాలి. అట్లని ఎవరికి వారు చేతులు ముడుచుకుని కూచోనక్కరలేదు. ప్రజాస్వామ్యంలో వైవిధ్యమే కీలకమైన శోభ అని గమనించి ఏస్థాయిలో వ్యక్తులు, సంస్ధలు ఆ స్థాయిలో కృషి చేయాలి. ఇందులో అస్పష్టత ఉన్నా అది తప్పదేమో!

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap