చిన్నారి సైరా ఖైషగి అదృష్టవంతురాలు. వయసు పదమూడేళ్లు. తెలివైన కవయిత్రి, రచయిత్రి. అందునా యూనివర్సల్ లాంగ్వేజ్ ఆంగ్లంలో రాస్తుంది. కథలు, కవితలు సరే సరి. నవల కూడా రాసేసింది. పదిన్నరేళ్ల వయసున్నప్పుడు కేవలం తొమ్మిది రోజుల్లో రాసిన నవల బటర్ ఫ్లై! అన్విక్షికి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. అక్టోబర్ 8న జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో బటర్ ఫ్లై నవల ను ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత విమర్శకులు వాడ్రేవు చిన వీరభద్రుడు అధ్యక్షత వహించిన ఈ సభ లో సౌమ్యా మిశ్రా, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ లాంటి హేమా హేమీలు పాల్గొన్నారు. అందుకే సైరా అదృష్టవంతురాలు. చిన్న వయసులో అద్భుతంగా రాసిన నవలను సాహిత్య రంగంలో ఉన్నత శిఖరంలో ఉన్నవారు హాజరై ఆశీస్సులు అందించడం మామూలు విషయం కాదు. నేను సరే, బిబిసి తెలుగు విభాగం ఎడిటర్ జి. ఎస్. రామ్మోహన్, ప్రముఖ కథా రచయిత ఖదీర్ బాబు, సీనియర్ జర్నలిస్టులు శ్రీమతి సి. వనజ, రమేష్ బాబు, సామాజికవేత్త శ్రీమతి సజయ, పబ్లిషర్ మహి, సీనియర్ జర్నలిస్ట్ కళానిధి మంజుల తదితరులు చాలా మంది ప్రేక్షకుల్లో ఉండటం విశేషం.
సైరా ఎవరో కాదు… నా మేనకోడలే. ప్రముఖ జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ శ్రీమతి రుబీనా పర్వీన్ కుమార్తె సైరా. అతి పిన్న వయసులో నవల రాయడమే కాకుండా ప్రముఖ పబ్లికేషన్స్ వారు ముందుకొచ్చి ప్రచురించడం కూడా రికార్డు అని చెప్పుకోవచ్చు. సైరా సాధించిన గొప్ప విజయం ఇది. సైరా మల్టీటాలెంటెడ్ టాస్కర్. ఆల్ రౌండర్. మంచి సింగర్. పుస్తకాల పురుగు. అ వయసులో టీవీ లోనో స్మార్ట్ ఫోన్ లోనో కార్టూన్ బొమ్మల షో చూసుకుంటూ, వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. సైరా అలా కాదు, ఏ కాస్త సమయం దొరికినా ఏదొక నవల, కథల పుస్తకం చదివేస్తూ ఉంటుంది. స్కూల్ నుంచి వస్తూ వెళుతూ బస్సులో కూడా చేతిలో ఏదొక సాహిత్యం ఉండాల్సిందే. రోల్డ్, రస్కిన్, జెఫ్ కిన్నె తన అభిమాన రచయితలు అని చెబుతుంది.
బటర్ ఫ్లై నవల కూడా చాలా సున్నితమైన క్లిష్టమైన అంశం చుట్టూ తిరుగుతుంది. తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే వారి పిల్లల బాధలను ఇందులో కళ్లకు కట్టేలా రాసింది. పెళ్ళి చేసుకోవడం ఎంత ముఖ్యమో, మనసులు కలవనప్పుడు విడాకులు తీసుకోవడం లోనూ తల్లిదండ్రులకు హక్కు ఉందని సైరా తన నవల లో ఇచ్చిన సందేశం అద్భుతః. తన స్నేహితురాలు ఎదుర్కొన్న బాధ నే తాను కథా వస్తువు గా ఎంపిక చేసుకుని సీతాకోక చిలుక జీవన దశలతో పోల్చుతూ నవల పూర్తి చేసినట్లు బుజ్జి రచయిత్రి సైరా చెప్పింది. వయసులోనే సైరా బుజ్జిపిల్ల. ఆలోచనలు చూస్తే అనంతం. తెలివి చూస్తే అమోఘం.
సైరా తండ్రి డాక్టర్ ఎం కె ఖైషగి తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల శాఖ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ముంబై ఐఐటి లో ఆయన చదివారు. సైరా కూడా అదే కళాశాల లో చదివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పరిశోధకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అని వివరించింది. సైరా ప్రస్తుతం తొమ్మిదో క్లాస్ లో ఉంది. కొన్ని యాడ్ ఫిలిమ్స్ లోనూ నటించింది. సైరా జయహో.
–డా. మహ్మద్ రఫీ