గా(జ్ఞా)న సరస్వతి ఎస్. జానకి

(స్వరకోకిల జానకి జన్మదినం 23 ఏప్రిల్ సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం…)

1962లో దేవి ఫిలిమ్స్ బ్యానర్ మీద దర్శకనిర్మాత ఎమ్.వి. రామన్ తమిళంలో ‘కొంజూమ్ సలంగై’ అనే సంగీత నృత్యభరిత సినిమాను పూర్తిగా తమిళనాడులోని మురుగన్ కోవెల వుండే తిరుచెందూర్ లో నిర్మించారు. అందులో జెమిని గణేశన్, సావిత్రి హీరో హీరోయిన్లు. ఒకానొక సన్నివేశంలో సావిత్రి మురుగన్ కోవెలలోని కుమారస్వామిని ప్రస్తుతిస్తూ ‘’సింగార వేలనె దేవా… అరుళ్ సీరాడుం మార్పోడు వా… వా’’ అంటూ పాట పాడుతుంది. ఆ పాటకు హీరో జెమిని గణేశన్ తన నాదస్వర ప్రతిభను అనుసంధానించి దైవరంజకం కావిస్తాడు. బాలకుమారస్వామి ముగ్ధుడై ప్రత్యక్షం కావడం ఆ సన్నివేశ ప్రత్యేకత. ఈ పాటను ప్రముఖ తమిళ కవి బాలసుబ్రమణియం రచించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు నాదస్వర నేపథ్యంలో తారాస్థాయిలో ఆలపించేలా అభేరి రాగంలో స్వరపరచారు. అంతవరకు నాదస్వరంతో మానవ గళాన్ని మేళవించడానికి ఏ సంగీత దర్శకుడూ ప్రయత్నించ సాహసించలేదు. ఈ విశేష వినూత్న ప్రయోగసృష్టి సుబ్బయ్యనాయుడుకు దక్కడం విశేషం. మొదట సుబ్బయ్య నాయుడు గాయని ఆలపించవలసిన భాగాల వరకు ఖాళీలను వదలి, నాదస్వర విద్వాన్ కారైకురుచ్చి అరుణాచలంతో నాదస్వరం పలికే భాగాలను ఘటవాద్యపు దరువులను మేళవించి రికార్డ్ చేశారు. ఆ ఖాళీలలో గాయని చేత పాడించి రికార్డుతో సమన్వయం చేయాలనేది ఆయన ప్రయత్నం. ఆ శ్రుతిలో పాడగలిగే కంఠంకోసం చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు భక్తిపాటలకు ప్రసిద్ధిచెందిన పి.లీలను సంప్రదించవలసిందిగా రామన్ కు చెప్పారు. రామన్ లీలకు ఈ పాట సాహిత్యాన్ని, నాదస్వరం మీద స్వరపరచిన సంగీత బాణీని వినిపించి పాడవలసిందిగా ఆహ్వానింఛాడు. అది విని లీల అంతటి తారాస్థాయిలో పాటను పాడలేనని, అయితే నాదస్వరం రేంజ్ లో గాత్రాన్ని వినిపించగల గాయని ఎస్. జానకి ఒక్కరే అని సలహా ఇచ్చారు. అప్పుడు రామన్ జానకికి అవకాశమిస్తూ బొంబాయిలోని తన స్వంత స్టూడియోలో ఆమెచేత పాడించి మద్రాసులో రికార్డ్ చేసిన అరుణాచలం నాదస్వరాన్ని మిక్సింగ్ చేస్తూ సమన్వయం చేశారు. సాంకేతికత అంతగా అభివుద్ధిచెందని ఆరోజుల్లో రామన్ ఈ ప్రయోగం చేయడం గొప్పగా చెప్పుకోవాలి. 6 నిమిషాలకు పైగా సాగే ఈ పాటను సినిమాలో 5 నిమిషాలకు కుదించారు. ఆ పాటను జానకి అత్యద్భుతంగా పాడడంతో పదహారణాల తెలుగు గాయని తమిళ చలనచిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు. ఈ ప్రతిష్టాత్మక టెక్నికలర్ చిత్రాన్ని లండన్ నగరంలో ప్రాసెసింగ్ చేయిస్తూ రామన్ స్వయంగా సినిమా ఎడిటింగ్ పనులు కూడా పూర్తిచేశారు. అంతటి సంగీత ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించిన స్వరకోకిల జానకి జన్మదినం (23 ఏప్రిల్) సందర్భంగా ఆమె గురించి గురించి కొన్ని విశేషాలు.

తొలిరోజుల్లో…

శిష్ట్లా జానకి జన్మస్థలం గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామం. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు. తల్లి సత్యవతి. ఎక్కడ లతా మంగేష్కర్ పాటలు వినిపించినా జానకి అక్కడకు వెళ్ళి శ్రద్ధగా వినేది. ఆమె పాటలంటే జానకికి అంత ఇష్టం. సంగీత జ్ఞానం జానకికి దేవుడిచ్చిన వరం… యోగం. వారికుటుంబం కొంతకాలం రాజమండ్రిలో వున్నప్పుడు తల్లి ప్రోత్సాహంతో జానకి నాదవిద్వాన్ గాడిపల్లి పైడిస్వామి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. సాధారణంగా శాస్త్రీయ సంగీతం అభ్యసించేవారు సరళీస్వరాలతో, సరిగమలతో శిక్షణ ప్రారంభిస్తారు. కానీ జానకి మాత్రం ‘నగుమోము కనలేని’ వంటి కీర్తనలతో సంగీత శిక్షణ ఆరంభించింది. ఆమెతోబాటు జానకి అక్కయ్యలు కూడా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. కానీ జానకి ధ్యాస మాత్రం సినిమా పాటలమీద కేంద్రీకృతమై వుండేది. వాటిలో ముఖ్యంగా లతాజీ, ఆశా భోస్లే పాటలమీదే ధ్యాస. గురువు పైడిస్వామి మరణంతో సంగీత శిక్షణాకార్యక్రమం కొండెక్కింది. రాజమండ్రిలో వి.రామచంద్రరావు ‘క్రాంతి కళామండలి’ అనే యువజన సాంస్కృతిక సంస్థను నిర్వహించేవారు (రామచంద్రరావు తరవాతి కాలంలో సినీ దర్శకులుగా యెదిగారు). ఆ సంస్థ నిర్వహించే కచేరీలలో, కాలేజీ వార్షికోత్సవాలలో జానకి తెలుగు, హిందీ సినిమా పాటలు పాడేది. జానకి కి తోడుగా పంపన సూర్యనారాయణ, కె.ఎల్. నరసింహారావు యుగళగీతాలకు గళం కలిపేవారు. జానకి కి స్టేజ్ ఫియర్ లేకుండడం గొప్ప యోగం అని చెప్పాలి. ఎంతమంది ప్రేక్షకులు, ముఖ్య అతిథులు హాజరైనా జానకి బిడియం లేకుండా గళం విప్పిపాడేది. రాయలసీమలో కరవు ప్రబలినప్పుడు కరవు బాధితుల సహాయార్ధం జానకి సభ్యురాలిగా వున్న ‘క్రాంతి కళామండలి’ తరఫున నిర్వహించిన సంగీత కచేరీలలో జానకి పాల్గొంది. అందులో ప్రదర్శించే నృత్య కార్యక్రమాలకు పాటలు పాడింది. అలాగే విజయనగరంలో ఒకసారి ప్రదర్శన యిస్తే, జానకి అందులో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంలో పి. సుశీల గానం చేసిన ‘’చందన చర్చిత నీల కళేబర’’ అనే జయదేవుని అష్టపది ఆలపించింది. అది తన్మయత్వంతో వినిన పి. సుశీల తండ్రి వేదికమీదకు వచ్చి ఆశీర్వదించడం జానకి ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. అదే సమయంలో జానకి తల్లిగారు మరణిచడంతో జానకి మకాం హైదరాబాద్ లోని అక్కగారి ఇంటికి మారింది.

ఫన్ డాక్టర్ మార్చిన జానకి గాన ప్రస్థానం:

ఫన్ మాస్టర్ వి. చంద్రశేఖరం జానకి కుటుంబానికి దగ్గర బంధువు. నెల్లూరుకు చెందిన చంద్రశేఖరం ఆంధ్రరాష్ట్రం లోని అనేక ప్రదేశాలలో ప్రదర్శనలు ఇచ్చేవారు. వేదికమీదే రెండేరెండు నిమిషాలలో వేషాలు మార్చేవారు. నెహ్రూ, గాంధీజీ, జాకీర్ హుసేన్ ఆహార్యాలను అనుకరిస్తూ ప్రదర్శనలు ఇచ్చేవారు. వారు ఇచ్చే ప్రదర్శనలోని గ్యాప్ లో జానకి పాటలు పాడేది. ముఖ్యంగా లతాజీ పాటలే పాడేది. వాటిలో ‘సంతానం’ చిత్రంలో సుసర్ల దక్షిణామూర్తి లతాజీ చేత పాడించిన ‘’నిదురపోరా తమ్ముడా’’తప్పకుండా వుండేది. చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్ తండ్రి కార్యక్రమాలకు హాజరవుతూ, తండ్రిగారికి సహకరిస్తూ వుండేవారు. జానకి పాటలు పాడే విధానం రాంప్రసాద్ ను ప్రభావితం చేసింది. సినిమాలలో పాడిస్తే బాగా రాణిస్తుందని భావించారు. తండ్రి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొస్తే, చంద్రశేఖరం వెంటనే జెమినీ వాసన్ కు, ఏ.వి.ఎం మెయ్యప్ప చెట్టియార్ కు ఉత్తరాలు రాశారు. ఆ వెంటనే ఆమెను ఆడిషన్ కు రమ్మని కబురందింది. ఆరోజుల్లో పెద్ద పెద్ద స్టూడియోలలో గాయనీ గాయకులు ప్రత్యేకంగా వుండేవారు. వారు నెలజీతాలమీద పనిచేసేవారు. జానకి మద్రాసు వెళ్ళి ఏ.వి.ఎం స్టూడియోలో ఆడిషన్ పరీక్షకు హాజరైంది. ఆ టెస్ట్ కోసం లతా మంగేష్కర్ ‘చోరీ చోరీ’ (1956) చిత్రంలో ఆలపించిన ‘’రసిక్ బలమా హాయే దిల్ క్యోం లగాయా తోసే దిల్ క్యోం లగాయా’’ అనే పాటను శ్రావ్యంగా పాడింది. స్టూడియో ఆస్థాన సంగీత దర్శకులు ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్దనం జానకి పాటను ఆలపించే విధానాన్ని మెచ్చుకొని మెయ్యప్పచెట్టియార్ కు సిఫారసు చేసి జానకిని వారి స్టాఫ్ ఆర్టిస్ట్ గా నెల జీతానికి చేర్చుకున్నారు.

తమిళ పాటతో చిత్రసీమలోకి….

స్టాఫ్ ఆర్టిస్ట్ గా చేరిన కొద్దిరోజుల్లోనే జానకికి బయట చిత్రానికి పాడే అవకాశం వచ్చింది. ‘విధియిన్ విళైయాట్టు’ అనే చిత్రంలో తాతినేని చలపతిరావు సంగీత దర్శకత్వంలో “పేదై ఎన్ ఆసై పాళానదేనో” అనే పాటను పాడింది. అయితే కారణాంతరాలవలన ఆ చిత్రం విడుదల కాలేదు. ఈ పాటను జానకి ఆలపించడానికి ఓ నేపథ్యముంది. అప్పటికే దర్శకత్వశాఖలో సహాయకుడుగా బిజీగావుంటున్న వి. రామచంద్రరావు జానకిని తాతినేని చలపతి రావు వద్దకు తీసుకెళ్లారు. వీరు వెళ్ళిన సమయానికి చలపతిరావు విశ్రాంతి తీసుకుంటూ వుండడంతో చలపతిరావు సహాయకులు వారు వచ్చిన పని తెలుసుకొని, గురువుగారు నిద్రలేచేలోపు ఏదైనా పాట పాడమన్నారు. బిడియం లేకుండా జానకి పాడుతున్న పాటలు చలపతిరావు చెవినపడ్డాయి. ఆయన జానకి చేత మరికొన్ని పాటలు పాడించుకున్నారు. అలా ‘విధియిన్ విళైయాట్టు’ చిత్రంలో రెండు విషాద గీతాలను జానకిచేత పాడించారు. జానకి పాడిన ఆ మొదటిపాట ఏప్రిల్ 4, 1957 న రికార్డయింది. విడుదలకాని ‘విధియిన్ విళైయాట్టు’ చిత్రంలో జానకి పాడిన తొలిపాట మరచిపోకముందే ప్రారంభంలో చెప్పినట్లు ‘కొంజుమ్ సలంగై’ (1962) చిత్రంలో జానకి ఆలపించిన కష్టతరమైన “సింగారవేలనె దేవా” పాట జానకిని శిఖరాగ్రం మీద కూర్చోపెట్టింది. అవకాశాలు తన్నుకుంటూ జానకి ముంగిట చేరాయి. 60 దశకం నుండి 70 వ దశకం మొత్తంమీద ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ జానకిచేత కొన్ని వందల హిట్ పాటలు పాడించారు. 1971లో దర్శక నిర్మాత సి.వి. శ్రీధర్ నిర్మించిన ‘అవళుకెండ్రు ఒరు మనం’ (ఈ చిత్రాన్ని హిందీలో ‘దునియా క్యా జానే’ గా సమాంతరంగా నిర్మించారు) సినిమాలో “ఉన్నిదత్తిల్ ఎన్నై కొడుత్తేన్”, “దేవియిన్ కోవిల్ పారవై ఇడు” అనే రెండు పాటలను జానకి చేత విశ్వనాథన్ పాడించి హిట్ చేశారు. 1962లో ‘పోలీస్ కారన్ మగళ్’ చిత్రంలో విశ్వనాథన్-రామ్మూర్తి నాలుగు హిట్ పాటలను పి.బి. శ్రీనివాస్ తో కలిసి పాడించారు. ‘దైవిత్తిన్ దైవివం’ చిత్రంలో ఎస్.ఎ. రామనాథన్ జానకితో మూడు పాటలు పాడించారు. ‘గంగా గౌరి’ చిత్రంలో విశ్వనాథన్ భాగేశ్రీ రాగంలో పి.బి. శ్రీనివాస్ తో కలిసి ఆలపించిన “అందరాగం నా అరివేన్” సూపర్ హిట్టయింది. ఇళయరాజా శకం ప్రార్రంభం కావడంతో ఆయన జానకికి విస్తృతమైన అవకాశాలు కల్పించారు. ‘అణ్ణకిలి’(1976) సినిమాతో ఇళయరాజా సంగీతదర్శకత్వ ప్రస్థానం మొదలైంది (ఈ చిత్రాన్ని తెలుగులో ‘రామచిలక’ పేరుతో పునర్నిర్మించారు). అందులో జానకి ఆలపించిన “మచ్చానై పార్తీంగళా” (తెలుగులో “మామయ్య వచ్చాడంట” పాట) సూపర్ హిట్టయింది. దీనితోబాటు “సుధాచాంబ పచ్చరిసి”, మరొక టైటిల్ సాంగ్ “అణ్ణకిలి ఉన్నయ్’’ పాడింది. 1977లో వచ్చిన “16 వయత్తినిలే’ (తెలుగులో పదహారేళ్ళ వయసు చిత్రం) లో జానకి ఆలపించిన “సిందూరపూవై” (తెలుగులో సిరిమల్లెపువ్వా” పాట) ఈరోజుకి కూడా ఏదో ఒక చానల్ లో విన(కన)పడుతూనే వుంటుంది. ‘ఉల్లాస పారవైగళ్’ సినిమాలో జానకి ఆలపించిన “అళగు ఆయిరమ్”, “నాన్ ఉండన్ తాయాగ” పాటలు, ‘టిక్ టిక్ టిక్’ చిత్రంలో “ఇడు ఒరు నిల కాలం” వంటి పాటలు తమిళనాడులో ఎప్పుడూ వినపడేవే. రెండు జాతీయ బహుమతులు గెలుచుకున్న “మూండ్రామ్ పిరై’ (తెలుగులో ‘వసంతకోకిల’) చిత్రంలో ఇళయరాజా జానకి చేత పాడించిన “పొన్మేణి ఉరుగుత్తే” పాట, బాలుతో కలిసి పాడిన “వాణెన్గుం తంగ” పాటలు జానకికి ఉత్తమగాయని బహుమతి తెచ్చిపెట్టాయి. ఇలాచెప్పుకుంటూ పోతే జానకి తమిళ సినిమాలలో ఆలపించిన అధికశాతం సూపర్ హిట్ పాటల జాబితా ఒక పొడవాటి చాంతాడవుతుంది..

తెలుగు లో మరోవిషాదగీతంతో…

జానకి తొలి పాట తమిళంలో పాడిన మరుసటిరోజే… అంటే ఏప్రిల్ 5, 1957 న ఆమెకు తెలుగులో పాట పాడే అవకాశం వచ్చింది. అదికూడా అమరగాయకుడు ఘంటసాలతో కలిసి పాడగలగడం. అనుపమ చిత్రాల దర్శకనిర్మాత కె.బి.తిలక్ నిర్మించిన M.L.A. అనే చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు సారధ్యంలో ఆరుద్ర రచించిన జానపదగీతం “నీ ఆశా అడియాస చేజారే మణిపూస బ్రతుకంతా అమవాస లబాడోళ్ళ రాందాసా” ను జానకి ఘంటసాలతో కలిసి ఆలపించింది. అదికూడా విషాదగీతం కావడం విశేషం. ఈ పాట రికార్డింగ్ గోల్డెన్ స్టూడియోలో జరిగింది. అలాగే మరొక నేపథ్యగీతం “ఇదేనండీ ఇదేనది భాగ్యనగరం మూడుకోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం”ను ఆమె ఘంటసాలతోనే కలిసి పాడింది. ఇందులో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ పాట పాడే సమయానికి జానకికి నిర్మాత తిలక్ కానీ, గేయరచయిత ఆరుద్రకానీ, సంగీత దర్శకుడు పెండ్యాల కానీ యెవ్వరూ తెలియదు. ఇక్కడ మరోవిశేషం కూడా చెప్పాలి. విషాద గీతాలతో మొదలైన జానకి సంగీత ప్రయాణం, తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ, అలాగే ఏ.వి.ఎం వారు సింహళంలో నిర్మించిన చిత్రంలో కూడా జానకి విషాద గీతాలతోనే మొదలైంది … ఒక్క కన్నడ సినిమాలో తప్ప. కన్నడంలో హుషారైన పాట తొలిసారి పాడినా, విడుదలైన తొలి కన్నడ చిత్రంలో జానకి ఆలపించిన గీతం విషాదగీతమే! ఈ విషయంలో జానకి తొలుత కాస్త బాధపడినా, సర్దుకుపోగలిగింది. కానీ ఆ విషాద గీతాలే ఆమె నేపథ్యగాయనిగా రాణించేందుకు సోపానాలయ్యాయి. 1957లోనే జానకి చాలా బిజీగాయని అయిపోయింది. ఆ సంవత్సరం ఆరువందల పాటలకు పైగానే ఆమె పాడటం విశేషం. ఇక్కడ మరొకసారి ’కొంజుంమ్ సలంగై’ చిత్రం గురించి గుర్తుచేయాలి. తమిళంలో చరిత్ర సృష్టించిన ఈ సంగీత భరిత సినిమాను తెలుగులో కూడా ఎం.వి. రామనే ‘మురిపించే మువ్వలు’ పేరుతో అనువదించారు. అందులో తమిళ మాతృకను ‘’నీ లీల పాడెద దేవా… మనవి ఆలించ వేడెద దేవా… నను లాలించు మా ముద్దు దేవా’’ అంటూ ఆరుద్ర రాయగా జానకి అద్భుతంగా ఆలపించింది. ఈ పాట దక్షిణదేశం మొత్తాన్ని ఒక ఊపు వూపింది. పాట సాహిత్యంతో సహా మొత్తం ఫక్తు కర్ణాటక ఫక్కీలో వున్నా జనాల్లోకి బాగా చొచ్చుకొనిపోయింది. ఒక్క తమిళంలోనే ఈ రికార్డు అయిదువేలకు పైగా ఆరోజుల్లో అమ్ముడుపోవడం ఒక రికార్డుగా నిలిచింది. తమిళనాడులో కర్ణాటక సంగీతానికి పెద్దపీట వేసే అభిమానులంతా ఈ రికార్డును కొని భద్రపరచుకున్నారు. ఈ పాటను జానకి ఒకే టేకులో పాడడం ఆమె ప్రజ్ఞకు ఉదాహరణ మాత్రమే. ఈ పాటను 1989లో మద్రాసులో జరిగిన భారతీయ సినిమా ప్లాటినం జూబిలీ వేడుకలో వినిపించడం కూడా జానకి అదృష్టమే. ఈ పాటను జానకి పాడితేనే బాగుంటుందని చెప్పి ప్రోత్సహింపజేసిన గాయని పి. లీల అంటే జానకికి చాలా అభిమానం, గౌరవం కూడా. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తుచేయాలి. ‘’నీ లీల పాడెద దేవా’’ తమిళ వర్షన్ ను అప్పటికే రికార్డ్ చేసేశారు. ఈ సినిమాలో నాయిక సావిత్రి ఈ పాటను జానకి పాడితే తను నటించనని దర్శకనిర్మాత రామన్ కు చెప్పింది. రామన్ చాలా క్రమశిక్షణ గల నిర్మాత. సావిత్రితో ‘’నువ్వు నటించకుంటే ఫరవాలేదు. కానీ, జానకి పాడిన పాటను మార్చే పనిలేదు. సినిమాలో ఆమె పాడిన పాటే ఉంటుంది అని కరాఖండిగా చెప్పారు. సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు కూడా “నువ్వు నటించనంటే బాధే లేదు. ఆ పాటను కమలా లక్ష్మణ్ మీద చిత్రీకరిస్తాం” అని హెచ్చరించడంతో సావిత్రి ఒప్పుకోక తప్పలేదు. ప్రీవ్యూ చూశాక సావిత్రి జానకిని పొగడ్తలతో ముంచెత్తివేసింది. ‘మురిపించే మువ్వలు’ చిత్రం తర్వాత జానకికి తెలుగులో తిరుగులేక పోయింది. సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, కె.వి. మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, అశ్వత్థామ, కోదండపాణి, సత్యం, చలపతిరావు, రమేశ్ నాయుడు వంటి దిగ్గజ సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో అజరామరమైన పాటలు పాడే అవకాశం జానకికి దక్కింది. ఒకసారి ఫన్ మాస్టర్ చంద్రశేఖరంతో జానకి సాలూరు రాజేశ్వరరావు గారి ఇంటికి వెళ్లింది. రాజేశ్వరరావు వచ్చేలోపు ఒక పాట పాడమని అడిగారు. ఎప్పుడొచ్చారో తెలియదు కానీ, రాజేశ్వరరావు వచ్చి ఆ పాటను వింటున్నారు. పాట పూర్తయ్యాక ఎంతగానో మెచ్చుకుంటూ అద్భుతమైన అవకాశాలు జానకికి ఇచ్చారు. “పగలే వెన్నెల జగమే ఊయల” (పూజా ఫలము), “ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్” (ఆరాథన), “నడిరేయి యే జాములో స్వామి నిను చేర దిగివచ్చునో” (రంగులరాట్నం), “జననీ వరదాయనీ త్రిలోచని నీ పద దాసిని కావగదే” (భక్త ప్రహ్లాద), “పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా”; “గట్టుకాడ యెవరో, చెట్టు నీడ యెవరో”; “మనిషే మారేరా రాజా” (బంగారు పంజరం) పాటలు రాజేశ్వరరావు సంగీతదర్శకత్వంలో జానకి పాడిన కొన్ని పాటలు మాత్రమే. ఇక మరికొన్నిటిని పరిశీలిస్తే, “నీలి మేఘాలలో గాలి కెరటాలలో”(బావామరదళ్లు), “వెన్నెల్లో కనుగీటే తారక” (గురువును మించిన శిష్యుడు), “నరవరా ఓ కురువరా” (నర్తనశాల), “గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి” (బాలమిత్రుల కథ), “ఏ దివిలో విరిసిన పారిజాతమో” (కన్నెవయసు), “సిరిమల్లె పువ్వా” (పదహారేళ్ళవయసు),”నెమలికి నేర్పిన నడకలివి”, “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన” (సప్తపది), “ఓం నమశ్శివాయ చంద్రకళాధర సహృదయా”, “బాల కనకమయ హేల” (సాగర సంగమం), “పేరుచెప్పనా నా వూరుచెప్పనా’’ (గురు), “వెన్నెల్లో గోదారి అందం” (సితార), “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు”, “మనసా తుళ్ళిపడకే” (శ్రీవారికి ప్రేమలేఖ), “జాబిల్లికోసం ఆకాశమల్లే” (మంచి మనసులు), “జయజయజయ ప్రియభారత జనయిత్రి” (రాక్షసుడు), “మనసుపలికే మౌనగీతం” (స్వాతిముత్యం), “సిన్ని సిన్ని కోరికలడగా” (స్వయంకృషి), “ఈ దుర్యోధన దుశ్శాసన” (ప్రతిఘటన) వంటి ఎన్నో మంచి పాటలు మనకు గుర్తురాక మానవు. HMV వారు జానకి పాడిన రికార్డుకు ‘పగలే వెన్నెల’ అనే పేరు వాడుకున్నారు. అప్పట్లో ఏ.వి.ఎం వారితో జానకికి మూడేళ్ళ కాంట్రాక్ట్ వుండేది. వారు నిర్మించిన ‘లేతమనసులు’, ‘మూగనోము’ వంటి సినిమాలలో జానకి పాటలు పాడింది. ఆమె బిజీ కావడంతో ఆ కాంట్రాక్ట్ రద్దుచేసుకోవలసివచ్చింది. తెలుగు సినిమాలలో జానకి పాడిన అద్భుత గీతాలకు ఆమెకు 10 నంది బహుమతులు లభించాయి.

కన్నడ సినిమాలలో కూడా…

జానకి కన్నడ సినిమాలలోనే అత్యధిక పాటలు పాడింది. వాటిలో పి.బి. శ్రీనివాస్, హీరో కన్నడ రాజకుమార్, బాలు సరసన పాడిన పాటలు అత్యధికం. రాజన్ నాగేంద్ర, జి.కె. వెంకటేష్, రంగారావు, హంసలేఖ, బాబురాజ్, విజయభాస్కర్ వంటి అనేక సంగీతదర్శకుల వద్ద జానకి ఆలపించిన పాటలు సూపర్ హిట్లయ్యాయి. కన్నడ చిత్రరంగం ఆమెకు కన్నడ రజ్యోత్సవ బహుమతి కట్టబెట్టింది. మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఎల్. వైద్యనాధన్ ‘హేమవతి’ చిత్రంలో స్వరపరచిన “శివశివయన్నద నాళిగయేకే” అనే పాట అంటే జానకికి చాలా ఇష్టం. ఆమె ఈ పాటను ఎంతో శ్రమకోర్చి పాడింది. అందులో వాయులీనంకు తన గళానికి తేడా తెలియకుండా పాడటం విశేషం. “గగనవు ఎల్లో” (గజ్జెపూజ), “నంబిడే నిన్న” (సంధ్యారాగ), “కారేడు కేలడే” (సనాది అప్పణ్ణ), “భారత భూషిర” (ఉపాసనే), “ఆకాశ దీపవు నీను” (పావన గంగ), (“నోడు బా నోడు బా”(మిస్ లీలావతి), “ఓ పాండురంగా’’ (సతీ సక్కుబాయి), “హగళో ఇరుళో” (మయూర) పాటలు మచ్చుకు కొన్నిమాత్రమే. ఇక మలయాళ చిత్రసీమగురించి చెప్పాలంటే, జానకి మలయాళంలో కొన్ని వేలపాటలు పాడి రాణింపజేసింది. 1970లో ఆమె గాయనిగా తన తొలి మలయాళ రాష్ట్ర బహుమతి స్వీకరించిన నాటినుండి వరసగా పదిహేను సంవత్సరాలు ఉత్తమ గాయనిగా బహుమతులు అందుకుంటూనేవుంది. ఇప్పటికీ మలయాళ చిత్రపరిశ్రమలో ఇది ఒక చెరిగిపోని రికార్డు. భప్పిలహరి ప్రసాద్ స్టూడియోలో ఒక తమిళ చిత్రానికి జానకిచేత మొదట పాటలు పాడించారు. ఆమె స్వరంలో వున్న మెరుపుకు ముగ్ధుడై హిందీలో ‘సాహెబ్’, ‘సుర్ సంగం’, ‘ఝూటి’, ‘మయూరి’, ‘సత్యమేవ జయతే’, ‘మై తేరే లియే’ వంటి సినిమాలలో కొన్ని పాటలు పాడించారు. ఒరియా భాషలో జానకి 70కి పైగా పాటలు పాడింది. ఒడిషా స్టేట్ అవార్డు కూడా అందుకుంది. ఫ్రెంచ్, సింహళీస్, జపనీస్ భాషల్లో కూడా జానకి పాటలు పాడడం విశేషం. జానకి దక్షిణాది భాషలలోమే కాకుండా పంజాబీ, కొంకిణి, తుళు, బడగ, జర్మన్, సంస్కృత భాషల్లో కూడా పాటలు పాడటం పెద్ద విశేషం. ఇలా మొత్తం 17 భాషల్లో ఆమె 48 వేల పాటలు పాడారు. ఆమె పాడిన మొత్తం పాటలలో సింహభాగం సినిమా పాటలు కాగా మిగతా పాటలు లలితగీతాలు, ప్రైవేట్ పాటలు. జానకికి తెలుగు భాషలోకన్నా ఎక్కువ అవకాశాలు తమిళ, మలయాళ భాషల్లో వచ్చాయి. అయితే ఇళయరాజా శకం ఆరంభమయ్యాక రాజా ఎక్కువ పాటలు జానకితోనే పాడించారు. వివిధ భాషల్లో జానకి పాటలు పాడేటప్పుడు ఆమెకు భాషాపరమైన సమస్యలు రాలేదు. ఏ భాషలో పాడినా ఆ పాట సాహిత్యంలోని అర్ధాన్ని, ఉచ్చారణను అడిగి తెలుసుకొని పాడటంచేత ఆమె తమ భాషలోనే పాడుతూ ఉందని సంగీతాభిమానులు భావించారు. బహుశా ఈ కారణం చేతనే ఆమె వివిధ భాషల్లో ఎక్కువ పాటలు పాడగలిగింది.

Award receiving from NTR

మరిన్ని విశిష్టతలు:

జానకి రెండు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. 1987 లో ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించిన ‘చందమామ రావే’, 1990 లో నిర్మించిన ‘జడ్జిమెంట్’ చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. అలాగే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ 1989లో నిర్మించిన మరొక సినిమా ‘మౌనపోరాటం’ కు సంగీత దర్శకత్వం కూడా నిర్వహించింది. తరవాత కూడా ఆమెకు సంగీత దర్శకత్వం నెరపే అవకాశాలు చాలా వచ్చినా, పాటలు పాడేందుకే ఆమె ఎక్కువగా మొగ్గుచూపింది. ఎందుకంటే సంగీత దర్శకత్వం నిర్వహించాలంటే చాలా సమయం కేటాయించాలి. ప్లేబాక్ పాటలు పాడేందుకే ఆమెకు సమయం చాలేది కాదు. అయితే కొన్ని భక్తి గీతాలకు, త్యాగరాజ కృతులు, మీరా భజనలకు సొంత సంగీత దర్శకత్వంలోనే పాడి ‘’కృష్ణరవళి’, ‘నాదప్రవాహం’, ‘శిరిడీసాయి గీతమాలిక’ వంటి పేర్లతో క్యాసెట్లు/కాంపాక్ట్ డిస్కుల రూపంలో విడుదల చేసింది. అందరికీ దక్కని అరుదైన అవకాశం జానకికి త్యాగరాజస్వామి సొంతవూరు తిరువయ్యూరులో దక్కింది. శాస్త్రీయ సంగీతం పూర్తిగా నేర్చుకోకపోయినా త్యాగరాజ ఆరాధనోత్సవాలలో వరసగా మూడేళ్లు గాత్రకచేరి చేయడం ఆమె జీవితంలో మరచిపోలేలి సంఘటన. ఈ సందర్భంగా మృదంగ వాద్యంతో కాకుండా డోలు, సన్నాయి వాద్య సహకారంతో గాత్రకచేరి ప్రయోగం చేసి విజయవంతం చేసింది. మరో విశేషమేమంటే “కణ్ణా నీ ఎంగే” అనే పాటను ఒక తమిళ సినిమాకోసం గీతరచన చేసింది. 1956 లో ఆకాశవాణి పాటల పోటీలో విజేతగా నిలిచి నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా బహుమతి అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని జానకి ఎప్పుడూ చెబుతూ వుంటుంది. జానకి నాలుగుసార్లు జాతీయ బహుమతులు అందుకుంది. 1977లో ‘పదునారు వయదినిలే’ (సిందూర పూవై పాట) చిత్రానికి, 1980లో ‘ఒప్పోల్’ (ఎట్టుమణూరంబలత్తిల్) అనే మలయాళ చిత్రానికి, 1984లో తెలుగు సినిమా ‘సితార’ (వెన్నెల్లో గోదారి అందం) కు, 1993లో ‘దేవర్ మగన్’ (ఇంజీ ఈడుప్పళఘ) అనే తమిళ చిత్రానికి ఉత్తమ గాయనిగా ఆమె ఈ బహుమతులు అందుకుంది. 13 సార్లు కేరళ రాష్ట్ర బహుమతులు, 6 సార్లు తమిళనాడు రాష్ట్ర బహుమతులు, మరో 10 సార్లు ఆంధ్రరాష్ట్ర బహుమతులు, కర్నాటక, ఒడిషా రాష్ట్ర బహుమతులు ఒక్కొక్కటి చొప్పున జానకి కి దక్కాయి. 1987లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామ’ణి’ పురస్కారంప్రదానం చేసింది. ‘సాహెబ్’ అనే హిందీ చిత్రంలో పాడిన “యార్ బినా చైన్ కహా రే” పాటకు ఫిల్మ్ ఫేర్ బహుమతి లభించింది. ‘మయూరి’ హిందీ సినిమాకు ‘సుర్ సింగర్’ బహుమతి లభించింది. 2013లో ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించగా వివిధ కారణాలవలన ఆ పురస్కారాన్ని జానకి తిరస్కరిచింది. 2019లో భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పేరిట జాతీయ బహుమతి ప్రవేశపెట్టినప్పుడు తొలి బహుమతి ప్రదానం చేసింది జానకికే కావడం విశేషం. అరవై సంవత్సరాలుగా నిరంతరాయంగా వివిధ భాషల్లో పాటలు పాడుతున్న జానకి, సినిమాలకు పాటలు పాడడం నుంచి విరమణ తీసుకున్నారు. ఈ అరవై సంవత్సరాల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో జానకి నలభై ఎనిమిది వేలకు పైగా పాటలు పాడారు. చివరిసారిగా ఆమె 2016 చివర్లో విడుదలైన ’10 కల్పనకళ్’ అనే ఒక మలయాళ చిత్రానికి మిథున్ ఈశ్వర్ సంగీత దర్శకత్వంలో “ఆరేరారారో… ఆరేరారారో… అమ్మ ప్పూవిణుమ్ ఆంపల్ ప్పూవిణుమ్” అనే జోలపాట పాడారు. ఈ పాటను అక్టోబర్ 4, 2016 న అబుధబి లో విడుదల చేశారు. అయితే తన నిర్ణయాన్ని సడలించి టి.ఆర్. పళనివేలన్ నిర్మించిన ‘పన్నాడీ’ తమిళ సినిమాలో రాజేష్ రామలింగం సంగీత దర్శకత్వంలో రెండు పాటలు పాడింది. జానకి భర్త రాంప్రసాద్ 1997 లో మరణించారు. జానకికి మురళీకృష్ణ ఒక్కడే కుమారుడు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “గా(జ్ఞా)న సరస్వతి ఎస్. జానకి

  1. తెలుగు వారికి వరం
    సుస్వరాల జానకి స్వరం
    ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు
    *ధన్యవాదములు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap