గుంటూరులో జాతీయస్థాయి చిన్న కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం
“సమాజంలో జరిగే వివిధ సంఘటనలకు అక్షర ప్రతిబింబమే కథ” అని అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యులు వల్లూరు శివప్రసాద్ అన్నారు. ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో జూలై 23, ఆదివారం గుంటూరు, బృందావన్ గార్డున్స్‌లో గల పద్మావతి కళ్యాణ మండపం వేదికపై జరిగిన జాతీయస్థాయి చిన్న కథలపోటీలలో విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ”తెలుగు కథ అన్ని భాషలకంటే తక్కువదేం కాదని, అంతర్జాతీయ స్థాయిని అందుకునే క్రమంలో అనేకమంది రచయితలు, సాహిత్యసంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. ఇలా పోటీలు నిర్వహించడం ద్వారా కథకులలో కొత్త చైతన్యం తీసుకురావడంతోపాటు కొత్త కథలు వెలుగుచూడటానికి దోహదపడుతుందన్నారు. గత పద్నాలుగేళ్ళుగా రమ్యభారతి ఆధ్వర్యంలో ఈ సోమేపల్లి పురస్కారాలు నిర్వహిస్తూ రచయితలలో కొత్త ఉత్సాహం తెస్తుండడం అభినందనీయమని శివప్రసాద్ నిర్వహకులను అభినందించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఆలయకమిటి అధ్యకక్షులు చిటిపోతు మస్తానయ్య ప్రసంగిస్తూ ‘కథ ద్వారా సమాజంలో జరిగే దృష్ప్రభావాలు తెలుసుకుని సామాజిక మార్పును తీసుకురావచ్చన్నారు. ప్రముఖ కథా రచయిత శ్రీకంఠస్ఫూర్తి ప్రసంగిస్తూ “సమాజంపై సాహిత్య ప్రభావం తప్పక ఉంటుందని, అది కథల ద్వారా రచయితలు వ్యక్తం చేస్తూ, పోటీ కథల ద్వారా అందర్నీ ఆలోచనల్లో పడవేసే అవకాశం ఉందన్నారు. పురస్కార ప్రదాత సోమేపల్లి వెంకట సుబ్బయ్య తాము ఈ పోటీలు నిర్వహించడానికి గల కారణాలను సభకు విశదపరిచారు. రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ నిర్వహణలో జరిగిన ఈ సభలో, అతిథుల చేతులమీదుగా విజేతలైన బి. కళాగోపాల్ (నిజామాబాద్), బి.వి.రమణమూర్తి (మధురవాడ), మల్లారెడ్డి మురళీమోహన్ (విశాఖపట్నం), బి.వి. శివప్రసాద్ (విజయవాడ), కె.వి.లక్ష్మణరావు (మానేపల్లి), కె.వి. సుమలత (గుడివాడ)లకు శాలువా, మెమెంటో, దండ, నగదులతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఎస్.ఎం.సుభానీ, నానా, బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి నిర్వహించారు.