న్యూజెర్సీలో ఆకట్టుకున్న ‘శ్రీకృష్ణ రాయబారం’

కళావేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన, అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన వారందరికీ కార్యదర్శి రవికృష్ణ అన్నదానం, ఉపాధ్యక్షురాలు బిందు యలమంచిలి సాదర స్వాగతం పలికారు. కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి, తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత అధ్యాపకురాలు ఉషా ఆకెళ్ళ స్వరరాగ సుధా కళా అకాడమీకి చెందిన విద్యార్థినులు ప్రార్థనాగీతం ఆలపించారు. అనంతరం ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, ఆధ్యాత్మిక గాయని కళ్యాణి ద్విభాష్యం అన్నమయ్య సంకీర్తనలతో భక్తి సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కట్టెదుర వైకుంఠము, చూడరమ్మ సతులారా, వేడంబెవ్వని వెదకెడిని, మేడలెక్కి నిన్ను జూచి,
వాడవాడల వెంట, జగడపు చనువు జాతర వంటి బహుళ ప్రాచుర్యంలో ఉన్న మధురమైన అన్నమాచార్య కీర్తనలను కళ్యాణి ద్విభాష్యం ఆలపించి శ్రోతలను తన గానామృతం పంచారు. ప్రతి పాట చివర పాడిన గోవింద నామాలు, అందరినీ భక్తి రసంలో ముంచెత్తి ఈ సంగీత కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగు కళా సమితి కల్చరల్ కార్యదర్శి సుధా దేవులపల్లి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కళ్యాణి ద్విభాష్యంను తెలుగు కళా సమితి కార్యవర్గం, కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రతినిధులు టి. పి. శ్రీనివాస్, చైర్పర్సన్ అరుణా గంటి ఘనంగా సత్కరించారు.

బాలబాలికల పద్యనాటకం.. ఆసక్తిదాయకం:
అమెరికాలో పుట్టి పెరిగిన ప్రవాస బాలబాలికలు ప్రముఖ పద్యనాటక కళాకారుడు, ఏపీ నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ శిక్షణ, దర్శకత్వంలో “శ్రీకృష్ణ రాయబారం” పద్యనాటకాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. శ్రీకృష్ణుడుగా ఇషాన్ తంగిరాల, సుయోధనుడుగా జతిన్ ఇంటి రాధేయుడుగా ప్రణతి మిర్యాల, ధృతరాష్ట్రుడుగా లలిత్ నూకెళ్ళ, అశ్వథ్థామగా వందిత గబ్బెట, భీష్ముడుగా సిద్ధార్థ తమ్మా, విదురుడుగా ఆశ్రీత్ ఆదిరాజు, గాంధారిగా లక్ష్మి సౌమ్య రెండుచింతల, వికర్ణుడుగా సాయి సంయుక్త రెండు చింతల, ద్రోణాచార్యుడుగా శ్రీరామ దేశిరాజు, కృపాచార్యుడుగా శ్రీయాన్ దేశిరాజు మరియు సాత్యకిగా ఇషాన్ సాయి గ్రంథి నటించారు. పలు పద్యాలను అలవోకగా, రాగయుక్తంగా ఆలపించి ప్రవాస చిన్నారులు ఆకట్టుకున్నారు. గుమ్మడి స్వయంగా పాత్రధారులకు హార్మోనియం వాద్య సహకారం అందించటంతో నాటకం మరింత రక్తి కట్టింది. ఆయన నట శిక్షణలో ఈ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం ఉర్రూతలూగించగా వారి కరతాళధ్వనులతో ఆడిటోరియం మార్మోగింది. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ పౌరాణిక పద్య నాటకం తెలుగు వారి వైభవం. పద్య నాటకాలలో అనేక జీవన విలువలు ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలతో అమెరికా నలుమూలలా తన దర్శకత్వంలో జరుగుతున్న పద్య నాటకాలతో, రాబోయే తరంలో పద్యనాటకం అమెరికాలోనైనా కొనసాగుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. పద్యనాటకం కేవలం తెలుగు భాషకు మాత్రమే సాధ్యమైన ప్రక్రియ అని.. దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అందుకోసం అన్ని సంస్థలు ఇలాంటి ప్రదర్శనల్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.. “శ్రీకృష్ణ రాయబారం” పద్యనాటకంలో పాల్గొన్న బాలబాలికల ప్రతిభా పాటవాలకు ముగ్ధులైన సునీతా, రమణ క్రోసూరి దంపతులు ఆ చిన్నారులకు తమ అభినందనలతో పాటు నగదు బహుమతిని, ఆశీర్వచనాలను అందజేశారు.

అమెరికాలోని చిన్నారులకు తెలుగు వారి సాంప్రదాయ కళలను నేర్పించే ఆశయంతో కళావేదికను స్థాపించినట్టు ఆ సంస్థ అధ్యక్షురాలు స్వాతి అట్లూరి తెలిపారు. ఇలాంటి కార్యక్రమ నిర్వహణలో భాగమైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ తెలుగు కళాసమితి అధ్యక్షులు మధు రాచకుళ్ళ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు కళా సమితిలో తొలిసారి పౌరాణిక పద్య నాటకాన్ని ప్రదర్శించామని, ఇటువంటి వైవిధ్య భరితమైన కార్యక్రమాలను నిర్వహించి తెలుగు కళాసమితిని మరింతగా తెలుగువారికి దగ్గర చేశామన్నారు. తెలుగు కళాసమితి పూర్వ అధ్యక్షురాలు శ్రీదేవి జాగర్లమూడి మాట్లాడుతూ.. గతంలో కొవిడ్ కారణంగా తెలుగు కళా సమితి పలు కార్యక్రమాలు నిర్వహించ లేకపోయిందన్నారు. ప్రస్తుత కార్యవర్గం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. చక్కటి ప్రదర్శన చేసిన బాలబాలికలకు కళాభినందనలు తెలియజేశారు.

అనంతరం స్వాతి అట్లూరి దంపతులు గుమ్మడి గోపాలకృష్ణ మన సత్కరించారు. ‘శ్రీకృష్ణ రాయబారం’ పద్యనాటకానికి రవి కామరసు సమన్వయకర్తగా వ్యవహరించారు. నాటకాన్ని ప్రదర్శించిన పిల్లలను సమీకరించటం, గుమ్మడి గోపాలకృష్ణతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించటం, కావల్సిన పరికరాలను సమకూర్చి ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసినందుకు గుమ్మడి గోపాలకృష్ణ, స్వాతి అట్లూరి దంపతులు (కళా వేదిక), తెలుగు కళా సమితి కార్యవర్గం రవి కామరసులకు ప్రత్యేకంగా అభినందించారు. బాలబాలికలను పాత్రధారులుగా అలంకరించటంలో శ్రీవల్లి తాడిగడప, కాంతి దాట్ల, చిత్ర నుంకు సహాయం చేశారని.. పాత్రధారులు ధరించిన దుస్తులు, ఆభరణాలు తదితర మేకప్ సామగ్రి, హార్మోనియం బాక్స్ సమకూర్చిన వెంకటరావు మూల్పూరిలకు తెలుగు కళా సమితి కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
తెలుగు కళా సమితి ఉపాధ్యక్షురాలు బిందు. యలమంచిలి వెండర్స్ నిర్వహణ వ్యవహారాలు చూడగా.. కార్యదర్శి రవికృష్ణ అన్నదానం మొత్తం భోజన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించారు. కోశాధికారి శ్రీనివాస్ చెరువు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యదర్శి సుధా దేవులపల్లి, మెంబర్షిప్ కార్యదర్శి జ్యోతి కామరసు ఈ కార్యక్రమాలను రూపకల్పన చేసి సమర్థవంతంగా నిర్వహించారు.
-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap