ఆంధ్రజాతికి అమ్మభాష

ఆదికవి నన్నయ అనువదించిన భాష
అన్నమయ్య పదకవితలు ఆలపించిన భాష
ఆంధ్రభోజుడు రాయలు ఆదరించిన భాష
ఆంధ్రజాతికి అమ్మభాష … తెలుగుభాష

పరమభాగవతుడు బమ్మెరపో’తన’భాష
నలుగుపిండి నలుచు అమ్మ’లాల’ భాష
జోఅచ్యుతానందా జోలభాష
తాండవకృష్ణా తారంగం కృష్ణలీల భాష
ముద్దుమురిపాల అమ్మ చనుభాల భాష
అమృతము మన తెలుగుభాష

చందమామ రావే అనుచు అమ్మపిలుచు భాష
వెండిగిన్నెలో వేడిబువ్వవంటి భాష
పైడిగిన్నెలో పాలబువ్వలాంటి భాష
గొబ్బిళ్ళభాష … తెలుగు లోగ్గిళ్ళభాష

ప్రతి తెలుగు అక్షరం ఓ తేనెబొట్టు
తెలుగు భాష తేనెపట్టు
తెలుగు భాషామాధుర్యానికిదే అసలు గుట్టు
అందుకే భాషలన్నిటిలో తెలుగుదే పైమెట్టు

మనది తెలుగునేల
ఓ తెలుగోడా ! తెలుగులో నడువవేల?
మనది తెలుగునేల
మనం మన తెలుగును విడువనేల?
ఆంగ్లభాష మోజులో
తెలుగు పోరాదు వెలవెల
తెలుగు అక్షరానికి ఆంధ్రుడి గుండె కావాలి ఓ కోవెల…

-బి.ఎం.పి.సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap