తెలుగు లోగిళ్ళలో మళ్ళీ  ‘అమృతం ‘

అమ్మా, ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు అని త్రివిక్రమ్ రాసాడు కానీ దానితో పాటుగా ” అమృతం” అనే సీరియల్ ని కూడా చేర్చడం మర్చిపోయాడు. తెలుగు ఛానళ్ల లోగిళ్ళలో విరిసిన ఒక అద్భుత హాస్య కుసుమం “అమృతం”.ఎప్పుడో చాన్నాళ్ల క్రితం, ధర్మవరపు ఆనందో బ్రహ్మ అనే ధారావాహిక, ఆ తరవాతో లేక అదే సమయంలోనో గుర్తులేదు కానీ ” భమిడిపాటి” వారి కథలు దూరదర్శన్ లో నవ్వులు పూయించినా ఆ తర్వాత మాత్రం హాస్యం పాళ్లు తో నడిచే కార్యక్రమాలు చాలా తక్కువే అని చెప్పాలి. జంధ్యాల గారి హాస్య చిత్రాలు, ఆ తరవాత జంధ్యాల గారు కూడా దాటిపోవడం తో తెలుగు లో ఆరోగ్యకరమైన హాస్యానికి కాస్త కొరత ఏర్పడింది. అలాంటి టైమ్ లో గుణ్ణం గంగరాజు గారికి వచ్చిన ఆలోచనో లేక మరోకరి ఆలోచనో కానీ ఈ అమృతం పురుడు పోసుకుంది.

ముఖ్య పాత్రలు నాలుగు, పక్క పాత్రలు ఒక రెండో మూడో అంతే. వీటి ద్వారా హాస్యాన్ని పంచడం అనేది కత్తిమీద సాము లాంటి వ్యవహారం.ఐతే ఆయా పాత్రల వాటి స్వరూప స్వభావాలు బట్టి అవి హాస్యాన్ని పండించే పరిధి పెరగడం వలన ఎక్కడా బోర్ కొట్టించలేదు.పైగా ఎక్కువ మాటలు లేకుండా కేవలం హావభావాలు మీదనే చాలా కామెడీ జనరేట్ కావడం కూడా అమృతం విజయానికి మరో మూల కారణం. ఏ ఎపిసోడ్ తీసుకున్నా సరే వాళ్ల అమయాకత్వాన్ని చాలా నేర్పుగా ఓర్పుగా మెదళ్ళలోకి ఎక్కించడం వలన వాళ్ళు కూడా అంత ఫేమస్ అయ్యారు. ఒక మామ అల్లుళ్ళ ఎపిసోడ్స్, సీరియల్ నిర్మాణ ఎపిసోడ్స్, అలాగే ట్రావెలింగ్ గైడ్ ఎపిసోడ్స్ ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ ఎపిసోడ్స్ అలాగే ఇల్లు మారే ఎపిసోడ్స్ అన్నిటికంటే మిన్నగా సర్వం , అప్పాజీ కూతురి లవ్ ట్రాక్ వాళ్ళ పెళ్లి వాయిదాలు ఇలా ఒక్కటేమిటి మనం చూడాలి కానీ ప్రతీ ఎపిసోడ్ ఒక హాస్య గుళిక. ఆరోగ్యకరమైన హాస్యం నిజంగా ఇప్పుడు అవసరం. హాస్యం అంటే కేవలం ఆడవారి మీదనో లేక, థర్డ్ జండర్ మీదనో లేక జుగుప్సాకరమైన మాటలని వాడడం తెలుగు ఛానళ్ల లో ఎక్కువై పోయిన ఈ తరుణంలో అమృతం లాంటి నిజమైన హాస్య సీరియల్స్ రావడం చాలా మంచి పరిణామం. దీనికి పనిచేసిన రైటర్స్ అందరికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండి ఉండాలి లేకపోతే ఇంత నవ్వు బయటకి రాదు.
అంజి…
అంజి గా గుండు హనుమంత రావును చెప్పుకోవాలి.కేవలం హావభావాలు ద్వారా మాత్రమే తాను హాస్యం పండించే వారు. నిజానికి చాలా మంది అమృత రావులు మారారు కానీ అంజి మాత్రం ఒక్కడే. అలాంటి చిరస్థాయి గల నటుడు మన మధ్య లేకపోవడం అందునా అమృతం రెండో సారి వస్తున్న క్రమంలో ఆయాన లేకపోవడం దురదృష్టకరం.
ఈయన స్థానాన్ని భర్తీ చేస్తూ రాబోతున్న హాస్య చక్రవర్తి ఎల్బీ శ్రీరామ్ కూడా తన స్థానాన్ని ఆ పాత్రలో సుస్థిరం చేసుకుంటారని ఆశిద్దాం.
అప్పాజీ..
ప్రపంచ మేధావి, అపర పిసినారి ఈ క్యారెక్టర్ వేయడం అంత ఈజీ కాదు. అలాంటి క్యారెక్టర్ ని శివన్నారాయణ గారు చాలా అలవోకగా పోషించారు.చూద్దాం రెండో సారి ఈయన పెనాల్టీలు, మంచితనం ముసుగులో ఎన్ని నవ్వులు పూయించబోతున్నారో చూద్దాం. ఎన్ని పెసరట్లు భోంచేస్తారో చూద్దాం.
సర్వం….
ఎంత తెలివి ఉందో అంత తింగరితనం ఉన్న వ్యక్తి. అంజి అమృతానికి సరి జోడు. కొన్నిసార్లు వీళ్ళకన్నా అపార మేధావిగా మరి కొన్ని సార్లు వీళ్ళ కన్నా తింగరిగా ఉంటాడు. అప్పాజీ కూతురుని ప్రేమించడం దగ్గర నుంచి హెల్మెట్స్ అమ్మకం లో లాజిక్ వరకు, బస్సుల సమ్మెలో ఎద్దుల బండ్లని లాక్కురావడం నుంచి, క్రికెట్ పోటీల్లో అప్పాజీని ఓడించడం వరకు సర్వం సర్వమే.. వాసు ఇంటూరి ఈ పాత్రని చాలా సునాయాసంగా పోషించాడు ముఖ్యంగా అప్పాజీ ని ఎదిరించే సన్నివేశాల్లో ఇతని పాత్ర హైలెట్ గా ఉంటుంది. యముణ్ణి పూజించే సన్నివేశం చూసే తీరాలి. చూద్దాం ఈ నయా భాగం లో సర్వేశ్వరన్ లీలా వినోదాలు ఎలా ఉంటాయో.
ఇక రాగిణీ, తడవకి ఒకసారి మారిపోయే సంజీవిని పాత్రలు, ఎలా ఉంటాయో కాస్త ఆసక్తి గానే ఉంది. అలాగే మన మధ్య నుంచి ఈ మధ్యనే వెళ్లిపోయిన దేవదాస్ కనకాల పాత్ర కూడా చాలా కీలక మైనదే.
ఈ చానల్ మొదటి విజయం టైటిల్ సాంగ్ ఒరేయ్ ఆంజనేలు అంటూ సాగే మెలోడీ గాత్రం. కల్యాణి మాలిక్ సంగీతం. ఆవెంట పైన నడిచే కార్టూన్లు , సిరివెన్నెల కురిపించిన “కరెంట్ రెంటూ ఎటెస్త్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు ” అంటూ టీవీలో ఏం చూడాలో మన జీవితం లో హాస్యాన్ని ఎలా తీసుకోవాలో అంటూ సాగే గీతం ఇవన్నీ అమృతం ఆస్తులు.
ఏది ఏమైనా తెలుగు లోగిళ్ళలో మళ్ళీ అమృతం పూయడం మంచిదే అయితే ఇది కేవలం వెబ్ సీరిసా లేక జీ తెలుగులో కూడా ప్రసారం చేస్తారా అన్నది తెలియదు. చూద్దాం ఆరోగ్య కరమైన హాస్యం కావాలంటే కాస్తంత కష్టపడాలి కదా.
దర్శకత్వం…
ఈ సీరియల్ తో 11 మంది డైరెక్టర్లుగా పరిచయం అయ్యారు. ఈ సీరియల్ తో డైరెక్టర్ గా పరిచయం అయిన చంద్రశేఖర్ యేలేటి ఆ తరువాత ఐతే, సాహసం, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, మనమంతా వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో అంబుజనాభాంగా చేసిన ఎస్.ఎస్.కంచి మొదటి 30 ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించాడు. ఈ సీరియల్ లో అమృతంగా చేసిన హర్షవర్ధన్, సర్వంగా చేసిన వాసు ఇంటూరి కూడా కొన్ని ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు.
మొదటి ప్రసారం 18 నవంబర్ 2001 లో జెమినీ టీవీ లో ప్రసారమయ్యింది. ప్రసారమయిన ఎపిసోడ్ల సంఖ్య 313. ప్రొడక్షన్ సంస్థ -జస్ట్ యెల్లో మీడియా

-అనిల్ డాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap