కళకు, సనాతన సత్సంప్రదాయాలకూ, భక్తిభావాలు, గౌరవ భావాలకూ, భగవన్నామస్మరార్చనలకూ , సత్చింతనా మార్గాలకూ అజరామరమై సలక్షితమై విరాజిల్లుతున్న మన మహోన్నత భరతమాత ఒడిలో భగవంతునికి పూజా కార్యక్రమాలు సలపనివారుండరు. ఎంతో భక్తి ప్రేమలతో, దేవుని కొలస్తూ తరిస్తున్న వారందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క పద్ధతిలో రకరకాలైన పేర్లతో, శతకోటి దేవతలను పూజిస్తూ తరిస్తున్నారు.
అటువంటి దశలో మనుషులకే కాదు, దేవతలకు కూడా బంగారు ఆభరణాలు, నగిషీలద్ది తమ తమ గృహాలలో ఎంతో ప్రేమాభక్తులతో దేవతా చిత్రపటాలను కొలువుంచి, పూజా విధానాలలోనో అలంకార ప్రాయంగానో దేవతా చిత్రపటాలను చిత్రించడం 16వ శతాబ్ద కాలంలో ప్రారంభమైంది. 16వ శతాబ్దపు ప్రారంభ కాలంలో, అప్పటి చోళరాజుల పరిపాలన తంజావూరు రాజధానిగా జరుగుతున్న కాలంలో ఈ చిత్రకళ ప్రారంభమైదని గురువుగారు శ్రీ ఇలంగోవన్ గారి ఉవాచ. ఏ చిత్రమైనా చిత్రకారుడి శారీరక మానసిక స్థితి మీద, తను ఆలోచించే విధానము కలగలిపి చేతి రాతల ద్వారా చిత్రంగా రూపుదిద్దుతుందని అంటారు. అలాగే అప్పటి చక్కటి వాతావరణం, ఆరోగ్యవంతమైన ఆహారం అందమైన ప్రకృతి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఎంతో మంచి చక్కటి శరీర సౌష్టవం కలగి వుండేవారట. అలాంటి చిత్రకారుల చేతిలో రూపుదిద్దుకోవడం వల్లనే తంజావూరు చిత్రాలన్నీ ఎంతో పుష్టిగా వుంటాయట. ఇప్పుడు కూడా మనం పుష్టిగా వున్న శరీర సౌష్టవాలను గమనిస్తే అది అర్థమౌతుంది. ఇది తంజావూరు చిత్రాల శరీర సౌష్టవం మిగిలిన అన్ని రకాల చిత్రాల పద్ధతులను పూర్తిగా విభిన్నంగా ఉండడానికి కారణం.
పోతే తంజావూరు చిత్రకళ, మైసూరు చిత్రకళ నుండి ఆవిర్భవించినదని ఒక వినికిడి. మైసూరు చిత్రకళలో పూర్తిగా పలుచటి నగిషీ పనితనమే కనబుడుతంది. కానీ చోళరాజుల కాలంలో వారి దర్పాన్ని చాటుకోవడానికి అసలు సిసలు వజ్ర వైడూర్యాలు పొదగాలని భావించి ఆ రాళ్ళ పట్టు నిలుపుట కోసం క్రింద ఎత్తుగా గట్టిగా వుండే పదార్థాన్ని వుంచాల్సి వచ్చింది. గట్టిగా వుండే పదార్ధం నిలబడడం కోసం చెక్కలు వాడలసి వచ్చింది. వీటికి పురుగు పట్టకుండా వుండడం కోసం జిగురు కలిగిన చింతపిక్కల పొట్టు నానబెట్టి, ఉడుకబెట్టి జిగురు వాడవలసి వచ్చింది. ఇవి అన్నీ వాడితే పగుళ్ళు రాకుండా వుండడం కోసం బట్టముక్కలు వాడవలసి వచ్చింది. ఇన్ని మార్పు చేర్పులు చేసిన తరువాత ఎంతో స్పష్టమైన నగిషీలన్నీ చేస్తే బాగావుంటుందని భావించి, తమకు ఎంతో యిష్టమైన అప్పట్లో సంప్రదాయ బద్దంగా వాడే ఎన్నో రకాల బంగారు ఆభరణాలను దేవుడి చిత్రాలకు చిత్రించేవారు. ఆవిధమైన నగను ఇప్పటికి కూడా తంజావూరు చిత్రాలలో చూడవచ్చు.
తరువాత సహజ సిద్ధమైన రంగులను ఎంతో శ్రమకోర్చి తయారు చేసేవారు. అద్భుతమైన చిత్రాలను చిత్రించి ప్రప్రధమంగా సున్నితమైన పని తనానికి విలువనిచ్చారు. ఇప్పటికీ సునిశితమైన రేఖలకే తంజావూరు చిత్రాలలో కళాత్మకతను ఎత్తి చూపుతుంది. కను బొమ్మలు, ముక్కు పెదవులు, చూపు, పూల హారాలు, ఆభరణాలు, భంగిమలు ఇవన్నీ కలగలిపి రంగరించి వడబోసి ఒకేచోట చూస్తే కలపించే చిత్రమే తంజావూరు చిత్రం. మునుపట్లో ఎక్కువ భాగం అల్లరి కృష్ణడు, రాముడు, జీవితం ఆధారంగా ఎక్కువ చిత్రాలుండేవి. ఇప్పుడైతే అన్ని రకాల చిత్రాలకూ తంజాపూరు నగిషీలు అద్దుతున్నారు. ఏది ఏమైనా భారతీయ జీవన విధానంలో ఈ శైలి మిళితమై పోయిందంటే అతిశయోక్తి కానే కాదు. ఈ కళను తంజావూరు రాజులు, మారాఠులు, నాయక రాజులు విజయనగర పరిపాలకులు, తిరుచ్చి నాయకులు వారు అన్ని రకాల వజ్ర వైడూర్య స్వర్ణ వర్ణ కాంతులతో సమ్మిళతం జేసేలా చిత్రకారులను పెంచి పోషించి చిత్రింపజేసి విరాజిల్లేలా చేశారు. అద్భుతమైన కళాత్మకతను తరతరాలకూ తరగని వన్నె అందించారు. కేవలం భగవంతుడిని మాత్రమే ఈ కళద్వారా అలంకరించే వారు. చెన్న పట్టణానికి 300 కి.మీ పరిధిలోని గుప్తుల కాలంలో ఈ చిత్రాలను విపరీతంగా, ఎక్కువ శాతం చిత్రించారట, గుప్తుల కాలాన్ని యిప్పటికీ మనం చిత్రకళకు, శిల్పకళకు దేవాలయాల నిర్దానానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటున్నాము. ఎంతో విభిన్నంగా చిత్రంచబడే తంజావూరు చిత్రకళ, ఒక చిత్రం ప్రారంభ దశనుండి చివరి వరకూ ఎంతో సాగసైన పనితనంతో కూడి వుంటుంది. ఖచ్చితమైన విధి విధానలతో అలరారుతుంది. ఎంతో మంది గృహాలలో ఈ చిత్రాలను ప్రతి నిత్యం మనం చూస్తూ ఉంటాము. ప్రపంచంలో కళలకు ఆలవాలమైన భారత దేశంలో భారతీయ చిత్రకళ అంటే ఎలుగెత్తి చాటదగ్గది. అందరికీ యిష్టమైనది. మెచ్చేది తంజావూరు చిత్రకళ అంటే ఎంతో గర్వకారణం అనిపిస్తుంది. చిత్రకళ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ పరిగెతున్న ఈ రోజులలో సంప్రదాయ చిత్రకళ మరింతగా రానిస్తోందంటే ఆ నందం ఎంతో గొప్పది.
చిత్రకారులు సంప్రదాయలను భక్తి పల్లకిలో మోసుకెళ్ళి తరువాతి తరాలకు అందించే బోయీలని కొందరు, వారధులని మరికొందరు, ఎందరేమన్నా అది చిత్రకారులకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అటువంటి బోయీగానో, వారధిలో ఒక రాయిలాగానో, ఇసుక ముక్కలాగానో నిలుచోవడానికి అర్హత కల్గించి మా నాన్న కీ. శే. శంకర్ కు నాగురు దేవుల పద్మశ్రీ పన్నూరు శ్రీపతి గారికి, తంజావూరు చిత్రకళను నాతో ఆరంభప జేసిన పూజ్యులు శ్రీమతి వాసవాంబ (బెంగుళూరు) గారికి, మరింతగా నన్నాదరించి, తమ యింటిలో పెట్టుకొని విద్యనేర్పిన దైవ సమానులు శ్రీ ఇలంగోవన్ (మహాబలిపురం) గారికి సర్వదా కృతజ్ఞుడను.
-శ్రీపతి చిన్నా
Very good information about Tanjore painting and preparation.