తొలి సినీనృత్య దర్శకులు  వెంపటి సత్యం

(తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మున్నగు 300 చిత్రాలకు పైగా నృత్యదర్శకునిగా పనిచేశారు)

కూచిపూడిలో పుట్టిన వాళ్ళందరూ నర్తకులు కాకపోయినా, నర్తకులు చాలామంది కూచిపూడి లోనే పుట్టారు. నాట్యకళకూ, నర్తకులకు కూడా కూచిపూడే పుట్టిల్లు ఐంది. ‘నాట్యాచార్య’ వెంపటి సత్యంగారు 1822 వ సంవత్సరం, డిసెంబరు 5 న కూచిపూడిలోనే పుట్టారు. వంశ పారంపర్యంగా వస్తున్న నాట్యకళను కూచిపూడి వాసులు సాధారణంగా వదిలి పెట్టేవారు కాదు. నడవడం అలవాటు అవుతూ వుండడంతోనే కాలికి గజ్జె కట్టేవారు. సత్యంగారి తండ్రిగారు సుబ్బా రావుగారికి నాట్యకళలో ప్రవేశం పున్నది. పెద్ద తండ్రిగారయిన వెంకట నారాయణగారు నాట్యా చార్యులు. ఐనా, సత్యం చిన్నతనంలో నృత్యం మీద ఆసకి చూపలేదు. అతని మనసంతా – చదువుమీద వుండేది. చదువుకుంటేనే మంచిది, మంచి ఉద్యోగాలు చేసి పూళ్లు ఏలవచ్చు” అని సత్యం, తలిదండ్రులు కూడా అనుకున్నారు.

కాలికి గజ్జెకట్టి ఘల్లుఘల్లుమని ఆడవలసిన సత్యం, బడిలో తోటి విద్యార్థులతో ఆటలు ఆడాడు. నాట్యశాస్త్ర సూత్రాలనూ, విధానాలనూ అభ్యసించవలసిన సత్యం, పుస్తకాలు పుచ్చుకుని పాఠాలు చదివాడు. ఐతే, ఆర్థిక సంబంధమైన కారణాలవల్ల సత్యం చదువు మూడో ఫారంతోనే ఆగిపోయింది. సత్యం చేతిలో నాట్యకళా రేఖలతో పాటు చిత్రకళా రేఖలు కూడా వుండడం చేత కాబోలు అతని మనసు చిత్రకళ మీదకు వెళ్ళింది. చిన్నతనం నుంచీ బొమ్మలు గియ్యటంలోనూ, చిత్రాలు వెయ్యటంలోనూ శ్రద్ద చూపించేవాడాయన. ఎంతె నా వంశంలో వున్న కళ కాబట్టి….ఆయన బొమ్మలు వేసినా నాట్యభంగిమలే ఎక్కువగా వేసేవాడు. మూడో ఫారంలో ఆగిపోయినప్పుడు అతని వయస్సు 14 ఏళ్ళు. “ ఈ బొమ్మలూ అవీ ఎందుకురా అవేం కూడెట్టనా గుడైనా_మన మంచీ మన సంప్రదాయం మరిచిపోకుండా నాట్యం నేర్చుకో. న్యాయంగా అయితే ఈపాటికి పదిమందిలోనూ ప్రదర్శనలిచ్చి శబాష్ అనిపించుకోవాల్సిన ఈడు. ఐన ఆలస్యం ఎలాగూ అయింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు నాట్యం నేర్చుకో” అన్నారు సత్యం తండ్రిగారు. నృత్యం నేర్చుకోవడం ఐతే లేదు గాని, నృత్యంపట్ల అతనికి అభిమానం, ఉత్సాహం వుండనే వున్నాయి. మొదట్నించీ అతను యక్షగానాలనూ, భామాకలపాలనూ ఉత్సాహంతో తిలకించేవాడు. రక్తంలో వున్న కళకావడంచేత, మామూలుగా వేసే అడుగుకూడా వద్దనుకున్నా లయ బద్దంగానే పడేది. చింతా వెంకట్రామయ్యగారి దగ్గర చేరి సత్యం నాట్యాభ్యాసం చేయ్యసాగాడు. తెల్లవారు ఝామున మూడు గంటలకు లేచి, స్నానాదులు ముగించుకుని అభ్యాసం మొదలెడితే, సాయంకాలం ఆరుగంటలదాకా అలాగే సాగేది. ఆ విధంగా సత్యం మూడేళ్ళపాటు నిరాఘాటంగా ఆ విద్యను అభ్యసించాడు. చిన్నతనంలో మొదలెట్టవలసిన విద్యను, ఆలస్యంగా మొదలెట్టినా, పట్టుదలగా కృషి చేసి దార్లో పడ్డాడు. అప్పటికి యక్షగానాలు బాగా ప్రచారం లోకి వచ్చాయి. కూచిపూడి బృందంవారు వూరూరూ వెళ్ళి ఆ ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు. వేదాంతం రాఘవయ్యగారు ఆ బృందంలో వుండేవారు. వేదాంతం లక్ష్మినారాయణశాస్త్రిగారు ‘భరతనాట్యం ‘ పేరుతో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలను కలిపి ప్రదర్శనలు ఇచ్చేవారు. లక్ష్మీనారాయణశాస్త్రిగారి అబ్బాయి జగన్నాధశర్మ మున్నగువారంతా ఆ బృందంలో వుండేవారు. నేర్చుకున్న విద్య సార్ధకం చేసుకున్నట్లు అవుతుందనీ నాలుగు డబ్బులు సంపాయించుకోవచ్చుననీ చింతా వెంకట్రామయ్యగారు సత్యాన్ని ఆ బృందంలో చేరమన్నారు. ఆయనే లక్ష్మీనారాయణశాస్త్రిగారిలో మాట్లాడి ఆ బృందంలో జేర్పించారు. ఆ బృందం ఇచ్చే ప్రదర్శనలలో పాల్గొంటూ సత్యం వూరూరా తిరిగాడు. బృందంలో తాను పాల్గొంటున్నమాట ఎలా వున్నా – బృందం వారి సామాన్లు మొయ్యటం వాళ్ళకు పరిచర్యలు వెయ్యటం సత్యం వంతు. అలా వూరూ, పల్లె తిరగడంవల్ల అతని కొచ్చిన పెద్ద లాభం కూడా ఏమీ కనిపించలేదు. అన్ని విధాలా అలసట మాత్రం మిగిలి పోయిన్ది. తాను నేర్చుకున్న కళను ఎంతవరకూ సద్వినియోగం చేస్తున్నానని ఒక్కసారి అతను ఆలోచించుకున్నాడు. ఏముంది ? బృందంలో పాల్గొని — అడుగులు వెయ్యడం ! దానివల్ల తన కొచ్చే ఆదాయం దేనికీ చాలడం లేదు. ఆ ఉద్యోగం మానేస్తే జేబు ఖర్చు ‘కు కూడా రాని ఆ కాస్త ఆదాయం కూడా అంతరించిపోతుంది. ఏమైతే అదే అవుతుందని తాను ఆ కళ నే నమ్మదలచుకున్నాడు. ఆ కళ ‘కోసం అతను భోజనం లేనప్పుడు కాఫీలే తాగాడు అవి. లేకపోతే మంచినీళ్ళే తాగాడు. వాటికీ కరువైనప్పుడు డొక్కలో కాళ్ళు పెట్టుకుని నిద్రపోయాడు. అలా మూడేళ్ళు గడిచిపోయినై. ఒక రోజు లక్ష్మినారాయణ శాస్త్రిగారు సత్యాన్ని పిలిచి “ఒరే నీ బతుకు నువ్వు బతుక్కోగలవురా?” అని అడిగారు. అతనికేం అర్థం కాలేదు. “ఎలా ? ” అన్నాడు. ” అది ఎలాగో నువ్వే ఆలోచించుకో. ఈ బృందం సాగడం కష్టంగా వుంది ” అన్నారు. ఆ మాట తర్వాత సత్యం మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. రోడ్డు మీద కొచ్చి నించున్నాడు. ఇప్పుడెక్కడికి పోవాలి ? ఏం చెయ్యాలి ? ఏ గుమస్తా ఉద్యోగం ఐనా చెయ్యడానికి, తనకు అర్హతలు లేవు – నాట్య బృందంలో చేరడం తప్ప ఇంకో మార్గం లేదు ఐతే ఏ బృందంలో చేరడం ఎలా చేరడం. చేరినా, ఎన్నాళ్ళయినా ఒఖలాగే వుంటుంది. బ్రతుకు ఈ మూడేళ్ళలాగా. కనీసం రెండుపూటలా పొట్టయినా నింపని ఈ కళ ఎందుకు , ఈ విద్య ఎందుకు ? నిరర్ధకం: అనుకున్నాడు. తేజస్వరూపుడయిన నటరాజస్వామి విగ్రహం ముందు నించుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. “స్వామీ ! ఆరాధించినన్నాళ్లూ ఆరాధించాను. ఇంక నాకు అవకాశం లేదు. నన్ను మన్నించు స్వామీ ” అని నమస్కరించాడు.

ఎటుపక్క వెళ్ళాలో ఏం చెయ్యాలో సత్యానికి తోచలేదు. టక్కున అతనికి తన చేతిలో వున్న మరో విద్య గుర్తొచ్చింది చిత్రలేఖనం. పోనీ ఈ కళలోనన్నా కృషిచేస్తే ఏ డ్రాయింగు మాస్టరు ఉద్యోగమన్నా దొరక్క పోదా అనుకున్నాడు. బందరు చేరుకుని, అడివి బాపిరాజు గారిని కలుసుకున్నాడు. ఆయన సత్యం గీసిన రేఖలను చూసి ముచ్చటపడి… నేర్పుతానన్నారు. సత్యం చిత్రలేఖనాన్ని అభ్యసించడంలో కృషి చెయ్యసాగారు. మధూకరం ఎత్తుకుంటూ వారాలు చేసుకుంటూ, ఉపవాసాలు చేస్తూ, ఒక్కొక్కప్పుడు గాలితోనే పొట్ట నింపుకుంటూ, అతను ఆ విద్య నేర్చుకున్నాడు. ఒకసారి బాపిరాజుగారు, ఒక నృత్య ప్రదర్శనం చూశారు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఆ ప్రదర్శనాన్ని మెచ్చుకుంటూ సత్యాన్ని చూసి “అన్నట్టు నీదీ కూచిపూడేగదురా అబ్బాయ్ నీకు అలవడ లేదురా ఈ విద్య? ” అని అడిగారు.

“అలవడకేం గురువుగారూ ! అలవడింది వెలువడింది కూడా ” అన్నాడు సత్యం.
“ఏదిరా, కాస్త చేసి చూపించు, చూదాం “అన్నారాయన ఉత్సాహంగా సత్యం కళ్ళలో వున్న నీళ్ళు ఒక్కసారి తొంగి చూసి, మళ్ళీ లోపలకు పోయాయి. అతను నటరాజస్వామినీ, నాట్యకళామతల్లి నీ మనసులో ధ్యానించుకున్నాడు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ తాను ఆ అడుగుల వేస్తున్నాడు. సత్యంలో ఇన్నాళ్లూ మణిగివున్న కళా ప్రవాహం కట్టలు తెంచుకుని ప్రవహించింది. ఏ వాద్య సహాయాలూ లేకుండా, అతను అద్భుతంగా ఆడి గురువుగారికి చూపించాడు. ఆ నృత్యం చూసి బాపిరాజు గారు ఏమీ మాట్లాడలేదు. ఒక్క నిమిషం గడిచిన తర్వాత ” ఒరే.. ఇలా రారా ” అన్నారు. సత్యం వచ్చాడు. “నా గురువు సాక్షిగా చెబుతున్నాను. ఈ రోజు నుంచి నేను నీకు చిత్రలేఖనం విద్య నేర్పను. వెళ్లు నీ నృత్య కళాదేవినే ఆరాధించు. ఆ విద్యలో ఇంతటి శక్తిసామర్థ్యాలు గణించి, దాన్ని వదిలి పెట్టడానికి నీకు మనస్సెలా వచ్చిందిరా ? వెళ్ళు ఆ తల్లిని విడిచిపెట్టకు” అన్నారు. సత్యం భోరున ఏడ్చినంత పని చేశాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. “ఐతే ఆ విషయంలో నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. నువ్వు నాట్యకారుడిగా పైకి రావాలి!” అని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాన్ని మూటగట్టుకుని, గురువుగారి దగ్గర నెలవు పుచ్చుకుని సత్యం స్వగ్రామం వెళ్ళి కొంతకాలం కాలక్షేపం చేశాడు.
అడవి బాపిరాజుగారు మీరాబాయి ‘ చిత్రానికి కళాదర్శకులుగా మద్రాసు వచ్చారు. ఆ చిత్రంలో నృత్యాలున్నాయి. బాపిరాజుగారు నిర్మాతలకు సత్యం పేరు చెప్పి, అతని నృత్యాన్ని చూడమన్నారు. బాపిరాజు గారి ఉత్తరానికి సమాధానంగా సత్యం మద్రాసు వచ్చాడు. అప్పుడు చిత్రాలకు డాన్సు మాస్టర్ అని గాని, డాన్స్ డైరక్టర్ అని గాని ఎవరూ లేరు. నృత్యం కావలసివస్తే, ఆ నర్తకులే నృత్యం చేసేవారు. మీరాబాయి’ చిత్రంలో ప్రప్రధమంగా సత్యం ‘ కాపాలక నృత్యం ‘ చేశాడు. ఆ తొలి అనుభవం అతనికి బాగానే వున్నది. ఐతే, తనను మళ్ళీ ఎవరు పిలుస్తారు. మగవాడు నృత్యం చెయ్యవలసిన అవసరం మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో ! అంతవరకూ మద్రాసులో ఎలా వుండడం బాపిరాజుగారి ప్రోత్సాహంవల్ల సత్యానికి మళ్ళీ నాట్యవిద్యమీద శ్రద్ధకలిగింది. కూచిపూడి వెళ్ళి వేదాంతం రాఘవయ్యగారితో కలిసి, ” నృత్యనాటికలు ” రూపొందించి, దేశంలో పర్యటించాడు. తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ ఏమీ పనిలేదు. ఆ విషయం బాపిరాజుగారికి రాస్తే ఆయన మద్రాసు రమ్మన్నారు. మద్రాసులో సత్యానికి నాట్యాచార్యుడు రామ్ గోపాల్, పరిచయమైంది. రామ్ గోపాల్ కు బెంగళూరులో స్కూలు వుంది. అక్కడ తానూ విద్యార్థులూ కూచిపూడి పద్దతిని నేర్చుకోవచ్చునని సత్యాన్ని బెంగళూరు రమ్మన్నారు — రామ్ గోపాల్. సత్యం బెంగళూరు చేరు కున్నాడు. అక్కడ అతనికి జీతం 50 రూపాయలు. సత్యం కూచిపూడి పద్దతిని వాళ్ళకు నేర్పాడు. తాను భరతనాట్యాన్నీ కథాకళినీ రామ్ గోపాల్ దగ్గర నేర్చుకున్నాడు. రామ్ గోపాల్ ఇచ్చే 50 రూపాయల జీతం సత్యానికి ఎటూ చాలేదికాడు. అవస్థలూ ఇబ్బందులు పడుతూ తక్కువ డబ్బుకు ఏం దొరికితే అదే తింటూ కాలక్షేపం చేశాడు. కుక్కలకు వేనే రొట్టెముక్కలు కూడా తిని బతికాడు. మధ్యలో అతనికి ఈ జీవితం బహుదుర్బరంగా కనిపించేది. కాని.. పట్టుదల ! “ఈసారి ఏమైతే అదే అవుతుంది గాని, ఈ కళాదేవతను మాత్రం విడిచి పెట్టను” అని తీర్మానించుకున్నాడు. ఆ తీర్మానికి లోబడే అతను అన్ని డక్కా మొక్కలూ, బటానీలూ, రొట్టెముక్కలూ తిన్నాడు !
రామ్ గోపాల్ బృందం భారతదేశం అంతటా పర్యటించింది. ఆ బృందంతోపాటు సత్యం కూడా దేశమంతా తిరిగాడు. అలా ‘ టూర్’లో వుండగా అర్జెంటుగా మద్రాసు రావలసిందని అతనికో వుత్తరం వచ్చింది. అప్పుడు వాళ్ళు ‘లాహోర్’లో వున్నారు. రామ్ గోపాల్ దగ్గర సెలవు తీసుకుని సత్యం మద్రాసు వచ్చాడు. వేదాంతం రాఘవయ్యగారు, పెద్ద ఎత్తున ఒక నాట్యబృందాన్ని స్థాపించారు. దానికి సత్యం సహకారం అవసరమైంది. అంతాకలిసి 80 మంది ఆ బృందం. . రకరకాల నృత్యాలను రూపొందించి కార్యక్రమాలను తయారు చేశారు. ఆ బృందం చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి మెప్పులు పొందింది.

తర్వాత రాఘవయ్యగారు వాహినీ – సంస్థలో చేరడంతో ఆ బృందానికి స్వస్తి జరిగింది. ఐతే, అప్పుడే సత్యానికి కూడా డాన్సు మాస్టర్ ‘ ఉద్యోగం వచ్చింది. అది భక్తిమాల ‘ చిత్రానికి. ఆ చిత్రానికి వెంపటి సత్యం నాట్యాచార్యుడు. అంతవరకూ తెలుగు చిత్రాలకు నృత్యాలు రూపొందించే ‘మాస్టర్’ అంటూ ఎవరూ లేరు. తెలుగు చిత్రాలలో మొట్ట మొదటి నృత్యదర్శకుడు వెంపటి సత్యమే ! ‘భక్తిమాల’ చిత్రంలో ఆయన కొన్ని నృత్యాలు కంపోజ్’ చేశారు. తర్వాత వై. వి. రావుగారి ‘తాశీల్దార్ ‘ మొదలైన చిత్రాలకు కూడా పనిచేశారు. కూచిపూడి కళాకేంద్రం ‘ అనే నాట్య బృందాన్ని ఏర్పాటుచేసి, చిత్రాల్లో పని చేస్తూనే దేశంలో ప్రదర్శనలు ఇచ్చారు ! తర్వాత చిత్రాల ఒత్తిడిలో ఆ ప్రదర్శనలు ఇవ్వడం జరగలేదు!

నిరుత్సాహాలనూ, ఇబ్బందులనూ, ఆకలినీ, నిద్రనూ లేమినీ ఇలా ఎన్నింటినో ఎదుర్కొని నిలబడగలిగారు గనకనే వెంపటి సత్యనారాయణ గారు ఇవాళ చిత్రసీమ’లో ప్రముఖ నృత్యదర్శకులుగా వెలుగొందుతున్నారు.
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మున్నగు 300 చిత్రాలకు పైగా ఆయన ఇంతవరకూ నృత్యదర్శకునిగా పనిచేశారు. ఐదారు చిత్రాల్లో శివుడు ‘ వంటి పాత్రలు ధరించి, నృత్యం చేశారు. సత్యంగారి నృత్యాల్లో ఎక్కువ నృత్యాలు ప్రేక్షకాభిమానం పొందిన వే. ‘నర్తనశాల’ ‘సువర్ణ సుందరి’ ‘సీతారామకళ్యాణం’ ‘శ్రీకృష్ణపాండవీయం’ పాండవవనవాసం మున్నగు అనేక చిత్రాల్లోని నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జానపద రీతిలో ఆయన రూపొందించిన ‘రోజులు మారాయి’ లోని ‘ఏరువాక’ నృత్యం ఎలాంటి జనాదరణ పొందిందో రాయనవసరం లేదు. వహీదా రెహమాన్, యల్. విజయలక్ష్మి, రాజసులోచన, గీతాంజలి (ఆంధ్రాసిస్టర్స్) మొదలైనవారిని చలనచిత్రసీమకు పరిచయం చేసిన ఘనత సత్యంగారిదే. వారంతా ‘ డాన్సర్స్’గా పరిచయమైనారు. కూచిపూడి శాస్త్ర ప్రకారం సత్యం గారు విద్యనేర్పి వెంపటి చినసత్యం గారిని నాట్యాచార్యుని చేశారు. (చినసత్యంగారు మద్రాసులో కూచిపూడినృత్యాలను నేర్పే బడిని నడుపుతున్నారు. కొన్ని చిత్రాలకు కూడా పనిచేస్తున్నారు.)
“చలనచిత్రాల్లోని నృత్యాలన్నీ శాస్త్రీయ మైనవే కాజాలవు. రోజుల మార్పుతో అన్ని కళలలోనూ మార్పులు ఎలాగైతే వస్తున్నాయో, అలాగే నాట్యంలో కూడా మార్పులు వచ్చాయి. చిత్రాల్లోని సంగీతం శాస్త్రీయ మైనదా ? సంభాషణలు గాంధికమా ?_ అలాగే, నృత్యంలో కూడా కొన్ని కొత్త పుంతలు తొక్కవలసి వచ్చింది. సన్నివేశాన్ని బట్టి నృత్యానికి రూపకల్పన జరుగుతున్నది. శాస్త్రీయ నృత్యం అవసరమైన చోట అదే వాడుతున్నాము. ఏ క్లబ్ డాన్సో ఐతే, అక్కడ శాస్త్రీయనృత్యాన్ని ప్రవేశ పెట్ట లేము కదా ! అలాగే, రంభ ఊర్వసులు రాక్ ఆన్ రోలూ ‘ చెయ్యరు. పోతే, దేవలోకంలోని దేవకన్యలు చేసే నృత్యాలు కూడా పూర్తి శాస్త్రీయంగా వుండడం లేదన్న విషయం నేను అంగీకరిస్తాను. కాని – జన రంజకం కోసం, సంప్రదాయాన్ని విడిచి పెట్టకుండా కొత్తరకమైన భంగిమలను కలుపుకోవడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఈ రోజు ఆ నృత్యాలను చూస్తున్నది దేవలోకంలోని దేవతలు కాదుగదా ! పోతే చిత్రాల్లో చూస్తున్న నృత్యాల్లో ఎక్కడైనా అసభ్యత కనిపించడానికి కారణం మాత్రం పూర్తిగా నృత్యదర్శకుడు కానేకాడు. ప్రేక్షకుల కోసమని_దర్శకనిర్మాతల కోర్కెల ప్రకారమే ఆ నృత్యాలు రూపొందింపబడుతున్నాయి. అసభ్యత మోతాదు మీరితే ప్రేక్షకులే చూడరు !

“ఇటీవల వస్తున్న పాశ్చాత్య పద్దతి నృత్యాలు ఆట్టే కాలం నిలవవు. అవి మారిపోతూనే వుంటాయి. కలకాలం నిలబడేది సంప్రదాయ సిద్ధమైన నృత్యమే. త్యాగరాజ కృతులు, క్షేత్రయ్య పదాలు ఎన్ని సంవత్సరాలైనా నిలిచి వుంటాయి; మధ్యలో వచ్చే మామూలు ఫక్క పాటలు మధ్యలోనే సోతాయి. అలాగే నృత్యాలు కూడా. కలకాలం నిలబడి వుండేది శాస్త్రీయమే.”
“చలన చిత్ర నృత్య దర్శకునికి నృత్యం సంగీతజ్ఞానంతోపాటు, కెమెరా సెన్స్ వుండాలని నా అభిప్రాయం. దానివల్ల నృత్యం “స్లో “కాదు అందంగా కూడా వుంటుంది. నేను కవి హృదయాన్ని అర్ధం చేసుకుంటాను. ఆ సన్నివేశానికి కవి భావానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను.” అన్నారు సత్యం. విదేశ నృత్యాలను చూసి, ఆరీతులు కూడా ఆకళింపు చేసుకుని, అలవర్చుకున్నారాయన. సత్యంగారు ప్రస్తుతం “ఉమ్మడి కుటుంబం ” “కాంభోజరాజు కథ” “సుమతి” మున్నగు చిత్రాలకు నృత్య దర్శకునిగా పని చేస్తున్నారు.
(విజయచిత్ర సినీమా మాస పత్రిక 1967 మార్చి సంచిక నుండి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap