కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు ‘జీవనసాఫల్య పురస్కారం ‘

నవరసాల సినీ కళాక్షేత్రం హైదరాబాద్. ఎందరో నవరస నటనా సార్వభౌములు ఏలిన నగరమిది. దీన్ని భవిష్యత్తులో అతి పెద్ద ఫిలిం హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఒక సమావేశానికి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. 21-12-19, శనివారం రాత్రి హైదరాబాద్ హెచ్ఐసీసీలో టీవీ9 ఆధ్వర్యంలో నిర్వహించిన నవ నక్షత్ర సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను ఆయన జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. విశ్వనాథ్ తెలుగు సినీరంగంలో గొప్ప వ్యక్తి అని, ఆయన సినిమాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. డైరెక్టర్ త్రివిక్రమ్ వంటి వారు తెలుగు సినీరంగంలో ఉండటం గర్వకాణమని కూడా అన్నారు.  సినీ దర్శకులు నలుగురికి ఉపయోగపడేవిధంగా సినిమాలు తీయాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ప్రజా సేవలో ఎప్పుడూ బిజీగా ఉంటామని, ఇలాంటి ఆహ్లాదకరమైన కార్యక్రమంలో పాలుపంచు కోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వెలుగులోకి రానటువంటి గొప్ప వ్యక్తులను గుర్తించి వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమానికి టీవీ9 శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
సంచలనాలవైపు వెళ్ళకుండా సామాజిక కోణంలో మీడియా పనిచేయాలని ఆయన హితవు పలికారు. ఎర్రవెల్లిలో జరిగిన సంఘటన ఆధారంగా కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చి లక్షలమందికి చికిత్సలు చేయడమే కాకుండా కంటి అద్దాలు అందజేస్తే.. అలాంటి మంచి కార్యక్రమాలను కూడా మీడియా వక్రీకరించిందని సీఎం గుర్తుచేశారు. మీడియా మంచిని ప్రోత్సహించాలన్నారు. 17 ఏండ్లుగా టీవీ9 తెలుగువారి అభ్యున్నతికోసం కృషిచేస్తున్నదని అభినందించారు. ఆధ్యాత్మికత, మహిళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని, మంచిని మరింత ముందుకు తీసుకెళ్ళాలని సూచించారు.
సినీ హీరో విజయ్‌దేవరకొండ, హీరోయిన్ సమంతను ముఖ్యమంత్రి సన్మానించారు. తొమ్మిది క్యాటగిరీలకు సంబంధించిన అవార్డులు అందుకున్న పోలీస్‌అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్ల, సామాజిక సేవకులు మీరా సనాయి, డీఆర్డీవో చీఫ్ సతీశ్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వర్‌రావు, క్రీడాకారిణి పీవీ సింధు, మెదక్‌జిల్లా మూసాయిపేట రైలు ప్రమాదం నుంచి విద్యార్థులను కాపాడిన రుచితగౌడ్, పలువురు సినిమా నటులు, వారితోపాటు టీవీ9 యాజమాన్యం తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్‌రావును సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap