బెంగాల్ చిత్రసీమ ఉత్తమ ఐడల్… ఉత్తమ్ కుమార్

(ఉత్తమ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)

బెంగాలి బాబులకు అతడొక మహానాయకుడు. సినీ ప్రేమికులకు అతడొక మ్యాటినీ ఐడల్. సినీ నిర్మాతలకు అతడొక వసూల్ రాజా. సహనటులకు అతడొక మార్గదర్శి. ఇన్ని సుగుణాల కలబోత ప్రముఖ బెంగాలి, హిందీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్. అతడో విజ్ఞాన ఖని. మంచి నటుడు, నిర్మాత, స్క్రీ ప్లే రచయిత, దర్శకుడు, గాయకుడు, సంగీతదర్శకుడు…. అన్నిటికీ మించి ఓ మంచి మనిషి. ఓటమి అంచులనుంచి పైకెగసిన ఉత్తుంగ తరంగం. నటించిన సినిమాలన్నీ విజయవంతం చేసిన ఘనుడు. సుచిత్రాసేన్ తో అత్యధిక సినిమాల్లో హీరోగా నటించిన ‘నాయక్’. ఫిలిం జర్నలిస్టులకు ఇష్టుడైన కళాకారుడు. ఉత్తమ్ కుమార్ మరణించినప్పుడు ‘బెంగాలీ సినీ పరిశ్రమకు ఒక మార్గదర్శక వెలుగు మబ్బులో దూరి చీకటిమయం చేసింది’ అని ప్రఖ్యాత దర్శక నిర్మాత సత్యజిత్ రాయ్ చేత కీర్తింపబడిన మహామనీషి. సెప్టెంబర్ 3 న ఉత్తమ్ కుమార్ జయంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు…

తొలి ప్రస్థానం…

ఉత్తమ్ కుమార్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు అరుణ్ కుమార్ చట్టోపాధ్యాయ. 3 సెప్టెంబరు 1926 న కలకత్తాలోని ఆహిర్తోలా లో మాతామహుల ఇంటిలో ఉత్తమ్ జన్మించారు. తండ్రి సత్కారి చటర్జీ, తల్లి చపలా దేవి. వీరికి ముగ్గురు మగ సంతానం. వారిలో ఉత్తమ్ కుమార్ పెద్దవాడు కాగా, వరుణ్, తరుణ్ అతని తమ్ముళ్ళు. ప్రఖ్యాత నవలా రచయిత పులక్ బందోపాధ్యాయ ఉత్తమ్ కుమార్ కు పినతండ్రి. ఉత్తమ్ కుమార్ పూర్వీకులకు గిరీష్ ముఖర్జీ రోడ్డులో పెద్ద ఇల్లు వుండేది. దక్షిణ సబర్బన్ స్కూలులో ఉత్తమ్ కుమార్ హైస్కూలు విద్యను పూర్తిచేసి, కలకత్తా విశ్వవిద్యాలయ పరిధిలోని గోయెంకా కాలేజిలో చేరారు. అనివార్య కారణాలచేత డిగ్రీ పూర్తిచేయకుండానే కలకత్తా పోర్ట్ ట్రస్టులో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. ఉత్తమ్ కుమార్ పూర్వీకులకు ‘సుహిద్ సమాజ్’ అనే ఔత్సాహిక నాటక సమాజం వుండేది. తద్వారా బెంగాలి నాటకాలను కుర్ర కళాకారులచేత ప్రదర్శింప జేస్తూవుండేవారు. ఉత్తమ్ కుమార్ కూడా సమయం దొరికినప్పుడల్లా నాటకాల్లో పాల్గొనేవారు. చిన్న తమ్ముడు తరుణ్ అనేక బెంగాలి సినిమాల్లో నటించి మంచి పేరు గడించాడు. తీరిక వేళల్లో తరుణ్ రంగస్థల నాటకాలు కూడా ఆడేవారు. తరవాతి రోజుల్లో తరుణ్ తన అన్న ఉత్తమ్ కుమార్ నటించిన సినిమాలో కూడా నటించాడు. 1948 లో ఉత్తమ్ కుమార్ కు గౌరీ దేవితో పెళ్లయింది.

అవమానాలతో వెండితెరమీద…

1948లో నితిన్ బోస్ ‘దృష్టిదాన్’ అనే బెంగాలి సినిమా నిర్మించారు. అసిత్ బరన్, సునంద బెనర్జీ ముఖ్య తారాగణం గా నిర్మించిన ఈ సినిమా ద్వారా ఉత్తమ్ కుమార్ వెండితెరకు పరిచయమయ్యారు. అయితే అంతకుముందే ఉత్తమ్ కుమార్ నటించిన ‘మయదోర్’ సినిమా విడుదలకు నోచుకోలేదు. ‘దృష్టిదాన్’ సినిమా తరవాత ఉత్తమ్ కుమార్ నాలుగైదు సినిమాల్లో నటించినా, అవన్నీ పరాజయం పాలయ్యాయి. దాంతో ఉత్తమ్ కుమార్ ని ‘ఫ్లాప్ మాస్టర్ జనరల్’ అని సంబోధించడం మొదలైంది. అతడు స్టూడియోలో అడుగుపెడుతూవుంటే, వెనకనుంచి “అదుగో దుర్గాదాస్ వస్తున్నాడు”, “ఇడుగో కొత్త చబ్బి బిస్వాస్” అంటూ హేళన చేసేవారు. అవమాన భారంతో ఉత్తమ్ కుమార్ సినిమా ప్రపంచానికి దూరంగా వెళ్లి మరలా కలకత్తా పోర్టులో వుద్యోగం కొనసాగించాలనుకున్నారు. అయితే భార్య గౌరి ఉత్తమ్ కుమార్ కు ధైర్యాన్ని నూరిపోసింది. ఇదిలావుందగా ఎం.పి.స్టూడియోస్ వారు ఉత్తమ్ కుమార్ తో మూడు సంవత్సరాల కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. 1952లో వారు నిర్మల్ డే దర్శకత్వంలో ‘బసు పోరిబర్’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో ఉత్తమ్ కుమార్ హీరో కాగా, సావిత్రి చటర్జీ హీరోయిన్ గా నటించింది. సుప్రియాదేవి ఈ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. కమర్షియల్ గా విజయవంతమైన ఉత్తమ్ కుమార్ తొలిచిత్రం ఇదే. తరవాత ఇదే చిత్రాన్ని రామ్ ముఖర్జీ హిందీలో ‘’హమ్ హిందుస్తాని’ (1960) పేరుతో పునర్నిర్మించారు.

దశ తిప్పిన ‘అగ్నిపరీక్ష…

1954 లో ఎం.పి. ప్రొడక్షన్స్ వారే నిర్మించిన ‘అగ్నిపరీక్ష’ సినిమా ఉత్తమ్ కుమార్ ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తివేసింది. ఆశాపూర్ణాదేవి నవల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు అగ్రదూత్ దర్శకత్వం వహించగా సుచిత్రాసేన్ తొలిసారి ఉత్తమ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. ‘అగ్నిపరీక్ష’ సినిమా ఏకధాటిగా 65 వారాలు ఆడి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తదనంతరకాలంలో అన్నపూర్ణా పిక్చర్స్ వారు తెలుగులో ‘మాంగల్యబలం’, తమిళంలో ‘మంజల్ మహిమై’(1959) చిత్రాలను ఆశాపూర్ణాదేవి నవలనే ఆధారం చేసుకొని సమాంతరంగా నిర్మించి విజయం సాధించారు. 1967లో ఉత్తమ కుమారే స్వంతంగా ఈ చిత్రాన్ని ‘ఛోటి సి ములాఖత్’ పేరుతో హిందీలో పునర్నిర్మించారు. 1955లో అగ్రదూత్ దర్శకత్వంలో మరొక సినిమా రూపు దిద్దుకుంది. ‘సబర్ ఉపారే’ అనే ఈ చిత్రంలో కూడా ఉత్తమ్-సుచిత్ర లే జంటగా నటించారు. విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమాను ‘కాలా పాని’ పేరుతో హిందీలో పునర్నిర్మించారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన మరొక చిత్రం ‘సుర్జోతోరన్’. 1956 లో అగ్రగామి దర్శకత్వంలో ‘సాగరిక’ చిత్రం నిర్మించారు. అందులో ఉత్తమ కుమార్, సుచిత్రాసేన్ హీరో హీరోయిన్లు. ఈ సినిమా కూడా బెంగాలిలో సూపర్ హిట్టయింది. ఇదే సినిమాను జగపతి సంస్థ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తెలుగులో ‘ఆరాధన’ పేరుతో పునర్నిర్మించారు. తెలుగులో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ హిట్టయింది. దర్శక నిర్మాత అగ్రగామి 1956లో ‘శిల్పి’ అనే సినిమా నిర్మించారు. అందులో ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్ ముఖ్య తారలు. ఒక ధనిక అమ్మాయి మరొక బీద యువకుణ్ణి ప్రేమించడం ఈ సినిమా ఇతివృత్తం. 1957లో అజయ్ కర్ దర్శకత్వంలో ఉత్తమకుమార్ సొంతంగా ‘హరనో సుర్’ అనే బెంగాలి చిత్రాన్ని నిర్మించారు. అందులో ఉత్తమ్ కుమార్ సరసన సుచిత్రాసేన్ హీరోయిన్ గా నటించింది. విజయం నమోదు చేసిన ఈ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది.

Cinima Poster

యువత మెచ్చిన హీరోగా…

అంతకుముందు నిర్మించిన బెంగాలీ సినిమాల్లో నాటకీయత యెక్కువగా వుండగా ఉత్తమ కుమార్-సుచిత్రాసేన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో సహజత్వం ఉట్టిపడేలా నిర్మాణం జరిగింది. ఈ నూతన ట్రెండ్ ముఖ్యంగా యువతకు బాగా నచ్చడంతో ఉత్తమ్ కుమార్ సినిమాలను అభిమానించడం మొదలెట్టారు. ఉత్తమ్ కుమార్ ఎక్కువగా సుచిత్రాసేన్ తో కలిసి నటించినా, సుప్రియ చౌదరి, సావిత్రి చటర్జీ, మాధవి ముఖర్జీ, షర్మీలా టాగూర్, అంజనా బౌమిక్, అపర్ణా సేన్, తనూజా సామర్థ్, సుమిత్ర ముఖర్జీ వంటి హీరోయిన్లతో కూడా అనేక సినిమాల్లో నటించారు. యాభై దశకంలో ఎక్కువగా సంధ్యారాణితో, అరవయ్యో దశకంలో అరుంధతీ దేవి, మాలాసిన్హా లతో డెబ్భయ్యో దశకంలో తనూజ వంటి హీరోయిన్లతో ఉత్తమ్ కుమార్ నటించి మెప్పించారు. ఉత్తమ్ కుమార్ సరసన నటించడంతో వీరందరికీ స్టార్డం అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. 1966లో ఆర్.డి. బన్సాల్ ‘నాయక్’ సినిమా నిర్మించారు. ఉత్తమ కుమార్, షర్మీలా టాగూర్ నటించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రచించి దర్శకత్వం వహించింది సత్యజిత్ రాయ్. ఒక మ్యాటినీ ఐడల్ జాతీయ బహుమతి అందుకునేందుకు కలకత్తా నుండి డిల్లీ కి రైలులో ప్రయాణం చేస్తూ తనకు ఎదురైన అనుభవాలను ఒక యువ మహిళా జర్నలిస్టుకు తెలపడం ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ బహుమతి లభించింది. అది కాకుండా ఉత్తమ నాన్-యూరోపియన్ ఫిలిం బహుమతి, బెర్లిన్ అంతర్జాతీయ ప్రత్యేక బహుమతి లభించాయి. బెంగాల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉత్తమ కుమార్, సత్యజిత్ రాయ్ లకు స్పెషల్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ చిత్రాన్ని ఫిలిం ఆర్కైవ్ లో భద్రపరచారు. అలా ఉత్తమ్ కుమార్ బెంగాల్ చిత్రసీమను మూడు దశాబ్దాలు ఏకచత్రాధిపత్యంగా యేలారు. ఉత్తమ్ కుమార్ కు క్యారక్టర్ రోల్స్ చేయడమంటే చాలా ఇష్టం. ‘మాయామృగ’, ‘తానా తేకే ఆశ్చి’, ‘బిచారక్’, ‘మరుతీర్థ హింగ్లజ్’ సినిమాలు వీటికి దృష్టాంతాలు. ‘కుహాక్’ అనే బెంగాలి సినిమాలో ఉత్తమ్ కుమార్ హత్యలకు పాల్పడే దొంగగా నటించారు. ‘మరుతీర్థ హింగ్లజ్’ సినిమాలో మానసిక వైకల్యం కలిగిన యువకుని పాత్ర పోషించారు. ‘శేష్ అంక’ అనే చిత్రంలో పరపురుషునితో లైంగిక సంబంధాలను పెట్టుకున్న భార్యను హతమార్చిన వ్యాపారస్తునిగా నటించారు. ‘అపరిచిత’ అనే చిత్రంలో ఉత్తమ్ కుమార్ విలన్ పాత్రను ‘పోషించారు. ఇటువంటి పాత్రలు పోషించేందుకు సూపర్ స్టార్ హోదా వున్న యే నటుడూ అంగీకరించడు. కానీ ఉత్తమ్ కుమార్ దారే వేరు. అందుకే అతణ్ణి బెంగాలి బాబులు ‘మ్యాటినీ ఐడల్’గా కీర్తిస్తారు. ‘చిడియాఖానా’ అనే మరొక సత్యజిత్ రాయ్ సినిమాలో కూడా ఉత్తమ్ కుమార్ నటించడం విశేషం.

హిందీ చిత్రసీమలో…
ఉత్తమ్ కుమార్ బెంగాలీ నటుడైనా పదిహేను హిందీ సినిమాల్లో కూడా నటించి తన ఉనికిని బాలీవుడ్ లో చాటారు. ‘చోటి సి ములాఖత్’ సినిమా వాటిల్లో ఒకటి. ఈ సినిమా ఉత్తమ్ కుమార్ నిర్మించిన సొంత సినిమా కావడం విశేషం. గతంలో ఉత్తమ్ కుమార్ నటించిన ‘అగ్నిపరీక్ష’ చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. ఇందులో వైజయంతిమాల హీరోయిన్ కాగా, ఇతర పాత్రల్లో రాజేంద్రనాథ్, శశికళ, తరుణ్ బోస్, వీణ నటించారు. శంకర్ జైకిషన్ సమకూర్చిన సంగీతం తోడై ఈ చిత్రం విజయవనతమైంది. 1975లో దర్శక నిర్మాత శక్తి సామంత్ ‘అమానుష్’ అనే చిత్రాన్ని హిందీ, బెంగాలి భాషల్లో యేకకాలంలో నిర్మించారు. అందులో ఉత్తమ్ కుమార్, షర్మీలా టాగూర్ జంటగా నటించారు. శ్యామల్ మిత్రా సంగీతం సమకూర్చారు. రెండు వర్షన్లూ హిట్టయ్యాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఎదురీత’ పేరుతో రీ-మేక్ చేశారు. ఈ చిత్రానికి రెండు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ఏడు విభాగాల్లో నామినేషన్లు కూడా నమోదయ్యాయి. 1977లో శక్తి సామంత ఉత్తమ్ కుమార్ హీరోగా, షర్మీలా టాగూర్ హీరోయిన్ గా ‘ఆనంద్ ఆశ్రమ్’ పేరుతో మరొక సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి కూడా శ్యామల్ మిత్రా సంగీతం సమకూర్చారు. బెంగాలి నవలా రచయిత శైలజానంద ముక్కోపాధ్యాయ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మాణం జరిగింది. హిందీ వర్షన్ కు సమాంతరంగా బెంగాలీ వర్షన్ కూడా నిర్మించారు. సినిమా విజయవంతమైంది. ఉత్తమ్ కుమార్ నటించిన మరొక హిందీ సినిమా ‘దూరియా’. ఇందులో కూడా షర్మీలా టాగూర్ ఉత్తమ్ కుమార్ కు జంటగా నటించింది. భీమసేన్ ఖురానా దర్శకత్వం వహించగా జయదేవ్ సంగీతం సమకూర్చారు. తరవాత సులక్షణా పండిట్ తో ‘బందీ’ సినిమాలో, విద్యాసిన్హా తో ‘కితాబ్’ సినిమాలో ఉత్తమ్ కుమార్ నటించారు. రాజకపూర్ నిర్మించిన మాగ్నమ్ ఓపస్ ‘సంగమ్’ చిత్రంలో రాజేంద్రకుమార్ నటించిన పాత్రను ముందు ఉత్తమ్ కుమార్ కు ఇవ్వజూపారు. కానీ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంచేత ఆ పాత్రను పోషించలేక పోయారు. సత్యజిత్ రాయ్ నిర్మించిన ‘నాయక్’ సినిమాకి ఉత్తమ్ కుమార్ జీవితంతో చాలా పోలికలు వున్నాయని సినీ పండితుల ఉవాచ. తపన్ సిన్హా దర్శకత్వంలో ‘జిందా భోంది’ అనే సినిమాలో సహనటుడు సౌమిత్ర చటర్జీతో కలిసి ఉత్తమ్ కుమార్ నటించారు.

ఇతరవిశేషాలు…

1967 లో భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు (భరత్), ఉత్తమ నటి (ఊర్వశి) బహుమతులు ప్రవేశపెట్టినప్పుడు మొదటి బహుమతి అందుకుంది ఉత్తమ్ కుమార్ కావడం విశేషం. ‘ఆంథోనీ ఫిరంగి’, ‘చిడియాఖానా’ సినిమాలలో నటనకు ఉత్తమ్ కుమార్ ఆ బహుమతి అందుకున్నారు. కేవలం నటుడుగానే కాకుండా ఉత్తమ్ కుమార్ నిర్మాతగా, గాయకుడుగా, సంగీత దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. నిర్మాతగా ‘హరనో సుర్’, ‘సప్తపది’, ‘భ్రాంతివిలాస్’, ‘జోతుగ్రుహ’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించారు. హిందీలో ‘ఛోటి సి ములాఖత్’ సినిమాకు అతడే నిర్మాత. ఈ సినిమాకు ఉత్తమ్ కుమార్ చాలా ఖర్చు పెట్టారు. సినిమా విజయవంతమైనప్పటికీ, గొప్పగా ఆడలేదు. గొప్పగా ఆశించిన చిత్రం నిరాశ పరచడంతో ఉత్తమ్ కుమార్ కు గుండెపోటు రావడానికి ఇదొక కారణమైందని చెబుతుంటారు. ‘సుదూ ఏక్తి బొచ్చోర్’, ‘బోన్ పలశిర్ పడబోలి’ సినిమాలకు ఉత్తమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘కాల్ తుమి అలేయా’ అనే సినిమాకు సంగీత దర్శకత్వం నిర్వహించారు. 1980లో ‘అమర్’ పేరుతో ఉత్తమ్ కుమార్ తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఆత్మకథ లిఖిత ప్రతిని జాతీయ గ్రంధాలయంలో భద్రపరచారు. రవీంద్ర సంగీతం లో ఉత్తమ్ కుమార్ పాడిన కొన్ని పాటలకు రికార్డుల రూపంలో విడుదల చేశారు. ఉత్తమ్ కుమార్ నటించిన కాలాన్ని బెంగాల్ చలనచిత్ర స్వర్ణయుగంగా సినీ పండితులు గుర్తించారు. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెండువందల పైచిలుకు చిత్రాల్లో నటించారు. 1955, 61, 63, 68 సంవత్సరాల్లో ఉత్తమ్ కుమార్ జాతీయ బహుమతులు అందుకున్నారు. ఆరుసార్లు బెంగాల్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి బహుమతులు అందుకున్నారు. మూడు సార్లు ఫిలింఫేర్ బహుమతులు ఉత్తమ్ కుమార్ కు లభించాయి. 1980లో ‘ఒగో బోదు సుందోరి’ సినిమా షూటింగులో పాల్గొన్నప్పుడు గుండెపోటు వచ్చింది. వెంటనే కలకత్తా బెల్లెవ్యూ క్లినిక్ లో చేర్చారు. చికిత్స అందుతుండగా 24 జూలై 1980 న ఉత్తమ్ కుమార్ ప్రాణం విడిచారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ వయసు 54 యేళ్ళే. ఉత్తమ్ కుమార్ మరణానంతరం కలకత్తాలోని ఒక సినిమా థియేటర్ కు ‘ఉత్తమ్ మంచ’ అనే పేరు పెట్టారు. టాలీ గంజ్ కూడలిలో ఉత్తమ్ కుమార్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. టాలీ గంజ్ మెట్రో రైల్వే స్టేషన్ కు ‘మహానాయక్ ఉత్తమ్ కుమార్ స్టేషన్’ అనే పేరు పెట్టారు. 2009 లో భారత తంతి తపాలా శాఖ ఉత్తమ్ కుమార్ స్మారక స్టాంప్ ను విడుదల చేసింది. 2015 లో భారత ప్రభుతం ఉత్తమ్ కుమార్ పేరుతో ఒక జాతీయ అవార్డును నెలకొల్పింది.

-ఆచారంషణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap