డిశంబర్ 30 న వడ్డాది పాపయ్య వర్థంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం….
తెలుగు చిత్రకళారంగంలో అందాల హరివిల్లులా వెల్లివిరిసి, మెరుపులా కనుమరుగైన కళాబ్రహ్మ శ్రీ వడ్డాది పాపయ్య. ఆయన చిత్రాలు చూడని, పేరు వినని కళాభిమాని లేడంటే అతిశయోక్తికాదు. ఆయన చిత్రాలెన్నో కళాభిమానుల ఇళ్లల్లో ఫ్రేములో భద్రపరచబడి వున్నాయి.
ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్ప వాడో, వ్యక్తిగా అంత నిరాడంబరుడు. సాదా సీదా తెల్ల పంచె అదే రంగు లాల్చీ ధరించి, సిసలైన తెలుగు వ్యక్తిలా వుండే వారు. నిశీధిని సైతం నిశితంగా, సునిశితంగా పరిశీలించే ఆ కళ్ళే ఆయన ప్రత్యే కత! ఆ స్వప్న చక్షువులతో వీక్షించిన ఎన్నో సుందర దృశ్యాలు కళాభిమానుల్ని ఆకట్టుకొన్నాయి! మనోనేత్రానికి ప్రతీకలుగా నిల్పాయి.
ఆయన మరణంతో కళాప్రపంచంలో చీకట్లు కమ్మాయి. కళామతల్లి కంట నీరు ఒలికించింది. రంగులు వన్నె’ తగ్గాయి. సృజనాత్మకత చిన్నబోయింది. కల్పన కలగా మారింది.
జీవిత విశేషాలు : పవిత్ర నాగావళీ తీరాన వున్న శ్రీకాకుళంలో 1921లో ఓ మధ్యతరగతి కుటుంబంలో ‘వపా’ పుట్టారు. తండ్రి శ్రీరామమూర్తి స్థానిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ తీరిక సమయాల్లో తెలుపు-నలుపు రంగుల్లో చిత్రాలు గీస్తూ వుండేవారు. చిన్న తనం నుండి చిత్రలేఖనంపట్ల ప్రత్యేక అభిరుచి కలిగిన ‘వపా’ తండ్రివద్దనే ఈ కళలో మెలకువలు నేర్చుకున్నారు.
ఐదవ ఏట తొలిసారిగా హనుమంతుని చిత్రం గీశారు. ప్రముఖ పౌరాణిక చిత్రకారుడు రాజా రవివర్మను గురుతుల్యునిగానూ, ప్రముఖ ఆంధ్రచిత్రకారుడు దామెర్ల రామారావును గురువుగానూ భావించి చిత్రకళలో ముందడుగు వేశారు. మహారాష్ట్రకు చెందిన ‘దురంధర్ చిత్రాలు కూడా వీరిలో ప్రేరణ కల్గించాయి. అప్పట్లో వీరు భారతిలో గీచిన ‘నాగేశ్వరుడు’, ఆంధ్రజ్యోతిలో వేసిన ‘రతీమన్మథ’ చిత్రాలు సంచలనం సృష్టించాయి. మంజూష, రేరాణి, అభిసారిక, అవినీతి, నవ్వులు పువ్వులు పత్రికల్లో వీరి చిత్రాలు చూసిన స్వర్గీయ చక్రపాణి చందమామ చిత్రకారునిగా మద్రాసు ఆహ్వానించారు.
పాతికేళ్ళు మద్రాసులో వుండి, పిమ్మట జీవితచరమాంకం వరకు విశాఖజిల్లా కశింకోట లోనే వున్నారు.
ఆయనకి నూకరాజమ్మ, లక్ష్మీమంగమ్మ అనే ఇద్దరు భార్యలు, రవిరాం, వసంతరాం, పావనరాం అనే కుమారులు, అనూరాధ అనే కుమార్తె వున్నారు.
శ్రీరాముడంటే వీరికి ప్రత్యేక అభిమానం. రవివర్మ చిత్రించిన శ్రీరామ పట్టాభిషేకం చిత్రం ఫ్రేము కట్టించి తన గదిలో పెట్టుకున్నారు. తీరిక సమయంలో అంతర్గతంగా శ్రీరామనామస్మరణ చేస్తూండేవారు.
చిత్రాల్ని గురించి: గడచిన అర్ధశతాబ్ది కాలంలో వ.పా. వేలాది ముఖచిత్రాలు గీశారు. తొలుత ఆయన జానపద రీతుల్లో చిత్రాలు ప్రారంభించినా సంప్రదాయ, వాస్తవిక, ఆధునిక విధానాల్తో పాటు తనదైన బాణిలో చిత్ర రచన కొనసాగించారు.
తెలుగు సంస్కృతి, తెలుగుదనం ఆయన ప్రతిబింబించినా ఉత్తరాంధ్రసం స్కృతి ఆచార వ్యవహారాలు ‘ప్రత్యేకం’గా చూపించేవారు. వీరు గీసిన రేఖా, ఏకపర్ణ, బహువర్ణ చిత్రాలన్నీ నీటి రంగులవే! నూనె రంగులకన్నా నీటి రంగుల్లో అను కున్న”ఎఫెక్టు”సాధించవచ్చునని, చిత్రం కూడా ఏకకాలంతో సత్వరం పూర్తిచేయ వచ్చుననేవారు.
కరుణ శ్రీ కవితకి, ఉమఖయ్యాం కావ్యానికి, ఋతువులకి, సంవత్సరాలకి ఆయన వేసిన చిత్రాలు అనితరసాధ్యం . వివిధ కావ్యనాయకల్ని సాంప్రదాయ బద్దంగా చిత్రించిన అపర వర్ణబ్రహ్మ ఆయన. పల్లెసుందరి నుండి పౌరాణిక వరకు ఆయన కుంచెతో జీవం పోసుకొన్న చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో!
రంగుల్ని శాసించే శక్తి, యుక్తి, పట్టు, ఓర్పు, నేర్పు ఆయన సొంతం. రంగులకు ‘కాంతి’ పెంచిన రారాజు వపా. ఆయన చిత్రాలలోని పడతుల సౌందర్యం- అందగత్తెలు తలదించుకొనేలా, ఈర్ష్యపడేలా వుంటుంది! తన ఊహాసుందరులకి ఆయన చేసే అలంకరణ, ముస్తాబు, వస్త్రధారణ నభూతో నభవిష్యతి’. వీరి చిత్రాల్లోని రూపాలన్నీ బలిష్టంగా, ఆకర్షణీయంగా వుంటాయి.
ప్రశాంత నిశీధి సమయాల్లో ఆయన చిత్రరచన చేసేవారు. అనుకరణ లేని, అనుసరించ వీలులేని, అనితర సాధ్యం కాని రీతిలో ఆయన చిత్రసృష్టి చేశారు.
“ఫోటోగ్రఫీకి, రియలిజానికి అందని వస్తువుగా చూపించడమే నా అభిమాన చిత్రణ, రంగుల్లో ఏమీలేదు, రంగుల గురించి పట్టించుకోను, రంగులే అయితే ఇప్పటి ‘కలర్ ఫోటోగ్రఫీ’ అన్నిటికంటే గొప్పద”ని ఆయన అభిప్రాయం.
‘వపా’ ఎప్పుడూ ఏ చిత్రకళాపోటీల్లో నూ పాల్గొనలేదు. ఖర్గపూర్, ఝారగూడా ల్లో వీరి చిత్రకళా ప్రదర్శనలు జరిగాయి.
చిత్రాలు గీయడంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. తన ఇంటి గోడపై పరిసర ప్రాంతాల్లో దొరికే మట్టి, సున్నం, బొగ్గు వాడి అతితక్కువ వ్యయంతో కుడ్య చిత్రాలు గీశారు. చిత్రాలు గీసే పేపర్ని నలిపి వుండచేసి, విడదీసి, నలిగిన పేపరుపై బొగ్గుతో ఎన్నో చిత్రాలు గీశారు. కొండ అద్దమందు కొంచెమై వున్నట్టు ఆయన చిత్రాల్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది!
రచయితగా ‘వపా’ చిత్రకారుడే కాదు, రచయిత కూడా అని చాలామందికి తెలియదు. తన చిత్రాలకు పెట్టే ‘క్యాప్షన్సే’ ఆయన రచనా ప్రతిభకు తార్కాణం! పోతన,శ్రీశ్రీ, దేవులపల్లి సాహిత్యమంటే చెవి కోసుకొంటారు. జంబూలోక చరిత్ర, త్రికళ, జావళి, ఆషాఢమణీయం కథలు అద్భుత దృశ్యకావ్యాలుగా మలిచారు.
సంగీతంపట్ల కూడా ఆయనకు ప్రత్యేక అభిమానం వుంది.
రాగాలతో రోగాలు నయమవుతాయని నమ్మే ‘వపా’ శివరంజని, హిందోళ, కన్నడ, శహన, జయజయవంతి, అహిర భైరవి రాగాలకు భావయుక్తమైన చిత్రాలు గీశారు.
పత్రికలు వ్యక్తులకు కాక ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయం. టీ.వీ. యూనిట్ ‘కశింకోట’ వచ్చి ఇంటర్వ్యూ చేయబోతే నిరాకరించిన నిరాడంబరజీవి ఆయన. అస్వస్థతగా వున్నప్పుడు వైద్యం చేయించబోగా, వద్దని వారించి తన మరణం బయట ప్రపంచానికి తెలియనీయవద్దని కోరిన ఆదర్శవాది. మానవతకు సాంకేతమైన రెండు కళ్ళు, ముక్కు ‘వపాకి మరో పేరు, మారు పేరు!!
ఉపసంహారం: తన మరణం ముందుగా ఊహించి, అంతిమ చిత్రం తన అనంతరం వెయ్యడం కోసం కాకుండా, ఉన్నప్పుడే చూసు కొనేందుకు ‘చరమ చిత్రం’ చిత్రించుకొన్న మహాచిత్రకారుడు ‘వపా. అది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది.
ప్రముఖ చిత్రకళావిమర్శకులు డా. సంజీవదేవ్ శ్రీ వ.పా.ని గురించి వ్రాస్తూ “ఆంధ్రప్రదేశ్ లో వ.పా. చిత్రాలను గురించి తెలియనివారుండరు. తెలియనివారుంటే అది వారి లోపమేకానీ, వడ్డాది వారి లోపం కాదు! మన దేశపు కళాకారులను గురించి మనం తెలుసుకోకపోవడం మన లోపమే!” అన్నారు.
“సందేహం లేదు. ఆధునిక నైరూప్య కళాసృష్టిలో పడి కొట్టుకుపోతున్న ఈ యుగంలో వడ్డాదివారి చిత్రాల్లాంటివి మన్నన పొందడం కొంత కష్టమైన పని. అయినా, దేశం వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతో వున్నది. వడ్డాది వారు ప్రత్యేకంగా ఆభ్యాయిక చిత్రకారులు. వడ్డాదివారు ప్రధానంగా నిపుణవర్ణకారులు. వానికి తోడు బలీయ రూపకారులు కూడా! నేటి కళాజగత్తులో ఏ ఒక్కటి మాత్రమే ఉత్తమ కళాసృష్టి కాదు. అటు వంటి ఉత్తమ కళాసృష్టులలో వడ్డాది వారిది కూడా ఒకటి” అని సంజీవదేవ్ అభిప్రాయపడ్డారు.
లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే వడ్డాది పాపయ్య 1992, డిసెంబర్ 30 న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయాడు.
-సుంకర చలపతిరావు