పొలమారిన జ్ఞాపకాలతో వంశీగారు తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కథల్లోని పాత్రలను తమ వాక్యాల్లోనే కాక నిజజీవితంలోని ఫోటోలతో సహా కలిపి అందిస్తూ ఇవి కథలా, నిజమైన సంఘటనలా అనే సందిగ్ధంలో పెట్టి పాఠకులకు ఒక సరికొత్త లోకాన్ని దృశ్యమానం చేస్తున్నారు.
ఈ తరహా కథలు ఇంతవరకూ తెలుగుసాహిత్యంలో వచ్చిన దాఖలాలు లేవు. వంశీగారికివన్నీ పొలమారిన జ్ఞాపకాలేమో కానీ, చదువుతున్న మనందరికీ వెంటాడే జ్ఞాపకాలు, వేటాడే జ్ఞాపకాలు.
సహజంగా ఎవరి జ్ఞాపకాలైనా వాళ్ళ అనుభవాల్లోంచి వచ్చినవి కాబట్టి, వారికి సున్నితంగా ఉండవచ్చు, బయటివారికవి అంతగా నచ్చాలని లేదు.
కానీ మన వంశీగారి జ్ఞాపకాలు మాత్రం మనందరి జ్ఞాపకాలవుతున్నాయి. ఆయనతో కలిసి మనమంతా మద్రాసు వీధుల్లో తిరుగుతున్నాం.
గోదావరి తీరంలో విహరిస్తున్నాం, పోలవరం గెస్ట్ హౌస్లో నివసిస్తున్నాం, ఆయన మద్రాసులో మొదటి సారి అద్దెకున్న ఇంటి ఆవరణలోని వేపచెట్టు వద్ద నిల్చుంటున్నాం. తమ ఆనుభూతులను మన అనుభూతులుగా తర్జుమా చెయ్యగల రచయితలు చాలా అరుదుగా కనిపిస్తారు.
వాళ్ళలో వంశీగారు ప్రథమ పంక్తిలో నిలుస్తారు. అందుకే ఒక్కో పొలమారినజ్ఞాపకం చదవడం పూర్తవగానే అందులోని పాత్రలూ, సన్నివేశాలూ, పరిసరాలు మనల్ని అంతత్వరగా వదలవు. ట్రాన్స్లోంచి బయటకు రాబుద్ధి కాదు. పేరు మాళ్ళపురం రవణమ్మను చూడాలనిపిస్తుంది, గంటి లోవకుమారితో ఒక్కసారి మాట్లాడాలనిపిస్తుంది, నీల మయిఎక్కడన్నా ఎదురైతే బావుండుననిపిస్తుంది.
వంశీగారి మొట్టమొదటి నవల ‘మంచుపల్లకీ’లో ఆయన రాసిన మొదటి వాక్యం “ఊహ కమ్మగా ఉంటుంది, వాస్తవం కటువుగా ఉంటుంది… నిజం” కటువైన వాస్తవాలను కమ్మటి ఊహలుగా మార్చి, మనసుల్ని సున్నితంగా తాకి, కరుణరసప్లావితం చేస్తున్నాయి.
రచయిత దృష్టిలో చూస్తే ఇలాంటి ప్రక్రియలో ఎపిసోడ్స్ రాయడం అంత సులభంకాదు, దశాబ్దాలనాటి సంఘటనలను అతీసూక్ష్మంగా గుర్తుచేసుకో వాలి, ఏ చిన్న అంశాన్నీ వదల కూడదు, అవసరమైనప్పుడు ఆయా సమాచారాన్ని సేకరించాలి అంటే ఎంతోమందితో మాట్లాడాలి, ఫోటోలను సేకరించాలి, ఇవన్నీ అయ్యాక వాటికి కథారూపం ఇవ్వాలి…
ఈ కసరత్తు అంతా జరిగాక పాఠకులను చేయి పట్టుకుని తనతో నడిపించే శైలి ఎలానూ వంశీగారికి వెన్నతో పెట్టిన విద్య.
వారానికో జ్ఞాపకాన్ని అందించి, ఏళ్ళతరబడి గుర్తుంచుకునేలా చేస్తున్న వంశీగారికి కృతజ్ఞతలు అనడం చాలా చిన్నమాట. వారి కలం నుంచీ ఈ జ్ఞాపకాల ధార ఆగకుండా ప్రవహించాలన్నదే మా ఆకాంక్ష!
సుమారు పదిహేను వారాలుగా స్వాతి వీక్లీలో వస్తున్న ఈ కథలకు చిత్రకారుడు సురేష్ కడలి బొమ్మలు మరింత వన్నె తెస్తున్నాయి.
Nice article
Kadali Suresh gari illustration highlight.