అంతరించిపోతున్న భాషలు…!

మనిషిని, జంతువు నుంచి వేరు చేసే ఒక కీలక అంశం భాషను మాట్లాడగలగడం. ప్రతి మనిషీ తన సమాజ ఆధర్యంలో ఒక సొంత భాషను కలిగి ఉంటాడు. జంతువుకు అటువంటి భాష లేకపోవడమే మనిషి ప్రత్యేకతను తెలియజేస్తుంది. అందుకే, ‘మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ’ అనే సామెత పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడం, ఒంటబట్టించుకున్న జ్ఞానాన్ని, తన అనుభవాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని తరువాతి తరం వారికి అందించడానికీ ఉపకరించేది భాషే. ఆవిధంగా గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు వారధి కూడా భాషే. పరిణామ క్రమంలో కొత్తకొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ భాషను వృద్ధి చెందుతుంది.
‘సొంత’ భాషల ప్రత్యేకతా హెచ్చుతుంది, ప్రాధాన్యతా పెరుగుతుంది. ఒక సమాజం లేదా సమూహ అస్తిత్వానికీ అది ఆధారంగా ఉంటుంది. ఆ విధంగా భాషకు అపారమైన విలువ ఉంటుంది. కాబట్టే, భాష వినిమయ వస్తువుగా, డబ్బుకంటే ఎక్కువ విలువను సంతరించుకొన్నది. అయితే, దేశీయ భాషల వాడుక విధానంలో తలెత్తే క్లిష్టమైన పరిస్థితి వాటి వినియోగదారులను నేరుగా ప్రభావితం చేయడం వలన స్థానిక భాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. దానితో స్థానిక భాషలు భయంకరమైన రేటులో కనుమరుగవుతున్నాయి. అంతరించి పోతున్న ఈ భాషలలో చాలా మట్టుకు దేశీయ ప్రజలు ఉపయోగిస్తున్న స్థానిక భాషలే ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఐక్యరాజ్యసమితి 2019ని అంతర్జాతీయ దేశీయభాషల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రపంచం మొత్తమ్మీద 2019 చివరి నాటికి 2,680 భాషలు అంతరించిపోతున్న భాషల జాబితాలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి భాషా విభాగపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలు ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసలు పోతూండడం వల్ల వారు తమ భాషలకు దూరమవుతున్నారు. ఇలాంటి మరికొన్ని కారణాంశాల వల్ల స్థానిక భాషలు అదృశ్యమయ్యే స్థాయికి గానీ లేదా బలహీనపడే ప్రమాదకర స్థాయికి గానీ చేరుతున్నవని ప్రపంచ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్వదేశీ భాషలు సరైన స్థాయిలో మనుగడ కొనసాగించాలంటే, ప్రజా విధానాలలో అవసరమైన మార్పులు చోటు చేసుకోవాలి. దేశీయ భాషలకు ప్రచారం కల్పించాలి. భాషల మనుగడ అనేది భాషా వినియోగదారుల శ్రేయస్సు, రాజకీయ ప్రభావం, స్థానిక భాషలు మాట్లాడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
ఈ భాషా విధానాలు దేశీయ ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా శక్తిమంతం చేసే సామాజిక విధానాలతో పరిపూర్ణం చేయాలి. తద్వారా వారు తమ భాష, సంస్కృతిని వదులుకోకుండా, ఆర్థిక అవసరాల కోసం వలస పోకుండా జీవనోపాధిని సుస్థిరం చేసుకోగలుగుతారు. భారత్‌లాంటి దేశాల్లో రాజకీయ ప్రభావాల కారణంగా సామాజిక విధానాలు పరిపూర్ణం కాకుండా ఉండడం వల్ల ప్రజలు వలసలు పోతూ, స్వదేశీ భాషలు కనుమరుగు కావడానికి కారణమవుతున్నారు. స్వదేశీ భాషలు మాట్లాడే వారిపై విదేశీ భాషలపై ఆధారపడిన వారు వివక్షాపూరితంగా వ్యవహరించడం వల్ల కూడా స్థానిక భాషలు అంతరించిపోతున్నాయి.
తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లలకు స్వదేశీ భాషలను నేర్పించే విషయంలో శ్రద్ధ వహించకపోవడమే కాకుండా, పరాయి భాషపై మోజు పెంచే విధంగా వ్యవహరిస్తూ, స్వదేశీ భాషలను చిన్న చూపు చూస్తున్నారు. రాజకీయాలు, చట్టం, న్యాయం, సాంస్కృతిక పద్ధతులు, విద్య, ఉద్యోగాలు, సమాచార మార్పిడి, సామాజిక జీవితం, స్థిరమైన అభివృద్ధిలో విస్తృత భాగస్వామ్యం కల్పించకపోవడం వంటి పరిస్థితులూ దేశీయ భాషలు అంతరించిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. ఈ పరిస్థితులను గమనించి ప్రజలు, ప్రభుత్వాలు తగు విధంగా ప్రవర్తనలు, విధానాలు సరిదిద్దుకుంటేనే మాతృ భాషలను రక్షించుకోగలుగుతాం.

-పోలుమాటి రాంబాబు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap