శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓ కారణజన్ముడు. ఆయన చరిత్ర సృష్టించిన శకపురుషుడు. ఆయన చరిత్ర నిత్య చైతన్య ప్రదాయిని. ఆయన కృషి, నడత కాలాతీత స్ఫూర్తిదాయకాలు. అందుకే వారి గురించి అనేక గ్రంథాలు వెలువడినాయి. భవిష్యత్లోనూ మరెన్నో వస్తాయి….వస్తూనే వుంటాయి.
చారిత్రక పరిశోధక రచయిత, నటులు మన్నె శ్రీనివాసరావు రచించిన ‘వెండితెర వేలుపు నందమూరి తారక రామారావు’ పూర్వ గ్రంథాల కన్నా భిన్నమైంది. భవిష్యత్తులో మరెన్ని గ్రంథాలొచ్చినా ఈ గ్రంథం ప్రత్యేకత, విశిష్టతలు చెదరక నిలిచే వుంటాయి. దీనికి కారణము -ఈ రచన పూర్వ గ్రంథాల పరిశీలనకు పరిమితమైంది కాదు. మూలాలకు వెళ్ళి, క్షేత్ర సందర్శన చేసి, రామారావుగారి బంధుమిత్రగణాన్ని కలసి సమాచారాన్ని, ఛాయాచిత్రాలను, విలువైన దస్త్రాలను సేకరించి, వాటన్నింటిని క్రోడీకరించి సంపూర్ణముగా విశ్లేషించి సత్యనిర్ధారణచేసి గావించిన రచన. సందర్భానుసారం అందమైన ఫోటోలను ప్రచురించారు.
ఎన్టీఆర్ గారి అభియనశైలిని నాట్యశాస్త్ర ప్రమాణాలతో విశ్లేషించుతూ, చారిత్రక అంశాలతో తులనాత్మకముగా పోల్చుతూ రాసిన వైనం – దర్శకత్వశైలిని చాలా లోతుగా విశ్లేషించిన పద్ధతి – నిర్మాతగా బాధ్యతయుత ప్రస్థానాన్ని అక్షరీ కరించిన తీరు అపూర్వం. ఇవన్నీ ఈ గ్రంథానికి మాత్రమే సొంతమైన విశిష్ట, విలక్షణ అంశాలు. నందమూరివారు నటించిన చిత్రాలన్నింటినీ సంగ్రహంగా నిర్మోహంగా సమీక్షించిన తీరు ఈ గ్రంథానికి మరింత ప్రామాణికతను చేకూర్చింది.
నందమూరివారి జననీజనకుల వంశవృక్షాలు, దాయాదుల వంశవృక్షాలు, వారి ఛాయాచిత్రాలు, వారి బాల్యం -విద్యార్జన – నాటకసమాజ నిర్వహణ సమయాన సంఘటనలు, సేవాకార్యక్రమాల పూర్వాపరాలు తొలిసారిగా ఈ గ్రంథం ద్వారానే ప్రపంచానికి పరిచయం కానున్నాయి. శ్రీ తారక రామారావు గారి వ్యక్తిత్వ విరాట్ స్వరూపాన్ని అక్షర విశ్లేషణతో సాక్షాత్కరింపజేశారు. నందమూరివారి జీవితాన్ని, సినీచరిత్రను ఈ గ్రంథముద్వారా చాలా ప్రణాళికబద్ధంగా, శాస్త్రీయంగా తెలుగుజాతికి అందించి ఈ గ్రంథకర్త మహోపకారం చేశారు.
ఈ గ్రంథము నందమూరివారి వలనే తెలుగుజాతి వున్నంత కాలము నిలిచే వుంటుందనుటలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఇంతటి అపురూపమైన, అపూర్వమైన కృషి చేసిన శ్రీనివాసరావు విశ్వవిద్యాలయాల గౌరవడాక్టర్కి సంపూర్ణముగా అర్హులు. ఈ గ్రంథములోని కొన్ని అంశాలను పాఠ్యాంశంగా నిర్ణయించితే విద్యార్థులు తమ జీవితాల్ని ఆత్మవిశ్వాసముతో ఉత్తమముగా మలుచుకునేందుకు దోహదం కలుగుతుంది.
ఇంతటి ప్రయోజనకరమైన చారిత్రక గ్రంథాన్ని అందించిన మన్నె శ్రీనివాసరావుని మా చలన చిత్రపరిశ్రమ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గ్రంథము, తద్వార శ్రీనివాసరావు చరిత్రలో సదా నిలిచివుండాలని అశిస్తున్నాను. ప్రతీ ఎన్టీఆర్ అభిమాని చదవాల్సిన/ దాచుకోదగ్గ పుస్తకం ఇది.
–కాట్రగడ్డ ప్రసాద్
ప్రతులకు : మన్నె శ్రీనివాసరావు – 94402 41271 (Googlepay / PhonePe)
A4 సైజులో 490 పేజీలలో అందంగా ప్రచురించిన ఈ పుస్తకం వెల: రూ. 600/- (కొరియర్ చార్జీలతో కలిపి)