కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి
నాకే వీడ్కోలిస్తున్నప్పుడు
ఇన్నాళ్ళు
గుండె గదిలో వొదిగి ఒదిగి
కళ్ళకేదో మంచుతెర కప్పి
చూస్తూ చూస్తూనే గువ్వలా ఎగిరి పోయినట్టుంది…
తెలిసి తెలిసి
సైబీరియన్ పక్షిలా
వలసపోయినట్టుంది…
సందడిని, సంబరాన్ని మూటకట్టుకు పోయిందేమో
ఇంతలోనే మేము మనుషుల మధ్యే లేనట్టుంది
అనుభవానికొస్తే గాని
ఏ వేదనైనా, ఆవేదనైనా అర్థం కాకుండా వుంది”
అని

“వలస పోయిన మందహాసం”లో పెళ్ళయిన కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయినపుడు తండ్రి పడే వేదనను కవిత్వీకరించారు ప్రముఖ కవి ముకుంద రామారావు గారు.

ముకుంద రామారావుగారు పుట్టింది ఖరగ్ పూర్ లో అయినా తెలుగు నేర్చుకొని, చదువుకొని “వలస పోయిన మందహాసం” మొదలు… 12 కావ్యాలు రాశారు. ఆయన ఎంత గొప్ప కవో.. అంత గొప్ప అనువాదకుడు. అదేనేల, అదే గాలి, అదే నీరు, అదే ఆకాశం, అదే కాంతి అని పంచ భూతాల పేర్లతో అనువాద కావ్యాలు రచించారు. వివిధ భాషలలో ప్రఖ్యాతులైన కవుల కవితలను అనువదించారు. కావ్యాలతో పాటు కథలు రచించారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలి, కన్నడ, తమిళ, మళయాళం, మరాఠీ బాషల్లోకి వీరి కవితలు అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన వివిధ ఆంగ్ల కవితా సంకలనాల్లో వీరి కవితలు ప్రచురించబడ్డాయి. వివిధ గ్రంథాలలో వీరి గురించి పరిచయ వ్యాసాలు వచ్చాయి. నోబెల్ బహుమతి పొందిన కవుల కవితలను అనువదించారు. సూఫీ తత్వం నచ్చి ‘శతాబ్దాల సూఫీ’ కవిత్వం రాసారు.

సుదీర్ఘ కాలం కవిత్వంతో పాటు, అనువాద కవిత్వమూ రచిస్తున్న లబ్దప్రతిష్టులైన ముకుంద రామారావుగారిని గతంలో ఎన్నో పురస్కారాలు వరించాయి. వీటన్నింటినీ మించి జనవరి 7 వ తేదీన, విశాఖలో అజో-విభొ-కందాళం సంస్థ వారి “ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా యల్లపు ముకుంద రామారావు గారితో అభినందన పూర్వక పలకరింపు 64కళలు.కాం పాఠకులకోసం….
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

నమస్తే సార్! ఈ నూతన సంవత్సరంలో అజో-విభొ-కందాళం సంస్థ వారి “ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కారం అందుకోబోతున్న మీకు అనేక అభినందనలండి.

ధన్యవాదాలు తల్లి. పురస్కారం కన్నా కూడా, నన్ను ఇలా ఎవరో ఒకరు పట్టించుకునే వారు, అందులోనూ ప్రముఖులు ఉన్నారన్న ఆనందమే నాకు ఎక్కువగా ఉంది.

  1. ఒక విధంగా మీరు ప్రవాస జీవులే. ఎక్కడో పుట్టారు, ఎక్కడో ఉద్యోగాలు చేసారు. చివరకు తెలుగు రాష్ట్రంలో స్థిరపడ్డారు. కవిత్వం కన్ను తెరిచిన మీ ఊరు బాల్యం గురించి చెప్తారా?

అవును తల్లీ, నేను వలసజీవినే. ఆ మాటకొస్తే వలస జీవులు కాని వారెవరు? మా నాన్నగారు దక్షిణాఫ్రికాలో పుట్టారు, నేను పశ్చిమ బెంగాలులో. ఉద్యోగాలు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో చేసాను. అది కూడా వివిధ రకాలైన ఉద్యోగాలు – పాఠశాల-జూనియర్ కాలేజీలో బోధన, జౌళి పరిశ్రమ, రైల్వేలో సూక్ష్మతరంగ దూర ప్రసారం, కంప్యూటరీకరణ, భారతీయ రైల్వే రిజర్వేషన్ రూపకల్పనలో ప్రముఖ భూమిక, చివరకు బహుళజాతీయ కంప్యూటర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేసి పదవీవిరమణ. మొదటి సంతానం పుట్టిన వెంటనే చనిపోయాక, ఆరేళ్ల తరువాత నేను మా ఇంటిలో రెండవ వాడినే అయినా ఇంటిలో మొదటివాడిని. నా తరువాత మరో ఆరేళ్లకే మా తమ్ముడు. ఆ కారణంగా, అప్పట్లో అందరిలాంటి బాల్యం కాదు నాది, అనేక జాగ్రత్తల మధ్య, కట్టుదిట్టాల మధ్య పెరిగాను.

  1. మీతో మాటాడినప్పుడల్లా “నాకేమీ తెలీదు, నేను నేర్చుకుంటూన్నా అంటారు గదా! మీలాంటి నిగర్విని కన్న తల్లిదండ్రులెవరు?

మా నాన్నగారు యల్లయ్య నాయుడు. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఆరేళ్లకు మన దేశం వచ్చేసారు. వారి మేనమామల దగ్గర ఖరగపూర్‌లో పెరిగారు. తెలుగులో ఉత్తరాలు రాయగలిగే, దినపత్రికలు చదవగలిగే పాటి చదువు ఉండింది. మా అమ్మ ఎరుకులమ్మ కు అయిదేళ్లప్రాయంలో బాల్య వివాహం జరిగింది. అప్పటి నుండీ ఆమె జీవితమంతా ఖరగపూర్ లోనే గడిచింది. ఆమెకు చదువన్నది లేదు. భర్తంటే భయం. ఆ భయం మాకు కూడా సరఫరా చేసేది.

  1. మీ చదువుల వివరాలు చెప్పండి.

చెట్టుక్రింద బడిలో నాలుగవ తరగతి వరకూ, ఆ తరువాతే నాలుగు గోడల మధ్య చదువు. B.Sc వరకూ ఖరగపూర్ లోనే చదువుకున్నాను. అందులో ఒక్క ఏడాది మా మేనత్తలు ఉన్న అనకాపల్లిలో P.U.C చదివాను. అక్కడ ఎందుకో ఇమడలేక మళ్లీ ఖరగపూర్ వచ్చి డిగ్రీ లో చేరాను. M.Sc (Pure Mathematics) రెండేళ్లు సాగర్ విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్ లో చదివాను. అక్కడ అప్పట్లో మా బంధువులు చదువుకున్నారు, ఆ కారణంగా అక్కడ చేరాను. ఆ తరువాత I.I.T (Kharagpur) లో D.I.I.T (Applied Mathematics) చదివాను. హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరాక Hyderabad Central Univercity లో కంప్యూటర్స్ లో P.G.D.C.S చేసాను.

  1. మీ జీవితంలో ఒకరిమీద ఆధారపడకుండా మొదటిసారిగా సంపాదనా పరులైన ఆనాటి ఆనందానుభూతులను ఇప్పడు గుర్తుకు తెచ్చుకొంటే ఎలా ఉంటుంది? ఆ వివరాలు పంచుకొంటారా?

నా జీతం పూర్తిగా ఇచ్చేసే వాడిని అన్నదే జ్ఞాపకం తల్లీ.

  1. మీరు ప్రధానంగా కవి. “వలసపోయిన మందహాసం” దగ్గరనుంచి “రాత్రినదిలో ఒంటరిగా” వరకు ఎన్నో కావ్యాలను రచించారు. కథ, వ్యాసం మొదలిన విభిన్న ప్రక్రియలుండగా కవిత్వమే మిమ్మల్ని ఎక్కువగా ఎలా ఆకర్షించింది?

దాదాపు కవితగా బహుశా నా మొదటి కవిత “వలసపోయిన మందహాసం” అని భావిస్తాను, ఆ కవితకు వచ్చిన ప్రతిస్పందనే నన్ను కవిత్వానికి కట్టిపడేసింది.

  1. మీ మొదటి కవిత ఏది? దాని నేపథ్యం చెప్తారా?

కవితల్లాగ ఏవో కొన్ని రాసినా, నాకు ఎంతో దగ్గరైన మా మొదటి అమ్మాయి వివాహం తరువాత అత్తారింటికి పంపిన సందర్భంలో నాలో కలిగిన బావసంచలనాల్ని రాసిపెట్టుకొన్నది, ప్రఖ్యాత విమర్శకులు చేరా గారికి చూపించినపుడు, ఆయన అందులోని పదాలతోనే దానికి “వలసపోయిన మందహాసం” అని శీర్షిక పెట్టి, ప్రచురణకు ప్రోత్సహించి, అది ప్రచురించబడ్డాక నేను ఇలా కవితలు రాయొచ్చన్న విశ్వాసం వచ్చింది. అంచాత కూడా “వలసపోయిన మదహాసం” నా మొదటి కవితగా నాకు అనిపిస్తుంది.

  1. మీ కవితా సంపుటాలకు విశేష పాఠకులు ఉన్నారు. ఎన్నో ప్రతిస్ఠాత్మక అవార్డులు పొందారు. అలాంటి మీకు అనువాద కవిత్వం రాయాలని ఎందుకనిపించింది?

ఇతర భాషల్లో చదివిన కవిత్వం నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, ఆ రంగంలో అంతకుముందే కృషి చేసిన నా మిత్రుడు భూషణ్, అందుకు దోహదపడ్డ గ్రంథాలయాలు పుస్తకాలూ అందుకు దోహదపడ్డాయి.

  1. ఇటీవల ముకుంద రామారావు గారంటే “అదే ఆకాశం”, “అదే గాలి”, “అదే నేల”, “అదే కాంతి”, “అదే నీరు” కావ్యాలే గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ బృహత్సంపుటాలే. మీరు కొన్నివేల కవితలు అనువదించారు. వందల కవుల కావ్యాలు చదివారు. ఇలా అవిరామంగా రాయడంలో మీకు సహకారమిచ్చిన వారెవరు?

ఇంతకుముందే చెప్పినట్టు ఆయా భాషల్లో చదివిన అద్భుతమైన కవిత్వం, గ్రంథాలయాలు, నా కవిత్వ దాహాన్ని పెంచిన ఎన్నెన్నో గొప్ప గ్రంథాలు.

  1. ప్రపంచంలో ఎన్నో భాషలు, ఎందరో మహాకవులు ఉన్నారు. వాళ్లందరి కవిత్వం చదవడం చాలామందికి సాధ్యపడదు. మీలాంటి వాళ్ల వలన మాలాంటి వారి కవితా దాహం తీరుతుంది. నిజంగా అనువాదం చేయడం కష్టమా ? సొంతంగా రాయడం కష్టమా?

మన హృదయాన్ని అంతగా తాకి అంతగా నచ్చిన కవిత మనల్ని వదలదు. మనమూ వదలలేము. అదే అనువాదానికి మార్గం సుగమం చేస్తుంది. ఇష్టాఇష్టాలే దేనినైనా కష్టాన్ని కలిగిస్తాయేమో. అంతగా ఇష్ట పడినవి ఎవీ కష్టమనిపించవు. అనువాదమైనా సొంత కవిత్వమైనా? వాటికవే మనల్ని అందులోకి లాగుతూనే ఉంటాయి.

  1. మనం నిత్యం పారాయణం చేసే బారత భాగవతాలు ఒక విధంగా చెప్పాలంటే అనువాద గ్రంథాలే కదా? మీ అభిప్రాయం చెప్పగలరా?

అనువాద గ్రంథాలే అయినా, ఏ భాషలో ఎన్ని రకాలుగా ఉన్నా అందరినీ శతాబ్దాలుగా ఆ యా భాషల్లో వచ్చిన అపురూప గ్రంథాలుగా ఎన్నాళ్లయినా నిలబడగలగటం వాటి ప్రత్యేకత అనేకంటే, అద్భుతం అనడమే బాగుంటుంది.

  1. అనువాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలు గురించి చెప్తారా? మీరు అన్ని ప్రక్రియల్లో రచనలు చేసారు. మీ రచనల్లో మీకిష్టమైన పుస్తకం ఏమిటి?

మూల రచయిత పట్ల, ఆ రచన పట్ల గౌరవం ముఖ్యం. ఆ కవిత లేదా రచన మనలో ఇంకే వరకూ మనలో సహనం సంయమనం కూడా అంతే ముఖ్యం. ఆ తరువాత అడుగులు మనకు తెలియకుండానే అంత బాగా పడతాయి. ప్రతీ పుస్తకం ఒక ఎదుగుదల ఎవరికైనా. మీ పిల్లల్లో ఎవరు మీకు ఇష్టమంటే ఎలా చెప్పగలం?

  1. మీ రాబోయే రచనల వివరాలు చెప్తారా?

నేను ఎనభయి పడిలోకి పడ్డాను. ఉన్నవి పుస్తక రూపంలో వస్తే బాగుండును అన్న కోరిక అయితే బలంగా ఉంది. అంచాత కథలు, వ్యాసాలు, కవిత్వం, నాటకం, చిత్రలేఖన సంకలనాలు రావల్సి ఉన్నాయి. నా జీవితచరిత్ర కూడా మొదలుపెట్టాలి.

  1. అజో విభో పురస్కారం పొందుతున్న సందర్బంలో మీ అనుభూతులేమిటి?

ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన ఒక స్థితి. నన్ను కూడా ఇలా ఒకరు నా రచనల మూలంగా నన్ను గుర్తించారే అన్నది నన్ను మరింత ఆనందానికి గురిచేస్తోంది. అజో-విభో-కందాళం సంస్థ వారు ఇలా ప్రతీ ఏటా ఎవరో ఒకరికి ఇంత ఆశ్చర్యానందాల్ని కలిగించటం వారి ప్రత్యేకతగా కనిపిస్తోంది.

  1. మీ అనువాద రచనలు గూడా స్వీయ రచనల్లా సృజనాత్మక పరిమళాలతో ఉంటాయి. మూల భాషలోని సొగసులను అవలోలగా అనాయాసంగా అలవోకగా చెప్తారు. మీకిది ఎలా సాధ్యమండి?

    ముందే చెప్పినట్టు అనువాద రచన అయినా, నా స్వీయ రచనలా నన్ను వేదిస్తుంది. నన్ను తన వాడిని చేసుకుంటుంది. నేను అనువాదానికి లొంగిపోయాక ఆ అనువాదమే నాతో రాయించుకుంటుంది.
  2. ఇప్పుడు సాహిత్యం కూడా ఓ వ్యాపారమే. అనేక గ్రూపులున్నాయి. మీ అభిప్రాయం?

ఇది కేవలం వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారివి. మనకు మనం చేస్తున్న పని ముఖ్యం.

  1. వర్తమాన కవులకు మీరిచ్చే సందేశం?

మన భాష పట్ల మనకు గౌరవం గర్వం ఉండాలి. మన భాషలో వచ్చిన లేదా వస్తున్న సాహిత్యం పట్ల, ఆయా సాహిత్యకారుల పట్ల ప్రేమ ఉండాలి. తోటి సాహిత్యకారుల్లో ఒకరిపట్ల ఒకరికి గౌరవాభిమానాలు ఉండాలి. అందరి దగ్గరా అన్నింటి దగ్గరా ఎంతోకొంత నేర్చుకుందుకు అవకాశం ఉంటుంది. దానిని స్వీకరించగలగాలి. ఇతర భారతీయ భాషల్లో నేను గమనించినవి కూడా ఇవే.

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap