నడిచొచ్చిన దారంతా

“డా. పాతూరి అన్నపూర్ణ “గారు రచించిన “నడిచొచ్చిన దారంతా” చదివినప్పుడు ఆవిడ మన మనసుల్లోకి తొంగిచూసి వ్రాశారా అనిపించింది. మన హృదయంలోని చెమ్మని మనం తడిమి చూసుకుంటూ ఉంటాము ఒక్కో కవితా చదివినప్పుడు. ప్రధాన కవితలో ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టు పడుకుంటే ఎట్టా. లేవాలి… లేచి పరిగెత్తాలి అప్పుడే గమ్యం వీలవుతుంది అంటారు. నువ్వూ–నేను కవితలో ‘నిశ్శబ్దాన్ని బద్దలు చేద్దామని ఎంతగా ప్రయత్నించినా నీ అహంకారం అడ్డుగోడగా నిలిచింది’ అనే సత్యం చెపుతారు. ‘కన్నీళ్లు ఉపశమనం ఇస్తాయని తలగడ తడిసిన తర్వాత తెలిసింది’ ‘ఉరుములు, మెరుపులే తప్ప స్వాంతన పరచే సమీరాలే కరువైనాయి’ ఈ వాక్యాలు స్త్రీ ఆవేదన వ్యక్తం చేస్తాయి.

‘వీధి కుళాయి’ కవితలో ఆడవాళ్ళ ఓర్పు గురించి, అక్కడ ఇరుగు పొరుగు విషయాల సమాచారం తో పాటు ఏర్పడే భావ బంధాలు పరిచయం చేస్తారు. ‘కవిత్వమంటే’ ఏమిటో చెపుతూ కంటి నుండి జారే భాష్పాన్ని, హృదయం లోని వేదనని కవిత్వం స్పర్శిస్తుంది. ఎగిసిపడే భావావేశం, ఘర్షణ నుండి పుట్టే సముద్రం, అక్షరాలు చిలికే అమృతం అంటారు ఆమె. ‘కాఫీ సమయాలు’ మౌనం నదిలా మారినప్పుడు మళ్ళీ అలల సవ్వడి కోసం ఆ ఇద్దరితో పాటు కాఫీ కప్పులు ఎదురు చూస్తాయి, అంటూ స్త్రీ హృదయం ఆవిష్కరించారు. ‘నేను వాక్యమై’ రోడ్డు మీద పడ్డా ఆ మరకలు ఈ రోజు లేవు, పూలగౌను వేసుకున్న పదేళ్ళ పాపా లేదు కానీ కనిపించినంత మేరా వెతుకుతూనే ఉంటాను, అని రోడ్డు యాక్సిడెంట్స్ పై మనుషుల లోని యాంత్రిక స్వభావాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘దగ్గరవుతున్న దూరాలు’ కవితలో పల్లెలు పట్టణాలు అవుతూ, మనసు తడిని కోల్పోతున్న మనుషులు, అస్తిత్వ జ్ఞాపకాలను పారేసుకుంటున్నారు అంటూ తన బాధ వ్యక్తం చేశారు. రైతు ఎంత కష్ట జీవి యో, ఆశావాదో, త్యాగమూర్తి యో ‘అతనొక యోధుడు’ కవితలో చెపుతారు.

‘చెదపట్టిన మేధస్సు’ సెల్ఫోన్, పసితనం నుండే శరీరాన్ని, మెదడు ను ఎంత ఛిద్రం చేస్తుందో చెప్పి బాధపడతారు. పిల్లలు భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది ఒక అమ్మగా, స్త్రీగా, ఉపాధ్యాయుని గా అర్ధం చేసుకుని చెపుతున్నారు. ‘వీరజవాన్’ దేశం కోసం పోరాటం చేసే వీర జవాన్ల కృషి, త్యాగం ఎంత గొప్పదో చెపుతూ, వెన్ను చూపని పోరాటయోధుడు “సంతోష్” అనే వీరజవాన్ కు తన కవితా నివాళి అర్పించారు రచయిత్రి. ‘రెక్కలు కత్తిరిస్తూనే’, ‘ఆమె’, “చిట్టితల్లీ జాగ్రత్త’ ‘జవాబు వెతుక్కుంటూనే’, ‘విముక్తగా’ కవితల్లో స్త్రీ హృదయం గాయాలను చూపించారు.
“యుద్ధం” కవితలో రెండు ఆధిపత్యాల పోరు, అహంకార సామ్రాజ్య వాదం చిమ్మే విషమే యుద్ధం అంటూ మృత్యువు ఒడిలోకి ఒరిగి పోవటమో, విజయాన్ని భుజం మీద మోయడమో అంతిమ లక్ష్యం అవుతుంది అంటారు.
‘దగ్ధ గీతం’ కరోనా కన్నా భయంకరంగా మారిన ” కాలుతున్న మానవ సంబంధాలు” “పంచుకునేందుకు మాటలు లేని నిశ్శబ్దం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “వలస కూలీలు” పరస్థానం లో కూలీల జీవితం ఎంతో దుర్భరమో మనకు చెపుతారు. అన్నపూర్ణ గారి కవితల్లో పదాలు సాదాసీదా గా ఉన్నా, భావాలు హృదయపు లోతుల్లోకి ప్రయాణించి, ఆలోచింప చేస్తాయి. ముఖ్యంగా రకరకాల సమయాల్లో స్త్రీల భావాలను, సమస్యలను విస్తృతంగా వివరించారు.
80 కవితలు అన్నీ ఆణిముత్యాలే. తప్పక మన లైబ్రరిలో ఉండవలసిన పుస్తకం అని నా అభిప్రాయం.

శిరిపురపు అన్నపూర్ణ

ప్రతులకు: డా. పాతూరి అన్నపూర్ణ- 92464 15150
వెల: 200/-

1 thought on “నడిచొచ్చిన దారంతా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap