64కళలు.కాం పత్రిక కాలమిస్ట్, ధృవతారలు పుస్తక రచయిత బి.ఎం.పి. సింగ్ 2023, డిసెంబర్ 31 న గుండె పోటుతో విజయవాడలో కన్నుమూశారు. వారి ఆకస్మిక మరణానికి నివాళి గా 64కళలు.కాం పత్రిక సమర్పిస్తున్న వ్యాసం…
సాహితీ లోకంలో వన్నెతరగని ‘మణి’ ముని ప్రతాప్ సింగ్
పెదవి విప్పినా… పెన్ను కదిపినా మాటల మరాఠీలా మాయ చేస్తాడు
అలవోకగా అంత్య ప్రాసలతో ఎదుటివారిని ఆకట్టుకుంటాడు
తన రచనా శైలితో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు
స్నేహానికి, సహవాసానికి విలువనిచ్చే సన్మిత్రుడు
సన్మానాలకు, సత్కారాలకు ఆమడ దూరముంటాడు
ఆశలకు లొంగని, కీర్తి కాంక్షలేని క్షత్రియ పుత్రుడు.
పెద్ద పెద్ద జర్నలిస్టులు, ప్రముఖులు సైతం
ఆయనతో హెడ్డింగులు రాయించుకున్న దాఖలాలు కోకొల్లలు.
పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు లాంటి ప్రసిద్ధ జర్నలిస్టులు
తమ గురించిన జీవన చిత్రాన్ని ఆయన భాషతో రాయించుకుని
మురిసిపోయారు అంటే అతిశయోక్తి కాదు.
తెలుగు భాషలోనే కాదు హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ ఆయన అసమాన్య వకాబులరీ కలవాడు.
ఎంతోమందికి ప్రశంసా పత్రాలు లాంటి పరిచయ వాక్యాలు రాసి పెట్టారు.
రాయించుకున్న వ్యక్తి దాన్ని పటం కట్టించుకుని మురిసిపోయారంటే
ఆయన భాషా వైభవం అలాంటిది మరి!
రైల్వే స్కూల్లో హిందీ పండిట్ గా పనిచేసి, డిప్యుటేషన్ మీద
రైల్వే ఉన్నతోద్యోగిగా రిటైర్ అయ్యాక కూడా..
ఆ సంస్థ కోసం ఎన్నో హిందీ నాటికలకి తన సంభాషణలు, గీత రచనలు..
చేసి అనేక జాతీయస్థాయి బహుమతులు సంపాదించి పెట్టిన ఆత్మానంద యోగి.
ఒక స్నేహితుని కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలని…
భూమి మీద వదిలేసి.. కారు ప్రమాదంలో మరణించినప్పుడు
ఆ పిల్లల పెంపకం, చదువులు.. అన్నీ తానై చూసుకుని
జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన స్నేహ హృదయుడు ఆయన.
అద్భుతమైన వంటలు వండి వడ్డించే అమృతహస్తుడు.
…………………………………………………………………….
“నా మథర్ టంగ్ హిందీ, అదర్ టంగ్ తెలుగు అంటూ” చలోక్తులు విసిరే సింగ్ గారి… పూర్వీకులు రాజస్థాన్ లోని బుందేల్ ఖండ్ కు చెందిన క్షత్రీయులు. సింగ్ పుట్టింది 17 జూన్, 1956 విజయవాడలో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎం.ఏ. లతో పాటు బీ.ఈడి. చేశారు.
2010 సంవత్సరంలో ఒక మిత్రుని ద్వారా పరిచయమైన బి.ఎం.పి. సింగ్ గారు అనతికాలంలోనే నాకు అప్తమిత్రుడయ్యాడు. తద్వారా బ్నిం గారు, కనక మహలక్ష్మి గారు నాకు స్నేహితులయ్యారు.
తర్వాత రోజుల్లో 64కళలు.కాం పత్రికలో ఒక భాగమయ్యారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల గురించి అనేక వ్యాసాలు, భారతీయ ప్రముఖుల జీవన చిత్రాలు ‘ధృవతారలు’ పేరుతో 80 మంది ప్రముఖుల గురించి రాసారు. ఎన్నో చిత్ర, శిల్ప చిత్రకళా వ్యాసాలకు చక్కని శీర్షికలు సూచించారు. అలాగే విజయవాడలో ప్రముఖులను పరిచయం చేస్తూ ‘బెజవాడ ప్రముఖులు’ పేరుతో రెండేళ్ళ పాటు శీర్షికను నిర్వహించారు.
ఈయన ప్రతిభకు తార్కాణంగా నిలిచే కార్యక్రమం TV5 లో ప్రచారమైన రెండు నిమిషాల నిడివిగల ‘ధృవతారలు’ 365 ధారావాహిక ఎపిసోడ్స్. గురజాడ, శ్రీశ్రీ, టాగూర్, గాంధీ, స్వామి వివేకానంద, వడ్డాది పాపయ్య లాంటి ఎందరో భారతీయ ప్రముఖుల జీవన చిత్రాలను కేవలం రెండు నిమిషాల్లో ఆవిష్కరించారు.
బి.ఎం.పి. సింగ్ రచనలు జాగృతి, ఈనాడు, పత్రిక, సాహితీకిరణం, ఆంధ్రప్రదేశ్, 64కళలు.కాం, హాస్యానందం, విశాలాక్షి పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
నా అత్మీయ మిత్రుడు లేని లోటు 64కళలు.కాం పత్రికకు ఎవరు పూడ్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ…
కన్నీటితో… కళాసాగర్
We miss you Sir 🙏💐
ప్రముఖ రచయిత, ప్రతిభా సంపన్నులు స్వర్గీయ ప్రతాప్ సింగ్ గారి గురించినఆర్టికల్ చదివి గుండె బరువెక్కింది. అలాంటి ప్రతిభా శీలిని మనం కోల్పోవడం తీరని లోటు.వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.🙏🙏Bomman, విజయవాడ
చక్కని అక్షర నివాళితో మిత్రుని ఋణం తీర్చుకున్నారు. మీ సహృదయత కొనియాడదగినది. అందుకే మిమ్మల్ని మునిప్రతాప్ సింగ్ గారు అమితంగా ప్రేమించేవారు.
సరస్వతీ దేవి మానస పుత్రుడైన సింగ్ గారు ఇక లేరు అన్న వార్త ఎంతో భాదకు గురిచేసింది. ఆయన భాషా చాతుర్యం అనితారా సాధ్యమైనది. అసువుగా ఆయన పలికే మాటలు సైతం అక్షరీకరిస్తే కవిత్వం అవుతుంది.64 కళలు. కామ్ లో నేను రాసే ఆర్థికల్స్ లో ” విశ్వవిచిత్రం రామకృష్ణ చేతి చిత్రం, చిత్రకళ హిమగిరి కొండపల్లి శేషగిరి, లాంటి కొన్ని టైటిల్స్ సూచించింది సింగ్ గారే. వారి గురించి నివాళిగా రాసిన మీ ఆర్టికల్ చాలా బాగుంది సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి