సరస్వతీ పుత్రుడు “డైలాగ్ కింగ్” సింగ్

ఆయనే బి.ఎం.పి. సింగ్ ప్రాస లేని మాట అతని నోట వూహించలేము. ఏ క్షణమైనా… యే విషయమైనా… ఆయనతో జరిపే సంభాషణ ను అక్షరీకరిస్తే నిజంగా అది ఒక అందమైన కవిత్వమే అవుతుంది. అలాంటి సరస్వతీ పుత్రున్ని 2023 సంవత్సరపు ఆఖరి రోజు గుండె పోటు రూపంలో శాస్వతంగా మనల్ని వీడి పరలోకానికి తీసుకుపోయిందన్న వార్త విన్ననాకు నిజంగా హృదయమంతా భారమైపోయింది.

కారణం ఆయనతో నాకున్న సాంగత్యం. 2010 నుండి నేను 64 కళలు.కాం లో రాష్ట్రవ్యాప్తంగా వున్న చిత్రకారులను గూర్చి వ్యాసాలను రాసే క్రమంలో మిత్రులు కళాసాగర్ గారి ద్వారా దాదాపు పుష్కర కాలం క్రితం నుండి వారు నాకు పరిచయం, నాటినుండి మా మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతుంది.. నాతో పాటు ఆయనకూడా 64 కళలు.కాం లో బెజవాడ ప్రముఖులను గూర్చిఆయన వ్రాసే వ్యాసాలకు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు లాంటి వాళ్ళు సైతం పిదా అయిపోయారు. తుర్లపాటి గారి గురించి సింగ్ గారు రాసిన ఆర్టికల్ కి ముగ్దుడై ఆయన దాన్ని ప్రత్యేకంగా మోనోగ్రాఫ్ లా అచ్చు వేయించుకుని అందరికి పంచుకోవడం అందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. అందులో బాగంగా ఆ కాపి నాకు కూడా ఆయన ఇచ్చుకుని ఆనందపడడం నేను ఎరుగుదును. ధ్రువ తారలు పేరుతో వివిధ రంగాల్లో వందమంది పైగా ప్రముఖుల గురించి కేవలం నాలుగు వాఖ్యాల్లో ఆయన రాసిన సంక్షిప్త పదాలను TV-5 టేలివిజన్ చానల్ లో ప్రతిరోజూ ప్రసారం చేయడం ఎంతో గొప్ప విషయం.

శ్రీ శ్రీ గురించి రాస్తూ ఆయన ఇలా అంటారు…
“అక్షరంలో దాగిన ఆకలి జ్వాల
ఆకలేసి అరచిన వాడికి అమ్మ జోల
నవచైతన్య నిర్మాణ పాటశాల
శ్రామికుడి చెమటను తుడిచే చేతి రుమాలా”

అంబేద్కర్ గారి గురించి….
“నవ భారత రాజ్యాంగ నిర్మాత
సమ సమాజ నిర్ణేత
బడుగు వర్గాలకు బ్రాత
ప్రజాస్వామ్యానికి సరైన వ్యాఖ్యాత”

ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు గారి గురించి మరియు చేతి వ్రేల్లనే కుంచేగా చేసుకుని అద్భుతాలు సృష్టించిన మరో చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ గారిగురించి నేను వ్రాసిన ఆర్టికల్స్ కి “చిత్రకళా హిమగిరి ఈ కొండపల్లి శేషగిరి” విశ్వ విచిత్రం–రామకృష్ణ చేతి చిత్రం” అన్న మంచి టైటిల్స్ సూచించింది ఈ సింగ్ గారే…

ఒకా నొక రోజు ఆఫీసు విషయాలగురించి మామధ్య జరిగిన సంభాషణల్లో యాదృచ్చికంగా ఆయన నోటి వెంట వచ్చిన కొన్ని మాటలు ఈ సందర్భంలో నాకు గుర్తుకు వస్తున్నాయి. ఆయనంటాడు

ఆందోళనపడితే ఆన్సర్ రాదు అల్సర్ వస్తుంది
SENIOR — SEE NEAR

LEADER – LADER లా ఉండాలి
కూల్ గా ఆలోచిస్తే అన్సర్ అనుకూలంగా ఉంటుంది
కారణం తెలిస్తే నివారణ ఈజీ అవుతుంది
OFFICER FIRE అయితే STAFF FAR (దూరం)అవుతారు
ATTEND అవరు PRETTEND అవుతారు
నీటిబిందువు నాగరికతకు కేంద్ర బిందువు

నా మదర్ టంగ్ హిందీ, అదర్ టంగ్ తెలుగు అంటూ ఆయన నోటివెంట ఆశువుగా వచ్చే ప్రతీ మాటా ఒక తూటాలా పేలడమే కాదు కవిత్వ పరిమళాన్ని కూడా వెదజల్లుతుంది. కాసేపు ఆయనతో మాటల్లో దిగితే మనం ఆశ్చర్యంతో ఆయన ఆశువుగా వేసే ప్రాస పదాలకు నోరేల్లబెట్టాల్సిందే.

వృత్తి రీత్యా రైల్వేలో స్కూల్లో హిందీ మాస్టర్ గా పనిచేసి, రిటైర్ అయ్యాక కూడా ఆ సంస్థ కోసం హిందీ నాటికలకి తన సంభాషణలు, గీత రచనలు.. చేసి అనేక బహుమతులు సంపాదించి పెట్టిన ఆత్మానంద యోగి. ఎంతోమందికి ప్రశంసా పత్రాలు, పరిచయ వాక్యాలు రాసి పెట్టారు. రాయించుకున్న వ్యక్తి దాన్ని పటం కట్టించుకుని ముగిసిపోయారంటే ఆయన భాషా వైభవం అలాంటిది.

ఈనాడు, జాగృతి, విశాలాక్షి, సాహితీ కిరణం లాంటి పత్రికలలో ఎక్కువగా ఆర్తికల్స్ వ్రాసేవారు. భాష పై అంత పట్టు వున్నఅతనిని దానిని పుస్తకాల రూపంలోకి మార్చండి మహాప్రభో అని మాలాంటి వాళ్ళం ఎంత మొత్తుకున్నా పట్టించుకునే వాడు కాదు. అందుకే ఆయనలో గల అంతటి సాహితీ ప్రతిభ కూడా కేవలం మిత్రులతో నోటి మాటలలోనే మిగిలిపోయింది తప్ప గ్రంధ రూపంలోకి మారలేదు. కేవలం నాలుగైదు లైన్లలో గొప్ప మహనీయుల జీవితాలను ద్రువతారలు పేరుతో వారు రాసిన వాఖ్యాలను గ్రంధస్తం చేసి అందరికి తెలయజేయండి అని నేను కళాసాగర్ గారు ఇంకా కొందరు మిత్రులు ఎన్నోసార్లు మొత్తుకున్నా ఎవరికీ కావాలి సర్ ఇవన్ని అని దాటవేయడమే తప్ప కార్యరూపంలోకి తీసుకురాలేదు.

బహువిదకళాకారుడైన బ్నిం గారికి సింగ్ గారంటే ఎంతో అభిమానం. అలాగే సింగ్ గారికి కూడా బ్నిం గారన్నా అంతే అభిమానం. బ్నిం గారు చిత్రకారుడు కార్టూనిస్ట్ మరియు మంచి సాహిత్యకారుడు కూడా. కూచిపూడి భరత నాట్యాల బాలేలకోసం ఎన్నో గొప్ప గొప్ప సంగీత నృత్య రూపకాలను రచించిన కవి. అంతటి వ్యక్తి కూడా సింగ్ గారి ఆశు కవిత్వానికి వీరాభిమాని. వీరిద్దరూ గొప్ప మిత్రులని చెప్పడానికి విజయవాడలో వుండే సింగ్ సంవత్సరంలో పలుమార్లు హైదరాబాదులో వుండే బ్నిం గారింటికి రావడం, నాలుగైదు రోజులుండి స్వయం పాకంలో సిద్దహస్తుడైన సింగ్ గారు మంచి మంచి వంటలు చేసి బ్నిం గారింట్లో మిత్రులతో కలిసి భోజనం చేయడాలు ఆయనకు సర్వసాదారన విషయాలు. చాలా సార్లు బ్నిం గారి దగ్గరకు మీరు రావాలి వారిగురించి కూడా మీరు ఆర్టికల్ రాయాలి అని నన్ను అంటూ వుండే సింగ్ గారు ఒకరోజు ఉదయం ఆయన నాకు ఫోన్ చేసే సమయానికి నేను హైదరాబాదులో వుండడంతో నేను కూడా హైదరాబాద్ లో బ్నిం గారింట్లో వున్నాను తప్పక రావాలి అని నన్ను బ్నిం గారింటికి ఆయన నన్ను తీసుకు వెళ్ళి వారికి పరిచయం చేయడం జరిగింది. నిజంగా ఆ సందర్భం ఎంత ఆనందాన్నిచ్చిందో, అలాగే విజయవాడ ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఉదయం మిత్రులు కళాసాగర్ గారితో కలిసి ఆయన రైల్వే స్టేషన్ కి వచ్చి తన ఇంటికి తీసుకు వెళ్ళడమే గాక తాను ఆరోజు స్వయంగా వండిన వంటకాలను మాకు అల్పాహారంగా పెట్టిన సందర్భం ఒక తీపి గుర్తు. ఆయన గురించి ఆర్తికల్ రాసే నిమిత్తం ఆరోజు ఫొటోస్ కూడా తీసుకున్నాం… ఆయన ఇంటి పెరట్లో పెద్దపెద్ద పాత్రల్లో కంపోస్ట్ వేసి పెంచుతున్న కూరగాయలు, ఆకు కూరలను మా ఇరువురికి చూపించి వీటినే నేను కోసి వంట చేసుకుంటానని చెప్పినప్పుడు బలే ఆనందమనిపించింది. అప్పుడప్పుడూ కళాసాగర్ గారు కూడా కాసింత ఆకుకూరలు తీసుకేల్తారని చెప్పడం జరిగింది.

ఒక స్నేహితుని కుటుంబంఇద్దరు పసి పిల్లలని భూమి మీద వదిలేసి.. ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ పిల్లల పెంపకం చదువులు.. అన్ని గార్డియన్ అయి చూసుకుని జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన స్నేహ హృదయుడు ఆయన.

బ్నిం గారన్నట్టు ఆయన మాటల మరాఠీ, భాషేంద్రజాలికుడు మాత్రమే కాదు అద్భుతమైన వంటలు వండి వడ్డించే అమృతహస్తుడు కూడా.

ఇంతటి అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన సన్మిత్రుడు తెలుగువాడు కాదని రాజస్థాన్ కు చెందిన బుందేల్ ఖండ్ వాసి అని తెలిస్తే ఆశ్చర్యపోవడం మనవంతౌతుంది అలాంటి అలాంటి వారిలో నేను కూడా ఒకడిని. ఎన్నో సార్లు ఆయనతో ఈ మాట చెప్పేవాడిని అలాంటి గొప్ప సాహితీ పుత్రున్ని 2023 సంవత్సరం వెళ్తూ వెళ్తూ ఆఖరి రోజున మనందరికి శాశ్వతంగా దూరం చేయడం అందరికి భాదాకరం. మిత్రుడు ఆత్మకూరు రామకృష్ణ గారి వాట్సప్ మేసేజ్ ద్వారా చూసిన వార్త కి కాసేపు నేను షాక్ కి గురయ్యాను. మొన్న క్రిస్మస్ రోజునే కదా అయన నాతో మాట్లాడాడు ఏమి జరిగిందని మిత్రులు కళాసాగర్ గారికి ఫోన్ చేసాను. అమీర్ ఆర్ట్ అకాడమి వార్షికోత్సవంలో పాల్గొనే నిమిత్తం నెల్లూరు వెళ్ళిన కళాసాగర్ గారు కార్డియాటిక్ అరెస్ట్ అయ్యి సడన్ గా చనిపోయినట్టు తెలిసిందని చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ కొత్త సంవత్సరానికి అందమైన స్వాగత వచనాలు వారినుండి అందుకునే నేను వాటిని అందుకునే అవకాసం లేకుండా చేసింది 2023 సంవత్సరం. ఆయనతో నా జ్ఞాపకాలను కనీసం ఈ సందర్భంలోనైనా అక్షరరూపం లోకి తీసుకువద్దామని హైదరాబాద్ లో బ్నిం గారితో విజయవాడలో కళాసాగార్ గారి సమక్షంలో వారితో దిగిన ఫొటోస్ కోసం నా ఫోన్ మరియు కంప్యూటర్లలో నాలుగు రోజులు వెతికాను.కాని విచిత్రంగా ఆయన బ్నిం గారికి నన్ను పరిచయం చేసినప్పుడు బ్నిం గారితో నన్ను ఆయన తీసిన ఫోటో తప్ప ఆయనతో నేను కలిసి ఉన్న ఫొటోస్ కూడా మిస్ అవడం మరింత బాధనిపించింది. అయినా పోటోలు లేకుంటేనెం అద్భుతమైన ఆ సరస్వతీ పుత్రుడు నా మనసులో నే కాదు సాహితీ మిత్రుల మనస్సులో ఎప్పటికి శాశ్వతంగా నిలిచే వుంటాడు

వెంటపల్లి సత్యనారాయణ (9491378313)
ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, ఆర్ట్ క్రిటిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap