ప్రజానాయకుడు, ఓషో బాధితుడు వినోద్ ఖన్నా

బాలీవుడ్ లో అందాల విలన్ గా అరంగేట్రం చేసి, ఆదర్శవంతమైన హీరోగా మన్ననలు పొంది, ‘తనని ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమను స్థిరంగా వుంచుకునేదే స్త్రీ’ అనే సూత్రాన్ని బోధించిన ఆచార్య రజనీష్ (ఓషో) కు ప్రియశిష్యుడిగా పరిణితి చెందిన అలనాటి స్టార్ హీరో వినోద్ ఖన్నా2017 ఏప్రిల్ 27 న మూత్రాశయ క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ వైద్యశాలలో తుదిశ్వాస విడిచారు. 1968లో బాలీవుడ్ చిత్రసేమకు పరిచయమై 140 కి పైగా సినిమాలలో విలన్ గా, హీరోగా, క్యారక్టర్ నటుడిగా వినోద్ ఖన్నా రాణించారు. సినిమాలలో వేషాలు ధరించడం తగ్గించుకుని ప్రజాసేవకు పరిమితమవుతూ పంజాబ్ లోని గురుదాసపూర్ నియోజక వర్గానికి లోకసభ సభ్యునిగా సేవలందించిన వినోద్ ఖన్నా, వాజపేయీ ప్రభుత్వంలో సాంస్కృతిక వ్యవహారాలు, విదేశాంగ శాఖల సహాయ మంత్రిగా కేంద్రంలో పనిచేశారు. వినోద్ ఖన్నా జీవితం ఒక సప్తసాగర గీతం లాంటిది. ఆ నటుడి వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అతని జీవిత విశేషాలను తెలియజేస్తాను.

తొలి రోజుల్లో…

వినోద్ ఖన్నా పూర్వీకులది ప్రస్తుత పాకిస్తాన్ లో వున్న పెషావర్ పట్టణం. పంజాబీ హిందూ కుటుంబంలో వినోద్ ఖన్నా అక్టోబరు 6, 1946న పుట్టారు. తల్లిదండ్రులు కిషన్ చంద్ ఖన్నా, తల్లి కమలా ఖన్నా. వినోద్ పుట్టిన పది నెలలకే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం, భారత్-పాకిస్తాన్ విభజన జరగడంతో, వినోద్ ఖన్నా కుటుంబం పెషావర్ ను వీడి ముంబైలో స్థిరపడింది. తండ్రి బట్టల వ్యాపారం చేసేవారు. వినోద్ ఖన్నా ప్రాధమిక విద్యాభ్యాసం ముంబై క్వీన్ మేరీ పాఠశాలలోను, ఆ తరవాత సెయింట్ జేవియర్ ఉన్నత పాఠశాలలో గడచినా, వారి కుటుంబం దిల్లీకి మకాం మార్చడంతో, వినోద్ ఖన్నా దిల్లీ పబ్లిక్ స్కూల్ లో విద్యను కొనసాగించారు. మారిన పరిస్థితుల దృష్ట్యా వారి కుటుంబం మరలా ముంబైకి మారిన తరవాత సిడెన్హమ్ కళాశాల నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. చిన్నతనంలో చూసిన మొఘల్-ఎ-ఆజం, సోల్వాసాల్ సినిమాల ప్రభావం వినోద్ ఖన్నా మీద ఎంతో వుంది. అది సినిమాలలో నటించాలి అనే జిజ్ఞాసను పెంచింది. 1967 లో దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్ తెలుగులో బాబూ మూవీస్ వారు నిర్మించిన మూగమనసులు చిత్రాన్ని హిందీలో సునీల్ దత్ (సంజయ్ దత్ తండ్రి) హీరోగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నటుడు సునీల్ దత్ తన సొంత అజంతా ఆర్ట్స్ బ్యానర్ పై ‘మన్ కా మీత్’(1968) అనే సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించారు. తమిళంలో రామన్న దర్శకత్వంలో వచ్చిన ‘కుమరిపెణ్’(1966-తెలుగులో కొంటెపిల్ల గా డబ్ అయింది) సినిమాకు ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రం ద్వారా సునీల్ దత్ తన తమ్ముడు సోము దత్ ను హీరోగా, లీనా చందావర్కర్ ను హీరోయిన్ గా, వినోద్ ఖన్నా ను విలన్ గా బాలీవుడ్ తెరకు పరిచయం చేశారు. అలా వినోద్ ఖన్నా నటప్రస్థానం అందమైన విలన్ పాత్రతో మొదలైంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవడంతో వినోద్ ఖన్నాకు వెంటనే మంచి బ్రేక్ రాలేదు. తరవాత పూరబ్ అవుర్ పశ్చిమ్, మస్తానా, సచ్చా ఝూటా, ఆన్ మిలో సజనా, మేరా గావ్ మేరా దేశ్, ఎలాన్ వంటి సినిమాల్లో వినోద్ ఖన్నాసహాయక పాత్రలు పోషించారు.

విలన్ నుంచి హీరోగా...

బాలీవుడ్ చరిత్రలో విలన్ వేషాలు వేస్తూ హీరోగా ఎదిగిన శత్రుఘ్న సిన్హా వంటి నటులు చాలా తక్కువమందే. అందులో అగ్రతాంబూలం వినోద్ ఖన్నాదే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. వినోద్ ఖన్నాకు అటువంటి అవకాశం 1971లో వచ్చిన ‘హమ్ తుమ్ అవుర్ వో’లో దొరికింది. శివకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వినోద్ రొమాంటిక్ హీరోగా భారతి సరసన నటించాడు. అదే సంవత్సరం రాజ్ సిప్పీ నిర్మాణ సారధ్యంలో గుల్జార్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘మేరే అప్నే’ సినిమాతో వినోద్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ సినిమాను గుల్జార్ కేవలం 40 రోజుల్లో నిర్మించడం విశేషం. రెండు సంవత్సరాల తరవాత నానావతి మర్డర్ కేసు నేపథ్యంలో గుల్జార్ నిర్మించిన ‘అచానక్’ సినిమాలో మేజర్ రంజీత్ ఖన్నాగా నటించిన వినోద్ ఖన్నాకు చాలా మంచి పేరొచ్చింది. 1973-82 మధ్య ఆయన నటనకు సరిపడే పాత్రలు లభించాయి. హత్యారాలో మౌసమీచటర్జీ, ఇనకార్ లో విద్యాసిన్హా, గద్దర్ లో యోగితాబాలి, రాజ్ మహల్ లో రేఖా, మై తులసి తేరి అంగన్ కి లో నీతా మెహతా, ఆరోప్ లో సైరాబాను, జైల్ యాత్రా లో రీనారాయ్, దౌలత్ లో జీనత్ అమన్, బర్నింగ్ ట్రైన్ లో పర్వీన్ బాబి… ఇలా అందరు హీరోయిన్లతో వినోద్ సినిమాలు చేశాడు. ఈ సినిమాలన్నీ విజయవంతమైనవే. వినోద్ ఖన్నాకు రాజేష్ ఖన్నా మంచి స్నేహితుడు. వినోద్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో రాజేష్ ఖన్నా నటించిన సినిమాలలో సహాయ నటుడి పాత్రలు ధరించేందుకు వినోద్ వెనుకాడలేదు. వాటిలో ఆన్ మిలో సజనా, సచ్చా ఝూటా, ఖుద్రత్, రాజపుట్, ప్రేమ్ కహానీ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే బిగ్-బి అమితాబ్ బచన్ నటించిన అమర్-అక్బర్-ఆంథోనీ, జమీర్, పర్వరిష్, ఖూన్ ఫసీనా సినిమాలలో వినోద్ సహాయనటుడిగా రాణించాడు. వినోద్ ఖన్నా మంచి స్నేహశీలి కావడమే అతడు తోటి హీరోల సరసన నటించేందుకు ఒప్పుకోవడం. ఇంకా చెప్పుకుంటే సునీల్ దత్ తో డాకు అవుర్ జవాన్, జితేంద్ర తో ఏక్ హసీనా దో దివానే, పరిచయ్, అనోఖి అదా, ధర్మేంద్ర తో పథ్థర్ అవుర్ పాయల్, ఫరిస్తే, రఖ్ వాలా వంటి సినిమాలలో జంట హీరోగా నటించాడు. 1974-82 మధ్యకాలంలో జితేంద్ర కన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి వినోద్ ఖన్నా ఎదిగాడు. పర్వరిష్, అమర్ అక్బర్ ఆంథోనీ, హీరా ఫేరి, ఖూన్ పసీనా వంటి సినిమాల్లో అమితాబ్ బచన్ కన్నా అధిక పారితోషికం వినోద్ ఖన్నాకు ముట్టిందంటే ఆశ్చర్యంగానే వుంటుంది. కానీ ఇది నిజం! అలాగే 1987-95 మధ్యకాలంలో రిషి కపూర్, సంజయ్ దత్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ ల సినిమాలలో నటించి నప్పుడు కూడా పారితోషికం విషయంలో వినోద్ ఖన్నాదే పైచేయి.

కుటుంబాన్ని వదలి రజనీష్ (ఓషో) శిష్యుడిగా…

వినోద్ ఖన్నాకు గీతాంజలితో 1971లో వివాహమైంది. వారికి రాహుల్, అక్షయ్ అనే ఇద్దరు కుమారులు పుట్టాక 1975లో ఆధ్యాత్మిక గురువు భగవాన్ ఆచార్య రజనీష్ బోధనలకు ఆకర్షితుడై వినోద్ ఆయన సమూహంలో చేరి ప్రధాన శిష్యులలో ఒకడిగా మెలిగాడు. భార్యా బిడ్డల్ని, సినీ రంగాన్ని వదలి పుణె లో రజనీష్ ఆశ్రమం చేరాడు. విచ్చలవిడి శృంగారాన్ని రజనీష్ ప్రోత్సహించడం, స్త్రీ పురుషుల స్వేచ్చాలైంగిక జీవన ప్రవచనాలు చేయడంతో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం రజనీష్ ఆశ్రమం మీద నిషేదాజ్ఞలు విధించింది, దానితో 1980లో రజనీష్ అమెరికాకు వలస వెళ్లి తన శిష్యులతో ఒరెగాన్ రాష్ట్రంలోని వాస్కో గ్రామంలో పెద్ద ఆశ్రమాన్ని నిర్మించాడు. వినోద్ ఖన్నా కూడా రజనీష్ తో అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ తోటపని చెయ్యడం, బట్టలు ఉతకడం, శిష్యులు ఆరగించిన కంచాలు కడగడం వంటి పనులు కూడా చేశాడు. వినోద్ వైఖరి నచ్చని అతని భార్య గీతాంజలి అతడినుంచి విడాకులు తీసుకుంది. రజనీష్ ఆశ్రమం మీద హత్యా నేరారోపణలు రావడంతో అమెరికా తోబాటు 21 దేశాలు రజనీష్ ను బహిష్కరించడంతో, వినోద్ ఖన్నా అతణ్ణి వీడి భారతదేశం వచ్చేశాడు. 1990లో కవిత అనే మహిళను ద్వితీయ విఉవాహం ఛేసుకున్నాడు. వారికి సాక్షి అనే కొడుకు, శ్రద్ధ అనే కూతురు పుట్టారు. 1987లో మరలా బాలీవుడ్ లో అడుగుపెట్టి డింపుల్ కపాడియా తో ఇన్సాఫ్ సినిమాలో నటించాడు. తరవాత మణిరత్నం సినిమా దయావన్, ముకద్దర్ కా బాద్షా, CID, జుర్మ్ వంటి సినిమాలలో నటించాక తన కుమారుడు అక్షయ్ ఖన్నా ను హిమాలయ పుత్ర సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. తను కూడా రెడ్ అలర్ట్, వాంటెడ్, పెహచాన్ వంటి సినిమాల్లో క్యారక్టర్ నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న తరవాత 1997లో రాజకీయాలు వంటపట్టించుకున్నాడు. వినోద్ ఖన్నా నటించిన ఆఖరి సినిమా ‘ఏక్ థీ రాణి ఐసీ భి’ తను మరణిచక వారం ముందు అంటే ఏప్రిల్ 21 న విడుదల కావడం విధిలిఖితం.

రాజకీయ ఖన్నా

1997 లో వినోద్ ఖన్నా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పుచ్చుకొని పంజాబ్ లోని గురుదాసపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి సభ్యునిగా గెలుపొందారు. తరవాత జరిగిన మధ్యంత ఎన్నికల్లో కూడా అదే నియోజక వర్గం నుంచి గెలుపొందారు. 2002లో సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటకశాఖకు కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించారు. తర్వాత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవిని కూడా అలంకరించారు. అయితే 2004 లో ఓడిపోయి 2014 ఎన్నికల్లో మరలా అదే నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వినోద్ ఖన్నా ఎన్నికయ్యారు. ఖన్నా మరణించేవరకు పార్లమెంట్ సభ్యుడుగానే వున్నాడు. నాలుగు సార్లు పార్లమెంటు సభ్యునిగా గెలిచిన ఘనతకూడా వినోద్ ఖన్నాది కావడం అతనిమీద ప్రజలకు ఎంత అభిమానం వుంది అనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. మూత్రాశయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఖన్నా ఏప్రిల్ 27 న ముంబై రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ముక్తాయింపు

వినోద్ ఖన్నా సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో అకస్మాత్తుగా రజనీష్ బోధనలకు ఆకర్షితుడై పుణె ఆశ్రమం చేరాక, అమితాబ్ బచన్ స్టార్డం ఊపందుకుంది.

రజనీష్ తో పరిచయం అయిన కొత్తల్లో ప్రతి వారాంతం పుణె లోని రజనీష్ ఆశ్రమానికి వినోద్ వెళ్ళేవాడు. తరవాత 31, డిసెంబర్ 1975 న సంసారబంధాన్ని వీడి రజనీష్ ఆశ్రమానికి మకాం మార్చాడు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి నిర్మాతలను పుణె లో షూటింగు ఏర్పాటు చేయమని ఆదేశించేవాడు.

వినోద్ ఖన్నా సినిమాల్లో నటనకు స్వస్తి చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే అమితాబ్ బచన్ కు కూడా అందనంత ఎత్తులో అతడి స్టార్డం వెలిగిపోతుండేది.

వినోద్ రజనీష్ ను వదలి అమెరికా నుండి భారత్ వచ్చేందుకు సిద్ధపడినప్పుడు పుణె ఆశ్రమానికి రక్షకుడిగా ఉండమని రజనీష్ కోరాడు. కానీ వినోద్ ఒప్పుకోలేదు. నటనారంగానికే ప్రాధాన్యం ఇచ్చాడు.

వినోద్ ఖన్నా 47 మల్టీస్టారర్ సినిమాలలో నటించి రికార్డు నెలకొల్పాడు.

ఖుర్బాని సినిమాలో వినోద్ ఖన్నా పాత్రను తొలుత అమితాబ్ కు ఇవ్వాలని ఫిరోజ్ ఖాన్ తలపోసినా, అది వినోద్ కే దక్కింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

వినిద్ ఖన్నా ఆత్మీయ మిత్రుడు ఫిరోజ్ ఖాన్ 2009 ఏప్రిల్ 27 వ తేది న బెంగుళూరులో మరణిస్తే, వినోద్ ఖన్నా అదేరోజు (27 ఏప్రిల్ 2017) మరనించడం కేవం యాదృచ్చికం.

ఒక నటుడుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నాలుగుసార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికవటం ఒక రికార్డు.

వినోద్ ఖన్నాకు ఆరు సంవత్సరాల క్రిందే మూత్రాశయ క్యాన్సర్ మహమ్మారి సోకింది. వైద్యుల సలహా మేరకు తన కూతురి చదువుకు ఆటంకం కలుగుతుందణే బెంగతో ఈ విషయాన్ని వినోద్ ఖన్నా చాలాకాలం వరకూ దాచాడు. అనేకసార్లు జర్మనీ వెళ్లి చికిత్స పొందాడు. అందువలననే పఠాన్ కోట మారణకాండ జరిగినప్పుడు పరామర్శకు వెళ్ళలేకపోయాడు.

వినోద్ ఖన్నా రెండు ఫిలింఫేర్ బహుమతులు, ఒక జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “ప్రజానాయకుడు, ఓషో బాధితుడు వినోద్ ఖన్నా

  1. Good article. ఎంతో మంది జీవితాలు నాశనం కావడానికి కారణమైన ఓషొగాడికి ఇప్పటికీ కొంతమంది చెక్కబజనలు చేయడం విచారకరం. మొన్నీమద్యన మదనపల్లిలో జరిగిన జంటహత్యలకి కారణం వీడి పుస్తకాలే. వెధవని ఎన్నొ దేశాలు కుక్కలా తరిమికొట్టాయి. పాపం ఆఖరికి ఎయిడ్స్ తో చచ్చాడని అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap