‘సాంస్కృతిక రాయబారి’ ఎమ్వీయల్

సెప్టెంబర్ 21వ తేదీ ఎమ్వీయల్ గారి జన్మదిన సందర్భంగా ….

నూజివీడు అంటే నోరూరించే మామిడి రసాలు…
చెడుగుడు పోటీలు … దసరా ఉత్సవాలు……..

దివాణాలే కాదు…
రాజకీయ దిగ్గజం మాన్యులు దివంగత శ్రీ ఎం.ఆర్.అప్పారావు…

సాహితీవేత్త దివంగత శ్రీ ఎమ్వీయల్ కూడా…

నూజివీడు పట్టణం గురించి ప్రస్తావించగానే స్ఫురించే అరుదైన పేర్లలో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. 1944 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించి, ఉద్యోగరీత్యా ఈ పట్టణానికి చేరిన ఆయన దీనినే సొంతవూరు చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల అధ్యాపక జీవితంలో అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తనదంటూ ఒక ముద్ర వేశారు. ఆయనకు ఎందరో ఆత్మీయులు.. మరెందరో అభిమానులు.. ఇంకెందరో ఏకలవ్య శిష్యులు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఎప్పటికీ ప్రాత:స్మరనీయుడు…

ధర్మ అప్పారావు కళాశాల తెలుగుశాఖ వ్యవస్థాపక అధిపతిగా శ్రీ ఎమ్వీయల్ చేసిన కృషి గురించి చెప్పేందుకు ఎంతైనా ఉంది. ఈ మా మాస్టార్లంతా మా తెలుగు శాఖకే వన్నె తెచ్చారనడం అతిశయోక్తి కాదు. వారిలో కొందరు వయస్సు, ఇతరత్రా అనుభవం రీత్యా ఎమ్వీయల్ గారి కన్నా అధికులైనా, వారి మధ్యగల సద్భావం, సమన్వయం, పరస్పర గౌరవభావం ప్రశంసనీయం. తెలుగు ప్రధాన అంశంగా తీసుకోవడం చిన్నతనంగా భావించే తరుణంలో దానికి ఒక ప్రతిష్ఠ తెచ్చారని చెప్పేందుకు గర్విస్తున్నాను. వారి శిష్యులమని సగర్వంగా చెప్పుకునే వారిలో నేనూ ఒకడిని.
ఎమ్వీయల్ గారు వృత్తిరీత్యా ఆంథ్రోపన్యాసకులైనా, సాహితీ సాంస్కృతిక రంగాల్లో ఆయనది ప్రత్యేక బాణి. వ్యాఖ్యాతగా ఆయనదో విలక్షణ శైలి. ఆయన నడక, మాట (మాటల విరుపు), బోధన తీరులో ప్రత్యేకత. అప్పట్లో ఆయనను అనుకరించిన, అనుసరించిన వారు లేకపోలేదు. ఒక వైపు ఉద్యోగం. మరో వంక సభలు, సాహితీ సదస్సులు. సినిమా రంగంలో సంబంధాలు.. కథా / మాటల రచనలో సహకారం.. కొన్ని చిత్రాలకు సంభాషణల కూర్పు… అడపాదడపా ఆకాశవాణిలో ప్రసంగాలు.. పత్రికారచన. ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘యువజ్యోతి’ శీర్షిక పేర నిర్వహించిన ప్రశ్నలు – జవాబులు వగైరాలతో చాల బిజీగా వుండేవారు.
70వ దశకంలో ఆయన నిర్మాణ సారధ్యంలో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’ చలనచిత్రం అఖండ విజయం జాతీయస్థాయిలో రంగవల్లులు వేసింది. అనంతరం ఎన్ని చిత్రాలకు పని చేసినా ఆ చిత్రానికి అందుకున్న ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు ఎన్నెన్నో. ఇక ఆయన రచనలను ప్రస్తావించడం చర్విత చర్వణమే అవుతుంది. ఒక మాటలో ఆయన నూజివీడు ‘సాహితీ సాంస్కృతిక రాయబారి’.
మార్కెట్లోకి కొత్త పుస్తకం రాగానే దాని గురించి తరగతిలో విద్యార్థులకు వివరించడం ఆయన హాబీ. సినీసాహిత్య సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఆయన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న మిత్రులకు, శిష్యులకు కబురంపడం ఆయనకో సరదా. కొత్తగా వచ్చిన ఎల్.పి. గ్రాంఫోన్ రికార్డులు వ్యాఖ్యాన పూర్వకంగా వినిపించడం ఓ ముచ్చట. ఆయన పారాలతో పాటు పాటలను అందంగా, వ్యంగ్యంగా విశ్లేషించేవారు. నచ్చిన వాటిని పదేపదే ముచ్చటించేవారు. ‘అందాల రాముడు’ సినిమాలోని ‘ఎదగడానికెందుకురా తొందర’, ‘సంపూర్ణ రామాయణం’లోని దేవులపల్లి వారి శబరి పాట ఆయన మెచ్చుతునకలు. ‘నాకు అవకాశం వస్తే ఆ పాటను పార్యాంశంగా పెడతాను’ అనేవారు.

ఎమ్వీయల్ గారు మా అన్నదమ్ములందరికీ గురువే కాక, మా కుటుంబ హితైషి కూడా. కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థి మా పెద్దన్నయ్య ఎ.ఎస్.జి.కృష్ణస్వామి మాస్టారి ప్రోత్సాహంతో అనేక నాటక పోటీల్లో పాల్గొనడం, మాస్టారి పెళ్లి సందర్భంగా పౌరాణిక ఏకపాత్రాభినయం చేయడం ఓ తీపి జ్ఞాపకం. అనంతర కాలంలో మద్రాసు సినీరంగానికి వెళ్లిన మా అన్నయ్య ఆయన ప్రోత్సాహంతోనే ‘ముత్యాల ముగ్గు’కు పనిచేసి సినీకళాకారుడుగా స్థిరపడ్డారు.
ఆయన నాలాంటి వారెందరికో స్పూర్తి. ఆదినుంచి అధ్యాపక వృత్తి పత్రికా రచన పట్ల నాకు ఆసక్తి. ఆ తరువాత పత్రికా రచయితను కాగలిగాను. అప్పట్లో ఒక సినిమా పత్రికకు ‘వాణిముత్యాల’ పేరిట ప్రత్యేక శీర్షిక నిర్వహిస్తున్న మాస్టారు. పత్రికా రచన అధ్యాపక వృత్తికి ఏ మాత్రం తీసిపోదు. ఎం.ఎ. తెలుగు అందుకు బాగా ఉపకరిస్తుంది. కాకపోతే వ్యక్తిగత జీవితాన్ని కొంత త్యాగం చేయవలసి ఉంటుంది’ అని నా ఉద్యోగాన్ని అభినందించి,
ప్రోత్సహించడం ఎప్పటికీ గుర్తుండే అంశం. నిజం కూడా… వ్యక్తిగతంగా చూడలేని, సమీపించలేని ఎందరో ప్రముఖులతో పత్రికా రచయితగా ముచ్చటించడం ఆనందం కలిగించేదే.
నాకు తీరని కోరిక ఒక్కటే. పాత్రికేయునిగా మాస్టారి ‘ముఖాముఖి’ని ప్రచురించలేక పోవడం. ఆయన పాల్గొన్న సమావేశాల గురించి అనేక వార్తలు రాసినప్పటికీ, ఇంటర్వ్యూ చేసి ప్రచురించే అవకాశం లేకపోయింది. ఇన్నేళ్ల పాత్రికేయ వృత్తిలో లెక్కకు మిక్కిలి వార్తలు, వార్తా కథనాలు రాస్తున్న నేను విద్యాప్రదాత ఎం.ఆర్.అప్పారావు…. గురువు, కుటుంబ స్నేహితులు అయిన ఎమ్వీయల్… ‘ఇక లేరనే వార్తలు రాయవలసి రావడం చేదు అనుభవాలు. నిండా నాలుగున్నర పదుల వయస్సు కూడా నిండకుండానే 23 జనవరి 1986లో అనంతలోకాలకు సాగిన సాహితీమూర్తికి అక్షరాంజలి.

– ఆరవల్లి జగన్నాథస్వామి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap