చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

‘శ్రీరమణ'(కామరాజ రామారావు) ఈ ఉదయం (19 జులై, బుధవారం) నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు.

ప్రసిద్ధి ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత, సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయిత, పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా, పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించిన శ్రీరమణ గారికి అశ్రు నివాళి !

శ్రీరమణ పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళారంగాల్లో ప్రసిద్ధి వహించారు. ఆయన “పత్రిక” అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.

జీవిత విశేషాలు:
జననం …
వంకమామిడి రాథాకృష్ణ కామరాజు రామారావు 1952 సెప్టెంబరు 21 న గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి వరహాపురం అగ్రహారం ఆంధ్రప్రదేశ్ జన్మించారు. వేమూరు మండలం తెనాలికి చాలా సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు అనసూయ, సుబ్బారావులు. వారి తండ్రి పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవారు.

“శ్రీరమణ”గా పేరు మార్పు..
వారి తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.సి.లో వుండగా ఆయనను దత్తత చేసుకున్నారు. వారి జన్మనామం “వంకమామిడి రాథాకృష్ణ”. దత్తతకు వెళ్ళిన తరువాత నామం “కామరాజు రామారావు”గా మారినది. రెండు పేర్లు, రెండు ఇంటిపేర్లు — ఈ తికమక నుంచి బయటపడాలని ఆయన తన పేరును “శ్రీరమణ”గా మార్చుకున్నారు.

విద్యాభ్యాసం…
ప్రాథమిక విద్యను స్థానికంగా ఉన్న శ్రీరామ హిందూ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేసారు. ఫస్ట్‌ఫారమ్‌లో అంటే హైస్కూలులో అడుగుపెట్టాలంటే జరిగే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై కవిరాజా జిల్లా పరిషత్ హైస్కూల్, వేమూరులో ఫస్ట్‌ఫారమ్‌లో చేరారు. ఆ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు. స్కూలు రోజుల్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఆయనకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇలా వరసగా ఆరేళ్ళు ప్రథముడిగా నిలిచారు. పన్నెండేళ్ళ వయసులో విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వూ వచ్చింది. బాపట్ల వారి మాతామహుల ఊరు. అప్పుడే బాపట్లలో కళాశాల స్థాపించారు. బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పి.యు.సి.లో చేరారు.

వ్యక్తిగత జీవితం..
ఆయనకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య ఉన్నారు. ఆయన వివాహం వారి వదినగారి (అన్నభార్య) చెల్లెలైన జానకితో 1976లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు. వారు చైత్ర, వంశీకృష్ణ. వారి పిల్లల బాల్యం అంతా బాపు గారింట్లోనే గడిచింది. పెద్ద కుమారుడు బీ.టెక్. పూర్తిచేసి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కోడలు శాలిని, ఎంబిఏ చదివింది. మనవడు ఆదిత్య. వంశీకృష్ణ కెమికల్ ఇంజినీరింగ్‌లో పి.హెచ్‌డి. పూర్తిచేసి ఫెలోషిప్‌లో ఉన్నాడు.

సాహితీ ప్రస్థానం…
సాహితీప్రపంచానికి సుపరిచితులైన శ్రీరమణ అనేక ప్రముఖ పత్రికలలో పేరడీలు, శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి ఎన్నో శీర్షికలు నిర్వహించారు. మిథునం కథ చూసి ముచ్చటపడిన బాపు స్వీయదస్తూరిలో ఆ కథను రాసి శ్రీరమణకు పంపారు. జంపాల చౌదరిగారు (సాహితీప్రియులు, అమెరికాలో చైల్డ్ సైకియాట్రిస్ట్) ఆ దస్తూరితోనే కథను ప్రచురించి ఇప్పటికి నాలుగులక్షల మందికి అందచేశారు. మిథునం శ్రీరమణ మనసులో బాల్యం నుంచి నాటుకున్న ఆలోచనలకు అక్షరరూపం. ఇది ఎన్నో సంప్రదాయ కుటుంబాల కథ అని శ్రీరమణ చెబుతుంటారు.

తెలుగులో పేరడీ రచయితగా శ్రీరమణ సుప్రసిద్ధులు. అనేకమంది ప్రసిద్ధ రచయితల శైలిని అనుకరిస్తూ పేరడీలు రాసి స్వయంగా ఆయా రచయితల అభినందనలనూ పొందారు. వీరి పుస్తకాలను వసుధేంద్ర, అజయ్ వర్మ అల్లూరి గార్లు కన్నడలోకి,గౌరి కృపానందన్ గారు తమిళంలోకి అనువదించారు.

శ్రీరమణ గారి రచనలు…పుస్తకాలు..
1) శ్రీరమణ పేరడీలు
2) ప్రేమ పల్లకి (నవల)
3) రంగుల రాట్నం (కాలమ్)
4) శ్రీఛానెల్
5) హాస్య జ్యోతి
6) నవ్య మొదటి పేజి
7) గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలు
8) శ్రీకాలమ్
9) మిథునం (కథా సంపుటి)
10) శ్రీరామాయణం
11) మహాభారతం (విరాట వుద్యోగ పర్వాలు)
12) మానవ సంబంధాలు
13) సరసమ్.కామ్ (5 సంపుటాలు)
14) శ్రీరమణీయం
15) సింహాచలం సంపెంగ (కథా సంపుటి)
16) బొమ్మ – బొరుసు (రూరల్ ఎకానమీ కథా కమామిషు)

-మహమ్మద్ గౌస్

1 thought on “చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap