నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది…

చందమామ బాలల మాసపత్రికలో కథలు ఎంత బాగుండేవో, బొమ్మలు కూడా అంతే బాగుండేవి. ఆ బొమ్మలను చూసే కథల్లోకి వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు. 700 పైగా బేతాళకథలకు దాదాపుగా ఈయనే చిత్రాలు గీశారు. చందమామలో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియల్స్ కి వేసిన బొమ్మలతో పౌరాణికి పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్ గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చిత్రించిన శంకర్ గారు రాక్షస పాత్రలను కూాడ అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో 1951 లో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60 ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన చిత్రకారుడు శంకర్ గారి శత జయంతి సంవత్సరం ఈరోజు (19-7-23).
శంకర్ అసలు పేరు కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. 1924 జులై 19న తమిళనాడులోని ఈరోడ్‌లో ఆయన జన్మించారు. 1946 నుంచి చిత్రాలు వేయడం ప్రారంభించారు. తన చివరి శ్వాస వరకు బొమ్మలే జీవితంగా గడిపారు. చందమామ పత్రిక దేశంలోని అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో వెలువడేది. తద్వారా ఆయన దేశ ప్రజలందరికీ పరిచయమ్యారు. చందమామ మూతబడ్డ తర్వాత రామకృష్ణ పత్రికకు చిత్రాలు వేశారు.

బేతాళకథల బొమ్మలతో పాటు చందమామ మ్యాగజీన్‌లో ఎన్నో చిత్రాలను గీశారు. మ్యాగజీన్ చిత్రకారుల బృందానికి నేతృత్వం వహించారు. వందలాది సీరియళ్లు, వేల కథలకు ఆయన బొమ్మలు సింగారించారు. భారతీయ మూలాలతో ఆయన గీసే చిత్రాలు పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బాల్యం నుంచే చిత్రాలపై ఆసక్తి చూపిన శంకరన్ 1941లో మద్రాస్ గవర్నమెంట్ ఫైనార్ట్స్ కాలేజీలో చేరి శిక్షణ పొందారు. నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామ ఆయన కెరీర్‌కు బాటలు వేసింది. అనతి కాలంలోనే తెలుగు ఫ్యాంటసీ పాత్రల చిత్రకారులుగా ఆయన గుర్తింపు పొందారు.
చందమామ పత్రిక ద్వారా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రకారులు శంకర్ గారు 97 ఏళ్ల వయసులో (29-9-20)న కన్నుమూశారు. చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న మదనంతపుర ప్రాంతంలో తన కుమార్తె ఇంట్లో ఆచివరి వరకూ గడిపారు. ఆయన జీవన సహచరి షణ్ముకవల్లి (87) కుమార్తె, కుమారుడు ఉన్నారు. శంకర్ గారికి మరణానంతరం భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఇది శంకర్ గారి అభిమానులందరూ హర్షించదగినది.

________________________________________________________________________________________

అపరంజి లాంటి బొమ్మలు వేసేవాళ్ళు

చందమామ…ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. అల్లనల్లన మనం పిల్లలప్పటి రోజులు గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరిమ్పచేస్తుంది… బొమ్మలు శంకర్, చిత్ర, జయ, వీర, ప్రియతమ్, రాజి ఇలాటి అద్భుత చిత్రకారులు మనస్సులు రంజిల్లేలా అపరంజి లాటి బొమ్మలు వేసేవాళ్ళు. ఈ లిస్టులో పెద్దవారూ, అసమాన ప్రతిభాశాలీ, అత్యంత సృజనాత్మకత గల కొమ్ములు తిరిగిన చిత్రకారుడూ శ్రీ శంకర్ బొమ్మల తోనే ఏ చందమామ పుస్తకమన్నా మనముందు తెరుచుకునేది.

చిన్నప్పుడు ఆయన బొమ్మ చూసి మోహం చెందాకే కథలోకి దిగే వాణ్ణి. బొమ్మల తాలూకా కారక్టర్లు బోరింగ్ గా అనిపిస్తే కథ ఇంకెంత బోరింగో అని కథ లోకి తొంగిచూసే వాడినే కాను. అట్లా అయిదారు దశాబ్దాలు ఉర్రూతలూగించాయి ‘శంకర్’ బొమ్మలు. సరైన డ్రాయింగ్ పేపర్లు లేని కాలంలో, క్రొక్విల్ అనబడే అతి సన్నని నిబ్ తో తంటాలు పడుతూ బొమ్మలు గీయల్సివచ్చే రోజుల్లో …. ఆయన మటుకు ఎంతో అవలీలగా గీస్తూ… చూపరులకు తెలీకుండానే ఒక “త్రీడీ” ప్రపంచంలోకి తీసుకెళ్ళే బొమ్మలు అప్పట్లోనే చందమామలో రావడం… మనందరినీ మంత్రముగ్ధుల్ని చేయడం… మనకందరికీ తెలిసిన సంగతే. నేనైతే చిన్నప్పుడు ఆయా బొమ్మలు చూస్తూనే ‘ఫిగర్ డ్రాయింగ్’ అనబడే ప్రక్రియని ఏకలవ్య శిష్యరికం అనుకోండి… అలా చాలా గీసి, నా బొమ్మలు నేనే చూసుకుని మురిసేవాణ్ణి.

అలాటి శంకర్ మనకిక లేరని తెలిసాక దిగ్భ్రాంతి చెందాను. వారి బొమ్మ నెట్ లో దొరకబుచ్చుకుని ఈ బొమ్మ గీశాను. శ్రీ శంకర్ గీతల్నే ఇలా ప్రయత్నించి అంజలి ఘటించాను.

వర్చస్వీ, కార్టూనిస్ట్

5 thoughts on “నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

  1. ఇన్ని విషయాలు తెలిపిన మీకు ధన్యవాదములు
    అలాగే ప్రముఖ చిత్రకారులకు శతజయంతి ఘనమైన నివాళులు

  2. చందమామ శంకర్ గారి గురించిన వ్యాసం చదివి ఎంతో పరవశం చెందాను. ఆయనొక అద్భుతచిత్రకారుడు.నా చిన్నప్పుడుమా ఊరి గ్రంధాలయం లో ఆనాటి చందమామ చదివిన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎంతో ఆనందం కల్గింది. రచయిత శ్రీ వర్చస్వి గారికి, మీకూ అనేక కృతజ్ఞతలు.🙏🙏బొమ్మన్

  3. YES. HE IS A LEGENDARY ARTIST. THE SUCCESS OF CHANDAMAMA…. HE IS A PART OF THAT SUCCESS.

  4. బాహుబలి సినిమా పాత్రల ఆహార్యానికి ప్రేరణ శంకర్ గారి చిత్రాలే. ఆ సినిమా కథ కూడా చందమామ జానపద సీరియల్సే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap