చరిత్రలో చిరకాలం నిలిచే కథ – చింతామణి

తెలుగు నాటకం పేరు చెప్పగానే వెంటనే తలచుకొనే కొద్దిమంది నాటక కర్తలలో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు చిరస్మరణీయులు. అలాగే వందలాది తెలుగు నాటకాలలో… అందునా నూరేళ్ళకు పైగా నిలిచి ఉన్న గొప్ప నాటకాలలో చెప్పుకోదగిన “చింతామణి” నాటక రచయితగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ఈ ఏటికి చింతామణి నాటకానికి నూరేళ్లు. శతవార్షికోత్సవం జరుపుకొంటున్న నాటకం చింతామణి. ఈ సందర్భంలో కాళ్ళకూరి నారాయణరావు గురించి ఒక సమగ్రమైన వ్యాసం వ్రాయాల్సిన అవసరం ఉంది అని.. మిత్రులు..డా. కొల్లి మోహనరావు గారు చెప్పగా.. ఈ వ్యాసాన్ని అందిస్తున్నాను.ఆ మహారచయితని కేవలం చింతామణి నాటక కర్త గానే కాక..వారి బహుముఖీనమైన ప్రజ్ఞను తెలుగు నాటక ప్రేమికులు గుర్తుంచుకోవాలనే సదాశయంతో.. కొంచెం పెద్ద వ్యాసమే అందిస్తున్నాను.దయతో చూడండి. మనం ఆ ప్రసిద్ధ నాటకకర్తకు అందించే నివాళి ఇదే.

నిజానికి..ఒక్క చింతామణి మాత్రమే కాదు… కాళ్ళకూరి వారి నాటకాలు అన్నీ గొప్పవే. అన్ని నాటకాల అంతఃసూత్రం కూడా చాలా గొప్పది. సంఘసంస్కరణ కాళ్ళకూరి వారి ప్రధాన లక్ష్యం. ఆ ఉత్తమాదర్శంతోనే ఆయన నాటక రచన సాగించి, చరితార్థులయ్యారు.
కాళ్ళకూరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞావంతుడు. గొప్ప నాటకకర్త, మంచికవి, సంఘ సంస్కార ప్రియుడు, జాతీయ ఉద్యమం పైన ఎంతో నమ్మకం కలిగిన దేశభక్తుడు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఎన్నో మెలుకువలు తెలిసిన వ్యక్తి, మంత్రశాస్త్రంలో మంచి పండితుడు. గజ ఈతగాడు, ఆంజనేయ భక్తుడు. కండలు తీరిన మల్లయోధుడు.హరికథలో అందెవేసిన చేయి. నాట్య శాస్త్రంలో మంచి అభినివేశం కలిగిన ప్రతిభాశీలి. హస్తసాముద్రికంలో దిట్ట.పేరొందిన అవధాని.వీటన్నిటికీ మించి, సమాజ సంక్షేమాన్ని మనసారా కాంక్షించిన సహృదయ శేఖరుడు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం సమీపంలోని మత్స్యపురిలో 28-4-1871వ తేదీన జన్మించిన, నారాయణరావు తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బంగారు రాజులు. బంగార్రాజు మంచి కవి. వీరికి కవిరాజు అనే బిరుదుండేది.వీరి తమ్ముడు భోగరాజు కూడా మంచి కవి. ఎన్నో నవలలు, నాటకాలు రచించారు.
కాళ్ళకూరి వారి కుటుంబం.. మేధా దక్షిణామూర్తి భక్తులు. అందువల్లనే ప్రతి నాటక ప్రారంభంలోనూ మేధా దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః అనే మొదలు పెట్టేవారు.
తొలిరోజుల్లో.. పాడి వెంకట నారాయణ గారి దగ్గర
నాటక కావ్యాలంకారాలు చదుకొన్నారు.

బుద్ధిరాజువీరభద్రరావు గారి వల్ల వీరి పరిధి విస్తృతమయ్యింది.ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. దాని వల్లనే వీరి సాహితీ ప్రయాణం అభ్యుదయ దృష్టితో సాగుతూ వచ్చింది. కాళ్ళకూరి వారు యువకుడిగా ఉన్నప్పుడు వారి సోదరి గంటాలమ్మ భర్త మరణించారు. తొలి నుండి నారాయణరావు మీద కందుకూరి వీరేశలింగం గారి ప్రభావం చాలా ఉంది. అందువల్ల తన చెల్లికి రెండో పెళ్లి చేయాలని తలపెట్టారు.ఇది ఆయన తండ్రికి నచ్చ లేదు. ఈ విషయం మీద.. ఇంట్లో గొడవ పడి..ఇల్లు వదిలి వెళ్లిపోయారు.దేశ యాత్రలో కాశీ క్షేత్రాన్ని, హిమాలయాలను దర్శించారు. అక్కడే యోగవిద్యలు నేర్చుకొన్నారు. ఆంధ్రదేశానికి తిరిగి వచ్చేక…
క్రమంగా కాకినాడ కాళ్ళకూరి వారి కార్య క్షేత్రం అయ్యింది. అనాటి సామాజిక జీవనంలోని లోపాలు వారిని చాలా ఆలోచింప చేశాయి.సమాజంలోని దురాచారాలని ఖండించడానికి తన కలాన్ని.. ఖడ్గం చేసి.. నాటకాన్ని ఆయుధంగా మలచుకొన్నాడు. సమాజహితమే తన జీవన లక్ష్యంగా భావించే, నారాయణరావు తనలోని ప్రతిభను, సమాజ కళ్యాణానికే అంకితం చేసి, నాటక సాహిత్యాన్ని సృష్టించాడు. అందుకే ఆయన కలం నుండి వెలుగు చూసిన నాటకాలన్నీ ఉదాత్తమైనవిగా రూపుదిద్దుకొన్నాయి.

కాళ్ళకూరి వారి నాటక రచనలను మూడు తరగతులుగా వర్గీకరించవచ్చు.

  1. పౌరాణిక నాటకాలు
  2. సాంఘిక నాటకాలు
  3. ప్రహసనాలు
    కాళ్ళకూరి వారి సాంఘిక నాటకాలే ఎక్కువ కీర్తి పొందాయి. అంతమాత్రం చేత వారి పౌరాణిక నాటకాలు, సాధారణమైనవి కావు, అవీ అసాధారణమైనవే. అసలు వారు మొదట వ్రాసింది పౌరాణిక నాటకమే. అదే “చిత్రాభ్యుదయం”. 1909లో వ్రాయబడిన ఈ నాటకం, ప్రధానంగా సారంగధరుడి కథ. అయితే సారంగధరుడి కథ కల్పిత కథ అని వివరిస్తూ తన కథలో ఎన్నో కొత్త మార్పులు చేశారు. అందుకే ఈ నాటకానికి సారంగధర అని కాక, “చిత్రాభ్యుదయం” అని పేరు పెట్టారు. ఈ కథలో సంఘర్షణ అంతా ఇద్దరు మంత్రుల మధ్య సాగుతుంది. పెద్దమంత్రి గుణదేవుడి మీద, అసూయతో చిన్నమంత్రి హరిశర్మ…చిత్రాంగీ సారంగధరుల కథలో ఎన్నో అపార్థాలకు కారణం అవుతాడు. చివరకు, విషయం అంతా తెలుసుకొన్న రాజు, సారంగధరుడికి చిత్రాంగికి వివాహం జరిపిస్తాడు. ఇది నిజంగా కాళ్ళకూరి వారి సాహసమే. నాటకం అంతా సభ్యతతో నిండి ఉంటుంది. కథ సుఖాంతం అవడం కూడా గొప్ప విషయం.

వారి రెండవ పౌరాణిక నాటకం “పద్మవ్యూహం”. భారతకథలో అభిమన్యుడి వీరమరణానికి సంబంధించిన ఐదు శంకల నివారణకోసం వ్రాసిన నాటకం ఇది అని, కవి స్వయంగా వెల్లడించారు. 1919లో వ్రాసిన నాటకం పద్మవ్యూహం. మొదటి ప్రపంచ యుద్ధం…ఆ యుద్ధజ్వాలలు, పద్మవ్యూహ నాటకానికి ప్రేరకాలు.ఇది వీరరస ప్రధానమైన నాటకం. స్వరాజ్య ఉద్యమం దేశమంతా ఉవ్వెత్తున సాగుతున్న కాలం అది. ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ మారణకాండతో దేశప్రజల హృదయాలు రగిలిపోతున్న ఘట్టం అది. అందుకే, కవి వీరరస ప్రధానమైన కథను ఎన్నుకొని, శక్తివంతంగా నడిపించడమే కాక, నాటకంలో భారత స్వాతంత్ర్య పోరాటం వైపు ప్రజల్ని ఉద్యమించేలా చేసే గొప్ప ప్రయత్నం చేశారు. ధర్మ స్థాపన కోసం,నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటూ శ్రీకృష్ణుడి ద్వారా అర్జునుడికి గీతోపదేశం చేస్తూ దానిలో దేశభక్తిని మిళితం చేసి చూపిన గొప్ప రచయిత. ఈ నాటకానికి ఆ సంవత్సరం వచ్చిన రచనలు అన్నింటిలోకి ఉత్తమ రచనగా, గుర్తించి, కాళ్ళకూరి వారిని సత్కరించారు.

సాంఘిక నాటక రచయితగా కాళ్ళకూరి నారాయణరావు ప్రతిభ అసమానం. వారి నాటకాలలో అపూర్వమైన కీర్తి పొందిన నాటకం చింతామణి. 1921లో వ్రాయబడిన ఈ నాటకానికి ఈ ఏడు శతజయంతి.. నూరేళ్లు గడిచినా, ఈ నాటకం విలువ ఎంత మాత్రం తగ్గలేదు సరికదా, ఇప్పుడు కొత్తగా వ్రాసిన నాటకం లాగే జనాదరణ పొందుతూనే ఉంది.
“చింతామణి” పది అంకాల నాటకం. ఈ నాటకం యొక్క మూలకథ శ్రీకృష్ణ కర్ణామృతకర్తయిన లీలాశుకుడికి” సంబంధించిన కథ. లీలాశకుడి కథ గురించి స్పష్టంగా ఎక్కడా లేదు. అయితే, లీలాశుకుడు రచించారని చెప్పబడే కృష్ణకర్ణామృతానికి, ప్రసిద్ధ పండితులు శ్రీ తంజనగరం దేవప్పెరుమాళ్ళయ్య ‘పేఠిక వ్రాశారు. ఈ పేఠికలో లీలాశుకుడి గురించి ఆయన ఒక అభిప్రాయం వెల్లడించారు. కృష్ణ కర్ణామృతంలోని మొదటి శ్లోకమైన “చింతామణిర్దయతు… ప్రకారం లీలాశుకుడు పండితుడని, చింతామణి అనే వేశ్యాస్త్రీ మోహంలో పడి, తన పాండిత్యాన్ని మేధస్సును వృధా చేస్తూ వచ్చాడట. తనకోసం, సర్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడిన లీలాశుకుడ్ని చూసి, చాలా బాధపడింది చింతామణి. చివరికి, లీలాశుకుడ్ని సోమగిరి అనే గురువు దగ్గరకు పంపిందట. సోమగిరి ఉపదేశంతో లీలాశుకుడికి శ్రీకృష్ణ దర్శనం లభించిందిట. ఈ చింతామణి కథను తీసుకొని చింతామణి నాటకంగా రచించారు మహాకవి కాళ్లకూరి నారాయణరావు.
ఈ చింతామణి నాటకం ప్రధానంగా నాలుగు స్తంభాలాట. చింతామణి, బిళ్వమంగళుడు, భవానీ శంకరుడు, సుబ్బిశెట్టి అనే నాలుగు పాత్రలూ ఈ నాటకానికి నాలుగు స్తంభాలు. చింతామణి వేశ్య. అయితే ఆమెకు బాల్యం నుండే వేశ్యా వృత్తిపై విముఖత. తల్లి బలవంతం కొద్దీ ఆ దారిన నడచింది. బిల్వ మంగళుడు మంచి పుత్రుడు. ఆదర్శ భర్త. ఉత్తమ వ్యక్తి కానీ వేశ్యా వ్యామోహంలో చిక్కిజీవితాన్ని నాశనం చేసుకొని, చివరకు విరాగిగా మారిపోవడం, ఈ నాటకంలోని కథ. వేశ్యావృత్తి పేరుతో స్త్రీల జీవితాలు నాశనం కావడాన్ని ఈ నాటకంలో.. తీవ్రంగా ఖండించారు నారాయణరావు. నాటకంలో పాత్రలు అన్నీ ఆనాటి సమాజంలోని సజీవమైన పాత్రలే. ఈ నాటకంలో వాడుక భాష వినవస్తుంది. ఎంతో అందమైన సరళమైన పద్యాలు వినిపిస్తాయి. విమర్శలు ఎన్నో ఉన్నా అత్యంత జనాదరణకు పాత్రమైన గొప్ప నాటకం చింతామణి.

కాళ్ళకూరి వారి సాంఘిక నాటకాలలో మరొక ఆణిముత్యం “వర విక్రయం” గురజాడ నాటి కన్యాశుల్కం, కాళ్లకూరి వారి కాలం నాటికి “వర విక్రయం” అవతారమెత్తింది. వరకట్నం అనే సాంఘిక దురాచారం ఈ నాటికీ భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గం. దీనిని కథావస్తువుగా చేసి, కాళ్లకూరి వారు వర విక్రయం నాటకాన్ని రచించడంలోనే వారి దూరదృష్టి దర్శనమిస్తుంది.
ఆయన క్రాంతదర్శి.కథానిర్మాణంలోనూ, పాత్రపోషణలోనూ, ఈ నాటకం ఎంతో విజయవంతం అయ్యింది. ఈ నాటకంలోని పాత్రలు కూడా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడినవే. అన్నిటికన్నా ముఖ్యంగా పరమ లోభి అయిన సింగరాజు లింగరాజు పాత్ర నిస్సందేహంగా ఒక సజీవమైన పాత్ర.

కాళ్లకూరి వారి సాంఘిక నాటకాలలో మరొక గొప్ప నాటకం “మధుసేవ”. ఇందులో నాయకుడైన రఘునాధరావు మంచి వ్యక్తి. ఉన్నతమైన ఆదర్శాలతో జీవించిన ఉత్తముడు. కానీ మద్యపాన వ్యసనంతో సర్వం కోల్పోతాడు. చివరకు తన తప్పు తాను గ్రహించి పశ్చాత్తాప పడతాడు. ఈ రూపకంలోని విశ్వాసరావు పాత్ర ఎంతో అందంగా తీర్చిదిద్దిన పాత్ర. “విశ్వాసము” అనే అంశానికి ప్రతినిధి లాంటివాడు. రఘునాధరావు జీవితంలో అది, మధ్య, అంతాలలో కన్పించిన మార్పుల్ని ఈ నాటకంలో ఎంతో స్పష్టంగా చూపించారు కాళ్లకూరి వారు.

నారాయణరావు తమ పౌరాణిక రూపకాలను “నాటకాలని” సాంఘిక రూపకాలను ప్రకరణాలని పేర్కొన్నారు. ఈ ప్రకరణాలన్నీ పది అంకాలకే పరిమితాలు. ఒక్కొక్క అంకమూ, ఒక్కొక్క రంగము. వీరు సంస్కృత రూపకాలను కానీ, ఇంగ్లీషు నాటకాలను కానీ అనుసరించలేదు. వీరు నాటక రచనలో స్వతంత్రత చూపిన రచయిత. వీరి రచనలన్నీ ప్రదర్శనకు ఎక్కువ అనుకూలమైనవి. అందువల్లనే వీరి నాటకాలు… మరీ ముఖ్యంగా సాంఘిక నాటకాలు గత నూరేళ్ళుగా ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. ఆపైన అవి చలన చిత్రాలుగా రూపుదిద్దుకొన్నాయి కూడా! 1921వ సంవత్సరం ప్రాంతంలో విజయవాడలో కాళ్లకూరి వారు కొన్ని ప్రసంగాలు కూడా రచించారు. ప్రహసనమనే ప్రక్రియ, తెలుగులో అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వచ్చింది. అయితే, నాటక రచయితలు అందరూ ప్రహసన రచనవైపు ప్రయత్నం చేయలేదు. నారాయణరావు ప్రహసనాలను కూడా విజయవంతంగా తీర్చిదిద్దారు. వారు మంచి ప్రహసనాలను రచించారు. వారి తొలి ప్రహసనం లుబ్బాగ్రేసర చక్రవర్తి ప్రహసనం 1909వ సంవత్సరంలో రచించారు. ఆ తరువాత రూపాయ గమ్మత్తు (1920), కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వెలువడ్డాయి.వారి మరికొన్ని ప్రహసనాలు..పుష్కరాల కబుర్లు,గణపతి గత్తర,కాలేజీ గర్ల్,ఆడంగుల మీటింగ్,పొగచుట్ట- సిగరెట్టు పోరు,మొదలైనవి.ఈ ప్రహసనాలన్ని ఆ నాటి సమాజంలోని మూఢ నమ్మకాలను,దురాచారాలను తీవ్రంగా ఖండించాయి.
ఈ ప్రహసనాలన్నీవిజయవంతమైన ప్రహసనాలే.

నారాయణరావు మంచి నవల వ్రాసారు.ప్రతాప రుద్రమదేవి ఆ నవల.కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రమదేవి కథ అది.వారు
చాలా కథలు కూడా వ్రాసారు.వాటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.1.నీతి బోధకమైన కథలు.2.పెద్దలనాటి ముద్దు కథలు 3.విచిత్ర నీతికథలు.ఇందులో కొన్ని చారిత్రక కధలు.మరికొన్ని..జానపద కథలు. ఇంకొన్ని..హాస్యంతో నిండిన కల్పిత కథలు. ఈ కథలలో చాలా కథలు..మనోరంజని పత్రికలో ప్రకటించబడ్డాయి.

ఇంతేకాక.. వారు రెండు వచన గ్రంథాలు వ్రాసారు.
1.సదండ విదండ వివాదం
2.మారుతము.వీటితో బాటుగా మరో రెండు చరిత్ర గ్రంథాలు రచించారు.
అవి.. 1. ఢిల్లీ సామ్రాజ్యము 2. జార్జి రాజసూయము
వీటన్నితో పాటుగా..మరెన్నో వ్యాసాలు వ్రాసారు.ఇంకెన్నో గ్రంథ విమర్శలు ఆయన కలం నుండి
వెలువడ్డాయి.ఎన్నో సందర్భాలలో మధురమైన పద్యాలు రచించారు.మహాబలుడు..కోడి రామ్మూర్తి గారిని ప్రశంసిస్తూ రచించిన పద్యాలు,వీరేశలింగం గారిని కీర్తిస్తూ రచించిన పద్యాలు ఎంతో అందమైనవి.
ఈయన చిత్ర కావ్యాలు కూడా చాలా గొప్పవి.

కాళ్ళకూరి నారాయణ రావు మంచి నటుడు.ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశంతో కలిసి నటించారు.
వేణిసంహారంలో వీరు అశ్వద్ధామ గా నటిస్తే..ప్రకాశం గారు ద్రౌపది.చిత్ర నళీయంలో వీరు..నలుడు,
బాహుకుడుగా నటిస్తే..ప్రకాశం గారు దమయంతిగా
నటించేవారుట.
చాలా అందమైన రూపం.నిమ్మపండులాంటి పసిమి ఛాయ. ఆజానుబాహుడు.కొప్పరపు సోదర కవులకు చాలా మంచి మిత్రులు.తన రచనలన్నీ తనకు ఎంతో ఆప్తులైన బుద్ధిరాజు వీరభద్రరావు గారికి అంకితమిచ్చారు.ఆయన సంఘ సంస్కరణ కేవలం రచనలకు మాత్రమే పరిమితం కాదు.నిజజీవితంలో కూడా ఆచరించి చూపించారు.కళావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు.వారి పేరు చంద్రముఖి.ఆయన మంచి భోజన ప్రియులు.గుత్తివంకాయ కూరంటే వారికి చాలా ఇష్టం.పెద్ద విస్తరి 5వేసుకొని కూర్చుని..భోజనం ఆస్వాదిస్తూ చేసేవారట వీరికి నాట్య శాస్త్రంలో మంచి ప్రవేశం ఉండడం వల్ల,శ్రీకృష్ణ కర్ణామృతం లోని శ్లోకాలను అభినయించి చూపేవారట.వీరి ప్రతిభకు మెచ్చిన విరూపాక్ష పీఠాధి పతులు కాళ్ళకూరి నారాయణరావును మహాకవిగా ప్రస్తుతించి,సత్కరించారు.నిజంగా వారిది గొప్ప కథ.

జాతి చరిత్రలో చిరకాలం నిలిచే కథ.
తెలుగు నాటక రంగంలో, రచయితగా, నటుడిగా చిరస్మరణీయులు కాళ్లకూరి నారాయణరావు. ఆయన రచించిన నాటకాలూ చిరకాలం జీవించే ఉంటాయి. ఇంతటి మహా రచయిత కేవలం ఏభై ఆరేళ్ళ కాలం మాత్రమే జీవించి, 1927 జూన్ 27వ తేదీన స్వర్గస్తులయ్యారు. వీరు మరికొంత కాలం జీవించి ఉంటే తెలుగు నాటకరంగం మరెన్నో గొప్ప నాటకాలను అందుకొని ఉండేదేమో!

-వాడ్రేవు సుందర్రావు, 9396473287

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap