
భారతీయ సంప్రదాయం నృత్యరీతులలో కూచిపూడికి ప్రత్యేకస్థానం ఉంది. నృత్యనాటికలు, రూపకాలు, శాస్త్రీయనృత్య ప్రదర్శనలతో ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో పాటు, సమకాలీన అంశాలను కూడా ఇతివృత్తాలుగా తీసుకుని ప్రజల మనసుల్లోకి నవరసాల్ని చొప్పించగల మహత్తర సాధనం నాట్యం. ఆంధ్రరాష్ట్రానికి అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను అందించిన అపురూపమైన నాట్యకళా ప్రక్రియగా కూచిపూడి ఎంతగానో ప్రఖ్యాతి గాంచింది.
అలనాటి కూచిపూడి నాట్య దిగ్గజాలు వేదాంతం రాఘవులు, వెంపటి చిన సత్యం మొదలుకుని వర్గమాన నాట్యకళాకారుల వరకు తెలుగువారి సాంస్కృతిక వారధులుగా కూచిపూడి కళా వైభవాన్ని, భారతీయ ఆచార వ్యవహారాలు, చారిత్రక ప్రాభవాలను దశదిశలా వ్యాప్తి చేస్తున్నారు.
కూచిపూడి నృత్యాన్ని మరింత శోభాయమానం చేసిన ప్రక్రియలలో రూపాను రూపానికి ప్రత్యేక స్థానం ఉంది.
భామా కలాపం రుక్మిణీ పరిణయం వంటి పలు అంశాలలో స్త్రీ పాత్రలను పోషించి, అతివలను సైతం అబ్బురపరచిన నాట్యకారుల అసామాన్య ప్రతిభా పాటవాలు ఆ ప్రక్రియ గొప్పదనాన్ని చాటిచెపుతున్నాయి.
అటువంటి రూపానురూప ప్రక్రియకు తన నాట్య కళను అంకితం చేసి కేవలం స్త్రీ పాత్రలకే పరిమితమై అతివలకే అసూయపుట్టేంతగా ఒయ్యారాలొలికిస్తూ, ఆహార్యం, అభినయాలలో చూపరులను, కళాభిమానులను, అందమైన అమ్మాయిగా భ్రమింపజేస్తూ, ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న వర్ధమాన కళాకారుడు అజయ్ కుమార్, విద్య వినయాన్ని సమకూర్చుతుందన్న మాటకు ఇతడు నిలువెత్తు నిదర్శనం. కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు కూచిపూడి మొదలుకుని దేశ సాంస్కృతిక రాజధాని విజయవాడలో అతడు ఎక్కని వేదిక లేదు ఆ అందాల సవ్వడి మోగని చోటు లేదు. మనదేశంలోను, విదేశాలలో కూడా కూచిపూడి గిన్నీసు రికార్డుల కార్యక్రమాలతో పాటు ఇస్కాన్ దేవాలయం వంటి అనేక పవిత్ర స్థలాల్లో అజేయుని నృత్యప్రదర్శనలు అభినందనీయాలు.
మగవారు ఆడవారి పాత్రలను ధరించి నృత్య ప్రదర్శన ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. పురుష సహజమైన గాంభీర్యాన్ని బయటపడకుండా స్త్రీలకు మాత్రమే సొంతమైన లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని ప్రదర్శించటం ఒక సవాలైతే…
యువకుడైన అజయ్ కుమార్ చిన్ననాటి నుండీ స్త్రీ పాత్రలు చేస్తూ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకి తెలియంది కాదు. అయినప్పటికీ అతని సంకల్పం ముందు ఏ అవాంతరం నిలబడలేదు. స్వశక్తితో నిత్య విద్యార్థిగా ఒక్కొక్క మెట్టు ఎదిగాడు. తనలాంటి ఎందరినో తయారు చేసే సంకల్పంతో హంసధ్వని నృత్యాలయ సంస్థను స్థాపించి, అనేక మంది చిన్నారులను నాట్య మయూరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అవార్డులు, సత్కారాలు మనిషిలో అహంకార భీజాన్ని నాటుతాయంటారు. కానీ ఈ కళాతేజం అహంకారం, అసూయ, ప్రశంసలపై మోజు వంటి చీకట్లను చీల్చుకుంటూ స్వచ్ఛమైన కాంతిపుంజంగా నటరాజ పదార్చన చేస్తూ… వినమ్రుడై, విజేయుడై… అజేయుడై మాతృమూర్తి కలల దీపం కావాలని… అజేయంగా కూచిపూడి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఈ కొత్త సంవత్సరంలో… మంచి మనసులతో… శుభాకాంక్షలందిద్దాం.
– పద్మకళ
He is a great dapncer. Congrats Ajay kumar
Nice article. Thanks Padmakala garu
Wow, wonderful performer in lady getup.
Very good dancer.