మనలోనే విజేతలు ఉంటారు. కానీ మనం పట్టించుకోం. ఎవరో తెలియని వారి జీవితం గురించి ఆహా గ్రేట్ అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ స్టోరీ ఉంటుంది. అలాంటి ఒక విజేత గుదిబండి వెంకటరెడ్డి గారు. నేను ప్రేమగా బాబాయ్ అని పాతికేళ్లుగా పిలుచుకుంటున్న వెంకటరెడ్డి గారి గురించి రెండు మాటలు.
వెంకటరెడ్డి గారు చదివింది ఆ రోజుల్లో SSLC మాత్రమే. పోలీస్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్ గా 1954లో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. విద్యా శాఖలో డిప్యూటీ సెక్రటరీ క్యాడర్ లో 2000 మిలీనియం సంవత్సరంలో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ప్రతి నెల లక్షకు పైగా పెన్షన్ పొందుతున్నారు. ఈ విజేత వయసు 83 ఏళ్ళు.
పెద్దాయనది పెద్ద మనసు. పెన్షన్ లోంచి ఖర్చు పెడుతూ సాంస్కృతిక రంగానికి విశేష సేవ చేస్తుంటారు. కళాకారులను, రచయితలను సన్మానిస్తూ ప్రోత్సహిస్తుంటారు. యువకళావాహిని సభ్యులుగా సాంస్కృతిక రంగంలో ప్రవేశించి, కొన్నాళ్ళు ఆరాధన సంస్థను నడిపి, తరువాత జివిఆర్ ఆరాధన సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ప్రతినెలా ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు.
ఎంత దూరం అయినా బస్సు, ఆటో ఎక్కక పోవడమే తన ఆరోగ్య రహస్యం అంటారు వెంకట రెడ్డి గారు. ఎక్కడకు వెళ్లాలన్నా నడకనే నమ్ముకోవడం ఆయన బలం. అందరితో మంచిగా వుంటూ అందరిని కలుపుకుంటూ అందరివాడుగా అందరిలో పెద్దగా మసలుకుంటూ అందరి అభిమానాన్ని ప్రేమను గెలుచుకున్నారు. క్రమశిక్షణ జీవితం ఆయనకు అత్యంత ఇష్టం. అంతా టైం ప్రకారం జరిగిపోవాలి. లేదంటే ఇప్పటికీ ఈ వయసులో కూడా చిన్న పిల్లాడిలా అలుగుతారు. కొన్నాళ్ళు మాట్లాడటం మానేస్తారు. మళ్ళీ తనే పలకరించి కలుపుకుని పోతుంటారు.
ప్రతి పుట్టినరోజు ఒక కవితా సంకలనం తీసుకొస్తారు. ఆయనకు నచ్చిన ఊరు, అమ్మ, ఉమ్మడి కుటుంబం… ఇలా ఆయనకు నచ్చిన అంశంపై కవితలు ఆహ్వానించి సంకలనం చేసి ఆవిష్కరిస్తుంటారు. హరికథ భాగవతార్లకు ప్రతినెలా ఆర్ధిక సహకారం అందిస్తుంటారు. సాహితీ కిరణం అనే సాహిత్య పత్రిక కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తూ వివిధ రకాల పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తుంటారు. ఇలా నిత్యం ఏదొక సాహిత్య సాంస్కృతిక సేవలో తరిస్తూ హాయిగా సాఫీగా తృప్తిగా జీవితాన్ని గడిపేసే బాబాయ్ వెంకటరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. వారి జీవితం స్ఫూర్తిదాయకం. అయనొక గొప్ప విజేత. ఏప్రిల్ 2న 83వ పుట్టినరోజు జరుపుకున్నారు. త్యాగరాయ గానసభలో ఆత్మీయ పురస్కారాలతో మిత్రులను సత్కరించుకున్నారు. నిన్న ప్రెస్ క్లబ్ లో మిత్రులు అభినందన వేడుక ఏర్పాటు చేసి ఆయన్ని సత్కరించుకున్నారు. ఈనెల 30న 64వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ధన్యజీవి వెంకట రెడ్డి గారికి శుభాకాంక్షలు. వారి ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడూ ఇదేవిధంగా నాపై, కళాకారులపై ఉండాలని కోరుకుంటున్నాను. 108 ఏళ్లు హాయిగా సాంస్కృతిక సేవ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడ్ని వేడుకుంటున్నాను.
–డా. మహ్మద్ రఫీ