శతజయంతి సుందరుడు… దేవానందుడు!

1959 లో అఖిల భారత్ కాంగ్రెస్ మహాసభలు నాగపూర్ లో జరిగినప్పుడు పండిత జవహర్ లాల్ నెహ్రు హిందీ చలనచిత్ర సీమకు చెందిన ఒక ప్రముఖ నటుణ్ణి ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. అతడే హిందీ చలన చిత్రసీమలో నూతన ఒరవడి సృష్టించిన అందాల నటుడు ‘దేవ్ ఆనంద్’ అని పిలువబడే ధరమ్ దేవదత్ పిషోరిమల్ ఆనంద్. అతడు నటుడే కాదు, మంచి రచయిత, నిర్మాత, దర్శకుడు… దార్శనికుడు కూడా. ప్రధాని సహాయ నిధికి ఢిల్లీలో హిందీచిత్ర పరిశ్రమ ప్రత్యేక వినోద కార్యక్రమాలను నిర్వహించినప్పుడు జవహర్ లాల్ నెహ్రు తన నివాసం తీన్ మూర్తి భవన్ కు దేవ్ ఆనంద్ ను తేనీటి విందుకు ఆహ్వానించారు. ఇందిరా గాంధి స్వయంగా స్వాగతం పలికి దేవ్ ఆనంద్ ను నెహ్రూ వద్దకు తోడ్కొని వెళ్ళడం అతనికి లభించిన అరుదైన గౌరవం. ఇందిరా గాంధి విధించిన ఆత్యయిక పరిస్థితిని వ్యతిరేకించి ఉద్యమం నడిపిన ధీశాలి కూడా దేవానందే. ‘స్టైల్’ అనే పదానికి భాష్యంచెప్పి, యువతను తనవైపుకు తిప్పుకున్న ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో దేవ్ ఆనంద్. అరవై మూడేళ్ళ వయసులోకూడా పద్మిని కొల్హాపురి వంటి పిన్న వయస్కురాలి సరసన హీరోగా నటించిన ఘనత దేవ్ ఆనంద్ కే దక్కింది. ‘ఇండియన్ గ్రెగొరీ పెక్’ గా కీర్తించబడిన దేవ్ ఆనంద్ నవకేతన్ బ్యానర్ మీద 35 సినిమాలు స్వంతంగా నిర్మించి వాటిలో 19 సినిమాలకు తనే దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 26 దేవ్ ఆనంద్ శతజయంతి ప్రారంభమయిన సందర్భంగా దేవ్ ఆనంద్ ను గురించి కొన్నివిశేషాలు……….

సినీరంగంలో తొలి రోజులు:

దేవ్ ఆనంద్ పుట్టింది 26, సెప్టెంబర్ 1923 న అవిభాజ్య భారత్ లో వున్న పంజాబ్ రాష్ట్రంలోని నారోవాల్ జిల్లా షక్కరఘడ్ గ్రామంలో. తండ్రి పిశోరిలాల్ ఆనంద్ పేరుమోసిన లాయరు. ప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు చేతన్ ఆనంద్ దేవ్ ఆనంద్ కు అన్న, గురుదాస్ పూర్ జిల్లా కోర్ట్ లో పెద్దన్నయ్య మన్మోహన్ ఆనంద్ ప్రముఖ న్యాయవాది. సిల్వర్ జూబిలీ సినిమాల దర్శకుడు ‘గోల్డీ’ గా పిలువబడే విజయ్ ఆనంద్ దేవ్ ఆనంద్ కు తమ్ముడు. దేవ్ ఆనంద్ నాటి పంజాబ్ రాష్ట్రం లోని డల్హౌసీ సేక్రెడ్ హార్ట్ స్కూల్ లో, తర్వాత ధర్మశాల ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. లాహోర్ ప్రభుత్వ కళాశాలనుండి ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టభద్రుడు. డిగ్రీ పూర్తవగానే 1940లో దేవ్ ఆనంద్ బొంబాయి వచ్చేశాడు. చర్చిగేటు వద్ద వుండే మిలిటరీ సెన్సర్ కార్యాలయంలో ఉద్యోగానికి కుదిరాడు. అప్పటికే తన అన్న చేతన్ ఆనంద్ ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్’ అనే సంస్థను నడుపుతుండేవాడు. క్రమంగా దేవ్ ఆనంద్ అందులోకి మారి నటనమీద మోజు పెంచుకున్నాడు. అశోక్ కుమార్ నటించిన ‘అచ్యుతకన్య’, ‘కిస్మత్’ సినిమాలు దేవ్ ఆనంద్ మీద పెద్ద ప్రభావాన్నే చూపాయి. ఒకసారి ప్రభాత్ ఫిలిం స్టూడియో అధిపతి బాబురావు పాయ్ దేవ్ ఆనంద్ ను చూశాడు. అతని కళ్ళు, చిరునవ్వు నవ్వే విధానం పాయ్ కి ఎంతగానో నచ్చాయి. వెంటనే హిందూ ముస్లిం ఐక్యత ప్రధాన అంశంగా నిర్మించిన ‘హమ్ ఏక్ హై’(1946) సినిమాలో కమలాకొట్నిస్ సరసన నాయకుడి వేషాన్నిచ్చి దేవ్ ఆనంద్ ను ప్రోత్సహించాడు. ఈ సినిమాకు ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు, గురుదత్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. ఒకరోజు పుణేలో షూటింగ్ జరుగుతుండగా దేవ్ ఆనంద్ కు చెందిన చొక్కావేసుకొని గురుదత్ ప్రత్యక్షమయ్యాడు. ఆ చొక్కా దేవ్ ఆనంద్ దనే విషయం గురుదత్ కు తెలియదు. ఆ విషయాన్ని దేవ్ ఆనంద్ ప్రస్తావించినప్పుడు “నా చొక్కా చిరిగిపోతే, ల్యాండ్రీకుర్రాడు ఈ చొక్కా వేసుకోమని యిచ్చాడు” అని గురుదత్ దేవ్ ఆనంద్ కు చెప్పాడు. అలా దేవ్ ఆనంద్ కు గురుదత్ తో పరిచయమై అది విడరాని మైత్రీబంధానికి బాటలు వేసింది. వారిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. “గురుదత్ ముందుగా ఫిలింమేకర్ అయితే దేవ్ ఆనంద్ అందులో హీరోగా నటించాలి…అదే దేవ్ ఆనంద్ గురుదత్ కన్నా ముందు నిర్మాత అయితే, ఆ సినిమాకు గురుదత్ దర్శకత్వం వహించాలి” అనేదే ఆ ఒప్పందసారాంశం. దాన్ని గౌరవిస్తూ దేవ్ ఆనంద్ తన సొంత క్రైం థ్రిల్లర్ సినిమా ‘బాజీ’(1951)లో గురుదత్ కు దర్శకునిగా తొలిఅవకాశాన్నిచ్చాడు. ఆ సినిమా గురుదత్ గతినే మార్చివేసింది. ‘హమ్ ఏక్ హై’ సినిమా తరువాత దేవ్ ఆనంద్ 1947లో ‘మోహన్’, ‘ఆగే బడో’ అనే రెండు సినిమాల్లో నటించాడు. ఆ తరవాత నటించిన ‘జిద్ది’, ‘విద్యా’, ‘హమ్ భి ఇన్సాన్ హై’ (1948) సినిమాల్లో దేవ్ ఆనంద్ కు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా తను అభిమానించే అశోక్ కుమార్ స్వయంగా దేవ్ ఆనంద్ కు ‘జిద్ది’ సినిమాలో చోటివ్వడం, కిషోర్ కుమార్ తొలిసారి దేవ్ ఆనంద్ కు పాట పాడడం దేవ్ ఆనంద్ కు ఆనందాన్నిచ్చింది. 1949లో ‘ఉధార్’, ‘షాయర్’, ‘జీత్’ సినిమాల్లో దేవ్ ఆనంద్ నటించాడు. 1950లో దేవ్ ఆనంద్ యేకంగా 8 సినిమాల్లో నటించడం విశేషం. అప్పుడే ‘నవకేతన్’ ఫిలిమ్స్ పేరుతో సొంత సంస్థను నెలకొల్పి తన అన్న చేతన్ ఆనంద్ దర్శకత్వంలో ‘అఫ్సర్’ అనే సినిమా నిర్మిస్తే అదికాస్తా ఫ్లాపయింది. ఇందులో సురయ్యా హీరోయిన్ గానే కాకుండా సచిదేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో పాటలుకూడా పాడింది. 1951లో నవకేతన్ బ్యానర్ మీద గురుదత్ దర్శకత్వంలో ‘బాజీ’ చిత్రాన్ని నిర్మించి స్టార్డం అందుకున్నాడు. హాలీవుడ్ సినిమా ‘గిల్డా’ స్పూర్తితో నిర్మించిన ‘బాజీ’ సినిమా హిందీలో వచ్చిన తొలి క్రైం థ్రిల్లర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రేమాయణం:

దేవ్ ఆనంద్ సురయ్యా ప్రేమలోపడ్డాడు. గిరీష్ త్రివేది సినిమా ‘విద్యా’(1948)లో దేవ్ ఆనంద్ సరసన సురయ్యా నటించింది. 40,50 దశకాల్లో సురయ్యా అటు నటిగా ఇటు మంచి గాయనిగా ఒక వెలుగు వెలిగిన విశిష్ట వ్యక్తి. ఆమె కె.యల్. సైగల్ మెప్పుపొంది భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారి ‘క్వీన్ ఆఫ్ మెలోడీ’ గా గుర్తింపు పొందిన మహిళ. ఆరోజుల్లో దేవ్ ఆనంద్ కన్నా యెక్కువ పారితోషికాన్ని సురయ్యా తీసుకునేది. ‘విద్యా’ సినిమా నిర్మాణ సమయంలో “కినారే కినారే చలే జాయేంగే” అనే పాటను చిత్రీకరిస్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న బోటు ఫల్టీ కొట్టింది. సురయ్యా నీటిలో మునిగిపోతుండగా దేవ్ ఆనంద్ ఆమెను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ సంఘటనతో సురయ్యా దేవ్ ఆనంద్ కు దగ్గరయింది. దుర్గాఖోటే, కామినీ కౌశల్ వారిద్దరి ప్రేమకు మద్దతు తెలిపారు. తరవాత ‘జీత్’ సినిమాలో నటిస్తున్నప్పుడు దేవ్ ఆనంద్ తన ప్రేమ చిహ్నంగా ఆరోజుల్లోనే మూడువేల రూపాయల విలువచేసే వజ్రపుటుంగరాన్ని ఆమెకు బహూకరించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న దశలో సురయ్యా అమ్మమ్మ వారికి అడ్డుతగిలింది. హిందూ మతస్థుడైన దేవ్ ఆనంద్ తో ముస్లిం మతస్థురాలైన సురయ్యా పెళ్లి జరగడానికి వీల్లేదంది. అంతటితో వీరిద్దరి ప్రేమాయణానికి తెరపడింది. దేవ్ ఆనంద్ తో కలిసి సురయ్యా ‘షాయిర్’, ‘అఫ్సర్’, ‘నీలి’, ‘సనమ్’ సినిమాల్లో నటించాక 1951లో దేవ్ ఆనంద్ సాంగత్యానికి స్వస్తి చెప్పి అవివాహితగానే వుండిపోయి, అసలైన ప్రేమకు నిర్వచనమై నిలిచింది. దేవ్ ఆనంద్ –సురయ్యా కలిసి నటించిన చివరి చిత్రం. దేవ్ ఆనంద్ ‘దో సితారే’. సురయ్యాతో విఫలమైన ప్రేమకు కల్పనాకార్తిక్ అతనికి ఊరట నిచ్చింది. తన సొంత సినిమా ‘బాజీ’ తో ప్రయాణం మొదలెట్టి మరో ఆరు సినిమాల్లో దేవ్ ఆనంద్ కల్పనాకార్తిక్ తో హీరోగా నటించాడు. మనసులు కలిసి ఇద్దరూ 1954లో ‘టాక్సీ డ్రైవర్’ సినిమా షూటింగ్ విరామంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారికి సునీల్ ఆనంద్, దేవీనా ఆనంద్ అనే ఇద్దరు సంతానం. దేవ్ ఆనంద్ తమ్ముడు విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘నవ్ దో గ్యారాః’ కల్పనా నటించిన ఆఖరి సినిమా. నటుడు అశోక్ కుమార్ దేవ్ ఆనంద్ కు జిద్ది చిత్రం తో బ్రేక్ ఇప్పించాడు.

నటనాలయం:

1948లో కామినీకౌశల్ తో నటించిన ‘జిద్దీ’ సినిమా దేవ్ ఆనంద్ కు తొలి బ్రేక్ ఇచ్చింది. కిశోర్ కుమార్-లతామంగేష్కర్ పాడిన తొలి యుగళగీతం “యే కౌన్ ఆయా కర్కే యే సోలా సింగార్” ఈ సినిమాలోనిదే. అక్కడనుండే కిషోర్ తో స్నేహం బలపడి నాలుగు దశాబ్దాలపాటు నిలిచింది. 1949లో సొంత ఫిలిం కంపెనీ ‘నవకేతన్’ నెలకొల్పి దేవ్ ఆనంద్ 2011 దాకా 35 సినిమాలు నిర్మించాడు. దేవ్ ఆనంద్ డైలాగ్ డెలివరీ ఒక ప్రత్యేక పంధాలో వుండేది. ముఖాన్ని ఒక ప్రక్కకు వంచి తల వూపే విధానం, చిరునవ్వు నవ్వే పధ్ధతి యువతను యెంతగానో అలరించింది. ముఖ్యంగా హౌస్ నెం-44, నవ్ దో గ్యారాః, పాకెట్ మార్, మునీమ్ జీ, ఫంతూష్, పేయింగ్ గెస్ట్ సినిమాల్లో దేవ్ ఆనంద్ స్టైల్ ను, హెయిర్ స్టైల్ ను యువత అనుకరించడం మొదలెట్టింది. 1950 దశకంలో వహీదారెహమాన్ తో నటించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆమె హిందీలో నటించిన తొలిచిత్రం దేవ్ ఆనంద్ సూపర్ హిట్ సినిమా ‘సి.ఐ.డి’. తరవాత సోల్వాసాల్, బాత్ ఏక్ రాత్ కి, కాలాబజార్, కాలాపానీ, సినిమాల్లో దేవ్ ఆనంద్ సరసన వహీదా నటించింది. కాలాపానీ సినిమాలో అద్భుతమైన నటనకు దేవ్ ఆనంద్ కు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. దేవ్ ఆనంద్ శతజయంతి సంవత్సరం మొదలైన రోజే వహీదా రెహమాన్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార ప్రకటన రావడం యాదృచ్ఛికం! బొంబయ్ కా బాబూ, షరాబీ సినిమాల్లో దేవ్ ఆనంద్ కాస్త సీరియస్ పాత్రలు పోషించాడు. అంతే కాదు దేవ్ ఆనంద్ కొన్ని నెగటివ్ పాత్రలు కూడా పోషించడం విశేషం. ‘జాల్’ సినిమాలో స్మగ్లర్ గా, ‘దుష్మన్’ లో పరారీలో వున్న గూండాగా, కాలాబజార్ లో బ్లాక్ మార్కెటర్ గా దేవ్ ఆనంద్ పోషించిన నెగటివ్ పాత్రల్ని జనం మెచ్చుకున్నారు. 1960 దశకం దేవ్ ఆనంద్ ని తిరుగులేని సూపర్ స్టార్ గా నిలబెట్టింది. నూతన్ సరసన ‘తేరే ఘర్ కె సామ్నే’, ‘మంజిల్’; మీనాకుమారి సరసన ‘కినారే కినారే’; మాలాసిన్హా సరసన ‘మాయా’; ఆశా పారేఖ్ సరసన ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’, ‘మహల్’; సాధనా సరసన ‘అసలీ-నకిలీ’; కల్పనా, సిమి, నందాల సరసన ‘తీన్ దేవియా’ సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచి దేవ్ ఆనంద్ ని శృంగార నాయకుడిగా నిలబెట్టాయి.

చరిత్ర సృష్టించిన ‘గైడ్’:

1965లో తమ్ముడు విజయ్ ఆనంద్ దర్శకత్వంలో దేవ్ ఆనంద్ తన తొలి కలర్ సినిమా ‘గైడ్’ ని నిర్మించారు. ఆర్.కె. నారాయణ్ రాసిన ఇంగ్లీషు నవలను సినిమాగా నిర్మిస్తానని దేవ్ ఆనంద్ ప్రకటించినప్పుడు యెన్నో విమర్శలొచ్చాయి. నాట్యమంటే చెవికోసుకొనే ఒక వివాహిత మహిళ భర్తనువదిలేసి పరాయివాడితో వుంటూ కీర్తిప్రతిష్టలు ఆర్జించడం ఈ సినిమా నేపథ్యం కావడం ఈ విమర్శలకు కారణం. ఈ సినిమాను హిందీ, ఇంగ్లీషు భాషల్లో యేకకాలంలో నిర్మించారు. ఇందులో నాట్యం ప్రధానపాత్ర వహిస్తుండడంతో వహీదారెహమాన్ ని నాయికగా, రాజ్ ఖోస్లాను దర్శకునిగా తీసుకుందామనుకున్నారు. అయితే వహీదా రెహమాన్ రాజ్ ఖోస్లా నియామకాన్ని వ్యతిరేకించింది. అంతకుముందు ఒక సినిమాలో వహీదాను లోనెక్ జాకెట్టుతో నటించాల్సిందిగా రాజ్ ఖోస్లా ఆదేశించడం ఇందుకు కారణం. అప్పుడు తమ్ముడు విజయ్ ఆనంద్ ముందుకు వచ్చి స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి, ఉదయపూర్ లో షూటింగుజరిపి సినిమా పూర్తి చేశాడు. సినిమా విడుదలయ్యాక ఈ సినిమా అంచనాలకు మించి ఆడింది. ఏకంగా ఐదు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఈ సినిమాకు సంగీతం ప్రాణం. దేవ్ ఆనంద్ సొంత సినిమాలకు సంగీతం సమకూర్చే సచిదేవ్ బర్మన్ అస్వస్థుడు కావటంతో దేవ్ ఆనంద్ వేచి చూచాడే కానీ వేరే సంగీత దర్శకుని తీసుకొనే ప్రయత్నం చేయలేదు. దేవ్ ఆనంద్ కు బర్మన్ దాదా మీద వున్న అచంచల విశ్వాసం అలాంటిది. ఆర్.కె. నారాయణ్ మాత్రం యీ సినిమా చూసి పెదవి విరిచాడు. తన నవల మూలకథను వక్రీకరించారనే అభియోగం మోపాడుకూడా. కానీ, యధాతధంగా ఆనవలను సినిమాగా మలిచివుంటే మాత్రం దేవ్ ఆనంద్ నష్టపోయి వుండేవాడు. అది నిజమని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి ‘గైడ్’ ను ఆదరించారు. ఈ చిత్రాన్ని భారత దేశ అధికారిక ఎంట్రీగా ఆస్కార్ బహుమతికోసం ఎంపికచేసి పంపింది. ఈ సినిమాను ఏకకాలంలో 120 నిముషాల నిడివితో ఇంగ్లీషులో తీశారు. ప్రఖ్యాత రచయిత్రి పెరల్. యస్. బక్ ఈ సినిమాకు స్క్రిప్టు సమకూర్చడమే కాక భాగస్వామిగా కూడా నిలిచింది. కానీ ఇంగ్లీషు వర్షన్ నిరాశ పరచింది. తరువాత గోల్డీ దర్శకత్వంలోనే వైజయంతిమాల హీరోయిన్ గా నిర్మించిన ‘జ్యువెల్ తీఫ్’ అఖండ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ విజయ పరంపర హేమామాలినితో నటించిన ‘జానీ మేరా నామ్’ కు కూడా విస్తరించింది.

దర్శకావతారం:

1970లో దేవ్ ఆనంద్ దర్శకునిగా మరో అవతారమెత్తాడు. అతడు తొలిసారి దర్శకత్వం వహించిన ‘ప్రేమ పూజారి’ ఫ్లాప్ చిత్రంగా ముద్రపడింది. అయితే తర్వాతి సంవత్సరం నిర్మించిన ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా సంచలనం సృష్టించింది. జీనత్ అమన్ వెండితెరకు పరిచయమైన సినిమా ఇదే! అలాగే 1973లో తీసిన ‘హీరాపన్నా’ సినిమా కూడా విజయవంతమైంది. దర్శకుడిగా మిశ్రమ ఫలితాలు రాబట్టినా ఆ దశకంలో రాఖీతో నటించిన ‘బనారసిబాబు’, హేమామాలినితో నటించిన ‘ఛుపారుస్తుమ్’, ‘అమీర్ గరీబ్’, పర్వీన్ బాబీతో నటించిన ‘బుల్లెట్’, జీనత్ అమన్ తో నటించిన ‘వారంట్’, ‘డార్లింగ్ డార్లింగ్’ సినిమాలు విజయవంత మయ్యాయి. 1995లో దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్ స్టర్’ సినిమాలో చూపిన దిగంబర అత్యాచర సన్నివేశం విమర్శలపాలయింది. 1990 తరవాత దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల్లో ‘అవ్వాల్ నంబర్’ సినిమా మినహాయిస్తే అన్నీ పరాజయంపాలైనవే! దేవ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ‘చార్జ్ షీట్’(2011). హాలీవుడ్ నటుడు గ్రెగరీ పెక్ తో పోలిక కలిగిన దేవ్ ఆనంద్ కు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డులిచ్చి గౌరవించింది.

ముక్తాయింపు :

జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులతోబాటు దేవ్ ఆనంద్ ముంగిట లెక్ఖలేనన్ని పురస్కారాలున్నాయి. రెండు దఫాలు ఉత్తమ నటుడుగా మొత్తం నాలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతులు అందుకున్నాడు. 2001లో భారత ప్రభుత్వం దేవ్ ఆనంద్ ను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2002లో ప్రతిష్టాత్మక దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం దేవ్ ఆనంద్ కు లభించింది. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటూ దేవ్ ఆనంద్ “సినిమాల్లో తొలి బ్రేక్ ఇచ్చిన సంవత్సరం నుంచి నేను యెన్నో కొత్తతరాలను చూశా. అభిమానుల ప్రేమ, ప్రశంసలు అందుకున్నా. విమర్శలు, తిరస్కారాలూ చవిచూశా. కానీ విమర్శలను విజయానికి మెట్లుగా భావించా. అలాగే ముందుకు సాగుతున్నా” అని మనసులో మాటను బయటపెట్టారు. ఆరు దశాబ్దాలపాటు అద్భుత నటుడుగా జేజేలు అందుకున్న దేవ్ ఆనంద్ వంద సినిమాలకు పైగా నటించాడు. 2013లో భారతీయ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం దేవ్ ఆనంద్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. బాంద్రా బస్ కూడలి లో దేవ్ ఆనంద్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా తనకు దేవ్ ఆనంద్ స్పూర్తి ప్రదాత అనేవారు. 1957 నుండి న1964 వరకు హిందీ చిత్రసీమలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న హీర్తో దేవ్ ఆనంద్ మాత్రమే!

తన 88 వ యేట దేవ్ ఆనంద్ ఆరోగ్య పరీక్షలకోసం లండన్ వెళ్లి 2011 డిసెంబరు 3వ తేదీ మైఫేర్ హోటల్లో గుండె ఆగి చనిపోయారు. దేవ్ ఆనంద్ అంతిమ సంస్కారాలు లండన్ లో నిర్వహించారు. అలా అరవయ్యోయేట కూడా ఎవర్ గ్రీన్ హీరోగా రాణించిన ఒక అందమైన మణిరత్నం రాలిపోయింది.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap