నేడు జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలు…
ప్రముఖ రంగస్థల సీనియర్ నటి సురభి జమునా రాయలు ప్రథమ వర్థంతి సంధర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నటి సురభి జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ రంగస్థల సినీనటి శ్రీమతి సుభాషిణి, రంగస్థల చిత్రకారుడు కొనపర్తి ఆనంద్ వున్నారు. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో జరగనున్న ఈ కార్యక్రమంలో శ్రీ యాదాద్రి క్షేత్ర మహత్యం పద్య నాటకం ప్రదర్శింపబడుతుంది.
జననం: జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించింది. ఆ రోజుల్లో తెనాలి లో జరుగుతున్నతెలుగు మహాసభల్లో నాటకాలు ఆడడానికి సురభి కుటుంబం మంతా తెనాలి కి వెళ్లారు. మేనమామ సురభి రాయలునే వివాహం చేసుకుంది. తన మేనమామ సురభి అవేటి కృష్ణదేవరాయలుని పెళ్ళి చేసుకున్న తరువాత ఈమె పేరు జమునా రాయలుగా మారింది.
రంగస్థల ప్రస్థానం:
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా చింతామణి నాటకంలో శ్రీకృష్ణుడు పాత్ర పోషించింది. పీసపాటి నరసింహమూర్తితో రాధగా, షణ్ముఖి ఆంజనేయ రాజుతో సత్యభామగా, వేమూరి రామయ్యతో సుధేష్ణగా నటించడంతోపాటు బాలనాగమ్మ, చంద్రమతి, గుణసుందరి, రాణీ మాలినీదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ద్రౌపది, సక్కుబాయి, మహాకవి కాళిదాసులో కథానాయికిగా, చత్రపతి శివాజీలో జిజియా బాయి, పాన పిశాచంలో కథానాయికిగావంటి పాత్రలు పోషించింది. వరవిక్రయం, శ్రీకృష్ణ రాయబారం, సత్య హరిశ్చంద్ర, పంచమధర్మం వంటి నాటకాలలో నటించింది. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ, శశిరేఖా పరిణయం అంటి నాటకాలకు దర్శకత్వం చేసింది. ప్రథమ స్వతంత్ర మహాసంగ్రామం నాటకంలో ఝాన్సీ లక్ష్మీబాయిగా, శ్రీ మాధవ వర్మ నాటకంలో గుండమ్మగా నటించి నంది అవార్డు, ఉత్తమ నటి అవార్డులు అందుకుంది.
స్వాతి చినుకులు, సుందరకాండ టీ.వీ. సీరియళ్ళలో, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో కూడా నటించారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలుండగా, చిన్న కుమార్తె రంగస్థల నటిగా కొనసాగుతున్నారు.
పురస్కారాలు – బహుమతులు
ఉత్తమ దర్శకత్వం – శశిరేఖా పరిణయం (నాటకం) – నంది అవార్డు
పైడి లక్ష్మయ్య అవార్డు – తెలుగు విశ్వవిద్యాలయం
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు
బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు
అక్కినేని ప్రథమ గోల్డ్ మెడల్
జి.వి.ఆర్. జీవిత పురస్కారం
2019 సుమధుర కళానికేతన్, విజయవాడ – ‘రాధాకుమారి స్మారక పురస్కారం ‘
2019 యువ కళావాహిని, హైదరాబాదు – ‘నాటకకళా పురస్కారం ‘
సురభి హొయలు – నటి జమునారాయలు
“శ్రీకృష్ణసత్య” పేరుతో ఏకకాలంలో శ్రీకృష్ణుడు – సత్యభామ గా(అర్థ-నారీశ్వర స్ఫూర్తి తో ) మేకప్ ఆర్టిస్ట్ బాపన్ పల్లి వెంకటస్వామి గారు మేకప్ చేయగా జమునా రాయలు ఒక వైపు శ్రీకృష్ణుడు గా , మరో వైపు సత్యభామ గా అద్వితీయ నటనను ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణను, నాటక ప్రయోక్తల ప్రశంసలు అందుకున్నారు. శ్రీమతి జమునా రాయలు నటజీవితం లో ఈ “శ్రీకృష్ణసత్య” ఓ కలికితురాయి గా చెప్పుకోవచ్చు. జమునా రాయలు గారికి 25 పర్యాయాలు “శ్రీకృష్ణసత్య” గా మేకప్ చేసారు, బాపన్ పల్లి వెంకటస్వామి గారు.
ఐదు దశాబ్దాల పాటు తెలుగు రంగస్థలం పై పలు పాత్రలలో జీవించి, బహుముఖ మైన ప్రతిభతో రాణించిన శ్రీమతి సురభి జమునా రాయలు మృతికి 64 కళలు.కామ్ పత్రిక నివాళులు అర్పిస్తోంది.
– కళాసాగర్ (ఎడిటర్)
ప్రముఖుల నివాళి ….
రంగస్థల నటి జమునా రాయలు మృతి తీరనిలోటు
సురభివారి నాటక రంగానికి జమునా రాయలు ఒక కలికితురాయి అని, ఆమె నటన నేటి యువతరానికి చాలా ఆదర్శవంతమైనదని, అటువంటి జమునా రాయలు మన మధ్య నుంచి వెళ్లిపోవడం చాలా విచారకరమని, సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి దుర్బా శ్రీనివాస్ అన్నారు. సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రముఖ రంగస్థల నటి జమునా రాయలుకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని, ఆవిడ సంస్కార భారతికి చాలా ఆప్తులు, 2007వ సంవత్సరంలో సంస్కార భారతి నిర్వహించినటువంటి, 1857 ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా డాక్టర్ పివిఎన్ కృష్ణచే రచించబడి దర్శకత్వం వహించినటువంటి ప్రధమ భారత స్వతంత్ర సంగ్రామం నాటకంలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రధారి జమునారాయలు తన అద్వితీయమైన నటనను ప్రదర్శించి నాటకానికి వన్నె తీసుకువచ్చారని, వారు పరమపదించడం వలన దేశం ఒక ప్రముఖ కళాకారిణిని కోల్పోయినందన్నారు. ఆమె ఆత్మకు సద్గతులు కలగాలని సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నట్లు, సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆమెకు ఘనంగా నివాళులర్పించినట్లు తెలిపారు.
-సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్
_____________________________________________________________________
ఝాన్సీ లక్ష్మీబాయి గా ప్రథమ స్వతంత్ర మహాసంగ్రామంలో ను శ్రీ మాధవ వర్మ నాటకంలో గుండమ్మ గాను నంది అవార్డు, ఉత్తమ నటి అవార్డు , అందుకున్న మహానటి, తమ్ముడు గారు అని నన్ను ఆదరంగా పిలిచే మా సోదరి శ్రీమతి సురభి జమునా రాయలు గారు స్వర్గస్తులైనారు అని తెలిసి తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాను. అటువంటి నటీమణి నాటక రంగంలో నభూతో న భవిష్యతి. వారు నటరాజ పాద మంజీరం గా విలసిల్లాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ శ్రద్ధాంజలి ఉన్నాను.
PVN కృష్ణ , రంగస్థల నటులు(రామన్ అకాడెమీ)
___________________________________________________________________________
పద్యనాటకానికి సరికొత్త చరిత్రసృష్టించిన శ్రీ కృష్ణ తులాభారం నాటక ఘనతలో సత్యభామ పాత్ర తో ప్రేక్షకులను మరో లోకం లో విహరింపజేసిన నా సహనటి శ్రీ మతి జమునారాయలు గారి మధుర జ్ఞాపకం. యింత త్వరగా నటరాజు సన్నిధికి చేరతావని ఊహించలేదు ఆత్మీయురాలా. యిది నిజమని యింకా నమ్మలేక పోతున్నాను.నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగా లని భగవంతుని ప్రార్ధిస్తూ…అశ్రునయనాలతో…
-గుమ్మడి గోపాలకృష్ణ, ఏపి నాటక అకాడమీ మాజీ చైర్మన్
__________________________________________________________________________
“సురభి” జమున రాయలు,
పాత్రలకి న్యాయం చేస్తూ ప్రాణం పోసే మహా నటి.
మంచితనం, మానవత్వం, మూర్తీభవించిన మూర్తి.
ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం కలిసిన విశిష్ట వ్యక్తి.
“అన్నయ” అంటూ ఆత్మీయత తో పలకరించిన మరుపురాని మనిషి.
-“కళమిత్రా” అడివి శంకర రావు, makeup artist, హైదరాబాద్. 6301002268.
________________________________________________________________________
అమ్మా మీ గురించి ఎందరెందరో గొప్పగొప్పవాలు ఎన్నో విషయాలు చెబుతున్నారమ్మా, మీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంన్నారమ్మా. ఎక్కడికెళ్ళారమ్మా మీరు, వీరందరి మాటలు ఆలకించ ఒక్కసారి రావమ్మా…
మీ నోటినుంచి వచ్చే నానా అనే కమ్మని పలుకు ఇక మూగబోయిందని మనసుకు ఎలా సర్దిచెప్పుకోవాలమ్మా.
మేకప్ లో నేను మొదటి అడుగులు వేస్తున్న కొత్తలోనే ఎన్నో సమాజాలకు పరిచయం చేసి నాకు బ్రతుకుదారి చూపించిన ఈ మాతృమూర్తిని ఎలా మరిచి ఉండగలమమ్మా… మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండి నానా నాకు ఇవి అత్యంత ఆనందదాయకమైన క్షణాలు అని మీరన్నమాటలు మా హృదయాల్లో మారుమ్రోగుతున్నాయమ్మా.
ఇంత అన్యాయం చేసి వెళ్లిపోయావా అమ్మా.
నానా నాకు “శ్రీకృష్ణసత్య”మేకప్ నువ్వే చెయ్యాలి నానా అని ఆప్యాతగా ఇక ఎప్పుడు పిలుస్తావమ్మా…మీకు నివాళ్ళు అర్పించటానికి కూడా మాటలు రావట్లేదమ్మా…..ఈ అభాగ్యుడి కన్నీలతో మీ పాదాలను కడుగుతూ అశ్రునివాలు అర్పిస్తున్నానమ్మా….
-బాపన్ పల్లి వెంకటస్వామి, మేకప్ ఆర్టిస్ట్
________________________________________________________________________
ఏప్రిల్ మాసంలో జరుగవలసి ఉండిన శ్రీ వేంకటేశ్వర నాట్యకళాపరిషత్ గరుడ అవార్డ్స్ ఫైనల్ పోటీలకు పద్యనాటకం విభాగానికి గుణనిర్ణేతగా/న్యాయనిర్ణేతగా ఉండ వలసిన ముగ్గురు న్యాయనిర్ణేతలలో ఒకరు సురభి జమునరాయల్ గారు
కరోనా మహమ్మారి కారణంగా పరిషత్ పోటీలు వాయిదా పడతాయనిగాని… కరోనా కాటుకు సురభి జమునరాయల్ బలి అయిపోతుందనికానీ కలలో కూడా ఊహించని పరిణామాలు
కానీ మన చేతుల్లో ఏమిలేదని మంచితనం ఉంటే పదిమంది హృదయాలలో పదికాలాలపాటు ఉంటాం అని అందరి హృదయాలలో నిలిచిపోయిన *సురభి జమునరాయల్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను
ఈ సందర్భంగా జరుగబోవు గరుడ అవార్డ్స్ పోటీలలో స్త్రీ నటీమణులలో పద్య పఠనం బాగా ఆలపించినవారికి సురభి జమునరాయల్ పేర వారి జ్ఞాపకార్థం 5,000 ప్రధానం చేస్తానని కళాకారులకు తెలియజేసుకుంటున్నాను
-కోనేటి సుబ్బరాజు
జమునా రాయలుగారు గొప్పకళాకారిణి ఆమె తో నేను కూడ 45 రోజులు ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామం నాటకంలో కలిసి పనిచేసినప్పుడు తెలిసింది విన్నదినిజమే అని. ఇలాంటి వారు చాలా అరుదు.