రియలిజాన్ని ఆలంబనగా తీసుకొని చిత్రాలు రచించే సీనియర్ చిత్రకారుడు, శిల్పకళా చిత్రాల విశిష్ట కళాకారుడు, క్లాసికల్ పెయింటింగ్స్ రెప్లికా పెయింటర్, ల్యాండ్ స్కేప్స్, పోట్రెయిట్ పెయింటింగ్సు, ఫోటోగ్రఫీ మొదలైన అంశాల్లో విశిష్ట శృజనాకారుడు గొర్తి అరుణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో….
గొర్తి అరుణ్ కుమార్ (71) గారు నివాసం హైదరాబాద్. ఉద్యోగరీత్యా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో రిటైర్డ్ ఎంప్లాయి. ప్రవృత్తి పరంగా మంచి పట్టుగల, పట్టుదల గల ఆర్టిస్టు. నలభై సంవత్సరాలు నుండి ఆర్టిస్టుగా పలువురి చేత ప్రశంసలు పొందిన అనుభవశాలి.
బ్రహ్మ మనుషులకే ప్రాణం పోస్తాడని అందరికి తెలిసిన విషయమే. చిత్రాలకే ప్రాణం పోయడంలో దిట్ట ఈ మనిషి అరుణ్ కుమార్ గారు. శిల్పి శిలలను చెక్కుతాడు. శిల్పకళనే చిత్రాలుగా మలిచే విశిష్ట కళాకారుడు. నేటి సమాజంలో చిత్రకళారంగంలో రూపరహిత కళకు ఆదరణ ఎక్కువ. సహజత్వం ఉట్టిపడే చిత్రాలు వేసేవారి సంఖ్యాబలం రాను రాను తగ్గుతుంది. సహజత్వంను ఆలంబనగా తీసుకుని పెయింటింగ్స్ రూపొందించడంలో సీనియర్ కళాకారుడు గొర్తి అరుణ్ కుమార్ గారు ఒకరని ఘంటాపథంగా చెప్పుకోవచ్చును.
రాజారవి వర్మ రసరమ్య చిత్రాలు, క్యాలెండర్ ఆర్టిస్టు రాంకుమార్ వంటి కళాకారుల అరుణ్ కుమార్ గారికి స్ఫూర్తి. ప్రముఖుల జీవితాన్ని పేయింటింగ్ లో చూపడం, ఎంతచూసినా తనివితీరని ల్యాండ్ స్కేప్స్, ఇలా పలుఅంశాలలో అరుణ్ కుమార్ గారు ఆవిష్కరించిన చిత్రాలు రంగులతో మాయాజాలానికి నిలువెత్తు అద్దం పట్టాయి.
అరుణ్ కుమార్ గారు ఐ.టి.ఐ. పూర్తి చేసాక, ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చారు. 1975 లోహిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో చేరారు. ఆర్థికంగా ఇబ్బంది లేదనుకున్నాక, ప్రాణప్రదంగా భావించే చిత్రకళను మిగతా సమయాన్నంత ఉపయోగించుకున్నారు. తనదైన ముద్రకోసం, విశిష్ఠత కోసం రేయింబవళ్ళు శ్రమించారు. తైలవర్ణ చిత్రాలు, పెన్సిల్ తో చిత్రాలు, అడపా దడపా వాటర్ కలర్స్ తో చిత్రాలు ఇలా అనేక చిత్రాలకు ప్రాణం పోసారు. వైవిధ్యభరితమైన వర్ణమయ ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం నిరంతరం కలర్ కంపోజింగ్ లు, మిక్సింగులు వెరసి తనకో ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్నారు.
మొదటి నుంచీ సహజత్వానికి ప్రాముఖ్యతనిస్తూ, భారతీయ శిల్పకళ గొప్పతనాన్ని తన చిత్రకళలో ప్రతిబింబింప చేస్తున్నారు. ఒకవైపు ఒౌత్సాహిక కళాకారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూనే ఈరోజుకు కూడా నిత్య విద్యార్ధిగా ఉంటూనే చిత్రకళా ప్రయాణం కొనసాగిస్తున్నారు అపర బ్రహ్మ అరుణ్ కుమార్ గారు. ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రానికి “పునఃసృష్ఠి” గా అయిన సరస్వతీ దేవి చిత్రం చూడగానే భక్తి భావంతో మనకు తెలియకుండానే నిలబడి నమస్కరించుకుంటాము. అంటే అంత సహజంగా ఉంటాయి. దేవాలయాలలో ఉండే శిల్పాలను తన కుంచెతో కాన్వెస్ పై నయనానందకరంగా, రంగులు ఉపయోగించి, అద్భుతాలు చేయ్యగలరు. అదే అరుణ్ కుమార్ గారి ప్రత్యేకత. పోర్ట్రెయిట్స్, ల్యాండ్ స్కేప్, స్టిల్ లైఫ్, వైల్డ్ లైఫ్ తదితర చిత్రాలను కాన్వాస్ పై చేయ్యగలరు.
ప్రస్తుతం వీరి దగ్గర 2/3 అడుగుల సైజ్ లో ఆయిల్ పేయింటింగ్స్ అరవై దాకా, మరియు వాటర్ కలర్స్ వి ఏ3 పేపర్ వి పేయింటింగ్స్ ఇరవై దాకా ఉన్నాయి.
ఇకపోతే అవార్డులు కూడా ఆ సంఖ్యలోనే వచ్చాయి. గ్రూప్ గాను, సోలో గాను ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా పికాసో ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ లోను, ఇండియన్ ఇంటర్నేష్ నల్ ట్రేడ్ ఫెయిర్, ప్రగతి భవన్ ఢిల్లీలో, ఫైవ్ ఎలిమెంట్స్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ లో, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నేషనల్ ఆర్ట్ కాంపిటేషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, హైదరాబాద్ లోను, ఇలా ఎన్నో ప్రదర్శనలు ఏర్పాటు చేసారు.
కళాకారుడిగా జన్మించినందుకు నా జన్మ ధన్యమైనదని, ఓపిక ఉన్నంతవరకు నా ఈ కళామతల్లిక సేవకుడిగా వేస్తూనే ఉంటానని, ప్రతిరోజు నా స్వగృహములోని దేవుళ్ళకు నిత్యం ప్రార్థిస్తూనే ఉన్నానన్నారు. అయితే ఇంతవరకు ఎవ్వరికీ, ఎలాంటి శిక్షణ ఇవ్వలేకపోయానన్నది అసంతృప్తిగానే మిగిలిపోయింది. అలాగే నేను వేసిన నా యొక్క చిత్రకళకు ఎలాంటి ఆర్థికంగా లాభం పొందలేదు. కేవలం స్వయం సంతృప్తి కోసమే తప్ప, మరో దిశలో ప్రయత్నాలు చేయ్యలేదన్నారు.
చివరిగా “కాలము చాలా విలువైనది. మనసుకు నచ్చిన పనిని సంతృప్తిగా చేస్తూ, నిరంతరం సాధనతో ఏదైనా సాధించవచ్చును”. అంటారు అరుణ్ కుమార్ గారు.
-దార్ల నాగేశ్వరరావు
One of the great artist. Great to know about a great artist like Arun Kumar through you (64 kalalu.com) sir.