అర్ధ శతాబ్ది చిత్రం… బాబీ

(బాబీ 50 యేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం…)

డి గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని, చార్లీ చాప్లిన్ ఆఫ్ హింది సినిమా అని కీర్తించబడే రాజ్ కపూర్ బాల్యం సినిమా నిర్మాణంతోనూ, తండ్రి ప్రదర్శించే నాటకాల ప్రభావంతోనూ ముడిపడివుంది. ఇరవై నాలుగేళ్ళ చిరు ప్రాయంలోనే ఆర్.కె స్టూడియో నిర్మించి ఆదే బ్యానర్ మీద ‘ఆగ్’(1948) అనే సినిమాను నిర్మించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం చిన్న విషయం కాదు. కళకు సంబంధించిన కృషి అంతా నిజజీవితం నుంచే ఉద్భూతమౌతుందనే సిద్ధాంతాన్నినమ్మినవాడు రాజ్ కపూర్. అటువంటి చిత్రమే ‘ఆగ్’. ఆ సినిమాలో ఆరోజులలో వున్న యువకుల ప్రధాన సమస్యలను తనదైన భావస్పూర్తితో ‘ఆగ్’ చిత్రం ద్వారా మెప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సినిమా గొప్పగా ఆడకపోయినా దర్శకుడిగా రాజ్ కపూర్ కు పేరు తెచ్చిపెట్టింది.

1949 లో రాజ్ కపూర్ వరసగా ‘బర్సాత్’, 1951లో ‘ఆవారా’ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించి నిర్మాతగా, దర్శకునిగా, ఒక ఉదాత్తమ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ‘బూట్ పాలిష్’ (1954), ‘శ్రీ 420’ (1955), ‘జాగ్తే రహో’ (1956), ‘జిఎస్ దేశ్ మే గంగా బెహతీ హై’ (1960) సినిమాలు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి చిత్రాలుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1964లో నిర్మించిన ‘సంగం’ చిత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా రాజ్ కపూర్ అంటే ముక్కోణపు ప్రేమ ‘కావ్యాల’ నిర్మాణానికి ఆద్యుడుగా సినీపరిశ్రమ గుర్తించింది. అయితే రాజ్ కపూర్ కి ‘మేరా నామ్ జోకర్’ (1970) పేరిట ఒక భారీ సినిమా తీయాలని సంకల్పం కలిగింది. ఒకరకంగా ఈ సినిమా రాజ్ కపూర్ ఆత్మకథ వంటిదని చెప్పవచ్చు. మొదట ఈ సినిమాను ఆరు భాగాలుగా విభజించి మూడు వరస సినిమాలుగా నిర్మించాలని భావించాడు. కె.ఏ.అబ్బాస్ కపూర్ ని దృష్టిలో పెట్టుకొని స్క్రీన్ ప్లే రచించాడు. 1964 లోమొదలు పెట్టిన ఈ సినిమా నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. ఆరు చాప్టర్లను మూడుకు కుదించారు. తనవద్ద వున్న వనరులే కాకుండా, తన బంగాళాని సైతం తాకట్టుపెట్టి చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. ‘సంగం’ చిత్రానికి రెండు ఇంటర్వెల్స్ వున్నట్లే ఈ సినిమా ప్రధమ భాగానికి కూడా రెండు ఇంటర్వెల్స్ పెట్టారు. ఈ సినిమా విజయాన్ని సాధిస్తే ఒక మంచి ప్రేమ కథను రాజ్ కపూర్ నిర్మిద్దామని తలపెట్టాడు. కానీ ‘మారా నామ్ జోకర్’ చిత్రం నిరాశ పరచడమే కాకుండా, అప్పులపాలు చేసింది. రాజ్ కపూర్ ఆలోచించాడు. జనం మెచ్చింది మనం చేయాలి అనే నిశ్చయానికి వచ్చాడు. కసికొద్దీ టీనేజర్ల ప్రేమకథను అల్లాడు. అదే 1973లో వచ్చిన రాజ్ కపూర్ మ్యూజికల్ రొమాన్స్ మాగ్నమ్ ఓపస్ ‘బాబీ’. అది రాజ్ కపూర్ కథకాదు. మరో తరం కథ. నవతరం యువతీయువకుల ఆశలను, ఆశయాలను, సంఘర్షణలను, ఆశాభంగాలను, ప్రేమపట్ల ఆ యువకుల వైఖరులను ప్రతిబింబిస్తూ ‘బాబీ’ సినిమా నిర్మించాడు. 28 సెప్టెంబర్ 1973 న విడుదలై డంకా బజాయించిన ఈ సినిమా 50 యేళ్ళు పూర్తిచేసుకుంది. ఆ చిత్ర విశేషాలు కొన్ని.

టీనేజర్ల ప్రేమకథ:

ముంబై నగరంలో నివసించే ధనిక, సామాన్య కుటుంబాలకు చెందిన ఇద్దరు టీనేజర్ల కథ ‘బాబీ’. ప్రాణ్ నగరంలో పేరుమోసిన ధనిక వ్యాపారి. అతని కుమారుడే రిషి కపూర్ (రాజ్ కపూర్ తనయుడు). గోవన్ క్రైస్తవ చేపల వ్యాపారి ప్రేమ్ నాథ్ కూతురు డింపుల్. బోర్డింగ్ స్కూల్ లో చదువు పూర్తి చేసుకొనివచ్చిన రిషి కపూర్ కోసం తండ్రి అతని జన్మదిన వేడుక ఘనంగా జరుపుతాడు. ఆ వేడుకకు రిషికి చదువు చెప్పిన దుర్గా ఖోటే తన మనవరాలు డింపుల్ తో వస్తుంది. కానీ ఆమెకు అవమానం జరగడంతో మనవరాలిని తోడ్కొని పార్టీ నుంచి వెళ్లిపోతుంది. అది గమనించిన రిషి మరుసటిరోజు వారి ఇంటికి వెళ్తాడు. డింపుల్ ను చూసి ప్రేమిస్తాడు. డింపుల్ కూడా రిషిని ఇష్టపడుతుంది. కానీ రిషి అరుణా ఇరానీతో చనువుగా వుండడంతో, బహుశా రిషి ఆమెను ప్రేమిస్తున్నాడేమో అని భ్రమించి డింపుల్ కాశ్మీర్ కు వెళ్తుంది. రిషి వెంటనే కాశ్మీర్ వెళ్ళి డింపుల్ కు అరుణా ఇరానీ తో తనకున్నది కేవలం స్నేహం మాత్రమే అని నచ్చచెబుతాడు. వీరి వివాహానికి డింపుల్ తండ్రి, తల్లి సుముఖంగా వున్నా, ప్రాణ్ మాత్రం ఒప్పుకోడు. తన సంపద కోసం డింపుల్ ని రిషి కపూర్ మీదకు ఉసిగొలిపారని తప్పుగా అర్ధం చేసుకుంటాడు. సినిమా మలుపులు తిరుగుతుంది. ఇద్దరు ప్రేమికులు వెళ్ళిపోయి ఆత్మహత్యకు పాల్పడబోతారు. ఇరువురి తండ్రులు వారి నిజమైన ప్రేమకు జోహార్లు చెబుతూ వివాహానికి అంగీకరిస్తారు. టూకీగా కథ చిన్నదే… కానీ ఆ కథాకదనం రాజ్ కపూర్ చేతిలో ఒక మరకతమై నిలిచింది.

చిత్ర విశేషాలు:

ఈ చిత్రానికి రాజ్ కపూర్ కథ సమకూర్చగా, జైనేంద్ర జైన్ సంభాషణలు, క్వాజా అహమద్ అబ్బాస్, వి.పి. సాథే కలిసి స్క్రీన్ ప్లే రూపొందించారు. రాధు కర్మార్కర్ ఛాయాగ్రహణం సమకూర్చిన బాబీ సినిమాకు ఎడిటర్ రాజ్ కపూరే! రిషి కపూర్, డింపుల్ కపాడియా హీరో హీరోయిన్లు గా నటించగా, ప్రాణ్, ప్రేమ్ నాథ్, దుర్గా ఖోటే, సోనియా సాహ్ని, అరుణా ఇరానీ, ప్రేమ్ చోప్రా, ఫరీదా జలాల్ సహాయ పాత్రలు పోషించారు.

హిందీ చిత్రసీమలో రాజ్ కపూర్ తన కుమారుడు రిషి కపూర్ ని హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని ‘బాబీ’ సినిమా నిర్మించాడని వార్తలు పుట్టాయి. కానీ ‘మేరా నామ్ జోకర్’ సినిమా మిగిల్చిన అప్పుల బారినుంచి బయటపడేందుకే తన తండ్రి ‘బాబీ’ సినిమా నిర్మించారని రిషి కపూర్ ఒక ఇంటర్యూలో చెప్పాడు. నిజానికి రాజేష్ ఖన్నా వంటి పెద్ద నటీనటులతో ఈ సినిమా నిర్మించవలసి వున్నా, పెట్టుబడి పెట్టే స్తోమత లేకనే రాజ్ తనతో సినిమా నిర్మించారని రిషి చెప్పుకొచ్చాడు.

కాశ్మీర్ లోని గుల్మార్గ్ హిల్ స్టేషన్ హట్ లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ హోటల్ కు ‘బాబీ హట్’ అనే పేరు వచ్చింది. రాజ్ కపూర్ కు పుణె- షోలాపూర్ హైవే మధ్య రాజ్ భాఘ్ వద్ద పెద్ద ఫారం హౌస్ వుండేది. అక్కడ ‘’హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హొ’’ పాటతోబాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు దానిని రాజ్ కపూర్ మెమోరియల్ గా మార్చారు. బాబీ సినిమా చిత్రీకరణలో డింపుల్ పాత్రకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. రిషి కపూర్ తన కొడుకే అయినా, అతనికి బాబీ చిత్రం తొలిచిత్రమైనా, పాత్ర ఎంతవరకు అవసరమో అంతవరకే రాజ్ కపూర్ వాడుకున్నారు.

బాబీ సినిమాకు ఎంపికైనప్పుడు డింపుల్ వయసు కేవలం 15 ఏళ్ళు. ఆమె తండ్రి చున్నిలాల్ కపాడియా రాజ్ కపూర్ కు సన్నిహిత స్నేహితుడు. డింపుల్ కు ఆడిషన్ నిర్వహించి, ఆమె తండ్రిని ఒప్పించి హీరోయిన్ గా డింపుల్ నే రాజ్ కపూర్ ఎంపిక చేశారు. నీతూ సింగ్, పాకిస్తాన్ గాయని నాజియా హాసన్ కూడా ఆడిషన్ కు వచ్చినవాళ్లలో వుండడం విశేషం.

బాబీ సినిమాకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకులు. రాజ్ కపూర్ సంస్థలో పని చేయడం వారికి అదే తొలిసారి. రిషి కపూర్ కు క్రొత్తదనం కోసం గాయకుడుగా శైలేంద్ర సింగ్ అనే నూతన గాయకుడికి రాజ్ కపూర్ అవకాశం ఇచ్చారు. మేరా నామ్ జోకర్ సినిమాలో అన్ని పాటలు ఆశా భోంస్లే చేత పాడించిన రాజ్ కపూర్ బాబీ సినిమాలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సలహాను గౌరవిస్తూ డింపుల్ కు లతా మంగేష్కర్ చేత పాడించారు. 15 ఏళ్ల డింపుల్ కు 45 ఏళ్ల లతాజీ పాడడం విశేషం.

ఈ చిత్రంలో వచ్చే బృందగానం ‘నా చాహూ సోనా చాంది, నా చాహూ హీరా మోతీ, యహ్ మేరే కిస్ కామ్ కే’ పాట ట్యూన్ ‘ఆవారా’ చిత్రంలో రాజ్ కపూర్, నర్గీస్ ల స్విమ్మింగ్ పూల్ షాట్ కు ముందు శంకర్ జైకిషన్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించారు. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని పాటగా రూపొందించమని రాజ్ కపూర్ ఆదేశిస్తే లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అద్భుతంగా స్వరపరచారు.
విఠల్ భాయ్ పటేల్ రచించగా మన్నా డే, శైలేంద్రసింగ్ బృందం పాడిన ఈ పాటను రిషి కపూర్, డింపుల్, ప్రేమ్ నాథ్ బృందం మీద చిత్రీకరణ జరిపారు.

ఇందులో రిషి లవ్ ఇంట్రెస్ట్ గా నటించిన అరుణా ఇరానీ పాత్ర కోసం తొలుత రేఖా ను రాజ్ కపూర్ సంప్రదించారు. అప్రధాన పాత్ర అంటూ రేఖా తిరస్కరించింది. చాలా కాలం తర్వాత రేఖా, రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన ‘ధరమ్ కరమ్’ చిత్రంలో నటించింది. ఇందులో వాష్ రూమ్ నుంచి ఆచ్ఛాదన లేకుండా వస్తున్న రిషి కపూర్ ని అరుణా ఇరానీ కౌగిలించుకొనే దృశ్యం ఒకటి వుంది. ఇలాంటి సన్నివేశాన్నే రిషి కుమారుడు రణబీర్ కపూర్ చేత దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి ‘సావరియా’ (2007) అనే సినిమాలో నటింపజేశారు.

షేక్ స్పియర్ డ్రామా ‘రోమియో జూలియట్’ ను స్ఫూర్తిగా తీసుకొని, ఒరిజినల్ సినిమాలో హీరో హీరోయిన్ లు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్ కపూర్ పతాక సన్నివేశాన్ని చిత్రీకరించారు. రషెస్ చూసిన పంపిణీదారులు సినిమా విషాదాంతం అయితే నష్టపోతామని, సుఖాంతం చేయవలసిందిగా సలహా ఇచ్చారు. వారి సలహాను గౌరవిస్తూ సినిమాను రాజ్ కపూర్ సుఖాంతం చేశారు.

రిషి కపూర్ బాబీలో నటించేందుకు ముందు బరువు తగ్గాలని ఒక వెయిట్ లాస్ ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రిలో శిక్షణ పొందుతున్న యాస్మిన్ మెహతా అనే పార్శీ అమ్మాయితో రిషి కి పరిచయమై అది ప్రేమగా మారింది. బాబీ చిత్రం విడుదలయ్యాక స్టార్ డస్ట్ అనే సినిమా మ్యాగజైన్ డింపుల్ కాపాడియాతో రిషి ప్రేమాయణం సాగించినట్లు ఆరోపణ మోపింది. అప్పటికే డింపుల్ కు రాజేష్ ఖన్నాతో పెళ్లయింది. దాంతో రిషి ప్రేమికురాలు యాస్మిన్ అతనికి దూరం జరిగింది. తర్వాత రిషి నీతూ సింగ్ ని వివాహమాడాడు. పది సంవత్సరాల తర్వాత రిషి డింపుల్ తో ’సాగర్’ చిత్రంలో నటించాడు.

అమితాభ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ చిత్రం 1973 మే నెల లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాబీ చిత్రం 1973 సెప్టెంబర్ 28 న విడుదలై స్మాష్ హిట్ గా పేరుతెచ్చుకుంది. ఆ సంవత్సరానికి అమితాభ్ బచ్చన్ కు రావలసిన ఫిల్మ్ ఫేర్ బహుమతి అనూహ్యంగా బాబీ సినిమాలో రిషి నటించిన పాత్రకు లభిచింది. చిత్రసీమ ఆశ్చర్యపోయింది. రిషి రాసుకున్న ‘ఖుల్లమ్ ఖుల్లా- అన్ సెన్సార్డ్’ అనే ఆత్మకథలో ఆ బహుమతి తను ముప్పై వేలు వెచ్చించి కొనుక్కున్నానని మొహమాటం లేకుండా ఒప్పుకున్నాడు.

బాబీ చిత్రానికి 5 ఫిల్మ్ ఫేర్ బహుమతులు (ఉత్తమ నటుడుగా రిషి కపూర్, ఉత్తమ నటిగా డింపుల్ కపాడియా, ఉత్తమ గాయకుడుగా “భేషక్ మందిర్ మస్జిద్” పాట ఆలపించిన నరేంద్ర చాహల్, ఉత్తమ కళాదర్శకుడుగా రంగరాజ్, ఉత్తమ శబ్దగ్రాహకుడు గా అల్లాఉద్దీన్ఖాన్ ఖురేషీ) లభించాయి. రష్యా దేశంతోబాటు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ‘షోలే’ చిత్రం తర్వాత అత్యంత భారీ వసూళ్లు చేపట్టిన సినిమాగా ‘బాబీ’ చిత్రం రికార్డులు నెలకొల్పింది. పర్షియా దేశం ఈ సినిమాని ‘పర్వాజ్ డర్ ఘఫస్’ పేరుతో రీమేక్ చేసింది.

రిషి కపూర్ కు లుకేమియా వ్యాధి సోకడంతో న్యూయార్క్ నగరంలో చికిత్సపొందాడు. 2018 లో భారత్ వచ్చి ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’ చిత్రాల షూటింగ్ లో పాల్గొనేందుకు కూడా సిద్ధపడిన తరుణంలో ఈ క్యాన్సర్ మహమ్మారి తిరగబెట్టడంతో సుదీర్ఘ పోరాటం జరిపి 2020 ఏప్రిల్ 30 న ముంబై ఆసుపత్రిలో కన్నుమూశాడు.
ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap