విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుభావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 11
ఆంధ్ర భాషోద్ధరణ కు కంకణ బద్ధుడై నట్టి అరుదైన ఆంగ్లేయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. భారతదేశంలోని బ్రిటిష్ ఉద్యోగి తప్పని సరిగా స్థానిక భాషలను అధ్యయనం చేయాలన్న నిబంధనలకు అనుగుణంగా వెలగపూడి కోదండరామ పంతులు గారి వద్ద తెలుగు భాషను అభ్యసించడం ప్రారంభించి, అనతి కాలంలోనే ఆ భాషపై పట్టు సాధించగలిగాడీయన. 1825 ప్రాంతంలో మన తెలుగు నేలలో నిరక్షరాస్యత వల్ల, మన తెలుగు వారందరూ తెలుగు భాషను నిర్లక్ష్యం చేసి తప్పు చేస్తున్న తరుణంలో బ్రౌను అప్పు చేసి మరీ పతనమై పోతున్న తెలుగు వ్రాత ప్రతులను రక్షించాలన్న తపనతో రాయసగాళ్ళను తన ఇంటికి వద్దకు రప్పించి, జీర్ణ దశలో ఉన్న తాళపత్రాలను, ఇతర గ్రంధాలను సేకరించి, వాటిని తిరగ రాయించి, ముద్రింపజేసి ఆంధ్ర భాషోద్ధారకుడు గా పేరు గడించాడు. తెలుగు భాషోద్ధరణ లో అంతర్భాగంగా కడప లో రెండు పాఠశాలలు, మచిలీపట్నంలో రెండు పాఠశాలలు నెలకొల్పి ఉన్నత విద్య, ఉచిత బోధన వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తెలుగు నేర్చుకోవాలనే ఆంగ్లేయుల కొరకు తెలుగు – ఆంగ్ల నిఘంటువు ను రూపొందించాడు. సుమతి శతకాన్ని సేకరించి ముద్రించిన బుద్ధిమతి బ్రౌన్. జానపదుల నానుడులను కూడా లిపి బద్దం చేసి, భద్రం చేసి మనకందించాడు. తన జీవిత చరమాంకంలో లండన్ యూనివర్సిటీలో తెలుగు ఆచార్యునిగా కూడా పనిచేసి ఆజన్మాంతం తెలుగుతల్లి సేవలో తరించాడు. తెలుగుతల్లికి ప్రీతిపాత్రుడైన ఈ తెల్ల దొర నేటి మన ధృవతార.
(సి.పి.బ్రౌన్ జన్మదినం 10 నవంబర్ 1798)
great person.