సినీ కవికుల గురువు… మల్లాది

(మల్లాది పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)

తెలుగు సారస్వతాన్ని అభిమానించే సాహితీ ప్రియులకు అతడు ఒక విశ్వవిద్యాలయం. సంప్రదాయపు వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని, వాటిలో వున్న మాధుర్యాన్ని చవిచూడాలంటే ఆ విద్యాలయ కులపతి మల్లాది సాహిత్యాన్ని చదువుకోవాలి. మల్లాది సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు అనిర్వచనీయమైన రసానుభూతిని పొందుతారు అనే విషయాన్ని ఎందరో గుర్తించారు. “సినిమా పాటకు మల్లాది సాహిత్య ప్రశస్తిని సంతరింప జేశారు” అని మహాకవి శ్రీశ్రీ అభిప్రాయపడ్డారు. “మల్లాది రచనా శైలే ఒక అద్భుతం. ఆ శైలిలో అమృతం తొణికిసలాడుతుంది” అని ప్రశంసించారు దాశరథి. “మల్లాది పలుకుల్లోంచి అమృతం పుట్టి అది తెలుగు పాటను చిరంజీవిని చేసింది” అంటూ అక్షర సత్యాన్ని వెల్లడించారు వేటూరి సుందరరామమూర్తి. ఇందరు ప్రశిద్ధ కవులు ప్రశంసించిన మల్లాదిని సినిమా రచయితగా కాకుండా ఒక సాహితీకారుడుగా చూస్తే ఎన్నో విషయాలు గోచరమౌతాయి. ఒకానొక సందర్భంలో మల్లాదిగారే చెప్పుకున్నారు… తన కథలు దస్తావేజులు కావని. దస్తావేజులకు తలా, తోకా వుండి తీరాలనేది శాస్త్రం. కానీ తన కథలకు పది తలలు ఉండవచ్చు, లేకనూ పోవచ్చు అని గుంభనంగా సెలవిచ్చారు. పింజబోసిన గ్లాస్గో పంచె, ఖద్దరు సిల్కు లాల్చి, చేతిలో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ డబ్బా, చెరగని చిరునవ్వు ఈ మహా మనీషికి అలంకారాలు. అటువంటి మహానుభావుడి వర్ధంతి సెప్టెంబరు 12 న. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మల్లాది సినీ సాహితీ పటిమను ఒకసారి గుర్తు చేసుకుందాం ….

బాల గోపాల మల్లాది…

మల్లాది రామకృష్ణశాస్త్రి పుట్టింది 17, జూన్ 1905 న కృష్ణా జిల్లా చిట్టిగూడూరు గ్రామంలో. విద్యాభ్యాసం అంతా బందరులోనే జరిగింది. నరసింహశాస్త్రి, కనకవల్లి అతని తల్లిదండ్రులు. తండ్రి జిల్లా బోర్డులో మేనేజరు గా పనిచేసేవారు. తండ్రికి సంగీత సాహిత్యాలమీద, నాటకాది కళల మీద ఆసక్తి వుండేది. బందరు నాటక కంపెనీ వారు ప్రదర్శించే ‘హరిశ్చంద్ర’ వంటి నాటకాల్లో వేషాలు వేసేవారు. రామకృష్ణ శాస్త్రి ఏకసంతాగ్రాహి. పాఠశాల చదువులో ముందంజలో వుండేవారు. పదమూడేళ్లకే మెట్రిక్యులేషన్ పరీక్ష పాసయ్యారు. కాలేజిలో చేరకముందే వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. బందరు నోబుల్ కాలేజీలో బి.ఎ. చదివారు. తరవాత 1934లో చెన్నపట్నం చేరి ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత, ఆంధ్ర సాహిత్యంలో మాస్టర్ పట్టా పుచ్చుకున్నారు. వేదాలను ఆపోశన పట్టారు. అందుకు మల్లాదికి సహకరించినవారు యడవల్లి సుబ్బావధానులు. వాటితోబాటు బ్రహ్మసూత్రాలను శిష్ట్లా నరసింహశాస్త్రి వద్ద, మహాభాష్య వ్యాకరణాన్ని నూరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద అభ్యసించారు. అలాగే నలభైకి పైగా భాషల్లో పాండిత్యం సంపాదించారు. ఇంగ్లీషు సాహిత్యం మీద మల్లాదికి మంచి పట్టు వుంది. మల్లాది తన కలం ద్వారా ఎందరో సాహితీమూర్తుల గురించి వ్యాసాలు రాశారు. ఇక పీఠికలు, విమర్శనావ్యాసాలు కోకొల్లలు. మున్షీని పెట్టుకొని ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఖురాను చదివారు. పీటర్ కేటర్ అనే బైబిల్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆయనకు వున్న ఆస్తి కేవలం పాండిత్యమే కాదు. ఆయనకు కుస్తీ పట్టడాలు, వ్యాయామ విద్యలుకూడా వచ్చు. కాలికి గజ్జెకట్టి నాట్యంచేసేవారు. హార్మోనియం మీద మెట్లను సుతారంగా మీటేవారు. ఇన్ని లక్షణాలున్న ఈ అక్షర యాత్రికుడు సినీ కవుల కులానికి ఆదిగురువు లాంటివారు. రాత్రికి రాత్రే ఐదారు కథలు ఏకబిగిన రాసేవారు. ఆయన రాసిన వందకు పైగా కథలు వేటికవే ఆణిముత్యాలు. వాటిలో తెలుగుతనం ఉరకలు వేస్తుంటుంది. గుంటూరు నుంచి వెలువడే ‘దేశాభిమాని’ అనే పత్రికలో చేరి మంచి రచనలు చేశారు. తరవాత ‘కృష్ణాపత్రిక’ లో కలంపేర్లతో చాలా రచనలు చేశారు. తెలుగు నటులు, సమీక్షలు వంటి శీర్షికలను నిర్వహించారు. 1940 లో మల్లాది కి దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం నుంచి సినీరంగానికి రమ్మని పిలుపొచ్చింది.

Malladi

చెన్నపట్నంలో బోధిసత్వుడు…

గూడవల్లి రామబ్రహ్మం మొదట సముద్రాల రాఘవాచార్యకు ‘కనకతార’ (1937) సినిమాలో అవకాశం ఇచ్చారు. తరవాత నిర్మించిన ‘గృహలక్ష్మి’(1938), వాహినీ వారి ‘వందేమాతరం’(1939) సినిమాలు సముద్రాలకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. సారథి వారి ‘మాయాలోకం’ (1947) సినిమాకు రామబ్రహ్మం దర్శకత్వం చేపట్టినప్పుడు సముద్రాల ఆరోగ్యం దెబ్బతిన్నది. అప్పుడు మల్లాది రామకృష్ణశాస్త్రి ఆ సినిమాకు రచనా సహకారం అందించారు. సముద్రాల అంతకుముందే మల్లాదికి తెలిసి ఉండడంతో సినిమాల రచనలో తనకు సహకారం అందించమని సముద్రాల కోరితే, రామకృష్ణశాస్త్రి ‘సరే’నన్నారు. ‘పల్నాటియుద్ధం’(1947) సినిమాకు సముద్రాల రచన చేస్తుండగా, నిర్మాత రామబ్రహ్మం మల్లాదికి కథా పర్యవేక్షణ, సలహా, సంప్రదింపుల బాధ్యతలు కట్టబెట్టారు. అయితే సినిమా మొదలుబెట్టిన కొంతకాలానికే రామబ్రహ్మం పక్షవాతంతో మంచంపట్టారు. దాంతో చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యత ఎల్.వి. ప్రసాద్ మీద పడింది. చిత్రనిర్మాణం పూర్తవకుండానే రామబ్రహ్మం కాలంచేశారు. అందులో మల్లాది కలంనుంచి జాలువారిన “ఈ కుహూరాత్రి నా రాజు వేంచేయునా, నా జీవితమూ రాసీభూతమ్ము చేయునా” అనే పాట బాగా హిట్టయింది. విరహగీతంలా కనిపించే విషాద గీతమిది. అందులో ‘కుహూరాత్రి’ (చంద్రకళ కానరాని అమావాస్య) అనే పదప్రయోగం సినీ పండితులను ఆకట్టుకుంది. అయితే మల్లాది రాసిన పాటలు, సహకరించిన సంభాషణలు అన్నీ సముద్రాల పేరిటే చలామణి అయ్యాయి. శాస్త్రి గారు సినిమాల్లో పాటలు రాసేందుకు వెంపర్లాడలేదు. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళిన నిర్మాతలకే పాటలు రాశారు. పాటల కోసం ఎవరినీ యాచించలేదు, ఆశ్రయించనూలేదు. మద్రాసులోని పానగల్ పార్క్ లో ఓ చెట్టుక్రింద వుండే రాతిబల్ల మీద కూర్చొని సాయంత్రం వేళలో విద్వత్సభలను నిర్వహించేవారు. ఎందరో కవులకు సందేహ నివృత్తి చేసేవారు. ఆ సమావేశాలకు శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ వంటి ఉద్దండ కవులు హాజరయ్యేవారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్వహించే భువనవిజయంలా వుండేవి ఆ విద్వత్సభలు. ఒకసారి ఆచార్య ఆత్రేయ ఒక సందేహాన్ని లేవనెత్తారు. ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’ పౌరాణిక సినిమాకు సంభాషణలు రాస్తూ అందులో ‘కబురు’ (ఖబర్ అనే అరబిక్ పదం) అనే పదం పొరపాటున దొర్లిందని విచారం వ్యక్తం చేశారు. మల్లాది వారు వెంటనే “ఏమీ ఫర్వాలేదు ఆత్రేయా. బీబీ నాంచారమ్మ వుందికదా. సర్దుకుంటుందిలే” అని చమత్కారంగా ఆత్రేయను సమాధానపరచారు. మరొకసారి ఆరుద్ర మల్లాది వారిని “గురువుగారూ మీకు అసలు ఎన్ని భాషల్లో ప్రవేశం వుంది?” అని అడిగారు. అందుకు జవాబుగా “చెబుతూ వుంటాను. రాసుకోండి” అన్నారు. అప్పుడు ఆరుద్ర మల్లాది వారికి ఒక విసనకర్ర ఇస్తూ “గురువు గారూ మీకు ఎన్ని భాషలు వచ్చో అన్నీ భాషల్లో ఈ విసనకర్ర రెక్కలమీద సంతకం చేసి ఇవ్వండి” అంటూ కలం అందించారట. మల్లాది గారు ఒక్కో ఆకుమీద సంతకం చేస్తుంటే ఆ విసనకర్రకు రెండువైపులా వుండే ఆకులన్నీ నిండిపోయాయట. అంతే కాదు, పాండీ బజార్ లో వున్న ఒక హోటల్లో భోజన టికెట్ల పుస్తకం కొని జేబులో పెట్టుకునేవారట, పానగల్లు పార్క్ కు వచ్చే అన్నార్తులకు ఆ భోజనం టికెట్లు ఇచ్చి భోజనం చెయ్యమని చెప్పేవారట. ఈ విషయాన్ని శ్రీ రావి కొండలరావుగారు నాకు చెప్పారు. మల్లాది రచించిన నవలల్లో తేజోమూర్తులు, కృష్ణాతీరం, క్షేత్రయ్య వున్నాయి. అలాగే బాల, కేళీగోపాలం, గోపీదేవి వంటి నాటికలు కూడా వున్నాయి. చలవ మిరియాలు పేరుతో కథల సంకలనం కూడా వెలువరించారు.

కథ, మాటలు, పాటల రచయితగా..

మల్లాదికి తొలి చిత్రం ‘చిన్నకోడలు’(1952). దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య నిర్మించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది శాస్త్రి గారే. గోవిందరాజుల సుబ్బారావు, కుమారి, కృష్ణకుమారి, నారాయణరావు నటించిన ఈ చిత్రానికి అశ్వత్థామ సంగీతం సమకూర్చారు. ఇందులో అనార్కలి గేయరూపకం ఆరోజుల్లో బాగా పాపులర్ అయింది. సినీగేయచరిత్రలో అనార్కలిపై వెలువడిన తొలి గేయరూపకంగా దీనిని పరిగణించాలి. ఇందులో మల్లాది ఉర్దూ షాయరీ, పారశీక భాషా పరిమళాలను వెదజల్లారు. మల్లాది పాటలు రాసింది కేవలం 40 చిత్రాలకు మాత్రమే. వాటిలో ఆయన రాసిన పాటలు కేవలం 185 అంటే విస్మయం కలుగుతుంది. ఇన్ని తక్కువ పాటలు రాసిన శాస్త్రి గారికి అంతటి పేరు, గురుత్వం ఎలా వచ్చిందనేది అంతుతెలియని ప్రశ్న. సినీ కవులు సముద్రాల, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి మల్లాదిని ఒక సాహిత్య బ్రహ్మగా గౌరవించారే తప్ప, సినీ కవిగా మాత్రం కాదు. మల్లాది చివరి సారి పాటలు రాసిన చిత్రం కల్పనా చిత్ర బ్యానర్ పై కె. బాబురావు నిర్మించిన ‘అత్తగారు-కొత్తకోడలు’ (1968). అక్కినేని సంజీవి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినవారు జి.కె. వెంకటేష్. “యమునా తీర సైకతాల ఎంతో చల్లని హాయిరా, యదురాయా నీ నగవు మచ్చు చల్లే మాయరా” (సుశీల) అనే పాటను అందులో రాశారు. మల్లాది రాసిన పాటలన్నీ శాశ్వత విలువలతో వెలిగే వెన్నెల దీపాలే. కేవలం పాటలే కాకుండా చిరంజీవులు, శ్రీ గౌరీ మహాత్మ్యం, రాజనందిని, రాజూ-పేద, పెళ్లిచూపులు, ఉషాపరిణయం సినిమాలకు కథ, మాటలు, పాటలు సమకూర్చగా, రేచుక్క, శ్రీకృష్ణ రాయబారం, శ్రీశైల మహాత్మ్యం, వీరాంజనేయ సినిమాలకు మాటలు, పాటలు రాశారు. అంజలి పిక్చర్సు వారి స్వర్ణమంజరి, సువర్ణసుందరి చిత్రాలకు మాటలు రాశారు. జాతీయాలను, లోకోక్తులను మేళవించి అలతి పొలతి పదాలతో ఆయన మాటలు రాసేవారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని 1954లో శ్యామలా సంస్థ బోళ్ళ సుబ్బారావు దర్శకత్వంలో సినిమాగా నిర్మించింది. ఎం.ఎస్. రామారావు సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో “యేరు నవ్విందోయ్, ఊరు నవ్విందోయ్, ఏటిలో చిట్టిచేప యిట్టే నవ్విందోయ్” అనే పాటను రాశారు శాస్తి గారు. అయితే ఈ పాటను మల్లాది దేవదాసు సినిమాకోసం రాస్తే సుబ్బురామన్ రికార్డు చేశారని, కానీ అందులో ఉపయోగించలేకపోయారని పెద్దల ఉవాచ. వినోదా వారు నిర్మించిన ‘కన్యాశుల్కం’ చిత్రంలో మల్లాది “చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా…వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడా” అనే పాట రాశారు. ఇందులో గిరీశం శిష్యుడు వెంకటేశం వేసే ప్రశ్నకు గిరీశం సమాధానం చెప్పేలా ఈ పాటను రాశారు మల్లాది. ఇందులో మిఠాయి పొట్లం బుచ్చమ్మ అనుకోవాలి. నటి దేవిక (ప్రమీల) హీరోయిన్ గా పరిచయమైన ప్రతిభావారి ‘రేచుక్క’ (1954) చిత్రానికి మల్లాది సమకూర్చిన మాటలు, పాటలు చిన్నచిన్న వాక్యాలతో, అర్దోక్తులతో, విరుపులతో సాగుతాయి. ఇందులో “ఎక్కడిదీ అందం, ఎవ్వరిదీ ఆనందం… వెలిగే అందం, చెలరేగే ఆనందం”(జిక్కి), “ఎటుచూసినా బూటకాలే, ఎవరాడినా నాటకాలే” (లీల), “బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదా తీరగా పావురమా” (ఘంటసాల), “ఒంటరొంటరిగా పోయేదానా ఒక మాట వినిపో” (ఘంటసాల) పాటలు అద్భుతాలే. ముఖ్యంగా “మబ్బులకు సరాసరి ఎగరాలి హంసలా, చిక్కాలి నీకు చక్కని చుక్కలు, ఆకశమంతా నీ రాజ్యమే” అంటూ రాయడం ఆ మహానుభావునికే సాధ్యమైంది. లీల పాడిన “అయ్యో బంగాగారు సామీ, ఓరబ్బీ బంగారు సామీ” పాటలో “గువ్వలాటిదాన్ని, మల్లెపువ్వు లాటి చిన్నదాన్ని, రవ్వలేమి చేసుకోనురో రాయడా, రవ్వలొద్దురా దొరా నవ్వు నవ్వరా” ఒక అద్భుత ప్రయోగం. ఇక్కడ రవ్వలు అంటే ‘మణులు’ అనే అర్ధం. ఈ సినిమా వందరోజులు ఆడినప్పుడు జరిగిన వేడుకలో మల్లాది తరఫున సముద్రాల షీల్డు అందుకోవడం వారిద్దరి ఆత్మీయతకు, మైత్రీబంధానికి తార్కాణం. అసలు ఈ చిత్రానికి మల్లాది వారు ‘రేచుక్క’ అని పెట్టడమే ఒక అద్భుతం. 1956 లో డి.ఎల్. నారాయణ వినోదా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ‘చిరంజీవులు’ సినిమా నిర్మించారు. ఇందులో మాటలు, పాటలు మల్లాదివే. ఆ చిత్రంలో “చికిలింత చిగురు, సంపంగి గుబురు, చినదానీ మనసు” (ఘంటసాల) పాట నేటికీ హిట్ పాటే. “దిరిసెన పూవుమీద చిలుకూ ముగ్గులూ, చిన్నారి బుగ్గమీద ఛిలిపీ సిగ్గులూ, మల్లెల దొంతరలూ, మరుమల్లె దొంతరలూ” అని చరణం పొదిగారు మల్లాది. అసలు ‘చికిలింత చిగురు’ పదప్రయోగమే ఓ అద్భుతం. ఇందులో ఘంటసాల, లీల ఆలపించిన “ఎందాక ఎందాక ఎందాక, అందాక అందాక అందాకా” అనే పాటలో ప్రశ్నల జోరు బలే వుంటుంది. “ఏనాటికైనా నీదాననే” (లీల) అనే ఉదాత్తమమైన పాటలో “చివురుకు జీవము నీవేగా” అని మల్లాది అమోఘమైన ప్రయోగం చేశారు. ఇక ఘంటసాల పాడిన “మనసు నీదే మమత నాదే, నా దానవే, నే నీవాడనే” పాటలో అన్నీ అలతి పొలతి పదాలే. ఈ పాటలో “చివురు మామిడి పందిళ్ళు” అనే గొప్ప ప్రయోగాన్ని చేశారు మల్లాది. ఘంటసాల ఆలపించిన విషాదగీతం “మిగిలింది నేనా బ్రతుకిందుకేనా” కూడా మంచి పాటే. ఈ సినిమాలో నేటికీ వినిపించే అద్భుతమైన పాట లీల ఆలపించిన “తెల్లవార వచ్చే తెలియక నాసామి మళ్ళి పరుండేవు లేరా” అనేది. అందులో “కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా, తరుణులందరూ దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా” అంటూ మేలుకొలుపు పాటలో ఎన్ని అద్భుత ప్రయోగాలున్నాయో వింటే తెలుస్తుంది. వాస్తవానికి ఈ పాట వేరే సినిమాకోసం రాసింది. డి.ఎల్. నారాయణ ఈ పాటను చూసి, అందుకోసం ఒక సన్నివేశాన్ని సృష్టించి పాటను వాడుకున్నారు. ‘దొంగల్లో దొర’ (1957) చిత్రంలో ఘంటసాల ఆలపించిన “ఎందుకోయీ పయనమూ, నీకు నీవే దూరమై” పాట ఆయన పాడిన విషాదగీతాల్లో మకుటాయ మానమని చెప్పక తప్పదు. ‘ఎందుకో… ఈ పయనమూ’ అని, ‘ఎందుకోయీ పయనమూ’ అని కూడా ఈ పల్లవిని అన్వయించవచ్చు. అలాగే ‘ఇంటిగుట్టు’ (1958)లో ఘంటసాల ఆలపించిన “న్యాయంబిదేనా ధర్మంబిదేనా ఇల్లాలికే వేదనా” అనే పాట కూడా కంటనీరు తెప్పించేదే. ‘కార్తవరాయని కథ’ (1958) సినిమాలో పి.బి. శ్రీనివాస్ ఆలపించిన “ఆనంద మోహన, ఖగరాజ వాహన, అవతార లీలా విలాసా లోకేశా”అనే ప్రార్ధనాగీతం; జలరుహా వారి ‘రాజనందిని’ లో జిక్కి ఆలపించిన “కొమ్మమీద కోయిలుందిరా సినవోడా కోయంటే పలుకుతుందిరా” అనే కవ్వింపు పాట, రాజా, జిక్కి ఆలపించిన “అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా” అనే ప్రణయ గీతం మరపురానివి. గుత్తారామినీడు దర్శకత్వంలో మంజీరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ‘చివరకు మిగిలేది’ (1960) చిత్రంలో మల్లాది పాటలు వెరైటీగా వుంటాయి. బెంగాలి చిత్రం ‘దీప్ జలే జాయే’ ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాలో ఘంటసాల ఆలపించిన “సుధవోల్ సుహాసినీ, మధువోల్ విలాసినీ, ఓహో కమనీ” పాట యెంతో ప్రశాంతంగా సాగుతుంది. బెంగాలి మాతృకలో హేమంతకుమార్ ఆలపించిన “యే రాత్ తోమార్ అమర్” పాటకుకు యధాతధ అనుకరణ ఈపాట. “సుధవోల్”, “మధువోల్” పదాల ప్రయోగం కూడా ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఇక మల్లాది ఊహాత్మక రచనకు మచ్చుతునక ‘కలిమిలేములు’(1962) చిత్రంలో రచించిన “కొమ్మలమీద కోతి కొమ్మచ్చులాడింది తెల్లాతెల్లని ఓ బుల్లి ఎండా, నేలమీద వాలింది వాలుమొగ్గలేసింది నల్లానల్లని ఓ బుచ్చి నీడ” అనే సింధుభైరవి రాగ చాయాల్లో వచ్చే పాత అమోఘం. ఈ గీతంలో కొమ్మను తాకిన ఎండతో కూడా కోతికొమ్మచ్చులు ఆడవచ్చని మల్లాది భావయుక్తంగా తెలపడం విశేషం. అనురూపావారి ‘అనురాగం’ (1963) చిత్రంలో భానుమతి పాడే “సన్నజాజి తీవలోయ్ సంపంగి పూవులోయ్, చిలిపి సింగారులోయ్ పాపలు, సిరులోలికే చిన్నారులోయ్” అంటూ చిన్నారుల గుణగణాలను మల్లాది వారు వర్ణించారు.

చరిత్ర సృష్టించిన జయభేరి, రహస్యం

1959లో శారదా ఫిలిమ్స్ పతాకం మీద వాసిరెడ్డి నారాయణరావు పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘జయభేరి’ అనే సంగీత భరిత చిత్రాన్ని నిర్మించారు. కళలు పండిత జనానికే కాకుండా పామరులకూ అందాలని, కులరహిత సమాజం వర్ధిల్లాలనే నేపథ్యంలో మరాఠీ సినిమా ‘మత్వాలా షాయర్ రామ్ జోషి’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి మల్లాది పెండ్యాలతో కలిసి సంగీత ప్రతిష్ట చేశారు. ఇందులో మల్లాది ఏడు అజరామరమైన పాటలు రాసి అమరులయ్యారు. సాక్షాత్తు వరదాయని కోసం ఆవిష్కరించిన మల్లాది కృతి “మది శారదా దేవి మందిరమే, కుదురైన నీమమున కొలిచేవారి మది” ని ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రఘునాథ పాణిగ్రహి కల్యాణి రాగంలో పోటీగా పాడటం విశేషం. నిశ్చల భక్తితో కొలిచేవారి హృదయమే శారదా దేవి మందిరం అని సూచిస్తూ సాగే ఈ గీతం ఆ సినిమాకే మకుటాయమానమైంది. ఇక మనసును మలయ మారుతంగా తాకే గీతం ఘంటసాల భీంపలాస్ రాగంలో ఆలపించిన “రాగమయీ రావే, అనురాగమయీ రావే” ఒక అద్భుతం. ఈ పాటలో మల్లాది వాడిన కొన్ని పదాలు చిరకాలం గుర్తుంచుకునేవి. వాటిలో “చివురులు మేసిన చిన్నారి కోయిల”, “చనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు”, “మరుమల్లెల విరజాజుల పరిమళం”, “జిలుగే సింగారమైన చుక్కకన్నెలు అంబరాన” కొన్నిమాత్రమే. ఘంటసాల స్వరజీవన ప్రస్థానంలో స్థిరంగా నిలచిన సంప్రదాయ సంగీతపు రసగుళిక “రసికరాజ తగువారము కామా, అగడు సేయ తగవా…ఏలు దొరవు అరమరికలు ఏలా, ఏలావేల సరసాల సురపాల ఏలు దొరా” పాట. జగదేకవీరుని కథలో “శివశంకరి” సరసన ధీటుగా నిలిచే ఈ గీతాన్ని త్రిస్థాయిల్లో చక్రవాక, కానడ రాగాల్లో పెండ్యాల స్వరపరచగా అత్యద్భుతంగా ఘంటసాల ఆలపించిన గీతమిది. ఇందులో “దివ్యనామ మధుపానము చేసి” అనే పద ప్రయోగం “పిబరే రామరసం” కీర్తనను గుర్తుకు తెస్తుంది. ఇక ఎం.ఎల్. వసంతకుమారి ఆలపించిన “నీవెంత నెరజాణ వౌరా, సుకుమార, కళామోహనా, సంగీతానంద” అనే జావళిని కేవలం పదశక్తితో రక్తి కట్టించారు పెండ్యాల. హిందోళ, బిళహరి రాగాల మేళవింపుతో అమరిన రాగమాలిక ఇది. ఈ సినిమాలో మల్లాది రాసిన “నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా” అనే మరోఅద్భుతమైన పాటను సెన్సారు వారి సూచన మేరకు తొలగించారు. ‘చుక్క’ అనే పదప్రయోగం ఆరోజుల్లో అమలులో వున్న మద్యపాన నిషేధ చట్టానికి నిషిద్ధమనే వాదనతో ఆ పాటను నిషేధించారు. మల్లాది రామకృష్ణశాస్త్రి సినీ జీవన ప్రస్థానంలో సాహిత్యపరంగా వన్నెతెచ్చిన చిత్రం లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ సినిమా. ఈ సినిమాకోసం మల్లాది గిరిజా కల్యాణం యక్షగానాన్ని ఒక సంగీత జలపాతంలా మలిచారు. అందుకు ఘంటసాల తనదైన రీతిలో వివిధ రాగాల అమరికతో ఆ పాటను అజరామరం చేశారు. జగన్మాత లలితాదేవి నిలయంలో అమ్మవారి వైభవాన్ని లక్ష్మి, పార్వతి, సరస్వతులు కలిసి వర్ణిస్తూ, నారదుడు, ఇతర దివ్యాంగనామణులతో కలిసి స్తుతించే సన్నివేశానికి రాసిన పాట “లలిత భావనిలయా నవ రసానంద హృదయా, వికచారవింద నయనా సదయా జగదీశ్వరీ”అంటూ ఈ గీతం సాగుతుంది. పల్లవిలో లలితాదేవి తోబాటు సరస్వతీ దేవిని స్తుతించారు. రెండు, మూడు చరణాలలో లక్ష్మీ దేవి, పార్వతీ దేవిని స్తుతించారు. ఘంటసాల ఈ పాటను సరస్వతి, శ్రీ, లలిత రాగాల సమ్మేళనంతో రాగమాలికగా తీర్చి దిద్దారు. ‘లలితభావ నిలయ’ ను సరస్వతి రాగంలో, ‘శ్రీదేవి కైవల్య చింతామణి’ని శ్రీ రాగంలో, ‘నిటలలోచన నయన తార తారా భువనేశ్వరి’ ని లలిత రాగంలో స్వరపరచడం ఘంటసాలకే సాధ్యపడింది. ఇన్ని పాటలను విశ్లేషించినా మల్లాది వారి ప్రతిభకు విలువ కట్టలేం. సముద్రాలకు పరోక్ష రచయిత మల్లాది అనే కథనం ప్రచారంలో వుంది. అందులో అబద్ధం లేదు. ఈ విషయాన్ని కొందరు సన్నిహితులు మల్లాది వద్ద ప్రస్తావిస్తే “నా పేరుతో వచ్చేవే నా పాటలు” అంటూ “సముద్రాల నా కలం పేరు” అని చమత్కరించారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54295)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap