(నేడు(14-10-21) ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు వర్ధంతి)
ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులన్నారు. నృత్య అభ్యసనకు పనికిరాదన్న తిరస్కారాలు పొందిన ఆమె పట్టుదలతో నృత్యసామ్రాజ్యంలో ఉన్నతశిఖరాలను చేరారు. ముద్రలు సరిగ్గా లేవన్న విమర్శలను పొందిన ఆమె అనంతర కాలంలో శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్ర వేశారు. కూచిపూడి అభినయానికి దేశ విదేశాల్లో గొప్ప పేరు తెచ్చిపెట్టారు. చలనచిత్రాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా ప్రఖ్యాత నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్ కు ఇచ్చిన మాట మేరకు ఆ అవకాశాలన్నింటినీ సున్నితంగా తిరస్కరించారు. నాట్యకళకే అంకితమయ్యారు. విశేషకృషితో పద్మశ్రీ బిరుదాంకితులయ్యారు. ఆ నృత్య చూడామణి శోభానాయుడు.
కూచిపూడిలో నవరస అభినయంతో ప్రేక్షకులను అలరించిన శోభానాయుడు 1956లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు. చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఆమెలో నృత్యం అభ్యసించాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. సంప్రదాయ కుటుంబం కావడంతో తండ్రి వెంకటనాయుడుకు ఆమె నాట్యం నేర్చుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఆమె అభిరుచికి తల్లి సరోజినీ దేవి ప్రోత్సాహం తోడు కావడంతో కూచిపూడి అభ్యసనలో తొలి అడుగులు వేశారు. అయితే ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులు నిరాశపర్చారు. వారి మాటలు ఆమెలో పట్టుదలను పెంచాయి. రాజమండ్రిలో పి.ఎల్.రెడ్డి వద్ద తొలి పాఠాలు నేర్చుకున్న అనంతరం ప్రఖ్యాత నృత్య గురువు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి అభ్యసించేందుకు చెన్నై పయనమయ్యారు. తన కూతురును డాక్టరుగా చూడాలని ఆశపడ్డ వెంకటనాయుడు అయిష్టంగానే ఒక షరతుతో ఆమె చెన్నై వెళ్ళేందుకు అంగీకరించారు. అరంగేట్రం తర్వాత ప్రదర్శనలివ్వడం మానేయాలన్నది ఆ షరతు. షరతుల వారధి మీదుగా చెన్నై పయనించిన శోభానాయుడుకు అరంగేట్రం తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు.
వెంపటి చినసత్యం ముఖ్య శిష్యురాలిగా కూచిపూడి నృత్యంలో శిఖరారోహణ చేశారు శోభానాయుడు. గురువు రూపొందించిన పలు నృత్య నాటకాల్లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సత్యభామగా, పద్మావతిగా, చండాలికగా నవరస నృత్యాభినయానికి మారుపేరుగా నిలిచారు. లయబద్ధంగా చురుకుగా కదిలే శోభానాయుడు పాదాలు, శిల్ప సదృశ దేహ భంగిమలు, ముఖంలో ప్రతిబింబించే భావాలు, నేత్రాభినయం, కనురెప్పల కదలికలు, కనుబొమ్మల ముచ్చట్లు, హస్త ముద్రలు ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తేవి. ‘భామనే… సత్యభామనే..’ అంటూ సిద్ధేంద్ర యోగి తీర్చిదిద్దిన సత్యభామగా వేదికపై శోభానాయుడు అభినయం ఆమెకు ‘కలియుగ సత్యభామ’గా పేరు తెచ్చిపెట్టింది. 80వైయక్తిక ప్రదర్శనలకు, 15నృత్య రూపకాలకు ఆమె రూపకల్పన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, ఇంగ్లాండు, సిరియా, టర్కీ, హాంకాంగ్, బాగ్దాద్, కంపూచియా, బ్యాంకాక్, వెస్టిండీస్, మెక్సికో, వెనిజులా, ట్యునీషియా, క్యూబా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి, కూచిపూడి కళకు ప్రాచుర్యం కల్పించారు. దేశం ప్రతినిధులుగా వివిధ దేశాల్లో పర్యటించిన భారతీయ కళాకారుల బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ‘తానా’ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు చేశారు.
నృత్య రంగంలో విశిష్ట సేవలందించినందుకు కేంద్రప్రభుత్వం 2001లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని 1991లో శోభానాయుడు పొందారు. చెన్నై లోని కృష్ణ గాన సభ 1982లో ఆమెను ‘నృత్య చూడామణి’ బిరుదుతో సన్మానించింది. 1996లో నృత్య కళా శిరోమణి పురస్కారాన్ని, 1998లో ఎన్టీరామారావు అవార్డును, 2001లో తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక పురస్కారాన్ని పొందారు. ఇవే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, సత్కారాలను, ఎన్నో బిరుదులను ఆమె పొందారు.
దేశ విదేశాల్లో కూచిపూడికి విశేష ప్రాచుర్యం కల్పించిన శోభానాయుడు హైదరాబాదులో కూచిపూడి డ్యాన్స్ అకాడమీని నెలకొల్పారు. అకాడమీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. కూచిపూడి అభ్యసనం తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సదుద్దేశ్యంతో అతి తక్కువ ఫీజుతో అకాడమీలో కూచిపూడి నేర్పించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండువేల మందికి కూచిపూడి నృత్యాన్ని బోధించారు.
శోభానాయుడు తన జీవితాన్ని పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితం చేశారు. నేతి శ్రీరామశర్మ దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించినా, పూర్తిదృష్టి కూచిపూడి నృత్యంపైనే పెట్టారు. నాట్యంలో ఆమె నైపుణ్యానికి ఆశ్చర్య భరితులైన ప్రముఖ భరతనాట్య గురువు వళ్లువూర్ బాగ్యతమ్మాళ్ రామయ్య పిళ్ళై ఆమెకు ఉచితంగా భరతనాట్యం నేర్పుతానన్నారు. పిళ్ళై అన్నా, భరతనాట్యమన్నా తనకు అభిమానమేనని, అయితే కూచిపూడి నేర్చుకునేందుకు తన జీవితకాలం సరిపోదని సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు శోభానాయుడు. తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ను హిందీలో ‘సర్గం’ పేరుతో పునర్మిర్మించే సందర్భంలో ఆ సినిమాలో నటించేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాతో పాటు పలు ఇతర సినిమాల్లోనూ నటించేందుకు వచ్చిన అవకాశాలను శోభానాయుడు వదులుకున్నారు. కూచిపూడి నాట్యం తనకు మొదటి ప్రాధాన్యత కావడం ఇందుకు ఒక కారణమైతే ప్రఖ్యాత నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్ కు ఇచిన మాట ఒక కారణం. శోభానాయుడు లోని ప్రతిభను అరంగేట్రం నాడే గుర్తించిన రుక్మిణీదేవి సినిమాల్లోకి వెళ్ళనన్న హామీని శోభానాయుడు నుండి పొందారు.
కూచిపూడి కళకు విశేష ప్రాచుర్యం తెచ్చిన శోభానాయుడు గత ఏడాది అక్టోబరు 14వ తేదీన కన్ను మూశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అభినయంతో అలరించిన ఆ కళ్లు శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. ‘కూచిపూడి నృత్యం ద్వారా పొందే ఆత్మ సంతృప్తి, మానసిక ప్రశాంతత, వైద్యపరమైన ప్రయోజనాలను కీర్తి, కాసులతో ముడి పెట్టలేమ’ని పేర్కొన్న శోభానాయుడు నృత్యాభినయం ఎప్పుడూ మర్చిపోలేనిది.
–డాక్టర్ ఆర్ సూర్యప్రకాశ్ రావు
మొబైల్: 94410 46839