డ్రీమ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ 8వ జాతీయ చిత్రలేఖనం పోటీలు మరియు ప్రదర్శన గత నెల 25వ తేదీన విజయవాడ కల్చరల్ సెంటర్ ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో దాదాపు 15 రాష్ట్రాల నుండి వందకు పైగా పాటశాలల నుండీ, ఆర్ట్ అకాడమీల (జవహర్ నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్) నుండి మూడు వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విద్యార్థినీ విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని అనేక అంశాలపై సొంత భావాలను అద్భుతమైన చిత్రాల ద్వారా తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా దేశ సమగ్రత, ఐక్యత, సేవ్ వాటర్, కాలుష్య నియంత్రణ, సేవ్ గర్ల్ చైల్డ్, ల్యాండ్స్కేప్, మోడరన్ ఆర్ట్ మొదలగు అంశాలు చిత్రించారు.
బహుమతులు:
ఆల్ ఇండియా బాల ప్రోత్సాహక అవార్డులు – 20 ( ప్రతి స్కూల్ కి)
ఆల్ ఇండియా బెస్ట్ స్కూల్ అవార్డులు – 20
బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డులు – 20
దామెర్ల రామారావు అవార్డులు – 10
భగీరథ అవార్డులు -10
వడ్డాది పాపయ్య అవార్డులు – 10
బాపు అవార్డులు – 5
నడిపల్లి సంజీవరావు అవార్డులు – 5 అందజేసారు.
బహుమతి ప్రధానోత్సవం లో శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి,గుంటూరు, అనంతపురం, చిత్తూరు, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీమ్నగర్, హైదరాబాద్ తదితర ప్రాన్తాల నుండి ఆర్ట్ టీచర్లు విద్యార్దులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శన ను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యునెస్కో ఇండియా ప్రతినిధి, సీనియర్ ఆర్టిస్ట్ గోకా రామస్వామి, ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ గోళ్ళ నారాయణరావు, ఎమినెంట్ ఆర్టిస్ట్ డా. ఎన్. రవికుమార్, అధ్యక్షులుగా 64 కళలు డాట్కాం ఎడిటర్ కళాసాగర్ యల్లపు, చిత్రకారులు మృత్యుంజయరావు, గోకా అశోక్, ఐ.సిహెచ్. సత్యనారాయణ, శశి భూషన్రావు, సి. కోటేష్, వెంపటాపు, టి. రవీంద్ర, పి. రామస్వామి, ఈ. విజయ్ కుమార్, మండా మోహన్ రావు, కె. రమేష్ తదితరులను డ్రీమ్ ఆర్ట్ అకాడమీ పౌండర్ ప్రెసిడెంట్ పి. రమేష్ అవార్డులతో సత్కరించారు. గోళ్ళ నారాయణరావు గారు ప్రారంభించిన ఈ ప్రదర్శనలో బహుమతి పొందిన చిత్రాలన్నిటిని ప్రదర్శించడం విశేషం.