సినీ కళామతల్లి సేవలో ఎదిగిన – ఏడిద

తీసినవి పది సినిమాలే అయినా… రాశి కంటే వాసి ముఖ్యమన్న నిర్మాత. తాను నిర్మించిన సినిమాలతో తన అభిరుచికి అద్దంపట్టేలా…సినీ కళామతల్లికి సేవలు చేసిన గొప్పవ్యక్తి, మన ప్రభుత్వాలు గుర్తించని గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వర్ధంతి నేడు !

ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారాయన.

రాశి కంటే వాసి ముఖ్యమన్న నిర్మాత. తాను నిర్మించిన సినిమాలతో తన అభిరుచికి అద్దంపట్టేలా.. సినీ కళామతల్లికి సేవలు చేసిన మహనీయుడు.. ప్రపంచ సినీ య‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాత, పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు వర్ధంతి నేడు. తెలుగు సినిమా వ్యాపార ధోరణిని కాదంటూ.. ఉత్త‌మాభిరుచితో సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు 4, అక్టోబర్ 2015న స్వర్గస్తుల‌య్యారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 1934 ఏప్రిల్‌ 24 ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. పాపలక్ష్మి, సత్తిరాజు నాయుడు తల్దిదండ్రులు. 1954లో మేనమామ కూతురు జయలక్ష్మిని వివాహ‌మాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.

సినీరంగ ప్రస్థానం…
తన స్నేహితుడు, నిర్మాత వి.బి. రాజేందప్రసాద్‍ నుంచి ‘అన్నపూర్ణ’లో నటించాలని పిలుపు రావడంతో మద్రాస్‍ వెళ్లాడు. కాని, ఆ వేషం దక్కలేదు. డబ్బింగ్‍ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ‘పార్వతీ కళ్యాణం’ లోని శివుడి పాత్రకి డబ్బింగ్‍ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తర్వాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకొన్నారు. నిర్మాత కాక ముందు ఆయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. రణభేరి, నేరము శిక్ష, బంగారు బాబు, మానవుడు దానవుడు, చిన్ననాటి స్నేహితులు తదితర చిత్రాల్లో నటించారు.
1962 నుంచి 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకి పైగా డబ్బింగ్‍ చెప్పారు. ఆ తర్వాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు.

‘నేరము శిక్ష’లో నటించడంతో ఆ చిత్ర దర్శకుడు కె. విశ్వనాథ్తో పరిచయం ఏర్పడింది. ఆయనతో సిరి సిరి మువ్వ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తర్వాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. తొలి ప్రయత్నంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో ‘తాయారమ్మ బంగారయ్య’ను నిర్మించారు. అందులో చిరంజీవి ప్రతినాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు. ఆ సినిమా విజయం సాధించడంతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్‍ అయ్యింది. నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని, నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో సినిమా కోసం మళ్లీ కె.విశ్వనాథ్‍ని సంప్రదించి శంకరాభరణం నిర్మించారు. ఇక ఆ చిత్రం తర్వాత వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. సీతాకోక చిలుక, స్వాతిముత్యం, సితార చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్‍ నామినేషన్లకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. చివరిగా ‘ఆపద్బాంధవుడు’ చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు.

తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. ఉత్తమాభిరుచి ఉన్న
ఏడిద నాగేశ్వర రావు.. 1979లో పూర్ణోద‌య సంస్థ‌ను స్థాపించారు.
తన సినీజీవితంలో పదే పది సినిమాలను నిర్మించారు. అయితే ఈ పది సినిమాలు కూడా కళాఖండాలు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన సంతకాలు. పూర్ణోదయ బ్యానర్ పై ఫస్ట్ తాయారమ్మ బంగారయ్యను నిర్మించారు. ఆపద్బాంధవుడు, స్వరకల్పన, స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, సాగర సంగమం, సితార, సీతాకోకచిలుక, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సిరిసిరిమువ్వ. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 9 సినిమాల్లో అత్యధిక చిత్రాలు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం. ఏడిద నాగేశ్వరరావు శంకరాభరణంతో ఖండాంతరంగా ఖ్యాతిగాంచారు. శంకరాభరణం సినిమాతో జాతీయ పురష్కారం ‘స్వర్ణ కమలం’ అందుకున్నారు. అంతేకాదు శంకరాభరణం మూవీ కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ సినిమాకి ఉత్త‌మ చిత్రంగా అవార్డు అందుకుంది.

‘శంకరాభరణం’ చిత్రంతో తెలుగు సినిమా రంగాన్ని మలుపు తిప్పిన నాగేశ్వరరావు గారు…
విశ్వనాథ్ తో ఉన్న అనుబంధంతో ఆయన వద్ద సంగీత సాహిత్యాలతో మిళితమైన ఓ మంచి కథ ఉందని తెలుసుకున్నారు ఏడిద నాగేశ్వరరావు. అయితే విశ్వనాథ్ సైతం అలాంటి చిత్రాలను జనం ఆదరిస్తారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయినా, తీస్తే అలాంటి సినిమా తీయాలని భావించారు ఏడిద. తాడి రామకృష్ణ, తాడి హరిబాబు, తాడి బాబ్జీ వంటి మిత్రుల ఆసరాతో ఆకాశం శ్రీరాములు, ఏడిద సంయుక్తంగా ‘శంకరాభరణం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 1979 లోనే పూర్తయింది. అయితే ఈ సినిమాను విడుదల చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. పంపిణీదారులకు పలు ప్రదర్శనలు వేశారు. చివరకు లక్ష్మీఫిలిమ్స్ వారు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో, ఇతర ఏరియాల వారూ సరే అన్నారు. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ‘శంకరాభరణం’ మొదటి వారం కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలు మాత్రమే ప్రదర్శితమయింది. మెల్లగా మౌఖిక ప్రచారం సాగింది. ‘శంకరాభరణం’ భలే బాగుందన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో ఉదయం ఆటలేవేసిన థియేటర్లు రెగ్యులర్ షోస్ ప్రదర్శించాల్సి వచ్చింది. 12 కేంద్రాలలో వంద రోజులు చూసిన ‘శంకరాభరణం’ తెలుగునేలపైనే కాదు, కన్నడ, తమిళ, మళయాళ సీమల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. మంచి లాభాలు చూసింది. ఆ రోజుల్లో టాప్ స్టార్ యన్టీఆర్ సినిమాలు మాత్రమే ఘనవిజయం సాధిస్తే కోటి రూపాయలు వసూలు చేసేవి. అలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ తో రూపొంది, అంతగా పేరులేని వారు ప్రధాన పాత్రలు పోషించగా తెరకెక్కి అనూహ్యంగా అన్నిచోట్లా కలిపి కోటి రూపాయలు పోగేసింది. మిత్రులందరికీ మంచి లాభాలు రావడంతోపాటు ఎనలేని కీర్తి కూడా దక్కింది. ఎక్కడికి వెళ్ళినా నాగేశ్వరరావును ‘శంకరాభరణం’ నిర్మాత అని పిలిచేవారు. అందుకే ఆయన హైదరాబాద్ లో కట్టుకున్న ఇంటికి ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు.

కమర్శియల్‌ సినిమా హవా నడుస్తోన సమయంలో శంకరాభారం పెను సంచలనం సృష్టించింది. దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. కమల్‌హాస‌న్‌ నటించిన ‘సాగరసంగమం’ తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అందించింది. ఉత్తమ న‌టుడిగా కమల్‌, ఉత్త‌మ గాయనిగా జానకి నంది అవార్డులు అందుకున్నారు. చిరంజీవితో ‘స్వయం కృషి’ సినిమా నిర్మించారు. తెలుగోడు త‌లెత్తుకునేలా ఈ సినిమా రష్యన్‌ భాషలోకి అనువాదమైంది. తర్వాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు శ్రీరామ్‌ హీరోగా నటించిన ‘స్వరకల్పన’ కూడా రష్యన్‌ భాషలోకి అనువాదమైంది. చిరంజీవి నటించిన మరో చిత్రం ‘ఆపద్భాందవుడు’ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక కాగా, నంది ఉత్తమ నటుడిగా చిరంజీవి రెండవ సారి ఎంపికయ్యారు.

మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాత.. తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన వ్యక్తికి ఏడిద నాగేశ్వర రావుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వలేదు.. దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. ఓర‌కంగా ప్రభుత్వాల కంటే ప్ర‌యివేటు సంస్థ‌లే ఏడిద సినీ అభిరుచిని గౌరవించాయి. కళాసాగర్ వారు దశాబ్తపు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, ‘సంతోషం’ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి. ప్రభుత్వాలు గుర్తించకపోయినా ఆయన నిర్మించిన సినీ కళాఖండాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని తీపిజ్ఞాపకంగా కలకాలం ఉండిపోతారు అనడంలో సందేహం లేదు.

‘శంకరాభరణం’తో ఖండాతర ఖ్యాతి:
సింగిల్‌ షెడ్యూల్లో 52 రోజుల్లో రూ.11 లక్షల వ్యయంతో ‘శంకరాభరణం’ను నిర్మించారు ఏడిద. జాతీయ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను తెచ్చుకున్న సినిమా. ఈ సినిమాను మలయాళంలోకి డబ్‌ చేశారు. అయితే పాటలను మాత్రం తెలుగులోనే ఉంచారు. ఎర్నాకులంలోని కవితా థియేటర్లో రెండేళ్ళు ఆడింది. అమెరికాలోనూ విడుదల చేశారు. 20 మంది యూనిట్‌ సభ్యులు అమెరికాలో 45రోజుల పాటు శంకరాభరణం నైట్స్‌ను నిర్వహించారు. తెలుగు సినిమాకు అమెరికాలో అంతగా బ్రహ్మరథం పట్టడం అదే ప్రథమం. జాతీయ స్థాయిలో స్వర్ణకమలం కూడా సాధించింది. ఈస్ట్‌ ఫ్రాన్స్‌లో సంగీత ప్రధాన చిత్రాలు మాత్రమే పాల్గొనే బెసన్‌కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు లభించింది. ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో ‘సీతాకోకచిలుక’ను తెరకెక్కించారు. అది జాతీయ స్థాయిలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకాన్ని, రాష్ట్ర స్థాయిలో బంగారు నందిని అందుకుంది. అలీకి ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడు అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా ‘సాగర సంగమం’. బెంగుళూరులో 575 రోజుల అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినిమా అది. నేటివిటీ మార్పులతో తెలుగు, తమిళ్‌, మలయాళంలో ఒకేసారి విడుదలైన సినిమా ఇది. తమిళంలో ‘సలంగై ఒళి’ పేరుతోనూ మలయాళంలో ‘సాగరసంగమం’ అనే పేరుతోనే విడుదలైందీ సినిమా. ఇండియన్‌ పనోరమకు ఎంపికైంది. బాలసుబ్రమణ్యానికి బెస్ట్‌సింగర్‌గా జాతీయ అవార్డు వచ్చింది.

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015 ఆదివారం సాయంత్రం కన్ను మూశారు.
-మహమ్మద్ గౌస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap