ఎప్పుడు ఫోన్ చేసినా అదే నవ్వు! అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు! “ఇంకో రెండేళ్లు ఉంచితే సహస్ర పూర్ణ మహోత్సవం చేసుకుందాం కనుల పండువగా” అని అనే వారు. ఆయనే మన చంద్రమోహన్. కానీ, ఇవాళ (11-11-23) ఉదయం గుండెపోటుతో కనుమూశారు. ఇంకో రెండేళ్లు ఉంచితే ఏం పోయింది? అంత తొందరేమిటి స్వామి.
చంద్రమోహన్ సినిమాలపై వంశీ రామరాజు గారు ఒక వెబ్ సెమినార్ ఏర్పాటు చేసినప్పుడు నేను విక్రమ్ సినిమా గురించి మాట్లాడాను. చంద్రమోహన్ నటనా వైదుష్యం గురించి విశ్లేషించాను. మరుసటి రోజు చంద్రమోహన్ నాకు ఫోన్ చేసి “మీ విశ్లేషణ విన్నాక మళ్ళీ విక్రమ్ సినిమా చూడాలనిపించింది. చూసాక మీకు ఫోన్ చేయాలనిపించింది. నేను అన్ని షేడ్స్ లో నటించానని మీరు చెప్పాక ఆ కోణం లో సినిమా చూసాక నాకు అర్ధమైంది” అని ఆయన ఒక నూతన నటుడు లా ఒక చిన్న పిల్లాడిలా ఆయన ఉత్సాహంగా మాట్లాడితే ఆశ్చర్యం కలిగింది. 930 సినిమాల నట చందురుడు ఆయన.
కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు. అయినా ఉత్సాహం తగ్గలేదు. ఆ నవ్వు చెదరలేదు. శోభన్ బాబు ఆయనకు ఆదర్శం. అందుకే సంపాదన వున్నప్పుడే ఆదాయాన్ని భూమి పై పెట్టాడు. ఆ భూములే ఆయన్ని కాపాడుకున్నాయి. అయితే ఆ తరువాత కబ్జాదారుల నుంచి కాపాడుకోలేక అనేక ఇబ్బందులు పడి చాలావరకు అమ్మేసుకున్నారు. భార్య జలంధర మంచి కథా రచయిత్రి. ఆమె ఆయన విజయ రహస్యం. ఆమె ఆయనకు బలం.
సంవత్సర క్రితం ఎవరో ఒక ‘యు ట్యూబ్ ఛానెల్’ లో చంద్రమోహన్ ఇకలేరు అనే పుకారు సృష్టించాడు. అది నిజం అనుకుని సోషల్ మీడియా కోడై కూసింది. శాటిలైట్ ఛానెల్స్ కూడా స్క్రోలింగ్ తో చంపేశాయి. అప్పుడు చంద్రమోహన్ నాకు ఫోన్ చేసి “నన్ను మీ మీడియా చంపేసిందయ్యా… బతికే వున్నా అని చెప్పవయ్యా” అన్నారు. వీడియో రిలీజ్ చేయండి అని సలహా ఇచ్చాను. వెంటనే “నేను బతికే వున్నా” అని వీడియో చేసి విడుదల చేశారు. నేను నా వంతు మీడియాకు సమాచారం ఇచ్చాను. నిముషాల్లో చావు వార్త ఆపేశారు.
చంద్రమోహన్ లక్కీ హీరో. ఆయన పక్కన నటించిన హీరోయిన్లు అందరూ సూపర్ సక్సెస్ అయ్యారు. మంచి భోజనప్రియుడు. మంచి హాస్య చతురుడు. సద్గుణాల సంపన్నుడు. 82వ ఏట వెళ్లిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. అయినా చిత్ర పరిశ్రమలో ఆయనది చెక్కు చెదరని సువర్ణ పేజీ సృష్టించుకున్నారు. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రమోహన్ కు అశ్రునివాళి…
–డా. మహ్మద్ రఫీ