బాలీవుడ్ చిత్రాల బెంగాలి బాబు- హృషికేష్ ముఖర్జీ

(హృషికేష్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…)

“చుప్కే చుప్కే”(1975) సినిమా షూటింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ వున్న ఐదుగురు సహాయ దర్శకులు వారివారి పనుల్లో నిమగ్నులై వున్నారు. మరోవైపు ఆ చిత్ర దర్శకుడు సంభాషణల రచయిత రహి మసూమ్ రజాతో చర్చలు జరుపుతున్నారు. డ్రైవరు యూనిఫారంలో హీరో ధర్మేంద్ర, సూట్ లో హాస్యనటుడు అస్రాని మేకప్ గదినుంచి బయటకు వచ్చారు. అస్రాని ఆ సినిమాకు పనిచేస్తున్న సహాయకుల వద్దకు వెళ్లి చిత్రీకరించబోయే సన్నివేశ వివరాలు తెలుసుకోగోరాడు. వారి దగ్గర జవాబు లేదు. ధర్మేంద్ర డ్రైవర్ డ్రస్సులో, అస్రానీ సూట్ లో వుండడం నచ్చని ధర్మేంద్ర అస్రానీతో సన్నివేశమేమిటని అడిగాడు. అది వినిన దర్శకునికి కోపం వచ్చింది. ”ఏయ్! ధరమ్ అస్రానీని ఏంటి అడుగుతున్నావ్?” అని గద్దించాడు, చేతిలో వున్న చిన్న ఊతకర్రను ఊపుతూ. స్కూలు పిల్లాడిలా సంజాయిషీ ఇచ్చుకున్నాడు ధర్మేంద్ర. సన్నివేశ చిత్రీకరణ లో ఒక హెడ్మాస్టరులా క్రమశిక్షణ పాటించే ఆ దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న భిన్న ప్రయోగ చిత్రాలే ‘ఆశీర్వాద్’, ‘సత్యకామ్’, ‘ఆనంద్’, గుడ్డి’, ‘బావార్చి’, ‘అభిమాన్’, ‘నమ్మక్ హరామ్’, ‘గోల్ మాల్’ వంటి మధ్యతరగతి జీవితాల సామాజిక సమస్యల పరిష్కార సినిమాలు. ఆ విభిన్న ప్రయోగాల ప్రతిభాశీలే హృషికేష్ ముఖర్జీ. అద్భుత సినిమాలకు ప్రాణం పోసిన హృషికేష్ తన 83 వ ఏట 27, ఆగస్టు 2006 న పరమపదించారు. ఈ దిగ్దర్శకుడి సినీ ప్రస్థానాన్ని అందించాలనేదే ఈ చిన్ని ప్రయత్నం.

చలనచిత్ర ఎడిటర్ గా రంగ ప్రవేశం…

హృషికేష్ ముఖర్జీ కలకత్తా నగరంలో సెప్టెంబరు 30, 1922 న జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి సైన్సు విద్యార్థిగా పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం విద్యార్థులకు సైన్సు లెఖ్ఖలు బోధించే వృత్తిని చేపట్టారు. అతనికి సినిమా నిర్మాణమంటే చాలా ఆసక్తి వుండేది. నలభయ్యో దశకంలో బెంగాలీ చిత్రసీమలో కొంతకాలం బి.ఎన్. సర్కార్ కు చెందిన ‘న్యూ థియేటర్స్’లో కెమెరామాన్ గా పనిచేశారు. తరవాత సుబోద్ మిట్టర్ వద్ద ఎడిటింగ్ శాఖలో శిక్షణ పొందారు. 1951లో బిమల్ రాయ్ నిర్మించిన ’దో బిఘా జమీన్’ కు స్క్రీన్ ప్లే రైటర్ గా, సహాయ దర్శకుడిగా, ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 1953లో వెటరన్ నటుడు అశోక్ కుమార్ బిమల్ రాయ్ దర్శకత్వంలో నిర్మించిన ‘పరిణీతా’ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరించారు. 1954లో హితేన్ చౌదరి బిమల్ రాయ్ దర్శకత్వంలోనే ‘బిరాజ్ బహు’ సినిమా నిర్మిస్తే దానికి కూడా ఎడిటర్ హృషికేష్ ముఖర్జీనే. బిమల్ రాయ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవదాస్’ (1955) సినిమాకు హృషికేష్ ఎడిటర్ గా వ్యవహరించారు. తరవాత 1970 వరకు ‘గరమ్ కోట్’, ‘మధుమతి’, ‘హీరా మోతీ’, ‘చార్ దివారి’, ‘చెమ్మీన్’(మళయాళ చిత్రం), ‘దస్తక్’ సినిమాలకు ఎడిటర్ గా అమర్ కుమార్, రాము కరియత్, రాజిందర్ సింగ్ బేడి ల వద్ద పనిచేశారు. బిమల్ రాయ్ చిత్రం మధుమతి లో హృషికేష్ ప్రదర్శించిన ఎడిటింగ్ ప్రతిభకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. 1977లో నిర్మించిన కన్నడ చిత్రం ‘అనురూప’ కు హృషికేష్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు. ఎడిటర్ గా హృషికేష్ ముఖర్జీ పనిచేసిన చివరి చిత్రం మన్మోహన్ దేశాయ్ నిర్మించిన ‘కూలీ’(1983).

దర్శకుడిగా ఎదిగి…

దర్శకుడిగా హృషికేష్ ముఖర్జీ తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్ర బహుమతిని అందుకున్నారు. అది దిలీప్ కుమార్, సుచిత్రాసేన్ నటించిన ‘ముసాఫిర్’(1957) చిత్రం. ఈ సినిమాకు కథను సమకూర్చింది కూడా అతడే. అయితే ఈ సినిమా గొప్పగా ఆడలేదు. రెండు సంవత్సరాల తరవాత ఎల్.బి. లచ్చమన్ నిర్మించిన ‘అనారి’ సినిమాకు హృషికేష్ దర్శకత్వం తోబాటు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాజకపూర్, నూతన్ నటించిన ఈ సినిమాకు శంకర్ జైకిషన్ సంగీత దర్శకులు. ఈ సినిమాకు ఏకంగా 5 ఫిలింఫేర్ బహుమతులు (రాజకపూర్, శంకర్ జైకిషన్, శైలేంద్ర, ముఖేష్, లలితా పవార్), ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి లభించాయి. హృషికేష్ సినిమాలకు కథాబలం మిన్న. తొలి సినిమా ‘ముసాఫిర్’ లో ప్రతి జీవితంలో ఎదురయ్యే జననం, వివాహం, మరణం వంటి మూడు సమస్యలను విభిన్న కోణాలలో ఆవిష్కరించారు. ఈ సినిమా చూశాక రాజకపూర్ ‘అనారి’ సినిమాకు హృషికేష్ ను దర్శకుడిగా నియమించారు. ‘అనూరాధ’ సినిమాలో ఒక అసాధారణ వైద్యుడు నిజజీవితంలో వృత్తిపట్ల జిజ్ఞాసతో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కథాంశంగా హృషికేష్ ఎన్నుకున్నారు. ‘అనుపమ’ చిత్రం ఒక యదార్థ సంఘటన నేపథ్యంలో సాగుతుంది. ఇక ‘ఆనంద్’ సినిమా జీవితం మీద ఆశ, మృత్యువుతో పారాటం వంటి అద్భుత కథతో నిర్మించిందే. హృషికేష్ ముఖర్జీ మొత్తం మీద 42 సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా 1960-80 మధ్యకాలంలో హృషికేష్ అద్భుత సాంఘిక సమస్యాత్మక చిత్రాలు నిర్మించారు. వాటిలో “అనూరాధ, ఛాయా, అసలీ-నకిలీ, ఆనంద్, అనుపమ, ఆశీర్వాద్, సత్యకామ్, గుడ్డి, బావార్చి, అభిమాన్, నమ్మక్ హరామ్, మిలి, చుప్కే చుప్కే, ఆలాప్, గోల్ మాల్, ఖూబ్ సూరత్, బేమిసాల్” చిత్రాలను గురించి తప్పక ఉదహరించాలి. హీ-మాన్ ధర్మేంద్రను ‘చుప్కే చుప్కే’ సినిమా ద్వారా కామెడీ హీరోగా నటింపజేసిన ఘనత ఆయనదే. అలాగే ‘ఆనంద్’ (1970) చిత్రం ద్వారా అమితాబ్ బచ్చన్ కు, సూపర్ స్టార్ ఇమేజ్ ని కట్టబెట్టిన రాజేష్ ఖన్నాకు ‘బ్రేక్’ ఇచ్చింది కూడా హృషికేషే. 1971లో ‘గుడ్డి’ చిత్రం ద్వారా జయాభాదురిని హిందీ చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కూడా అతనిదే. 1998 లో జి.పి. సిప్పీ నిర్మించిన ‘ఝూట్ బోలె కవ్వా కాటే’ దర్శకుడిగా హృషికేష్ ముఖర్జీ కి చివరి సినిమా. ఇందులో అనిల్ కపూర్, జూహి చావ్లా జంటగా నటించారు.

వ్యక్తిగతం…

హృషికేష్ ముఖర్జీ భార్య అతనికన్నా ముప్పై సంవత్సరాల ముందే కాలం చెయ్యడం ఒక దురదృష్ట సంఘటన. హృషికేష్ కు జయశ్రీ, రాజశ్రీ, సురశ్రీ అనే ముగ్గురు కూతుళ్ళు, ప్రదీప్, సందీప్ అనే ఇద్దరు కొడుకులు. వారిలో సందీప్ అనే చిన్న కుమారుడు ఆస్తమా తో బాధపడుతూ బొంబాయి రైల్వే స్టేషన్ లోనే కన్నుమూయడం హృషి దా ను బాగా బాధించిన అంశం. అతని తమ్ముడు ద్వారకనాథ్ ముఖర్జీ కూడా మంచి రచయిత. హృషికేష్ నిర్మించిన ఎక్కువ సినిమాలకు అతడే స్క్రీన్ ప్లే సమకూర్చేవాడు. హృషికేష్ నివాసం బాంద్రాలో. ఆయన కు కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. ఇంటిలో రకరకాల జాతుల కుక్కపిల్లలు దర్శనమిస్తూ ఉండేవి. తన చివరి రోజుల్లో ఒంటరిగానే, తన సేవకులతోబాటు హృషికేష్ జీవించారు. హృషికేష్ చివరిరోజుల్లో మూత్రపిండాల వ్యాధితో బాధపడ్డారు. లీలావతి ఆసుపత్రిలో క్రమం తప్పకుండా డయాలిసిస్ చేయించుకునేవారు. అదే ఆసుపత్రిలో ఆగస్టు 27, 2006 న హృషికేష్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు.

అవార్డులు… రివార్డులు:

హృషికేష్ ముఖర్జీ కి భారత ప్రభుత్వం 2001లో పద్మవిభూషణ్ పురస్కారమిచ్చి గౌరవించింది. 1999లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. మరో ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఎన్.టి.ఆర్. జాతీయ బహుమతి’ కూడా అదే సంవత్సరం హృషికేష్ కు దక్కింది. 1961లో హృషికేష్ చిత్రం ‘అనూరాధ’ బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రానికొరకు నామినేట్ అయ్యింది. హృషికేష్ కు ఉత్తమ ఎడిటర్ గా నౌకరి, మధుమతి, ఆనంద్ సినిమాలకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఆతడు నిర్మించిన ఆనంద్, ఖూబ్ సూరత్ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా ఫిలింఫేర్ బహుమతులు గెలుచుకున్నాయి. ఆనంద్ సినిమా కథకు, అనోఖి రాత్ సినిమా స్క్రీన్ ప్లే లకు ఫిలింఫేర్ బహుమతులు దక్కాయి. 1994లో హృషికేష్ ముఖర్జీ ఫిలింఫేర్ సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘నెల్లు’ అనే మళయాళ చిత్రానికి కేరళ ప్రభుత్వ ఉత్తమ ఎడిటర్ బహుమతి తీసుకున్నారు. హృషికేష్ దర్శకత్వం వహించిన మౌసమ్, అనారి, అనూరాధ, అనుపమ, ఆశీర్వాద్, సత్యకామ్, ఆనంద్ సినిమాలకు జాతీయ స్థాయి ఉత్తమ చిత్ర బహుమతులు లభించాయి. కేంద్రీయ సెన్సార్ బోర్డుకు అధ్యక్షునిగా, జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పోరేషన్ కు చైర్మన్ గా హృషికేష్ ముఖర్జీ వ్యవహరించారు.

మరిన్ని విశేషాలు…

హృషికేశ్ ముఖర్జీని బాలీవుడ్ లో హృషి దా అని ముద్దుగా, గౌరవంగా పిలుచుకుంటారు. ఆయనకు తొలిగురువు బిమల్ రాయ్. దర్శకుడిగా తొలి బ్రేక్ ఇచ్చినవారు రాజకపూర్. వీరిద్దరితో హృషికేష్ కు సత్సంబంధాలు ఉండేవి. వీరిమీద గౌరవంతో ‘అనుపమ’ చిత్రాన్ని బిమల్ రాయ్ కి, ‘ఆనంద్’ సినిమా ను రాజకపూర్ కు అంకితమిచ్చి తన గౌరవాన్ని చాటుకున్న సహృదయుడు హృషికేష్ ముఖర్జీ.

ఆనంద్ సినిమా కథ దాదాపు ఏడు సంవత్సరాలపాటు మగ్గినదే. అందులో హీరోగా ఎవరిని తీసుకోవాలనే మీమాంస బయలుదేరింది. అప్పుడే రాజేష్ ఖన్నా నటించిన బహారోం కే సప్నే సినిమా చూసి రాజేష్ ఖన్నాను హీరోగా చేసి సినిమా నిర్మాణం మొదలెట్టారు హృషికేష్. ఈ సూపర్ స్టార్ కు ఆనంద్ సినిమాలో హృషికేష్ ఇచ్చిన పాత్ర ఎంతో వైవిధ్యమైనది. హృషికేష్ ఆశించినంత గొప్పగా రాజేష్ ఖన్నా ఆ పాత్రను పోషించారు. హృషి దా మీద వున్న గౌరవంతో రాజేష్ ఖన్నా తను నటించిన హృషికేష్ సినిమాలకు, ఇతర నిర్మాతల వద్ద తీసుకునే పారితోషికం లో కేవం 30 శాతం మాత్రమే తీసుకునేవాడు.

రాజకపూర్ హృషి దా ను ‘బాబూ మోషాయి’ (పూజనీయ పెద్దమనిషి)గా పిలుచుకునేవారు. కారణం… హృషికేష్ ముఖర్జీ ఎంచుకునే నటులు ‘స్టార్స్’ కారు… వాళ్ళు నిజమైన నటులు. హృషి దా మెరుగులు దిద్దిన నటులు రాజేష్ ఖన్నా, అమితాబ్ బచన్, ధర్మేంద్ర… ముందు నటులు… ఆ తరవాతే స్టార్లు తనకు నచ్చని కథను హృషికేష్ ఏనాడూ సినిమాగా మలచడానికి సాహసించ లేదు. ఆనంద్ సినిమాలో ‘ఆనంద్’ పాత్రకు హృషికేష్ కు రాజకపూర్ ప్రేరణ. అసలు ఆ పాత్రను రాజకపూర్ పోషించాల్సింది. కానీ ఈ సినిమా మొదలయ్యే సమయానికి రాజకపూర్ కు చాలా తీవ్రమైన జ్వరమొచ్చింది. ఆనంద్ పాత్ర రోగిష్టిపాత్ర కావడంతో, సెంటిమెంటల్ గా భావించి రాజేష్ ఖన్నాను తీసుకున్నారు ఈ ‘బాబూ మోషాయి’.

హృషికేష్ ముఖర్జీ ‘హమ్ హిందూస్తానీ’, ‘తలాష్’, ‘దూప్ చావోం’ వంటి టివిజన్ సీరియళ్ళు నిర్మించారు. హృషి దా సినిమాలలో సెక్స్, హింస వంటి మసాలాలు ఉండనే వుండవు. 1961లో హృషికేష్ కీళ్ళ నొప్పులతో బాధపడ్డారు. అయినప్పటికీ ‘అసలీ నకిలీ’, ‘అనుపమ’ చిత్రాలను చక్రాల కుర్చీలో నుంచే నిర్మించడం విశేషం.

-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap