వేదాంత గానకోవిదుడు… ముఖేష్

సంగీతం విశ్వజనీనం. వాద్య స్వరసమ్మేళన రాగమాధుర్యంతో సమ్మోహింపజేసేదే పాట. ఏ పాటైనా నిత్యనూతనంగా నిలిచిపోవాలంటే, బాణీ, భావం బాగున్నంత మాత్రాన కూడా సరిపోదు. గాయకుని గొంతులోని మార్దవం, స్వచ్ఛత, ప్రత్యేకత, ప్రతిభ కలిస్తేనే ఆ పాట సుదీర్ఘకాలం సుమధురగీతంగా నిలిచిపోతుంది. ఏ పాటకైనా స్వరం ఆధారం. స్వరం వేరు, స్వరస్థానం వేరు. అనుస్వరంతో పాడితే అది ఒక అద్భుతగీతం అవుతుంది. ఈ సలక్షణ సంపన్నుడే ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయకుడు ముఖేష్‌…. హిందీ సినీ సంగీతానికి మరపురాని మధుర గీతాలను ప్రసాదించిన కళానిధి. పిన్నవయసులోనే కాలంచేసినా, జీవితం చివరి వరకూ ముఖేష్‌ పాడుతూనే వున్నారు. అతని పాటలు శ్రోతలు ఎన్నిసార్లు విన్నా ఏనాడూ విసిగిపోలేదు. అదే ముఖేష్‌ ప్రత్యేకత. ముఖేష్‌ పాడిన వేదాంతభరిత విషాద గీతాలు హృదయాలను కదిలిస్తాయి. ముఖేష్‌ గొంతులోని మాధుర్యం మనస్సుకు జోలపాడితే, విషాదం గుండెల్ని పిండేస్తుంది. ఇరవై సంవత్సరాల గాయక ప్రస్థానంలో ముఖేష్ పాటలు పాడింది కేవలం వందలలోనే. కానీ ఆ పాటలన్నీ అజరామరాలే. ఆగస్ట్ 27 న ఆయన వర్ధంతి సందర్భంగా ముఖేష్ గురించి కొన్ని విషయాలు…

హీరోగా పరిచయమై, గాయకుడిగా గళమెత్తి…

ముఖేష్‌ అసలు పీరు ముఖేష్‌ చంద్‌ మాథుర్‌. జూలై 22, 1923న ఢిల్లీ నగరంలో జోరవర్‌ చంద్ మాథుర్‌, చంద్రాణి దంపతులకు ఆరవ సంతానంగా జన్మించారు. తండ్రి ఇంజనీరుగా ఉద్యోగం చేసేవారు. ముఖేష్‌ అక్క సుందర్‌ ప్యారికి సంగీతం నేర్పేందుకు ఒక పండిట్‌ వారి ఇంటికి వచ్చేవారు. దూరంగా ఉన్న గదిలో కూర్చొని ముఖేష్‌ ఆ సంగీత పండితుడు తన అక్కకు సంగీతం ఎలా నేర్పిస్తున్నారో శ్రద్ధగా గమనిస్తూ తనలో తనే పాడుకుంటూ ఉండేవారు. అలా సంగీతం పట్ల ముఖేష్‌కు అభిమానం ఏర్పడింది. మెట్రిక్యులేషన్‌ పూర్తి చేయగానే కాలేజి చదువుకు వెళ్లకుండా ప్రభుత్వ నిర్మాణశాఖలో ఉద్యోగంలో కుదిరారు. అటు వుద్యోగం చేస్తూనే తన సంగీతాభిరుచికి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేశారు. హార్మోనియం వంటి కొన్ని వాద్య పరికరాలను ఎలా వాయించాలో అనే విషయంలో శిక్షణ తీసుకున్నారు. ముఖేష్‌ అక్క వివాహం జరిగినప్పుడు కొన్ని పాటలు పాడి బంధుమిత్రుల అభిమానం చూరగొన్నారు. అతని దూరపు బంధువు, సినీ నటుడు మోతిలాల్‌కు ముఖేష్‌ స్వరం కొత్తగా, వినూత్నంగా తోచింది. అతని తండ్రి అనుమతితో ముఖేష్‌ను బొంబాయి తీసుకెళ్లి పండిట్‌ జగన్నాథ్‌ ప్రసాద్‌ వద్ద మోతిలాల్ సంగీత పాఠాలు నేర్పించారు. ఆ సంగీత పండిట్‌ వద్దకు హిందీ సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు వచ్చిపోతూ వుండేవారు. ముఖేష్‌ స్పురద్రూపి కావడంతో దర్శకుడు వీరేంద్ర దేశాయ్‌ ముఖేష్‌ను చూసి 1941లో ‘నిర్దోష్‌’ అనే సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. ముఖేష్‌ సరసన నళిని జయవంత్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో ముఖేష్‌ది ఒక గాయకుడి పాత్ర. అందులో నీలకంఠ తివారి రాయగా, అశోక్‌ ఘోష్‌ స్వరపరచిన ‘దిల్‌ హి బుఝా హువా హో తో ఫసి-యే-బహార్‌ క్యా’ అనే పాటను ముఖేష్‌ తొలిసారి పాడారు. రెండవ సినిమా వి.సి. దేశాయ్‌ నిర్మించిన ‘ఆదాబ్‌ అర్జ్’లో కూడా నళిని జయవంత్‌ సరసనే హీరోగా ముఖేష్‌ నటించారు. జ్ఞానదత్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముఖేష్‌ ఒక్క పాట కూడా పాడకపోవడం విశేషమే! తర్వాత రామ్‌ దర్యాని దర్శకత్వంలో వచ్చిన ‘దుఃఖ్‌ సుఖ్‌’ (1942) సినిమాలో హీరోగా సితారాదేవి సరసన నటించారు. ఖేమ్‌ చంద్‌ ప్రకాష్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సితారాదేవితో కలిసి రెండు యుగళ గీతాలు పాడారు. ‘అబ్‌ దేర్‌ న కర్‌ సాజన్‌ ఫూలోం సే జో మిల్నా హైృ’, ‘మోరీ అతరియా పే ఆజావో పరదేశి పంఛీ’ అనే ఈ రెండు పాటలు పాపులర్‌ అయ్యాయి. రాజకపూర్‌తో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత ‘ఆహ్‌’ సినిమాలో క్యారేజ్‌ డ్రైవర్‌గా ముఖేష్‌ ఒక అతిథి పాత్రలో కనిపించారు. తర్వాత ముఖేష్‌ నేపథ్య గాయకుడిగా స్థిరపడాలని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులేశారు.

నేపథ్య గాయకుడిగా బ్రేక్‌..
నేపథ్య గాయకుడిగా ముఖేష్‌కు బ్రేక్‌ ఇచ్చిన చిత్రం ‘పెహలి నజర్‌’ (1945). నిర్మాత మోతిలాల్‌ నిర్మించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడు అనిల్‌ బిస్వాస్‌ నేతృత్వంలో ‘దిల్‌ జల్తా హై తో జల్నే దే, ఆంసూ నా బహా ఫరియాద్‌ నా కర్‌ దిల్‌ జల్తా’, ‘తాయ్‌ కర్‌ కే బడీ దూర్‌ కి పురాపెచ్‌ డగరియా’ అనే రెండు సోలో పాటలు, నసీం అఖ్తర్‌ తో కలిసి ‘పెహలి నజర్‌ కా తీర్‌ రే లగా’, ‘జవాని ఏ భర్పూర్‌ దిల్కష్‌ అదాయే’ అనే రెండు యుగళ గీతాలు ఆలపించారు. ‘దిల్‌ జల్తా హై’ పాట నేటికీ ఏదో ఒక రేడియో ఛానల్‌లో వినిపిస్తూనే వుంటుంది. గాయక నటుడు కె.ఎల్‌. సైగల్‌కు ముఖేష్‌ వీరాభిమాని. నేపథ్య గాయకుడుగా పరిచయమైన తొలిరోజుల్లో సైగల్‌ పంధాను ముఖేష్‌ అనుకరించే ప్రయత్నం చేసేవారు. నిజానికి సైగల్‌ ముఖేష్‌ పాడిన ‘దిల్‌ జల్తా హై’ పాటను విని ఆ కొత్త గళాన్ని హిందీ చిత్రసీమకు దొరికిన ఆణిముత్యంగా శ్లాఘించారు. ముఖేష్‌కు సంగీత దర్శకుడు నౌషాద్‌తో పరిచయ మయ్యాక అతని గొంతులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సైగల్‌ గాత్ర అనుకరణ నుంచి ముఖేష్‌ను బయటకు తీసి, తనదైన సొంత శైలిని అలవరచుకునేలా చేయడంలో ముఖేష్‌కు నౌషాద్‌ ఎంతో సహకరించారు. 1948లో దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అందాజ్‌’ చిత్రంలో నౌషాద్‌ ముఖేష్‌ చేత దిలీప్‌ కుమార్‌కు పాటలు పాడించారు. రాజ్‌కపూర్‌కు అందులో మహమ్మద్‌ రఫీ పాడడం విశేషం. ‘ఝూమ్‌ ఝూమ్‌ కే నాచో ఆజ్‌, గావో ఖుషీ సే గీత్‌’, ‘హమ్‌ ఆజ్‌ కహీ దిల్‌ కో బైటే తూ సమఝో కిసీ కే హో బైటే’, ‘తూ కహే అగర్‌ జీవన్‌ భర్‌, మై గీత్‌ సునాతా’, ‘టూటేనా దిల్‌ టూటేనా టూటేనా టూటేనా సాథ్‌ హమారా ఛూటే నా’, ‘సునావూ క్యా మై గమ్‌ అపనా జుబా తక్‌ లా నహీ సకతా’ అనే ఐదు సోలో పాటలు దిలీప్‌ కుమార్‌ కోసం పాడితే అవన్నీ హిట్లయ్యాయి. అదే సంవత్సరం ‘మేలా’ (దిలీప్‌ కుమార్‌), ‘అనోఖి అదా’ (సురేంద్ర) సినిమాలలో కూడా నౌషాద్‌ ముఖేష్‌ చేత అద్భుతమైన పాటలు పాడించారు. నౌషాద్‌ సాంగత్యంలోనే ముఖేష్‌ గొంతు మెరుగులు దిద్దుకుంది. దిలీప్‌ కుమార్‌, నర్గీస్‌ నటించిన ‘అనోఖా ప్యార్‌’ చిత్రంలో అనిల్‌ బిస్వాస్‌ ముఖేష్‌ చేత పాడించిన ‘జీవన్‌ సపనా టూట్‌ గయా, జానేవాలే జాతే జాతే దిల్‌ కి దునియా లూట్‌ గయా’ అనే పాట స్మాష్‌ హిట్‌ అయ్యింది. గోల్డెన్‌ జూబిలీ జరుపుకున్న బిమల్‌ రాయ్‌ మరో చిత్రం ‘మధుమతి’ (1958)కి సంగీతదర్శకత్వం వహించిన సలీల్‌ చౌదరికి ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సంగీత దర్శకుని బహుమతి వచ్చింది. అందులో దిలీప్‌ కుమార్‌కు ముఖేష్‌ పాడిన ‘సుహానా సఫర్‌ అవుర్‌ ఏ మౌసమ్‌ హసీ’ పాట మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు బినాకా గీత్‌ మాలా వార్షిక రేటింగులో ఈ పాట ఐదవ స్థానంలో నిలిచింది. శంకర్‌ జైకిషన్‌ సంగీత దర్శకత్వంలో బిమల్‌ రాయ్‌ నిర్మించిన ‘యాహుది’ (1958) సినిమాలో దిలీప్‌ కుమార్‌కు పాడిన ‘ఏ మేరా దీవానాపన్‌ హై, యా మోహబ్బత్‌ కా సురూర్‌’ పాటకు బహుమతి కూడా లభించింది. తరవాతి రోజుల్లో దిలీప్‌ కుమార్‌ మహమ్మద్‌ రఫీని నేపథ్య గాయకుడుగా ఇష్టపడితే, ముఖేష్‌ రాజ్‌కపూర్‌కు ఆస్థాన గాయకుడయ్యారు.

అలరించిన ముఖేష్‌ గానం..
నేపథ్య గాయకుడిగా శంకర్‌ జైకిషన్‌ సంగీత దర్శకత్వంలో ముఖేష్‌ 133 పాటలు పాడితే, కల్యాణ్ జి ఆనంద్‌ జి ఆధ్వర్యంలో 99 పాటలు పాడారు. ముఖేష్‌ గెలుచుకున్న నాలుగు ఫిలింఫేర్‌ బహుమతుల్లో మూడు సినిమాలకు శంకర్‌ జైకిషనే సంగీత దర్శకులు కావడం విశేషం. అవి ‘సబ్‌ కుచ్‌ సీఖా హమ్‌ నే’ (అనారి -రాజకపూర్‌), ‘సబ్‌ సే బడా నాదాన్‌ వహీ హై’ (పెహచాన్‌- మనోజ్‌ కుమార్‌), ‘జై బోలో బేయిమాన్‌ కి’ (బేయిమాన్‌- మనోజ్‌ కుమార్‌), ‘కభీ కభీ మేరె దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై’ (కభీ కభీ- అమితాబ్‌ బచన్‌) పాటలు. 1974లో సలీల్‌ చౌదరి సంగీతం సమకూర్చిన ‘రజనీగంధ’ సినిమాలో ముఖేష్‌ పాడిన ‘కహి బార్‌ యూ హి దేఖా హై’ పాటకు జాతీయ బహుమతి లభించింది. ముఖేష్‌ మొత్తం మీద 1300 పాటలు పాడారు. అయితే తన సహచర నేపథ్య గాయకులైన మహమ్మద్‌ రఫీ వంటి వారితో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదే కావచ్చు. కానీ, వాసిలో ముఖేష్‌ పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. కొన్ని ముఖేష్‌ పాటలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. వాటిలో కొన్ని… ‘నైనా హై జాదూ భరే’ (బేదర్ద్ జమానా క్యా హై), ‘మై హూ మస్త్‌ మదరి’ (మదరి), ‘చాహే ఆజ్‌ ముఝే న పసంద్‌ కరో’ (దరిందా), ‘చలియా మేరా నామ్‌’, ‘మేరే టూటే హుయే దిల్‌ సే’, ‘డం డం డీగా డీగా’ (చలియా), ‘ముఝ్‌ కో ఇస్‌ రాత్‌ కి తన్హాయీ మే’ (దిల్‌ భి తేరా హమ్‌ భి తేరే), ‘హమ్‌ ఛోడ్‌ ఛలే హై మెహఫిల్‌ కో’ (జీ చాహతా హై), ‘చల్‌ మేరె దిల్‌ లేకరాకే చల్‌’ (ఇషారా), ‘ధీరే సే చలో’ (జోహార్‌ మెహమూద్‌ ఇన్‌ గోవా), ‘మై తో ఏక్‌ ఖ్వాబ్‌ హూ’, ‘చాంద్‌ సి మెహబూబా హో’ (హిమాలయ్‌ కి గోద్‌ మే), ‘వఖ్త్ కర్తా జో వఫా’ (దిల్‌ నే పుకారా), ‘దీవానోం సే ఏ మత్‌ పూఛో’ (ఉపకార్‌), ‘ఖుష్‌ రహో హర్‌ ఖుషీ హై’ (సుహాగ్‌ రాత్‌), ‘హమ్‌ సఫర్‌ అబ్‌ ఏ సఫర్‌ కట్‌ జాయేగా’ (జువారి), ‘చాంద్‌ కీ దీవార్‌’, ‘చలే చల్‌ లే చల్‌ మేరె జీవన్‌ సాథి’ (విశ్వాస్‌), ‘కోయీ జబ్‌ తుమ్హారా హృదయ్‌ తోడ్‌ దే’ (పూరబ్‌ అవుర్‌ పశ్చిమ్), ‘దర్పన్‌ కో దేఖా’ (ఉపాసనా), ‘జో తుమ్‌ కో హో పసంద్‌’ (సఫర్‌), ‘ముఝే నహీ పూచ్నీ తుమ్‌ సే బీతే బాతే’ (అంజాన్‌ రాహే), ‘ఆ…లౌట్‌ కే జానా మేరె మీత్‌’ (రాణి రూపమతి). ముఖేష్‌ పాడిన కొన్ని పాటలు రోజూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే వుంటాయి. వాటిలో కొన్ని….. ‘కహీ దూర్‌ జబ్‌ దిన్‌ డల్‌ జాయే’, ‘మైనే తేరే లిఏ హై సాథ్‌ రంగ్‌ కే’ (ఆనంద్‌), ‘ఎక్‌ ప్యార్‌ కా నగుమా హై’ (షోర్‌), ‘సబ్‌ కుచ్‌ సీఖా హమ్‌ నే’ (అనారి), ‘జీనా యహాఁ మర్నా యహాఁ’, ‘కెహతా హై జోకర్‌’ (మేరా నామ్‌ జోకర్‌), ‘ఓ మెహబూబా ఓ మెహబూబా’ (సంగమ్). క్రికెటర్లు బి.ఎస్‌.చంద్రశేఖర్‌, సునీల్‌ గవాస్కర్‌, కిర్మాణి, గుండప్ప విశ్వనాథ్‌లకు ముఖేష్‌ పాటలంటే ఎంతో ఇష్టం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో స్ఫూర్తి పొందాలని వాళ్లు ముఖేష్‌ పాటలు ‘హమ్’ చేసేవారు.

వ్యక్తిగతం…
ముఖేష్‌ సరళా త్రివేది రాయ్‌ చంద్‌ను రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు. తాడు బొంగరంలేని ఒక పాటలు పాడుకునే వాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం సరళ తండ్రి రాయ్ చంద్‌ త్రివేదికి ఇష్టం లేకపోవడంతో వారు 22 జులై 1946న గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు. ఆరోజు ముఖేష్‌ 23వ పుట్టినరోజు కావడం కూడా యాదృచ్చికమే. ముఖేష్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో నితిన్‌ ముఖేష్‌ గాయకుడిగా స్థిరపడ్డాడు. అమెరికా పర్యటనలో వుండగా ముఖేష్‌కు గుండెనొప్పి వచ్చింది. డెట్రాయిట్‌ (మిచిగన్‌ రాష్ట్రం)లోని హోటల్‌ రూమ్‌లో ముఖేష్‌ తన 53వ (27 ఆగస్టు 1976) ఏట అసువులు బాశారు. లతా మంగేష్కర్‌ చొరవతో ముఖేష్‌ పార్థివ శరీరాన్ని ముంబాయి తీసుకొని వచ్చి అన్ని లాంఛనాలతో కర్మక్రతువులు నిర్వహించారు. దహనక్రియలప్పుడు రాజకపూర్‌ ‘నా గొంతు మూగవోయింది. నా ఆరో ప్రాణం గంగలో కలిసింది’ అంటూ రోదించారు. ముఖేష్‌ చనిపోయాక ఆయన పాటలు పాడిన ‘ధరం వీర్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంథోనీ’, ‘ఖేల్‌ ఖిలాడి కా’, ‘చాందిని సోనా’, ‘దరిందా’ సినిమాలు 1977లో విడుదలయ్యాయి. 1978లో ‘ఆహుతి’, ‘పరమాత్మా’, ‘తుమ్హారీ ఖసమ్’, ‘సత్యం శివం సుందరం’ చిత్రాలు విడుదలయ్యాయి. ముఖేష్‌ ఆలపించిన ఆఖరి పాట ‘చంచల్‌ శీతల్‌ నిర్మల్‌ కోమల్‌’ రాజ్‌కపూర్‌ నిర్మించిన సినిమాలోది కావడం వారి అనుబంధానికి గుర్తుగా మిగిపోయింది. బెంగాలి ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సంస్థ తీస్రీ ఖసమ్, మిలన్‌, సరస్వతిచంద్ర సినిమాలలో ముఖేష్‌ పాడిన పాటలకు ఉత్తమ నేపథ్య గాయకుడి బహుమతులు అందజేసింది.

మరిన్ని విశేషాలు…
రాజ్‌కపూర్‌కు ముఖేష్‌ పాడడం ‘ఆగ్‌’ (1948) సినిమాతో ప్రారంభమైంది. వీరి కలయికలో ‘ఆవారా’, ‘శ్రీ 420’, ‘అనాడీ’, ‘జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై’, ‘సంగమ్’, ‘మేరా నామ్‌ జోకర్‌’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. జీవితాంతం వారి స్నేహం కలిసేవుంది.
కొంతకాలం తనకు సినిమాలలో పాటలు పాడే అవకాశాలు సన్నగిల్లడంతో ‘మశూకా’ (1953), ‘అనురాగ్‌’ (1956) వంటి సినిమాలలో ముఖేష్‌ నటించారు. కానీ ఆ సినిమాలు పరాజయం చవిచూశాయి. ఆ సమయంలో పిల్లల చదువులకు ఫీజులు కూడా కట్టలేని స్థితి ఎదురైంది. అయినా తన మామగారి వద్ద చెయ్యి చాచలేదు.
సంగీత దర్శకులుగా హిందీ చలనచిత్ర సీమకు తొలిసారి పరిచయమైన వారికి ముఖేష్‌ పాటలు పాడి ఆ పాటల్ని అజరామరం చేశారు. వారిలో శంకర్‌ జైకిషన్‌(బర్సాత్‌), మదన్‌ మోహన్‌(ఆంఖే), లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ (పరస్మణి), బప్పిలహరి(నన్హా షికారి) వున్నారు.
గురుదత్‌కు ముఖేష్‌ పాటలు పాడలేదు. ఇదో వింత విషయం. రాజ్‌కపూర్‌ తర్వాత ముఖేష్‌ అత్యధిక పాటలు పాడింది హీరో మనోజ్‌ కుమార్‌కే!

యష్‌ చోప్రా నిర్మించిన ‘కభీ కభీ’ సినిమాకోసం ఖయ్యాం స్వరపరచిన ‘కభీ కభీ మేరె దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై’ పాట రికార్డింగుకు ముందురోజు ముఖేష్‌ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. యాష్‌ చోప్రా పరామర్శ కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ‘ఆ పాటను వేరేవారి చేత పాడిస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో’ అంటే ‘ఆ సినిమాలో మిగతా పాటలు ఎవరిచేతనైనా పాడించండి. ఈ పాటను మాత్రం నేనే పాడతాను’ అని చెప్పి ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయిన వెంటనే ముఖేష్‌ ఈ పాటను పాడి రికార్డు చేయించారు.
ముఖేష్‌ ఎన్నో గుప్తదానాలు చేసేవారు. ఒకరోజు అర్ధరాత్రి విక్టోరియా టెర్మినస్‌ రైల్వే ప్లాట్‌ ఫారం మీద పడుకున్న బిక్షగాళ్లకు దుప్పట్లు పంచుతూ ఒక సినీ ప్రముఖుని దృషిలో పడ్డారు. ఆయన ముఖేష్‌ చేస్తున్న పనిని అభినందిస్తుంటే, ఈ విషయం బయట చెప్పవద్దని ముఖేష్‌ ఆ ప్రముఖుణ్ణి కోరారు.
ఒకసారి కిషోర్‌ కుమార్‌ మన్నాడేను అతని ఇంటివద్ద కలిసి కబుర్లాడుకుంటుండగా ముఖేష్‌ ప్రస్తావన వచ్చింది. ‘ముఖేష్‌ భయ్యాకు వచ్చిన మంచి పాటలు నాకు రాలేదు. అతడు యెంత అదృష్టవంతుడో’ అని కిషోర్‌ కుమార్‌ అన్నాడట.

సత్యన్‌ బోస్‌ నిర్మించిన ‘రాత్‌ అవుర్‌ దిన్‌’ (1967) సినిమా కోసం శంకర్‌ జైకిషన్‌ టైటిల్‌ సాంగ్‌ ‘రాత్‌ అవుర్‌ దిన్‌ దియా జలే మేరె మన్‌ మే ఫిర్‌ భి అంధియారా హై’ ను ముందు ముఖేష్‌ చేత పాడించి రికార్డు చేశారు. పది రోజుల తర్వాత అదే పాటను లతా మంగేష్కర్‌ పాడాల్సి వచ్చినప్పుడు ఆమె రిహార్సల్‌ అవసరం లేదన్నారు. శంకర్‌ జైకిషన్‌లు కారణం అడిగారు. ‘ముఖేష్‌ భయ్యా పాట వినిపించారుగా. ఇక రిహార్సల్‌ ఎందుకు. డైరెక్టుగా పాడేస్తాను’ అన్నారట. అదీ ముఖేష్‌ గొప్పతనం.
ముఖేష్‌ కుమారుడు నితిన్‌ ముఖేష్‌ గొంతు కూడా ముఖేష్‌ గొంతులాగే వుంటుంది. ముఖేష్‌ అంత గొప్పగా పాడగల సత్తాను నితిన్‌ ఒకటి రెండు సార్లు నిరూపించుకున్నా, పదిమంది కొత్తగాయకుల్లో ఒకడుగా మిగిలి పోయాడే తప్ప అతడు మరో ముఖేష్‌ కాలేకపోయాడు.

-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap