(పూర్వ ప్రభుత్వ కార్యదర్శి జి. బలరామయ్య అభినందన.)
సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ సాంస్కృతిక రంగానికి విశేష సేవలు అందిస్తున్నారని, ఆయన రాష్ట్ర జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంఘాలతో మమేకమై సేవలందిస్తున్న ప్రపంచ సాంస్కృతిక వేత్త అని కొనియాడారు. కర్నూలు టి.జి.వి. కళాక్షేత్రంలో కళా విపంచి ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగిన వై.కె. నాగేశ్వరరావు నాటకోత్సవాల ముగింపు సభ లో(ఆదివారం, 27-8-23) సీనియర్ సాంస్కృతిక పాత్రికేయులు పౌర హక్కుల నేత దివంగత జిఎల్ఎన్ మూర్తి స్మారక ప్రతిష్టాత్మక పురస్కారంతో కళ పత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ మహ్మద్ రఫీని ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన జి. బలరామయ్య మాట్లాడుతూ రాయలసీమలో తెలుగు ఆధునిక నాటకం వెనుకబడి వున్నదని, పురోభివృద్ధి దిశగా కళాకారులు కృషి చేయాలని కోరారు. త్వరలో కర్నూలులో ప్రారంభించనున్న నాటక రిపర్టరీ కి తన వంతు సహకారం అందిస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నాటక అభివృద్ధికే కాకుండా సాంస్కృతిక రంగానికి మహ్మద్ రఫీ చేస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రపంచ తెలుగు మహా సభల్లో తాను కార్యదర్శిగా వున్నప్పుడు మహ్మద్ రఫీ పిఆర్వో గా అద్భుతంగా వేలాది కళాకారులను సమన్వయం చేశారని అభినందించారు.
ఈ వేడుకలో టి.జి.వి. కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబుళయ్య (కర్నూలు), నాటక ప్రయోక్త డి. రామ కోటేశ్వరరావు (హైదరాబాద్), అలిండియా రేడియో పూర్వ విజయవాడ కేంద్రం డైరెక్టర్ ఎ. మల్లేశ్వరరావు (తిరుపతి), ఆదిలీల ఫౌండేషన్ చైర్మన్ ఎం. ఆదినారాయణ (న్యూఢిల్లీ), కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు ఎర్రంశెట్టి అంజిబాబు (హైదరాబాద్), మహమ్మద్ మియా (కర్నూలు) తదితరులు పాల్గొన్నారు. బొప్పన నరసింహారావు, జివిజి శంకర్ సమన్వయం చేశారు. శ్రీమతి అక్కినేని ఉమ వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన తులసి తీర్ధం, థింక్ నాటికలు గొప్ప సందేశాన్ని చాటి ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ రెండు నాటికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ వేదికలపై ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపు పొందిన కళాకారులు మరోసారి కర్నూలు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. మల్లాది క్రియేషన్స్ సీనియర్ టివి నటులు మల్లాది భాస్కర్ శ్రీదేవి బృందం తులసి తీర్ధం ప్రదర్శించి నవ్విస్తూనే మానవుడే మహనీయుడు అంటూ మానవత్వం పరిమళత్వం చాటి చెప్పారు. అనంతరం మంజునాధ్ దర్శకత్వం లో సిరిమువ్వ కల్చరల్ కళాకారులు “థింక్” నాటిక ప్రదర్శించి అందరిని సమాలోచనంలోకి తీసుకెళ్లారు. పిల్లల పెంపకం, పిల్లల అభిరుచులపై తల్లిదండ్రులు అనుసరించాల్సిన విధానాన్ని ఈ నాటికలో సరికొత్తగా చూపించి కళాకారులు కరతాళధ్వనులు అందుకున్నారు.