34వ విజయవాడ పుస్తక మహోత్సవాలు 7 వ తేదీతో ముగింపు సందర్భంగా…
పుస్తకాలు జ్ఞానాన్ని పంచే మంచి స్నేహితులనీ, పుస్తక పఠనం వల్ల మనిషిలో ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయని, వినయం, సత్ప్రవర్తన, విధేయత వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ.ఎం.డి ఇంతియాజ్ అన్నారు. చదువరి లో ఆలోచనా శైలి గొప్పమార్పు చెంది ఉన్నత లక్ష్యాలను అందుకోగలిగిన స్థాయి ఏర్పడుతుందన్నారు. తాను ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నాను అంటే దానికి పుస్తక పఠనమే కారణమన్నారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవాలను పురస్కరించుకొని, పుస్తకాలతో ఆయనకున్న సంబంధాన్ని 64కళలు పత్రికతో పంచుకున్నారు.
హై స్కూల్ నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టాను.
నేను హైస్కూల్ నుంచి పుస్తకాలు చదవటం మొదలు పెట్టాను. కోడుమూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఎనిమిదవ తరగతి చదివేరోజుల్లో వేసవి సెలవులు కారణంగా మా అమ్మమ్మగారి ఊరు కర్నూల్ వెళ్లాను. అక్కడ పార్కు రోడ్డులోమా మామయ్య వాళ్ళది ఫ్యాన్సీ షాప్ ఉండేది.ఫ్యాన్సీ వస్తువులతో పాటు పుస్తకాలు చదువుకునేందుకు అద్దెకిచ్చేవారు. నన్ను షాపులో కూర్చోమనే వారు. ఇక అక్కడి నుంచి నేను పుస్తకాలు చదవడం ప్రారంభించాను.యద్దనపూడి సులోచనారాణి, మాధవరెడ్డి, లాంటి రచయితలు నవలలు, కొమ్మూరి సాంబశివరావు అపరాధ పరిశోధన, డిటెక్టివ్ స్టోరీస్ చదవటం వలన అనేక కొత్త విషయాలు తెలిసేవి.
నేను అలా చదవటం వలన నాతోపాటు ఉన్న విద్యార్థులకు నాకు మధ్య ఆలోచన సరళిలో తేడాను గమనించాను.ఆ తర్వాత తరగతి పుస్తకాలతో పాటు వార పత్రికలు చదవడం మొదలెట్టాను.
*ఆంగ్ల సాహిత్యం తో పరిచయం
రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివేటప్పుడు నా క్లాస్మేట్ శంకరగిరి నారాయణస్వామి ఆంగ్ల సాహిత్యాన్ని పరిచయం చేశారు. వాళ్ల కుటుంబానికి సాహిత్యంతో మంచి సంబంధం ఉండేది. కాలేజీ లైబ్రరీ పుస్తకాలతో పాటు మరోవైపు అరువు తెచ్చుకుని ఆంగ్ల సాహిత్యంలో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ స్టోరీస్, రాబర్ట్ లుడ్ లూమ్, సిడ్ని సెల్టమ్,హగాథా క్రిస్టి, జఫ్రి ఆర్చర్, డాన్ బ్రౌన్ రచయితల కథలు బాగా చదివే వాణ్ని దానివలన ఆంగ్లంపై పట్టు పెరిగింది. మరో ఆంగ్ల రచయిత హుడ్ హౌస్ రచనలు చదివితే ఇంగ్లీషులో మరింత పట్టు పెరుగుతుంది.
తెలుగు సాహిత్యంలో ఎందరో మహానుభావుల గొప్ప సాహిత్యం ఉంది. ప్రేమ కోసం కాళిదాసు కవి “మేఘ సందేశం’ ఇస్తే జాషువా “గబ్బిలమ్” తో మానస సరోవరం దాటి కైలాసంలో ఉన్న శివునికి సందేశం పంపారు. సమాజం లో ఉన్న అసమానతలు, రుగ్మతలు తొలిగించమని నవయుగ కవి చక్ర వర్తి జాషువా అడిగారు. అలాగే వేమన పద్యాలు సరళ మైన తెలుగులో అద్భుతమైన సందేశాన్ని,అనుభవ పూర్వకమైన జీవిత సత్యాలను వినిపిస్తాయి.గురజాడ వారు తెలుగు నాటక రచనల్లో కొత్త సృజన,రచనలు యండమూరి రచించిన “ఆనందోబ్రహ్మ “నవల నాకు చాలా ఇష్టం. తులసి దళం, కాస్మోరా లాంటివి చదివాను.మనిషిలో వైవిధ్యభరితమైన రసాత్మాకత ఉండాలన్నది ఆనందోబ్రహ్మ ‘సారాంశం. కాశీభట్ల వేణుగోపాల్, ముళ్లపూడి, మధురాంతకపు, మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొత్త సచ్చిదానందమూర్తి, పట్టాభిరామ్, మహమ్మద్ ఖదీర్ బాబు,లాంటి రచనలు చదివాను.
ఖాళీ సమయం లో రచన చేస్తున్నా..
కోవిడ్ సమయం లో జరిగిన సంఘటనలు పై కోవిడ్ మ్యూజింగ్స్ అని ఒక రచన చేసాను. కథలు రాయడం మొదలు పెట్టాను. Vat, G.S.T లకు సంబంధించి 10 పుస్తకాలు రాశాను.
నాలో ప్రేరణ నింపింది పుస్తకాలే…
పుస్తక పఠనం వివేకం, విచక్షణా జ్ఞానం మంచి చెడుల మధ్య తారతమ్యం తెలుసుకునే శక్తిని అందిస్తుంది. ఇన్ని పుస్తకాలు చదివాను కాబట్టి ఆ ప్రేరణ నాలో ఆలోచన దృక్పథం మారి సానుకూలంగా, మానవీయంగా, సేవాభావంతో ఉన్నాను అని నాభావన.
బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలి.
నేటి కంప్యూటర్ ప్రపంచంలో కుటుంబాలు చిన్నాభిన్నమై, బంధాలు విచ్ఛిన్నమై, చిన్నపాటి మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొలేని బలహీన మానసిక స్థితి లో ఉన్నారు. అందుకే బాల్యం నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయిస్తే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని పుంజుకుంటారు.
–శ్రీనివాస రెడ్డి సారెడ్డి (98858 64418)