సాధారణంగా సాహిత్యంలో పాతవాటికి ఆదరణ, సాంకేతికత రంగంలో కొత్తవాటికి ఆకర్షణ ఎక్కువ అని నానుడి. కానీ ఆయనకి ఈ నానుడి వర్తించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో సినిమాలు తీసినా ఇప్పటికీ ఆ సినిమాలకి ఆదరణ తగ్గలేదు.
ఆయన తీసినవి అద్భుత కథలేమీ కావు – కానీ అద్భుతంగా తీసాడు.
ఆయన తీసినవి అజరామరాలేమీ కాదు – కానీ ఆశేష సినీ ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు.
టక్కు-టమార-గజకర్ణ-గోకర్ణ-ఇంద్రజాల-మహేంద్రజాల విద్యలతో కనికట్టు చేసి ప్రేక్షకులని మంత్రముగ్ధుల్నిచేశాడు.
సినిమా అంటేనే అబద్ధం. లేని అబద్ధాన్ని ఉన్న నిజంగా చూపించి నమ్మించడమే సినిమా అని బలంగా నమ్మిన వ్యక్తి.
సినిమా అంటే కళ కాదు, కాసులు కురిపించే వ్యాపారం అని నమ్మిన నిర్మాత.
సినిమా పరిశ్రమలో ప్రతిభ కన్నా ప్రవర్తన ప్రధానం అని నమ్మిన దర్శకుడు.
దక్షత కలిగిన దర్శకుడు, బాధ్యత మరవని నిర్మాత.
చిత్రపరిశ్రమలో కాల్ షీట్స్ కి అనే విధానానికి ఆద్యుడు…
కేవలం రెండు మూడు సెట్స్ తో, తక్కువ రోజుల్లో అంటే దాదాపు 30 రోజుల్లో నే అద్భుతంగా సినిమాలు తీసిన దర్శకుడు. సినిమా మొదలుపెట్టకముందే విడుదల తేదీ ప్రకటించే విధానానికి తెర తీసినవాడు.
ఆయనే జానపద దర్శక బ్రహ్మ విఠలాచార్య.
తనకు కోపం వస్తేనో, నటులు సమయానికి రాకపోతేనో తను వాళ్లని జంతువులగా మారుస్తారని విన్నాము ఇంతవరకూ— కానీ అది నిజం కాదని, భూత దయ (భూతం కాదు…) అని తన దగ్గర ఉన్న కపిలగోవు తో జరిగిన ఒక సంఘటన తెలియ చేస్తుంది.
సినిమా అనేది పక్కా వినోదంగా చూడాలి తప్ప లోపాలు ఎంచకూడదు అన్నది ఆయన నమ్మిన సిద్దాంతం.
మాట్లాడుకున్న డబ్బు ఇచ్చే దగ్గర ఎంత నిక్కచ్చిగా ఉండేవారో, చెప్పిన సమయానికి ఇవ్వడంలో అంతే నిక్కచ్చిగా ఉండేవాడు. అలాగే ఈ పుస్తకంలో విఠలాచార్య సినిమా రూపొందించడంలో ఆయన ఆలోచనా విధానం తో పాటు…
సినిమా ఎలా తీయాలి?
ఎంతలో తీయాలి?
ఎవరితో తీయాలి?
ఎలా విడుదల చేయాలి?
సినిమా నిర్మాణం లో వృధా ఖర్చు ఎలా అరికట్టాలి?
ఎలా ప్రేక్షకులలో ఆ సినిమా గురించి ఆసక్తి కలిగించాలి?
సినిమా ని ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకు వెళ్లాలి? లాంటి విలువైన విషయాలు ఇందులో మనకు తెలుస్తాయి.
సినిమా తీయడంలో అయన అనుసరించిన విధానం, పాటించిన పద్ధతులు, తక్కువ సమయంలో సినిమా తీయడం… ఇవన్నీ విలువైన పాఠాలు.
అంతేకాకుండా సినిమా రూపకల్పనలో దర్శకుడు ఎంత నిబద్ధత తో పనిచేయాలో, నిర్మాత ఎంత నిజాయితీ గా ఉండాలో తెలుస్తుంది.
ఈ పుస్తకం చదువుతుంటే విఠలాచార్య గారి జీవితం కాకుండా మరో వంద మంది నటులు, మరెంతో మంది సాంకేతిక నిపుణుల జీవితాలను మనం చూసినట్టు ఉంటుంది. విఠలాచార్య గారి గురించి ఈ పుస్తకం సినిమాపై ఆసక్తి ఉన్నవారికి ప్రేరణనిస్తుంది.
ఈ పుస్తకాన్ని ఎవరు చదవాలి ?
ఎందుకు చదవాలి ?
ఏం తెలుసుకోవచ్చు?
ఈ పుస్తకం దర్శకుడు ఎలా ఉండాలో చెపుతుంది.
నిర్మాత ఎలా ఉండకూడదో చెపుతుంది.
దానితో పాటు ఒక కళాకారుడు ఎలా ఉండాలో చెపుతుంది.
అంతకు మించి మనిషి తో మనిషి ఎలా బ్రతకాలో చెపుతుంది.
ఇలాంటి మరెన్నో అరుదైన, అపురూపమైన విషయాలను గుదిగుచ్చి ఒకచోట పుస్తక రూపంలో తీసుకురావడం అపురూపం. ఇంకా చాలా విషయాలను రాయాలని ఉంది… కాకపోతే మీరు స్వయంగా ఈ పుస్తకం చదివి ఆ అనుభూతి పొందితే బావుంటుంది అని ఇక్కడితో ఆపేస్తున్నాను.
528 పేజీలతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకంలో వందకు పైగా నటుల జీవితం కనిపిస్తుంది. ఆ నటుల ప్రవర్తన, ఆలోచనా విధానం, అంతకు మించి వారితో విఠాలాచార్యకు గల అనుబంధం కనిపిస్తుంది.
ఈ పుస్తక రూపకల్పనలో తీసుకున్న కాగితపు నాణ్యత అద్భుతం. ఇంతకు ముందు నేనెప్పుడూ ఇంత నాణ్యతతో తెలుగులో ఓ పుస్తకాన్ని కనలేదు. పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ పుస్తక ముఖచిత్రం విఠలాచార్యగారి శైలి, ఠీవిని సూచిస్తూ ఆకర్షణీయంగా రూపొందించారు.
ఇంత మంచి పుస్తకాన్ని తీసుకురావాలని అభిలషించిన జిలాన్ గారి కి అభినందనలు. తెలుగు సినిమా చరిత్రలో భాగం అయిన వారి చరిత్రను ఇలా పుస్తకరూపంలో ఈ తరానికి అందచేయడం అభినందనీయం.
అలాగే అనితర సాధ్యం అయిన ఈ పుస్తకంలో ప్రతి విషయాన్ని విపులంగా, ఆసక్తికరంగా వివరించిన రచయిత పులగం చిన్నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ ద్వయం లో మరిన్ని పుస్తకాలు రావాలన్నది నా ఆకాంక్ష.దర్శకుడు కావాలనుకునే ప్రతి ఔత్సాహిక సహాయదర్శకులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకం చదవడం సినిమా మరియు కళలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా ఇది విద్యాపరమైన మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవం కావచ్చు.
–విశ్వనాథ్ గౌడ్