సురేకారం వంటి తెలుగు సినీ గుండత్త-సూర్యకాంతం

(ఈరోజు 28 అక్టోబర్ 2023 సూర్యకాంతం…. శత జయంతి సంవత్సరం మొదలు)

“దురుసునోటి పలుకుబడికి పంతులమ్మ మీరు… బాక్సాఫీసు సూత్రానికి పలుపుతాడు మీరే… మీరులేని బయస్కోపు ఉప్పులేని చారు….” అంటూ బాపు కార్ట్యూనులో ముళ్ళపూడి వెంకటరమణ కితాబిచ్చిన ఆ సహజనటి సూర్యకాంతం ఆని వేరే చెప్పాల్సిన పనిలేదు. అదే వెంకటరమణ సూర్యకాంతం సహజ నటనను గుర్తుచేస్తూ…. “రొష్టుపెట్టు ఆలిగా, దుష్టు నోటి కాళిగా, నటించుటామె కేళిగా- గయాళిగా నాతిగాని నాతి- లేక గొప్ప చుప్పనాతిగా, ‘’ఏయ్! అబ్బీ!! ఏవిట్నీ బేహద్బీ అని?, తలుపుచాటు కోడల్లా పెద్దమాటలు చాటున్నిలబడి తిడితే తెలీదనీ- తెలిస్తే తెగబడి తిడతారనీ కదూ? నేను కోడళ్ళనీ వాళ్ళనీ వేపుకు తింటున్నాననీ, దుష్టునోరుదాన్ననే కదూ నువ్వన్నదీ? అబ్బీ! ఔగానీ నా దుష్టునోరు లేకపోతే నీలోని జాలి, వాళ్లలోని గుణం, ఎంత అట్టడుగునపడి అఘోరించేవనీ!” అని సరదాగా అంటుండేవారని అభిమాన రచయిత, నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ ఉవాచ. ఈ సురేకారం లాంటి సూర్యకాంతం అలనాటి తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో గయ్యాళి అత్తగా, అక్కగా, వదినగా, భార్యగా, తల్లిగా తనదైన శైలిలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకున్న మహానటి. అటువంటి మహానటి సూర్యకాంతం గురించి కొన్ని విశేషాలు….

సూర్యకాంతం పుట్టింది 28, అక్టోబర్ 1924 న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ-సామర్లకోట కు సమీపంలోవున్న వెంకటకృష్ణరాయపురంలో. ఆమె తల్లిదండ్రులు పొన్నాడ వెంకటరత్నమ్మ, అనంతరామయ్య. ఆమె తండ్రిగారు కరణీకంతోబాటు కాకర్లపూడి సంస్థానంలో దివాన్ గా కూడా పనిచేసేవారు. వారి కుటుంబంలో సూర్యకాంతం పద్నాలుగవ సంతానం. వారికి పుట్టిన పద్నాలుగురు సంతానంలో పదిమంది చనిపోయారు. ఆరోజుల్లో సరైన టీకాలవంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాలారిష్టాలవలన శిశుమరణాలు ఎక్కువగా వుండేవి. చివరికి అనంతరామయ్య సంతానంలో మిగిలినవారు నలుగురు మాత్రమే. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కాగా, సూర్యకాంతం కడగొట్టు సంతానం. చిన్నతనం నుంచి సూర్యకాంతం కాస్త గారాబంగానే పెరిగింది. ఆమెకు చిన్నతనం నుంచే నటనమీద, సంగీతంమీద ఆసక్తి మెండుగావుండేది. పైగా డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదవడంతో ఆమెకు వస్తుతః గడుసుతనం అలవాటయింది. స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతుండగా తండ్రి అనంతరామయ్య కాలంచేశారు. దాంతో సూర్యకాంతం కాకినాడలోని తన పెద్దక్కయ్య ఇంటిలోనే పెరిగింది. డిటెక్టివ్ నవలల పాత్రల ప్రభావం ఆమె మీద బాగా పనిచేయడంతో ధైర్యంతోబాటు సూర్యకాంతంకు గడుసుతనం బాగా అబ్బింది. పాఠశాల వార్షికోత్సవాలలో ఆమె తరచూ నాటకాలలో పాల్గొనేవారు… పాటలు పాడేవారు. ఆమెకు హిందీ సినిమాలమీద, పాటలమీద మోజు జాస్తి. సూర్యకాంతం కుటుంబానికి బంధువైన బాలాంత్రపు ప్రభాకరరావు కాకినాడలో ‘హనుమాన్ నాట్యమండలి’ పేరిట ఒక నాటక సంస్థను నెలకొల్పి, తద్వారా కేవలం ఆడపిల్లలతోనే నాటకాలు నిర్వహిస్తుండేవారు. ఆ సంస్థ ప్రదర్శించే సతీసక్కుబాయి, చింతామణి, శ్రీకృష్ణతులాభారం వంటి అనేక నాటకాల్లో సూర్యకాంతం పాల్గొంటూ రంగస్థలి నటిగా మంచి పేరుతెచ్చుకున్నారు. 1945 ప్రాంతంలో జెమిని సంస్థ వారు ‘చంద్రలేఖ’ చిత్రాన్ని భారీ తారాగణంతో తమిళం, హిందీ భాషల్లో సమాంతరంగా నిర్మిస్తూ, నటనమీద ఆసక్తిగల కళాకారులను, నృత్యకారులను పత్రికాముఖంగా స్వాగతించారు. ఆ ప్రకటనకు ఆకర్షితులైన హనుమాన్ నాట్యమండలిలో సభ్యురాలైన దాసరి సుభద్ర, యండమూరి సుభద్ర అనే తోటి అమ్మాయిలు మద్రాసుకు ప్రయాణం కడుతూ సూర్యకాంతానికి కూడా ఆహ్వానం పలికారు. అలా వారితో కలిసి సూర్యకాంతం మద్రాసు చేరి జెమినీ స్టూడియోలో నృత్యతారగా నెలజీతానికి కుదిరారు.


‘చంద్రలేఖ’ (1948) సినిమాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డ్రమ్ డాన్స్ సన్నివేశంలో పాల్గొన్న 500 మందిలో సూర్యకాంతం ఒకరుగా నృత్యంచేశారు. మొదటినుంచి ఆమెకు హిందీ సినిమాలలో నటించాలనేకోరిక వుండడంతోనే ఆమె జెమినీ స్టూడియోలో అడుగుపెట్టడం జరిగింది. ఆరోజుల్లో హిందీ సినిమాలు కొన్ని ఎక్కువగా జెమినీ స్టూడియోలోనే నిర్మితమౌతూవుండేవి. అక్కడ సూర్యకాంతంకు నృత్యతారగా బృందగానాల్లోనే ఎక్కువగా అవకాశాలు రాసాగాయి. ఆ స్టూడియోలో పాటలు పాడే ప్రముఖ నేపథ్యగాయని పి.లీలతో సూర్యకాంతంకు పరిచయమేర్పడింది. ఆమె సిఫారసుతో సూర్యకాంతం 1946లో ఫేమస్ ఫిలిమ్స్ వారు పి. పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘నారద నారది’ అనే పౌరాణిక చిత్రంలో ఒక చిన్న వేషంలో కనిపించారు. ఆ తర్వాత జెమినీ సంస్థలో అప్పటివరకు నెలజీతానికి కాంట్రాక్టు లోవున్న సూర్యకాంతం అందులోనుంచి తప్పుకున్నారు. 1946లో శ్రీసారథి స్టూడియోస్ వారు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన ‘గృహప్రవేశం’ చిత్రంలో పోషించిన సహాయనటి పాత్రకు సూర్యకాంతంకు గుర్తింపు వచ్చింది. దర్శకుడు పి.పుల్లయ్య గారి సిఫార్సు మేరకు 1949లో స్వస్తిక్ బ్యానర్ మీద హెచ్.వి. బాబు దర్శకత్వంలో మీసాల పులిగా కీర్తించే హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన ‘ధర్మాంగద’ జానపదచిత్రంలో సూర్యకాంతం ఒక మూగపిల్ల పాత్రను పోషించారు. 1950లో సాధనా వారు నిర్మించిన ‘సంసారం’ సినిమాలో రేలంగి తల్లిగా, నిర్దయ కలిగిన అత్తగారి పాత్రలో సూర్యకాంతం తొలిసారి నటించి ఆ పాత్రలో జీవించారు. కేవలం పాతిక సంవత్సరాల వయసులో అరవై యేళ్ళ అత్తగారి పాత్రను పోషించడం చిన్న విషయం కాదు. ఆ పాత్రకు సూర్యకాంతానికి మంచి పేరొచ్చింది. ఆదే సంవత్సరం ప్రముఖ న్యాయవాది పెద్దిభొట్ల చలపతిరావుతో ఆమెకు వివాహం జరిగింది. గుంటూరుకు చెందిన చలపతిరావు మద్రాసు హైకోర్టులో వకీలుగా ప్రాక్టీస్ చేస్తూ, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు న్యాయసలహాదారుగా కూడా వ్యవరిస్తూ వుండేవారు. ఆయనకు నాటకాలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం. అలా సూర్యకాంతంతో పరిచయమై, ఆ పరిచయం వారి వివాహానికి దారితీసింది. అయితే వీరికి సంతానం కలుగకపోవడంతో సూర్యకాంతం అక్క సత్యవతిగారి అబ్బాయి అనంత పద్మనాభమూర్తి ని చిన్నతనంలోనే చేరదీసి కుమారుడిగా పెంచి పెద్దచేశారు. 1951లో రాజరాజేశ్వరి ఫిలిమ్ కంపెనీ నిర్మాత కె.బి. నాగభూషణం నిర్మించిన ‘సౌదామిని’ చిత్రంలో సూర్యకాంతం హీరోయిన్ పాత్రకు ఎంపికైంది. దురదృష్టవశాత్తూ ఒక కారు ప్రమాదంలో గాయపడి ఆమె ముఖానికి పెద్ద దెబ్బలు తగలడంతో, ఆ పాత్ర ఎస్. వరలక్ష్మి పరమైంది. ఆమెకు స్వస్తత చేకూరిన తర్వాత అదే చిత్రంలో సూర్యకాంతం రూప అనే పాత్రను పోషించారు. సూర్యకాంతంకు మొదటినుంచి హిందీ సినిమాలలో నటించాలనే బలీయమైన కోరిక వుండేది. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించక ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అయితే దీపావళి పండుగరోజుల్లో ఒక హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు సూర్యకాంతంకు అవకాశం వచ్చింది. పాత్ర ఒప్పుకున్న కొద్దిరోజులలోనే తను ధరించబోయే ఆ పాత్రను మరొకరితో చిత్రీకరించి, కారణాంతరాలవలన ఆమెను తొలగించి సూర్యకాంతంను బుక్ చేశారని తెలిసి, సూర్యకాంతం ఆ ఆఫర్ ని త్రోసిపుచ్చారు. తన మానవత్వమే ఈ నిర్ణయం తీసుకునేందుకు ఆమెకు ఉపకరించింది. ‘ఒకరిని బాధపెడుతూ తను సంతోషంగా వుండలే’నని నిర్మాతకు ఆమె తెగేసిచెప్పేశారు.

తర్వాత 1953లో శ్రీ గజాననా ప్రొడక్షన్స్ సంస్థ కె.ఎస్. రామచంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన ‘కోడరికం’ సినిమాలో అత్తగా ఆమె స్థిరపడిపోయారు. అప్పట్లో గయ్యాళి అత్త పాత్రలను పోషిస్తున్న శేషమాంబను వెనక్కునెట్టి అత్తపాత్రలకు పెట్టింది పేరుగా సూర్యకాంతం రాణిస్తూ మంచి పేరుతెచ్చుకున్నారు. అలా పెళ్ళిచేసి చూడు చిత్రంలో చుక్కాలమ్మగా, చంద్రహారంలో రాజకుమార్తెగా, అమ్మలక్కలు చిత్రంలో శేషమ్మగా, చక్రపాణి చిత్రంలో మనోరమగా గయ్యాళి పాత్రలు పోషించి నిలదొక్కుకున్నారు. ధర్మాంగద, గృహప్రవేశం, రత్నమాల, మదాలస, సంసారం, రూపవతి, చిన్నకోడలు, ప్రేమ, దాసి, దొంగరాముడు, కన్యాశుల్కం, చిరంజీవులు, బ్రతుకుతెరువు, పరదేశి, వారసత్వం, చరణదాసి, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మాంగల్యబలం, వెలుగునీడలు, భార్యాభర్తలు, ఇద్దరుమిత్రులు, ఆత్మబంధువు, కులగోత్రాలు, దాగుడుమూతలు వంటి సినిమాలలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ఆమె నటనలో హాస్యాన్ని జోడించేవారు. ప్రత్యేకించి హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణలు చెప్పే తీరు నవ్వు తెప్పించేది. సూర్యకాంతం ఎంతటి గయ్యాళి పాత్రలు పోషించారంటే… ఆరోజుల్లో ఆమె పేరును ఆడపిల్లలకు పెట్టుకోవడానికి తల్లిదండ్రులు సంశయించేవారు. మరోవైపు పంపిణీదారులు ‘’మీరు నిర్మించే సినిమాలోసూర్యకాంతం వుందా’’ అని నిర్మాతలను అడిగేవారంటే, ఆలోచించండి ఆమెకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వుండేదో అనే విషయం. సూర్యకాంతం దుష్టపాత్రలు పోషించేవారు అనేదానికన్నా ఆమె ఒక అద్భుత క్యారక్టర్ నటి అంటే బాగుంటుంది. విఠలాచార్య కన్నడంలో నిర్మించిన ‘మనే తుంబిద హెణ్ణు’ సినిమా హక్కులను విజయా సంస్థ కొనుగోలు చేసి, కథకు కొన్ని మార్పులు చేసి, నరసరాజు చేత డైలాగులు రాయించి 1962లో ‘గుండమ్మ కథ’ సినిమా నిర్మించారు. అందులో అగ్రనటులు అక్కినేని, ఎన్టీఆర్ హీరోలైనా సినిమా టైటిల్ కు మాత్రం సూర్యకాంతం పోషించిన ‘గుండమ్మ’ పాత్ర పేరు పెట్టారు. అది సూర్యకాంతం సినీచరిత్రలో ఒక కలికి తురాయిగా మిగిలింది. అసలు గుండమ్మ తెలుగు పేరు కాదు. అయినా ప్రేక్షకులు ఆ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు.

సూర్యకాంతంకు దయాగుణం, దాతృత్వగుణం మెండు. ఆమె ఎందరో అనాధ పిల్లలకు, విద్యాసంస్థలకు, గ్రంధాలయాకు విరివిగా ధనసహాయం చేసేవారు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి సంతృప్తికరంగా భోజనంపెట్టి, ఆదరించి సాగనంపే దానగుణం సూర్యకాంతం స్వంతం. స్టూడియోలో షూటింగుకు వెళ్ళేటప్పుడు పిండివంటలతోబాటు వివిధ రకాల వంటకాలను పెద్ద క్యారియర్లనిండా తీసుకెళ్లి సహ నటీనటులకు ఆప్యాయంగా వడ్డించేవారు. ఆమెకు చదువుమీద యెంతో ఆసక్తి వుండేది. చిన్నవయసులోనే చదువుకు స్వస్తి చెప్పడంతో ఆమెకు గ్యాడ్యుయేట్ కావాలనే కోరిక అలాగే వుండిపోయింది. అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు చిత్రంతో మొదలెట్టి చివరిదాకా ఆ సంస్థ సినిమాలలో సూర్యకాంతం నటించారు. భరణీ వారి సినిమాలలో కూడా ఆమెకు వేషం తప్పనిసరిగా వుండేది. జెమిని వాసన్ నిర్మాణ దర్శకత్వంలో తెలుగులో నిర్మించిన ‘బాలనాగమ్మ’ చిత్రాన్ని 1954లో హిందీలో ‘బహుత్ దిన్ హుయే’ పేరుతో పునర్నిర్మించగా అందులో సూర్యకాంతం నటించి హిందీలో నటించాలనే కోరిక తీర్చుకున్నారు, అలాగే 1955లో కె.జె. మహదేవన్ దర్శకత్వంలో నిర్మించిన ‘దో దుల్హనే’ హిందీ సినిమాలో కూడా సూర్యకాంతం నటించారు. ఇక 50 కి పైగా తమిళ చిత్రాలలో వైవిధ్య పాత్రలను సూర్యకాంతం పోషించారు. ఆమె దాదాపు ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లా డేవారు. బొంబాయిలో కొన్ని సినిమా షూటింగులకు హాజరైనప్పడు, ఆ స్వల్ప వ్యవధిలోనే మరాఠీ భాషను నేర్చుకున్నారు. యాభైయేళ్ల వయసులో ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం ఆమెకు భాషమీద వున్న ఆసక్తికి తార్కాణమని చెప్పుకోవాలి. ఆమె వంటలమీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు కూడా. జీవిత చరమాంకంలో ఆమెకు తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించారు. సూర్యకాంతం మంచి వ్యాపార పటిమగల మహిళ. ఆవిడ పాత ఇళ్ళు కొనుగోలుచేసి, వాటిని ఆధునీకరించి మంచి ధరకు అమ్మేవారు. అంతేకాదు, పాత కార్లను కొని వాటికి రేపేర్లు చేయించి, రంగులు వేసి సెకండ్ హ్యాండ్ బజార్లలో అమ్మకానికి వుంచేవారు. ఇది కేవలం ధనార్జనకోసం చేసిన ప్రవృత్తి కాకపోయినా, వ్యాపార సరళి మీద ఆమెకు వున్న ఆసక్తికి గుర్తు మాత్రమే.

మరిన్ని విశేషాలు…

గుండమ్మ కథ సినిమా నిర్మాణ సమయంలో కొందరు శ్రేయోభిలాషులు నిర్మాత చక్రపాణితో “సినిమాకి గుండమ్మ పేరు పెట్టారుకదా. అందులో గుండమ్మ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు అందుకుతగ్గ కొన్ని సన్నివేశాలు పెడితే బాగుంటుంది కదా” అని సలహా ఇస్తే, చక్రపాణి తనదైన శైలిలో “సూర్యకాంతం ఆపాత్రను పోషిస్తుందంటేనే ప్రేక్షకుడికి ఆ పాత్ర లక్షణం ఇట్టే తెలిసిపోతుంది. ఇంకా సన్నివేశాలు అవసరమా” అని ఎదురుప్రశ్నించారట, అత్తగారిగా అదీ సూర్యకాంతం ప్రతిభ. పాతికేళ్లు అత్తగారి పాత్రలు పోషించినా, ప్రేక్షకుడికి ఆమె మీద అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు.

బాపు-రమణలకు సూర్యకాంతం అంటే చాలా అభిమానం. వారు నిర్మించిన సినిమాలలో సూర్యకాంతం కోసం విలక్షణమైన పాత్రలకు రూపకల్పన చేసేవారు. బాలరాజు కథ, ముత్యాలముగ్గు, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంత దీపం వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. సూర్యకాంతంకు కథలు రాయడం ఇష్టం. ఆమె 1951 లో చాలా కథలు రాశారు. కానీ అవి అన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

సహజనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “సూర్యకాంతం తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కని తెలుగు పేరును ఇంకెవరూ పెట్టుకోకుండా చేసింది” అంటూ చమత్కరించారు. ఇదే విషయాన్ని మరొక హాస్యనటుడు ఆమెదగ్గర ప్రస్తావించగా “నా పేరు పెట్టుకోవడానికి భయపడికాదు, అది నా మీద వారికి వున్న భక్తిప్రపత్తులు చాటుకోవడానికే నా పేరు పిల్లలకు పెట్టుకోవడం లేదు” అంటూ తనదైన శైలిలో బదులిచ్చారట. ఒక సినిమా సన్నివేశంలో నాగయ్య గారిని ఆమె నోటికొచ్చినట్లు తిట్టాలి. తప్పనిసరై ఆ సన్నివేశాన్ని అద్భుతంగా పండించిన సూర్యకాంతం షాట్ అయ్యాక నాగయ్య గారి కాళ్లమీదపడి క్షమాపణ కోరుకున్నారు. వెంటనే నాగయ్య “అక్కడ తిట్టింది ఆ పాత్ర కానీ నువ్వు కాదమ్మా, ఎందుకు బాధపడతావూ” అంటూ సమాధానపరచారు .

సినిమారంగంలో అడుగుపెట్టగానే ఆమె ఇంగ్లీషు నేర్చుకున్నారు. సినిమాలలో ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు సూర్యకాంతానికి చదువుమీద ఆసక్తి పెరిగి గ్యాడ్యుయేట్ కావాలని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంకు దరఖాస్తు పెట్టుకున్నారు. రాత్రిళ్ళు పుస్తకాలు చదువుకుంటూ, నోట్స్ రాసుకుంటూ ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించేవారు. సహనటి ఛాయాదేవి వంటివారు ఈ విషయం గమనించి, లేటుగా నిద్రించడం వలన గ్లామర్ తగ్గిపోతున్నది అని సలహా ఇచ్చి చదువుకు స్వస్తి చెప్పించారు. మరాఠీ, ఫ్రెంచ్ వంటిభాషల్ని ఆమె నేర్చుకున్నారు. వంటలమీద సూర్యకాంతం ప్రచురించిన పుస్తకం నేటికీ ఒక ప్రామాణిక గ్రంధంగా పేరు తెచ్చుకుంది. జీవిత చరమాంకంలో ఆమెకు తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించారు. సూర్యకాంతం మంచి వ్యాపార పటిమగల మహిళ. ఆవిడ పాత ఇళ్ళు కొనుగోలుచేసి, వాటిని ఆధునీకరించి మంచి ధరకు అమ్మేవారు. అంతేకాదు, పాత కార్లను కొని వాటికి రేపేర్లు చేయించి, రంగులు వేసి సెకండ్ హ్యాండ్ బజార్లలో అమ్మకానికి వుంచేవారు. 

సూర్యకాంతం దత్తపుత్రుడు ధిట్టకవి అనంత పద్మనాభమూర్తి. ఆయన సూర్యకాంతం అక్కయ్య సత్యవతి కుమారుడు. బ్యాంక్ ఉద్యోగి గానే కాకుండా, హోమియో వైద్యునిగా కూడా మూర్తిగారు వ్యవహరిస్తున్నారు.

సూర్యకాంతం అంటే భానుమతి, అంజలీదేవి గార్లకు ఎంతో అభిమానం. అంజలీదేవి సూర్యకాంతంను తల్లిగానే భావించేది. భానుమతి తనదైన శైలిలో సూర్యకాంతం ను ‘సూర్యం’ అని ఆప్యాయంగా పిలిచేది, కష్టసుఖాలు పంచుకునేది.

1993 ప్రాంతంలో సూర్యకాంతం మధుమేహవ్యాధితో బాధపడ్డారు. ఆ వ్యాధి ముదిరి మూత్రపిండాలను దెబ్బతీసింది. చివరిసారి ఆమె నటించిన సినిమా 1993లో వచ్చిన ‘ఎస్.పి. పరశురామ్’. 750 సినిమాలకు పైగా నటించిన సూర్యకాంతం 1994 డిసెంబర్ 18 న తన 70 వ యేట చెన్నైలో కన్నుమూశారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “సురేకారం వంటి తెలుగు సినీ గుండత్త-సూర్యకాంతం

  1. 64కళ లు నేను ప్రతి సంచికా చదువుతాను. పత్రిక ఉద్దేశ్యం మంచిదే కాని ఎందుకనో వ్యాసాలకు పరిమితి విధించుకున్నారేమో, విశేషాలు తక్కువగా ఉండి ముక్తసరిగా ముగించేవారు. ఈ తరహా ఏ ఒకటి రెండు వ్యాసాల కు మినహాయింపు.
    కాని ఈసారి ఆచారం గారి వ్యాసం కొంత పరణితితో, సాధ్యమైనంత ఎక్కువ సమాచారంతో సూర్యకాంతం గారిని ఆవిష్కరించిందనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap