కభి ఖుషి కభీ ఘమ్…. సినిమా

(నేను భువనేశ్వర్ లో పనిచేస్తున్నప్పుడు కరణ్ జోహార్ రచన, దర్శకత్వంలో నిర్మించిన ‘కభి ఖుషి కభీ ఘమ్’ హిందీ సినిమా విడుదలైంది. 2002 లో ఆ సినిమాని అక్కడే నాలుగు సార్లకు పైగా చూశాను. కుటుంబకథా చిత్రం కావడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా చూసినప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగేవి. ముక్కు నుంచి అదేపనిగా నీటిధార కారేది. నా స్నేహితులతో ఆ సినిమా చిత్రీకరించిన విధానాన్ని పంచుకునేవాడిని. పొదుపైన సంభాషణలతో నటనకు ప్రాధాన్యమిస్తూ, గంగవెర్రులెత్తించే హోరుతో వినిపించే నేపథ్య వాద్యాలు లేకుండా సినిమా ఆద్యంతం నన్ను బాగా ఆకర్షించింది. బరంపురంలో ఒక కెమెరా కాపీ (CD) దొరికింది. కానీ ఒక మిత్రుడు చూసి ఇస్తానని తీసుకొని ఇవ్వలేదు. నేనూ మర్చిపోయాను. కాకినాడకు వచ్చిన తర్వాత ఆ సినిమా మరలా చూసే అవకాశం నాకు కలుగలేదు. ఈరోజు కాకతాళీయంగా యూట్యూబ్ లో శోధిస్తున్నప్పుడు నాకు ఆ సినిమా కనిపించింది. కదలకుండా ఆసాంతం ఆ సినిమాను మా వైడ్ స్క్రీన్ మీద చూస్తూ, కళ్ళు, ముక్కు తుడుచుకుంటూ బావోద్వేగానికి లోనయ్యాను. ఆ సినిమా గురించి మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో మీముందుకు వస్తున్నాను….షణ్ముఖ)

ఉపోద్ఘాతం:

కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ 1979లో ధర్మాప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి హిందీ చిత్ర నిర్మాతగా, పంపిణీదారుడుగా మంచిపేరు తెచ్చుకున్నారు. యష్ జోహార్ నిర్మాతగా 1998లో నిర్మించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రానికి తొలిసారి కరణ్ జోహార్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి, ఉత్తమ జనప్రియ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని, ఉత్తమ దర్శక బహుమతితోబాటు మొత్తం ఎనిమిది ఫిల్మ్ ఫేర్ బహుమతులు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా రూ. వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రెండవ కుటుంబ కథా చిత్రమే మరో బ్లాక్ బస్టర్ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’. ఈ చిత్రనిర్మాణ కార్యక్రమాలు అక్టోబర్ 2000లో మొదలుపెట్టి దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్రణాళిక రచించినా, రంజాన్ కారణంగా 2001 డిసెంబర్ 14 న విడుదలచేశారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో కూడా ఆదేరోజున చిత్రాన్ని విడుదల చేశారు. చిత్రానికి ‘It’s all about loving your parents’ అనే ట్యాగ్ లైన్ జోడించడం విశేషం. సినిమా విశేష ప్రేక్షకాదరణ పొంది ఇతర దేశాలలో కూడా విజయవంతమై రూ. 136 కోట్లు వసూళ్లు నమోదు చేసింది. ఐదు ఫిలిమ్ ఫేర్ బహుమతులతోబాటు ఏడు IIFA కూడా గెలుచుకుంది.

చిత్ర కథ:

ఈ చిత్ర కథ చాలా క్లుప్తంగా వుంటుంది. అమితాబ్ బచన్ దిల్లీ నగరంలో ఒక పెద్ద బిజినెస్ టైకూన్. జయా బచన్ అతని భార్య. వారికి సంతు లేకపోవడంతో షారుఖ్ ఖాన్ ను బాల్యంలోనే దత్తత తీసుకొని ఆప్యాయంగా పెంచుకుంటారు. షారుఖ్ ఖాన్ వచ్చిన వేళ కలిసొచ్చి ఆ దంపతులకు హృతిక్ రోషన్ జన్మిస్తాడు. తల్లికి షారుఖ్ అంటే వల్లమాలిన ప్రేమ. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని ప్రేమతో పెంచుతూనే, వారికి సంస్కృతి, సభ్యత, మానవ విలువలు, ఆదర్శాలను నేర్పుతారు. అయితే దత్తత విషయాన్ని మాత్రం గోప్యంగా వుంచుతారు. అయితే షారుఖ్ కి దత్తత విషయం తన ఎనిమిదవ యేటనే తెలుస్తుంది. అప్పటినుండి తల్లి మాటను జవదాటకుండా ఆమె మీద మరింతగా ప్రేమను పెంచుకుంటాడు. పెరిగి పెద్దవాడైన షారుఖ్ కు రాణీ ముఖర్జీని ఇచ్చి పెళ్లి చేయాలని తండ్రి భావిస్తాడు. కానీ షారుఖ్ కాజల్ ను ఇష్టపడుతున్నట్లు రాణీ ముఖర్జీ తెలుసుకొని అతనికి అడ్డం తొలగుతుంది. ఆ విషయం తెలుసుకున్న అమితాబ్ మహోదగ్రుడౌతాడు. తండ్రిని సమాధాన పరచేందుకు షారుఖ్ రాణీముఖర్జీని పెళ్లాడేందుకు సుముఖత వ్యక్తం చేస్తాడు. ఆ విషయాన్ని కాజోల్ కు చెప్పి సమాధాన పరుద్దామని షారుఖ్ కాజోల్ ఇంటికి వెళ్ళగా, ఆమె తండ్రి చనిపోయి వుండడం గమనిస్తాడు. కాజోల్ ది అసలే మధ్య తరగతి కుటుంబం. కుటుంబ పెద్ద మరణించడంతో వారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయని గ్రహించిన షారుఖ్ కాజోల్ ని పెళ్లిచేసుకుంటాడు. అమితాబ్ వారి పెళ్లిని అంగీకరించకపోవడంతో, షారుఖ్ కాజోల్ని, ఆమె చెల్లెలు కరీనా కపూర్ ని తీసుకొని లండన్ వెళ్ళిపోతాడు. చదువు పూర్తి చేసుకొని వచ్చిన హృతిక్ తన తల్లి షారుఖ్ గురించి కుమిలిపోవడం గమనించి రెండు కుటుంబాలను కలపాలని సంకల్పించి, పై చదువు మిషతో లండన్ వెళ్ళి, తన ప్రయత్నాలు సఫలీకృతం చేసి రెండు కుటుంబాలను కలుపుతాడు. కాజల్ చెల్లెలు కరీనాను వివాహమాడడంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.

విశేషాలు:

ఈ సినిమా కు కథను సమకూర్చింది కూడా కరణ్ జోహారే. తొలుత ఇద్దరు కోడళ్ళ చుట్టూ తిరిగే కథకు శ్రీకారం చుట్టాడు. అయితే ఆదిత్య చోప్రా సూచనపై కోడళ్ళ స్థానంలో ఇద్దరు సోదరుల పాత్రలను ప్రతిక్షేపించారు. ఈ సినిమాలో నటించిన నటీ నటులందరూ బిజీ షెడ్యూళ్ళు వున్నవారు కావడంతో కాల్ షీట్లు సర్దడంలో కరణ్ జోహార్ కాస్త ఒత్తిడికి గురయ్యేవాడు. ఈ సినిమా తొలిసగం ఇండియాలో, మలి సగం లండన్ నగరంలో సాగుతుంది. తొలి సగంలో దిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతం చూపించాల్సిరావడంతో, ముంబై ఫిల్మ్ సిటీ లోని స్టూడియోలో భారీ సెట్టింగ్ వేసి చిత్రీకరణ పూర్తిచేశారు. ఇక రెండవ సగంలో నిర్మించాల్సిన భాగాన్ని లండన్ నగరం కార్డిఫ్ లోని వేల్స్ మిలీనియం సెంటర్, కెంట్ లోని బ్లూ వాటర్ షాపింగ్ సెంటర్, సెయింట్ పాల్ కెథడ్రెల్, పీకడిల్లీ సర్కస్, థేమ్స్ నది ప్రాతంలో చిత్రీకరించారు. అమితాబ్ నివాస భవనం కోసం లండన్ నగరం బకింగ్ హామ్ షైర్ లోని వాడెస్టన్ మానర్ (Waddesdon Manor)ను వాడుకున్నారు. ఈ Waddesdon Manor లో జయా బచన్, షారుఖ్ ఖాన్ ల తో ఎమోషనల్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు, జనం గుంపులు గుంపులుగా గుమికూడడంతో ఆ కాంప్లెక్స్ యాజమాన్యం షూటింగ్ ను రెండు గంటల్లో ముగించెయ్యాలని షరతు విధించింది. హృతిక్ చదువుకునే కింగ్స్ కాలేజీ సన్నివేశాలను ఆక్స్ ఫర్డ్ షైర్ లోని Blenheim Castle లో చిత్రీకరించారు. ఇంకా బ్రిటీష్ మ్యూజియం, టవర్ బ్రిడ్జ్ లవద్ద చిత్రీకరణ జరిపారు. షారుఖ్ ఖాన్, కాజల్ తోటి చిత్రీకరించాల్సిన ‘’సూరజ్ హువా మద్ధమ్’’ అనే పాట కోసం ఈజిప్ట్ దేశంలోని కైరో కు వెళ్లారు. అయితే చిత్రీకరణకు సమయానికి సరైన వెలుతురు లేకపోవడంతో ఆ పాటను ఉదయం 7 నుండి 9 గంటల వరకు మాత్రమే చిత్రీకరించడం సాధ్యపడింది. దాంతో పాట పూర్తి చిత్రీకరణకు పక్షం రోజులు పైనే పట్టింది. ఈ పాట చిత్రీకరణ సమయంలో కాజల్ పొరపాటున పెద్ద రాతి కట్టడం మీదనుంచి క్రిందపడి దెబ్బలు తాకడంతో కూడా చిత్రీకరణలో జాప్యం జరిగింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలుండగా, వాటికి జతిన్ లలిత్, సందేశ్ శాండిల్య, ఆదేశ్ శ్రీవాత్సవ అనే ముగ్గురు సంగీత దర్శకులు నిర్దేశకత్వం వహించారు. సినిమా టైటిల్ పాట థీమ్ సాంగ్ గా చిత్రం పొడవునా వినిపిస్తూనే వుంటుంది. ఈ చిత్రం నిడివి మూడున్నర గంటలు. ఈ విషయం పైనే కాస్త విమర్శలు వచ్చాయి. సన్నివేశాలతో చిన్న కథను అనవసరంగా పొడిగించారని సినీపండితులు భావిస్తూ సమీక్షలు రాశారు. నిడివి కారణంచేత రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించాల్సి వుండగా, మూడు ఆటలకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. సినిమాకు వస్తున్న రద్దీ దృష్టిలో వుంచుకొనే టికెట్ ధరలను పెంచారు. విడుదలైన తొలి వారంలోనే రూ. పద్నాలుగు కోట్లు వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది ఈ సినిమా. కాజల్ కు ఉత్తమనటిగా, జయా బచన్ కు ఉత్తమ సహాయానటిగా, కరణ్ జోహార్ కు ఉత్తమ సంభాషణల రచయితగా, శర్మిష్టా రాయ్ కి ఉత్తమ కళా దర్శకునిగా, సినిమాకు ఉత్తమ సన్నివేశ చిత్రీకరణ విభాగంలో ఐదు ఫిల్మ్ ఫేర్ బహుమతులు లభించాయి. వాలెన్సీనెస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఐదు తోబాటు, IIFA బహుమతులు ఎనిమిది ఈ చిత్రానికి దక్కాయి.

దాదాపు 17 సంవత్సరాల తర్వాత అమితాబ్, జయా బచన్ ఈ సినిమాలో కలిసి నటించడం ఒక విశేషం. “కభీ ఖుషీ కభీ ఘమ్, న జూదా హోంగే హమ్” (ఆనందం ఒకసారి, విషాదం ఒకసారి) అనే టైటిల్ సాంగ్ హ్యాపీ వర్షన్, పాథోస్ వర్షన్ గా సినిమా పొడవుయినా వస్తూవుంటుంది. పైగా ఈ పాట ఇన్స్ట్రుమెంటల్ వర్షన్ బ్యాక్ డ్రాప్ లో వినిపిస్తూనేవుంటుంది. ఈ చిత్రానికి గతంలో యష్ చోప్రా నిర్మించిన ‘కభీ కభీ’ ప్రేరణ. నిరంజన్ అయ్యంగార్ అనే రచయిత “The making of Kabhi Khushi Kabhi Gham” అనే పుస్తకాన్ని సినిమా విడుదలకు ముందే ఆవిష్కరించారు. అందులో నిర్మాత, దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు పొందుపరచారు. ఈ సినిమా పతాక సన్నివేశాలను జాగ్రత్తగా చూస్తే మీ కళ్ళు చెమర్చక మానవు.
-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap