‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

దేశం నలుమూలల నుంచే కాదు, విదేశీయులను కూడా అమితంగా ఆకర్షించే ప్రదేశాల్లో ఖజురహో ఒకటి. భక్తి, రక్తిలను ఒకే వేదిక మీద తేటతెల్లం చేసే ప్రసిద్ద ఆలయాల సమూహమిది. మధ్యయుగపు వారసత్వం చిహ్నంగా భావిస్తున్న ఈ దేవాలయంలోని శిల్పకళా వైభవం వర్ణనాతీతం. భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్లో జబల్పూర్ నగరానికి సమీపంలో వింధ్య సాత్పూర పర్వత శ్రేణుల నేపథ్యంగా అలరారుతోంది.
ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్ పూర్ జిల్లాలోని ఓ గ్రామం. ఢిల్లీ నుంచి సుమారు 620 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఆగ్రా తరువాత అత్యంత ఎక్కువ మంది పర్యాటకులు దర్శించే ప్రాంతంగా రికార్డులకెక్కింది. ‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే శిల్ప వైభవం ఈ క్షేత్రం సొంతం. ఖజురహో అంటే “‘ఖర్జూర వనం” అని అర్ధం. ఈ క్షేత్రాన్ని ఆ రోజుల్లో ఖర్జూర వాటిక, ఖర్జూరపురం అని కూడా పిలిచేవారు. ఖజురాహో పేరు హిందీ శబ్దం ఖజుర్ నుంచి వచ్చింది. రాజా చంద్రవర్మ ఈ క్షేత్రంలో నాలుగు వైపులా ఖర్జూర వృక్షాలను వృద్ధి చేశాడట. ఈ ప్రాంతంలో ఆ కాలంలో ఎక్కువగా ఖర్జూరాలు పండడం వల్ల ఈ ప్రాంతానికి ఖజురహో అనే పేరు స్థిరపడింది. ఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు వందేళ్లు పట్టింది. క్రీ.శ 9501050 సంవత్సరాల మధ్య కాలంలో ఛందేలా రాజపుత్ర రాజులు ఈ గుహాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఆ రాజుల కళాత్మక తృష్ణకు, వైభవానికి ఈ గుహాలయాలు దర్పణాలు.
1986వ దశకంలో ఖజురహో దేవాలయాల సమూహాన్ని మూడు వర్గాలుగా విభజించడం జరిగింది. వీటిలో పూర్వ సమూహం, పశ్చిమ సమూహం, దక్షిణ సమూహ ఆలయాలుగా వర్గీకరించారు. ఖజురహోలోని ఎక్కువ ఆలయాలు తూర్పు నుంచి పశ్చిమ వైపుగా నిర్మితమయ్యాయి. ఇవన్నీ ఓ ఎత్తయిన వేదికపై నిర్మించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చేత గుర్తింపు పొందిన ఈ దేవాలయాలు హిందూ, జైన దేవాలయాల సమూహంగా దర్శనమిస్తుంది.
శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు… ఎన్నో ప్రకృతి బీభత్సాలకు గురయ్యాయి. ఎందరో దురాశాపరుల దాడులతో పాడైపోగా మిగిలిన ఆలయాల్లో జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఖజురహో వెయ్యేళ్ల కిత్రం ఛందేలా రాజవంశీయుల పరిపాలనలో రాజధానిగా వెలుగొందింది. ఆ రాజుల పరిపాలన అంతమవడంతో అక్కడి అద్భుత శిల్ప సంపద కూడా మరుగున పడిపోయింది. కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడవిలా మారిపోయింది.
1839లో మళ్లీ ఖజురహో వెలుగు చూసింది. ఆనాడు ఛందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా, నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా
దర్శనమిస్తాయి.
ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారం రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళు అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయాలు పరచుకుని ఉండేవి. ఆనాడు ఇటువంటి శిల్పకళా ఆలయాలు నగరం మొత్తంలో దాదాపు 80 ఆలయాలకు పైగానే ఉండేవి. అయితే ప్రస్తుతం ఇవి 25 మాత్రమే సందర్శన ప్రదేశాలుగా ఉన్నాయి. ఈ 25 మందిరాలలో 10 మందిరాలు విష్ణువి, 8 మందిరాలు శివునికి చెందినవి. ఒక మందిరం సూర్య భగవానునికి, ఒక మందిరం యోగినీ మాతలకు చెందినవి కాగా, మిగిలిన ఐదు మందిరాలు జైన మందిరాలుగా గుర్తించడం జరిగింది.
ఖజురహోలోని అతిపెద్ద దేవాలయంగా ఇక్కడున్న కందారియా మహాదేవుని ఆలయం ప్రసిద్ది చెందింది. పశ్చిమ వైపు సమూహంలో ఉన్న ఈ ఆలయాన్ని విద్యాధర మహారాజు నిర్మించాడు. నగర శైలిలో నిర్మితమయిన ఈ ఆలయం 1050లో నిర్మాణానికి నోచుకుంది. ఈ మందిరం 31 మీటర్లు ఎత్తు, 20 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. ఈ మందిర నిర్మాణానికి పెద్ద పెద్ద శిలలను ప్రయోగించారు. మందిర వెలుపలి ప్రాకారాలపై 646 శిల్ప ఆకృతులను పొందుపరిచారు. అలాగే మందిరం లోపల 226 శిల్ప ఆకృతలను పొందుపరిచారు. ఇతర ఆలయాల్లో ఉన్న మూర్తుల కంటే ఈ ఆలయంలోని మూర్తుల సంఖ్య అధికం కావడం విశేషం. ఈ ఆలయంలో శృంగార శిల్పాలతో పాటు మనిషి జీవన గమనంలోని అన్ని దృక్కోణాలను ఆవి ష్కరించే విధంగా శిల్పాలను పొందుపరిచారు. రైతులు, మహిళలతో పాటునిత్య జీవితంలో ఎదురయ్యే అనేక పాత్రలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం ఓ గుహను పోలి ఉంటుంది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని కందారియా మహాదేవుని మందిరంగా పిలుచుకుంటారు. మందిర ఆకారం నీలప ర్వతాన్ని పోలి ఉంటుంది. ఈ మందిరంలో ముఖ మండపం, అర్ధ మండపం, మహామండపం, అంత రాలయంతో పాటు గర్భగృహం దర్శనమిస్తాయి. ఈ మందిర నిర్మాణాన్ని పరిశీలించి చూస్తే ఓ విధమైన శైలి కనిపిస్తుంది.
ఖజురహోలో ఉన్న మరో ముఖ్యమైన దేవాలయం ఆదినాథ దేవాలయం. జైన తీర్ధాందకరుడు ఆది నాథుడికి అంకితమైన ఆలయమిది. ఇక్కడే ఉన్న మరో ఆలయం ఘంటాయ్ ఆలయం. ఇది కూడా జైన దేవాలయమే. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి 16 స్వప్నాల్ని ఆవిష్కరించే శిల్పాలు దర్శనమిస్తాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత శిల్పం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయంగా ఇక్కడున్న పార్వనాథ దేవాలయం పేర్గాంచింది. ఈ ఆలయంలో ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై రూపొందించిన చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. నిజజీవితంలోని రోజు వారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. 1860 సంవత్సరంలో లో ఇక్కడ పార్శ్వనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన మరో అపురూప దేవాలయం ఇక్కడున్న చతుర్భుజ దేవాలయం. ఇది ఎంతో ఆకర్షణీయంగా
దర్శనమిస్తుంది.
ఖజురహోలోని గ్రానైట్ రాళ్ళతో తయారైన ఏకైక దేవాలయంగా ఇక్కడున్న బౌంసత్ యోగిని దేవాలయం ప్రసిద్ది చెందింది. కాళీమాతకు చెందిన ఈ ఆలయం క్రీశ 900 శతాబ్దానికి చెందినది. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యం లోకి తేవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.
ఖజురహో నృత్యోత్సవాలు; ఖజురహోలోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా ఫిబ్రవరి , మార్చినెలల్లో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవి దేశాల నుండి లక్షలాది పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు.
ఎలా చేరుకోవాలి: ఖజురహోను చేరుకోవడానికి సాత్నా, హర్పలూర్, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి. ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హరలూర్, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా రైలు స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీ కులకు ఝానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్కతా, వారణాసిల నుంచి వచ్చే వారికి ముంబై అలహాబాద్ మార్గం ద్వారా సాత్నా నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధానంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి.
సందర్శించడానికి అనువైన కాలం: జులై మార్చి మధ్య కాలం ఖజురహో సందర్శించడానికి అనువైన సమయం.
-దాసరి దుర్గా ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap