‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నారు ఓ సినీ రచయిత. ఆయన రాసిన ఈ గీతం అక్షరాలా నిజం. ఎందుకంటే శిల్పసౌందర్యం మన దక్షిణభారత దేశంలో అత్యద్భుతంగా పరిఢవిల్లుతోంది.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.. సంస్కృతి సంప్రదాయాలు, సాంఘిక జీవనశైలిని ప్రపంచానికి చాటిచెప్పింది. అంతటి అపురూపమైన శిల్పకళ అంటే ముందుగా గుర్తొచ్చేది అమర శిల్పి జక్కన.. జక్కన అంటే శిల్పాలు.. శిల్పాలు అంటే జక్కన అనేంతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.
అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పాలివి. జక్కన ఎందుకు అమరశిల్పి అయ్యాడో ఈ శిల్పాలు చూసాక కానీ అర్థం కాలేదు. ఒక చిన్న పొరపాటు జరిగినా చెక్కిన శిల్పం అంతా వృథా అయిపోయే రిస్క్ తీసుకుని, ఒక్క పొరపాటు కూడా లేకుండా వందల కొద్దీ శిల్పాలు… అవి కూడా ఇంకెవరికీ అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేథస్సు, సాధన, కళా నైపుణ్యం… ఒక లెటర్ రాయడంలో వంద సార్లు backspace కొట్టే ఈ కాలంలో జీవించే నాకు ఎలా అర్థం అవుతుంది..? అర్థం చేసుకునే ప్రయత్నంలో నన్ను నేను వెతుక్కున్నాను… ఈ శిల్పాల సౌందర్యంలో నన్ను నేను పోగొట్టుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఒక శిల్పం అంటే… ఒక దేవతా మూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక arch లాంటిది పెట్టేస్తే సరి… ఇక శిల్పం పూర్తయినట్టే. కాని ఇదేమిటి స్వామీ…!! ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైన డిజైన్లతో నింపేశారు. ఆ స్త్రీమూర్తుల మెడలో అలంకరించిన హారాలు, చెవి రింగుల్లోని పూసలతో సహా… చేతి వేళ్ళకు వుండే గోళ్ళను, ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే… మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా ఇది..? దేవలోకంలో నివసించే ఏ యక్షుడో, గంధర్వుడో శాపవశాన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి… ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై, ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మడానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్లిపోయాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మొనాలిసాను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు డావిన్సి గురించి ప్రపంచమంతా డబ్బా కొడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు… పిచ్చి గీతల పికాసోను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మరి మనలో కలిసి తిరిగిన ఒకడు… మన ఊరి చావిట్లో పడుకుని, మన ఇంట్లో చద్దన్నం తిని, మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు ఇంతటి అసామాన్యుడని ఈ రాళ్ళకు కూడా అర్థమై అతనికి దాసోహం అన్న తరువాత కూడా మన మట్టి బుర్రలకు ఎందుకు తెలియడంలేదు..?
ఒప్పుకున్న ఒప్పుకోకున్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని… ఎలుగెత్తి చాటరా జక్కన్న శిల్పాల్ని…